Thursday, May 25, 2017

రక్షణ కల్పించాల్సిన వాడే నగ్నంగా మారుస్తూ ... ?? నరకయాతనలకు గురిచేస్తుంటే ఇక ఆ ఆడతనానికి దిక్కెవ్వరు..??



రక్షణ కల్పించాల్సిన వాడే నగ్నంగా మారుస్తూ ... ??
నరకయాతనలకు గురిచేస్తుంటే ఇక ఆ ఆడతనానికి దిక్కెవ్వరు..??

మహిళలపై జరిగే దాడులలో అత్యంత భయంకరమైనది, బాధాకరమైనది యాసిడ్ దాడి... మన దక్షిణ భారతదేశంతో పోల్చుకుంటే ఉత్తర భారతదేశంలోని స్త్రీలపైనే అధికంగా జరుగుతున్నాయి... వాటిల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రధమ స్థానంగా పరిగణించబడింది.. 

ఇంత పైశాచికంగా, పాశవికంగా ఎలా ఒక మనిషిపై దాడి చేస్తారో అని ఆలోచిస్తుంటేనే కళ్ళల్లో నీరు ఆగట్లేదు.. ప్రేమించలేదని దాడి, 
ఆమె మరొకరిని పెళ్ళి చేసుకుందని దాడి, 
అడిగింది ఇవ్వలేదని దాడి, 
కోరిక తీర్చలేదని దాడి, 
మోసం చేసిందని దాడి, 
ఇలా ఒకటా రెండా ప్రతీ విషయంలో నలిగేది, నలుగుతున్నది ఆడదే.. 

కొందరు మగవాళ్ళు అంటూ వుంటారు.. 
ఆడవారికే కాదు మగవారు కూడా కస్టాలు అనుభవిస్తున్నారు అని .. 
ఒప్పుకుంటాను.... కాని యెంత శాతం మేర మగవాళ్ళు అనుభవిస్తున్నారు ?? 
మహా అయితే వందలో ఒక 10 శాతం వేసుకుందామా ?? 
ఇక్కడ ఆడవారు అనుభవించే మారణ కాండ 100 లో 95% అని మర్చిపోకండి... 
అన్నీ అనుకూలంగా వారికే వున్నాయని గోల గోల చేస్తుంటాం.. 
అనుకూలతతో పాటు మిగిలినవి కూడా అన్నీ ఎక్కువే అని ఎందుకు మర్చిపోతున్నారు... 
ఇది ఉన్మాదమా విపరీత కాండమా ??

అంతెందుకు మన దేశంలో మహిళల్లో 70 శాతం మంది ఏదో ఒక రూపంలో గృహ హింసను ఎదుర్కొంటున్నారు. 

NCRB ప్రకారం ప్రతి మూడు నిమిషాలకు ఒకసారి మహిళలపై ఏదో ఒక అఘాయిత్యం జరుగుతూనే ఉంది.
ప్రతి తొమ్మిది నిమిషాలకు ఒకసారి భర్త అత్తమామల రూపంలో వివాహితలు వేధింపులు, హింస బారిన పడుతున్నారు.

పనిచేసే మహిళల్లో (Working women) ఎక్కువ శాతం విధులకు వెళ్లి వచ్చేటప్పుడు తమకు రక్షణ లేదని వెల్లడించారని అసోచామ్‌సర్వే తేల్చింది. ఢిల్లీ దాని పరిసర ప్రాంతాలతో పాటు ముంబై, పూణె, కోల్‌కతా, హైదరాబాద్‌లోని పెద్ద సంస్థలతో పాటు, మధ్యస్థ చిన్నతరహా కంపెనీల్లో పనిచేస్తున్న 5 వేల మందిని ఈ సంస్థ సర్వే చేయగా, ఏకంగా 92 శాతం మహిళలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా బీపీఓ, ఐటి అనుబంధ రంగాలు, హాస్పిటాలిటీ, పౌర విమానయానం, నర్సింగ్‌హోమ్స్ లో పనిచేస్తున్న మహిళలు తమకు తగిన రక్షణ లేదని చెబుతున్నారు.

మహిళలపై నేరాలకు మూలాలేంటి? 
లోపం ఎక్కడుంది? 
వ్యవస్థలోనా? 
వ్యక్తుల్లోనా? 
బాపూ కలల నిర్భయ భారతం ఎన్నాళ్లకి? 
ఎన్నేళ్ళకి సాకారమవుతుంది ?

రక్షణ కల్పించాల్సిన వాడే నగ్నంగా మారుస్తూ ... 
నరకయాతనలకు గురిచేస్తుంటే ఇక ఆ ఆడతనానికి దిక్కెవ్వరు..??

ఇలాంటి ఒక సంస్కార హీనమైన, అంధకారపు సమాజంలో ఒక సాదారణమైన స్త్రీ ఎలా స్వేచ్చగా ఉండగలదు ?? 
ఇలాంటి దుర్భేధ్యంలో వున్న మన పిశాచాల సామ్రాజ్యంలో కొన్ని మనం పాటించడం ద్వారా ఇలాంటివాటిని మనం కొంతమేర అరికట్టవచ్చు అనే సంకల్పంతో ఈ క్రింద వివరిస్తున్నాను దయచేసి చదవగలరు ... 

1. ప్రతి స్త్రీ బాల్యం నుంచే తనను తాను రక్షించుకోవటం ఎలా అన్నది తల్లి ఉగ్గుపాలతోనే నేర్పించాలి. ఎందుకంటే చంటి పిల్లల్ని కూడా (మృగాలుగా వ్యవహారించే, తార్కిక జ్ఞానం కోల్పోయిన) మగవారు అత్యాచారం చేయడానికి వెనకాడటం లేదన్నది వాస్తవం.

2. బాల్యంలో బాలికలను ముద్దు చేసే దగ్గర బంధువులు, స్నేహితులు, ఉపాధ్యాయులు వారిని ముట్ట రాని ప్రదేశాలలో నోటితో చేతులతో ముట్టినప్పుడు వారి నుంచి దూరంగా మసలడం పిల్లలకు నేర్పాలి. సాధ్యమయినంతవరకు ఎదుటి వ్యక్తులకు ఆనుకోని, తగులుతూ మాట్లాడకుండా దూరం జరగాలి.

3. చిన్నప్పటి నుంచే ‘అమ్మని, అక్కని, చెల్లిని, మొత్తం స్త్రీ జాతిని గౌరవించాలని మగ పిల్లలకు తల్లితండ్రులు నేర్పాలి. స్త్రీ పురుష సమానతలు, ఒకరు లేకుండా మరొకరు లేరన్న విషయం తెలియజేయాలి.

4. వివక్షతతో చూడకుండా బాల బాలికలను ఒకే రకమైన పాఠశాలలకు పంపడం పౌష్ఠికాహారం, ఆటపాటలు నేర్పించాలి.

5. బాలికలకు ఆత్మరక్షణ విద్యలు అంటే కరాటే, జూడో, క్రికెట్‌, బంతి ఆటలు అన్నీ నేర్పాలి.

6. ఎవరైనా స్త్రీలపై దాడి సంఘటన జరగబోతున్నపుడు తమ దగ్గర సెంటు స్ప్రే డబ్బాల్లో కారంపొడి / మిరియాల పొడి నీళ్ళలో కలిపి వారి కళ్ళలో కొట్టాలి. అప్పుడు దొరికిన సమయంలో తప్పించుకోవాలి.

7. ఆడపిల్లలు ప్రతిరోజూ ఆత్మరక్షణ విద్యలు నేర్చుకుంటే వారిలో ఆత్మస్థెర్యం పెంపొందుతుంది.

8. ఎక్కడికి వెళ్ళినా తమ సెల్‌ఫోనుల్లో పోలీస్ నెంబరు – 100/1098, దగ్గర పోలీసు స్టేషన్ నెంబరు, దగ్గర బంధువులకు తమ ఉనికిని తెలియ జేయడం, ద్వారా ఆత్మరక్షణ చేసుకోగలుగుతారు.

దేశ జనాభాలో దాదాపు సగభాగం మహిళలు ఉంటే వారి సంక్షేమానికి, భద్రతకు నిర్దేశించిన నిధులు 30 శాతానికి మించడం లేదు. మహిళా సాధికారిత సాధించి, నేర రహిత సమాజ సాధనకు నిధుల కేటాయింపు పెంచాలి. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను నివారించేందుకు శిక్ష ఒక్కటే కాదు చట్టాల్లోనూ మార్పులు చేయాలి. మహిళలపై జరుగుతున్న నేరాలుకు గల మూలాలపై పోరాటం చేయాలి. 

సమాజంలోని అన్ని వర్గాల్లోనూ, యువతలోనూ మానసిక పరిపక్వత కల్పించాల్సిన అవసరముంది. నేరం జరిగిన తర్వాత నిందితుణ్ని శిక్షించడం కంటే అది జరగకుండా నియంత్రించడమే ముఖ్యం. అత్యాచారాలు, అఘాయిత్యాలు, యాసిడ్ దాడులు ఎదుర్కొనేలా మహిళలకు అండగా నిలవాల్సిన కనీస బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది.

నేటి ఆడతనాన్ని నిలబెట్టుకుందాం..!! 
రేపటి అమ్మతనాన్ని రక్షించుకుందాం.. !!

Written By: Bobby Nani

No comments:

Post a Comment