Friday, December 6, 2019

SOCOTRA (The Mysterious Island) from Bobby... 25th Part

SOCOTRA

                                      -The Mysterious Island-


మునుపటి భాగాన్ని మనం ఒక్కసారి మననం చేసుకుందాం ... 

ఆ మరుసటిరోజునే నక్షత్ ప్రయాణం మొదలైంది.. తనని పశ్చిమ  దిక్కున సముద్రం మధ్యలో వున్న సొకోట్ర అనే ప్రాంతానికి వెళ్ళమని ఇక్కడే  తన గ్రంధాన్ని రాసి జాగ్రత్తగా భద్రపరచమని చెప్తుంది.. ఆత్మాశి..


తరువాత ఏంటో చూద్దాం పదండి..
25th Part
ఆ తరువాత చంద్రిక కొలనుకు వచ్చిన ఉపద్రవం ఏంటో, ఆత్మాశి ఎలా చనిపోయిందో.. 

వాసుర, నక్షత్ లు ఏమయ్యారో తదితర విషయాలు ఏమీ ఈ గ్రంధంలో లేవు అని చెప్తాడు అఘోరా.. !!

అంటే ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు అన్ని నక్షత్ రాసిన ఆ గ్రంధం లోనివా అని ఆశ్చర్యంగా అడుగుతాడు ఆకాష్.. !!


అవును అని తల ఊపుతాడు అఘోరా.. 

నిజంగా వారి త్యాగం అనిర్వచనీయము అంటాడు ప్రసన్నకుమార్ భాటియా.. 

గురువు గారు మీ దృష్టితో వారు ఎమైనారో చుడలేరా అని మోహన్ అడుగుతాడు.. 

ఈ గ్రంధాన్ని పూర్తి చెయ్యడానికి నక్షత్ కి చాలా ఏళ్ళ సమయం పట్టింది.. అందుకు కారణం వాసుర జ్ఞాపకాలు .. తనని ఉక్కిరిబిక్కిరి చేసేవి.. ఓ దశలో తను పిచ్చిపట్టిన వాడిలా కూడా మార్పుచెందాడు.. తరువాత తనని తాను తెలుసుకొని.. సత్యాన్ని దర్శించి గ్రంధంపై దృష్టి కేంద్రీకరించి నిద్రాహారాలు మాని అహోరాత్రులు మేల్కొని గ్రంధాన్ని పూర్తి చేసాడు.. 


తరువాత వాసుర వద్దకు ఉత్తర దిశగా ప్రయాణం చేసి తనను కనిపెడతాడు.. కానీ అప్పటికే సమయం చేజారిపోయింది.. దానికి మునుపే సముద్రపు దొంగలు జలకూన, వాసుర వున్న స్థావరాన్ని ఎన్నో రోజులుగా గమనిస్తూ, జలకూన గోప్యతను కనిపెట్టి తనని బంధించాలని అనుకుంటారు.. ఆ ప్రయత్నంలో వాసురకు ఓ విషపు బాణం తాకి సముద్రపుటొడ్డున కొన ఊపిరితో కొట్టుకుంటూ వుంటుంది.. నక్షత్ రాగానే తనను కళ్ళారా చూస్తూ, నవ్వుతూ తన ప్రాణాన్ని విడుస్తుంది.. చివర సమయంలో కలిసి వుండటం అంటే ఇదేనా అని వాసురను తన ఒడిలో పెట్టుకొని ఆకాశానికి చూస్తూ బిగ్గరగా రోధిస్తాడు నక్షత్.. 

అలా రోధిస్తూనే ఒడిలో వాసురను హత్తుకొని తన ప్రాణాన్ని విడుస్తాడు నక్షత్..!!

అలా వారి మరణాలను చూసి ఆకాశం కొన్ని వారాలపాటు ఏడ్చి ఏడ్చి తన కన్నీటితో వారిని సముద్రంలోకి తీసుకెళ్ళిపోయింది.. అంటూ కళ్ళల్లో నీరు తుడుస్తూ చెప్తాడు అఘోరా..!! 

మరి ఆత్మాశి అదే మత్స్యక ఏమైంది... ఆ వచ్చిన ఉపద్రవం ఏంటి ? 

జలకూన వాళ్ళకు చిక్కిందా ?? తనేమైంది.. ?? 


అని అడుగుతాడు ప్రసన్నకుమార్ భాటియా.. 

లేదు వాళ్ళకు చిక్కలేదు.. తను సముద్రగర్భంలోకి వెళ్ళిపోయింది.. కొన్ని శతాబ్దాలు ఎవ్వరికీ కనపడకుండా అజ్ఞాతంగా గడిపింది.. ఎన్నో విషయాలు నేర్చుకుంది.. ఒంటరిగానే సముద్రం మీద ఆదిపత్యం సాధించింది.. తన శక్తిని తాను గ్రహించింది.. సముద్రాన్ని వదిలి బయటకు రాకూడదని .. అలా వస్తే తన మనుగడ ప్రశ్నార్ధకం అవుతుందని తను భావించింది.. 

ఆత్మాశి కుటుంబంలో తరానికి ఒక్కరే జీవించి ఉంటారు.. మత్స్యక ది నాల్గవ తరం .. తను ఒక పాపకు జన్మనిచ్చే వరకే తన జీవితం.. జన్మనిచ్చాకా తను ప్రాణం విడవాలి .. వారు కలయిక లేకుండా పిల్లల్ని కనగలరు.. వారి జాతిలో మగ అనేది లేదు.. అందరూ ఆడవారే.. ఆ మీనాలకు రక్షణగా వున్న ఆకుపచ్చని వలయం వారి ఒక్కో తరంలోని ఒక్కో పూర్వీకురాలిది.. తను కూడా ఆ ఆకుపచ్చని వలయంలో కలిసిపోయింది..ఆ రక్షణా వలయాన్ని మరింత శక్తివంతంగా మార్చి తనవంతు బాధ్యతను పూర్తి చేసింది..నిజానికి తను అప్పుడే ప్రాణం విడవాల్సింది కాదు.. కొందరు మనుషులకు ఈ మీనాల సంగతి తెలిసింది.. కానీ వాటి శక్తుల గురించి తెలియలేదు.. మనిషికి సముద్రాలను శాసించవచ్చని తెలిస్తే ఎన్నో సమస్యలు వస్తాయి అందుకే ఆత్మాశి ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.. తన ప్రాణాన్ని ఆ రక్షణా వలయానికి అర్పించి దాన్ని మరింత శక్తివంతంగా చేసింది..!


అని సమాధానమిస్తాడు అఘోరా.. !!

ఇప్పుడంతా అర్ధం అయింది .. కానీ ఒక్క విషయం ఇంకా సందేహంగా మిగిలి వుంది అంటుంది వారితోపాటు వచ్చిన ఆ అమ్మాయి.. !!

ఇక్కడివారు కన్నీరును ఎందుకు సేకరిస్తున్నారు ?? 

అది కూడా ఇన్ని సంవత్సరములనుంచి ?? 

ఇంత కన్నీరును వారు ఏం చెయ్యాలనుకుంటున్నారు ? అని ప్రశ్నిస్తుంది.. 

ఆత్మాశి చెప్పింది గా.. పవిత్రమైన, స్వచ్చమైన కన్నీరు ఆ చంద్రిక కొలనులో పడితే ఆ మీనాలకు వున్న ఆకుపచ్చని రక్షణా వలయం తొలగిపోతుందని.. బహుశా ఆత్మాశి చనిపోయి ఆ రక్షణా వలయం మరింత శక్తివంతంగా మారింది అనుకుంటా.. అందుకే దానికి సరిపడా కన్నీరును వీరు సేకరిస్తున్నారు అని అంటాడు మోహన్.. !!

అయితే ఇక్కడివారికి ఆ కొలను అందులోని మీనాల గురించి బాగా తెలిసుండాలి.. ముఖ్యంగా వాళ్ళు నక్షత్ రాసిన ఈ గ్రంధాన్ని చదివి అర్ధం చేసుకొని ఉండాలి అని అంటాడు ఆకాష్.. !! 

మీరు చెప్పింది అక్షర సత్యం.. ఈ గ్రంధాన్ని వారు ఎన్నో ఏళ్ళ క్రితమే కనిపెట్టారు .. కొన్ని సంవత్సరములకు ముందు సోకోట్రా కార్స్ట్ ప్రాజెక్ట్ యొక్క బెల్జియన్ స్పెలియాలజిస్టుల బృందం సోకోట్రా ద్వీపంలోని ఒక గుహను పరిశోధించింది. అక్కడ, వారు పెద్ద సంఖ్యలో శాసనాలు, డ్రాయింగ్లు మరియు పురావస్తు వస్తువులను చూశారు. క్రీ.పూ 1 వ శతాబ్దం మరియు క్రీ.శ 6 వ శతాబ్దం మధ్య ఈ ద్వీపంలో మనుగడ సాగించిన ఆటవిక తెగవారు వీటిని విడిచిపెట్టారని వారి పరిశోధనలో తేలింది. చాలా గ్రంథాలు భారతీయ బ్రహ్మా లిపిలో వ్రాయబడ్డాయి అని వారు చెప్పారు.. బహుశా ఆ బృందంలో ఎవరో ఈ గ్రంధాన్ని చదివి ఇలాంటి దారుణమైన పనులను చేస్తున్నారని నాకు అనిపిస్తుంది .. అని అంటాడు ప్రసన్నకుమార్ భాటియా.. 

సరే ఇక మాటలకు సమయం లేదు.. వారి ప్రయత్నాన్ని మనం ఆపాలి అంటూ అఘోరా అంటాడు.. 


ఇంతలోనే యక్షామీ (ఉవిధ) తను జలకూనను తీసుకొచ్చింది.. ఆ పాప వచ్చీ రాగానే వారితో వచ్చిన ఆ అమ్మాయిని చూసి, అక్కా అంటూ, అమాంతంగా హత్తుకుంది.. జరిగిన విషయాలన్నీ ఆ పాపకు వివరించాడు ఆ అఘోరా.. తన తల్లి చనిపోయిందన్న విషయాన్ని చెప్పినా, తన గతాన్ని వినిపించినా ఆ జలకూన కంటి నుంచి ఓ చిన్న కన్నీటి బిందువు కూడా రాకపోవడం అందరిలోనూ ఆశ్చర్యాన్ని కలిగించింది.. 

తన మెడలోని హారాన్ని తీసి ఆ పాపకు ఇచ్చింది ఆ అమ్మాయి.. ఇచ్చింది తీసుకోవడానికి కాదు అక్కా అంటూ తిరిగి తన మెడలోనే వెయ్యబోతుండగా జలకూన చేతి స్పర్శకు ఆ హారం అందరికీ ప్రకాశవంతంగా కనిపిస్తుంది.. ఆశ్చర్యంగా ఆ హారాన్నే చూస్తూ నిస్తేజంగా ఉండిపోతారు అందరూ..


To be continued …
Written by : BOBBY

No comments:

Post a Comment