Saturday, December 7, 2019

SOCOTRA (The Mysterious Island) from Bobby... 26th Part

SOCOTRA

                                      -The Mysterious Island-


మునుపటి భాగాన్ని మనం ఒక్కసారి మననం చేసుకుందాం ... 

తన మెడలోని హారాన్ని తీసి ఆ పాపకు ఇచ్చింది ఆ అమ్మాయి.. ఇచ్చింది తీసుకోవడానికి కాదు అక్కా అంటూ తిరిగి తన మెడలోనే వెయ్యబోతుండగా జలకూన చేతి స్పర్శకు ఆ హారం అందరికీ ప్రకాశవంతంగా కనిపిస్తుంది.. ఆశ్చర్యంగా ఆ హారాన్నే చూస్తూ నిస్తేజంగా ఉండిపోతారు అందరూ..


తరువాత ఏంటో చూద్దాం పదండి..
26th Part
ఈ రాత్రికి మీరంతా ఇక్కడ నుంచి విడి విడి బృందాలుగా విడిపోయి కొన్ని పనులు చెయ్యాల్సి వుంటుంది. ముందుగా ప్రసన్నకుమార్ భాటియా మీరు మరియు నా ప్రియ శిష్యుడు మోహన్ కలిసి ఆ కన్నీరు సేకరించే చోటుకు వెళ్ళి ఆ కన్నీరును ఎక్కడ భద్రపరుస్తున్నారో తెలుసుకోండి..

యక్షామీ (ఉవిధ) నీతోపాటు ఆకాష్ ని తన ఇద్దరు సోదరులను తీసుకునివెళ్ళి ఆడవారి అందరినీ ఎక్కడ బంధించారో తెలుసుకోండి.. వారిని అక్కడ నుంచి ఎలా రక్షించాలో కనుగొనండి.. మరేదైనా రహస్య మార్గాన్ని అన్వేషించండి.. 

మిగిలిన మీరు ముగ్గురూ (వారితో వచ్చిన అమ్మాయి, జలకూన, నౌకలోని చిన్న పిల్లాడు) కలసి చంద్రిక కొలను దగ్గరకు వెళ్ళండి.. కుదిరితే ఆ రెండు మీనాలతో మాట్లాడటానికి ప్రయత్నించండి… ఇక్కడ జరిగిన విషయాలను జరగబోయే విషయాలను మీనాలకు వివరించండి...అంటాడు అఘోరా.. 

నేను ఈ గ్రంధాన్ని మరొకరికంట పడకుండా పాతాళంలో దాచిపెట్టేందుకు వెంటనే వెళ్ళాలి.. మీ అందరితో నేను అక్కడనుంచే మాట్లాడుతాను అని చెప్పి వెళ్ళిపోయాడు అఘోరా.. 


అందరి ముఖాల్లో ఏదో సాధించబోతున్నామన్న విజయ గర్వం కనిపిస్తుంది.. రేపటి అస్తమయానికి ఏదైనా జరగొచ్చు.. ఎవరికీ ఏమీ కాకూడదు అని అందరూ భగవంతున్ని ప్రార్ధించారు.. మళ్ళి ఇలా కలుస్తామో లేదో అనే భయంతో అందరూ ఆ రోజు ఒకరికొకరు సరదాగా గడిపారు..

ప్రసన్నకుమార్ భాటియా మోహంలో ఒక్క రక్తపు చుక్క లేదు…తన పిల్లల గురించి చాలా కంగారుపడుతూ పైకేమో మల్లె పువ్వులా నవ్వుతూ కనిపిస్తున్నాడు..

ఆకాష్ ని ఆ అమ్మాయి క్షణం కూడా విడువకుండా తన కళ్ళనిండా అతని రూపాన్నే నింపేసుకుంటూ రెప్ప వేయకుండా చూస్తూనే వుంది..


ధైర్యం చేసి ఆకాష్ ఆ అమ్మాయికి తన మనసులో మాట చెప్పాలని తన దగ్గరకు వస్తాడు.. 

ఎప్పుడూ ధైర్యంగా ఆకాష్ కళ్ళలోకి చూసే ఆ అమ్మాయి ఆకాష్ రావడం చూసి తలవంచుకొని మౌనంగా నిలబడి వుంది.. 

ఆకాష్ తనకు మరింత సమీపముగా ఆమె పాదాలు తన పాదాలకు తగిలేంతలా చేరువయ్యాడు..

ఆకాష్ శ్వాస తన నుదురుకు వెచ్చగా తాకుతోంది.. 

ఆ అమ్మాయిలో కంగారు మొదలైంది.. 

ఆ కంగారులో తన కాలి బొటనవేలు ఆకాష్ పాదాలకు తాకింది.. అంతే.. 

ఆమె వొళ్ళు ఝల్లుమంది, గుండె వేగం పుంజుకుంది.. చేతులు వణకడం మొదలయ్యాయి.. నాలుకతో తన పెదవులను తడుపుతూ తన రెండు చేతుల మునివేళ్ళను నొక్కుకుంటూ వుంది.. ఆమె శ్వాస ఆకాష్ గుండెలకు తాకుతోంది.. 

ఆకాష్ తనకు మరింత దగ్గరగా వచ్చాడు.. తన నుదుటిపై పడుతున్న కేశములను ఆకాష్ తన ముంజేతి వేళ్ళతో పక్కకు తీస్తూ మరో చేత్తో ఆ అమ్మాయి చేతిని అందుకుంటాడు.. 

ఆమె దేహం వణికిపోతూ వుంది.. అది గమనించిన ఆకాష్ ఆమె చెవి దగ్గరగా తన పెదవులను పెట్టి 

“నా మరణం ఎక్కడో లేదు.. నీవు విడిచే కన్నీటి బిందువులోనే దాగుంది... దాన్ని ఎప్పటికీ రానివ్వకుండా చూసుకుంటాను” నీకు ఇష్టమేనా అని అడుగుతాడు.. 

తన మాట ముగియక ముందే ఆమె అతని గుండెలపై తలవాల్చి కన్నీరు కారుస్తూ తనని లతలా అల్లుకుపోయింది.. 

కొన్ని క్షణాలు అలానే గడిచిపోయాయి.

ఈ క్షణం ఇలానే ఆగిపోతే ఎంతబాగున్నో అనుకుంటూ ఇద్దరూ బిగికౌగిటలోని తమకాన్ని ఆస్వాదిస్తూ వున్నారు.. 

వారిది ఎంత గొప్ప ప్రేమ అంటూ సన్నని స్వరంతో అడుగుతుంది ఆ అమ్మాయి.. 

ఎవరిది ? అని అడుగుతాడు ఆకాష్.. 

అదే.. వాసుర, నక్షత్ 

అవును చాలా గొప్ప ప్రేమికులు వారు.. ఇన్ని శతాబ్దాలు అయినా కూడా వారిని మనం ఇంకా గుర్తు చేసుకుంటున్నాం అంటే నిజంగా వారు అమరులే అంటాడు ఆకాష్.. 

హ్మ్మ్ .. అంటూ ఆకాష్ గుండెలమీద తలఆన్చి ఆ గుండెలపై తన మునివేళ్ళతో ఏదో రాస్తూ వుంది.. 

రేపు నువ్వు చంద్రిక కొలను దగ్గర చాలా జాగ్రత్తగా వుండాలి ..ఖచ్చితంగా కొందరు అక్కడ గమనిస్తూ ఉండొచ్చు.. అందుచేత మీరు వేసే ప్రతీ అడుగు ఎంతో జాగ్రత్తగా వెయ్యాలి అని తనకు జాగ్రత్తలు చెప్తాడు ఆకాష్.. 

కళ్ళు మూసుకొనే .. హ్మ్మ్ అన్నట్లు ఓ నిట్టూర్పు విడుస్తుంది ఆ అమ్మాయి.. 

ఏమైంది ? ఎందుకలా వున్నావ్ ? అడుగుతాడు ఆకాష్… 

ఏం లేదు…. భయమేస్తుంది.. 

నీకేం కాకూడదు..ఒకవేళ జరగరానిది నీకేమన్నా జరిగితే .. అదే నా చివరి క్షణం అవుతుంది .. అంటుంది ఆ అమ్మాయి.. 


ఎప్పుడూ చంద్రిక కొలను అంటే ఎంతో ఇష్టంతో వెళ్ళేదాన్ని.. ఇవాళ చాలా కష్టంగా వెళ్తున్నాను.. నిన్ను వదిలి వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేదు అంటుంది ఆమె.. 

వాసుర, నక్షత్ లు వారి జీవితాలలో ఎంత బాధ్యతగా వున్నారో విన్నావుగా.. మనకూ ఓ బాధ్యత ఇచ్చారు.. దాన్ని నిర్వర్తించాలి.. తరువాతే ఏదైనా.. మన ప్రాణం పోయినా సరే మన పేర్లు నిలిచిపోవాలి అంటాడు ఆకాష్.. 

ఆ అమ్మాయి కనురెప్పల తడి ఆకాష్ గుండెలకు తాకుతుంది.. 

వెంటనే ఆకాష్ .. 

హే ఏడుస్తున్నావా ? అంటూ తన రెండు చేతుల మధ్యలోకి ఆమె ముఖమును తీసుకుని ఆమె కళ్ళలోకి చూసాడు.. 

రుధిరము పులుముకొని ఆ రెండు నేత్రాలు ఎర్రగా మారి వున్నాయి.. 

బుగ్గలేమో కందిపోయి గులాబీ వర్ణాన్ని పులుముకొని వున్నాయి.. 

నీ నుంచి ఇంత ప్రేమ దొరకడం నిజంగా నా అదృష్టం అంటూ తనని లాక్కొని మరింత గట్టిగా హత్తుకుంటాడు ఆకాష్..!!

ఇప్పటికైనా చెప్పవే.. నీ పేరేంటి అని అడుగుతాడు ఆకాష్.. 

తల్లి చనుబాలు చంటి బిడ్డ చుంబించునట్లుగా ఉమ్.. అని మూతి పెట్టి 

చెప్పను పో.. అంటుంది అమ్మాయి.. 

అబ్బా.. ఎంత కోపమో.. అంటూ గోముగా తన తలను నెమురుతాడు ఆకాష్.. 

ఆ స్పర్శకు ఆ అమ్మాయి ఆకాష్ వెచ్చని కౌగిళ్ళలో వెన్నముద్దలా కరిగిపోతుంది..!!

అంతలో .. మెల్లిగా చీకటి పడటం మొదలైంది.. 

అఘోరా చెప్పినట్లుగా అందరూ సంసిద్దమౌతారు .. మూడు బృందాలుగా ఏర్పడి ఎవరికి వారుగా ఆలింగనాలు చేసుకొని, తగు జాగ్రత్తలు చెప్పుకొని ఆ చోటును వదిలి వెళ్ళారు.. 

ముందుగా ప్రసన్నకుమార్ భాటియా, మోహన్ లు ఆ కన్నీరు సేకరించే ప్రదేశానికి ఎవరికంటా పడకుండా చేరుకుంటారు.. ఆ గది మొత్తం చాలా పరిశుభ్రం గా మంచి పరిమళములు వెదజల్లుతూ సువాసనా భరితముగా ఆ ప్రదేశమంతా చాలా చల్లగా వుంది.. వారి కుడిచేతిప్రక్కన గాజుతో తయారు చేసిన టేబుల్ వంటి ఆకృతి పై ఓ గాజు సీసాలో పసుపు రంగు రసాయనమును వారు గమనిస్తారు.. 

ఏంటిది ఈ రంగులో వుంది అంటాడు మోహన్..

జాగ్రత్త .. తొందరపడి వేటినీ ముట్టుకోకు.. ఇది ఓ ప్రయోగశాల అని గుర్తుపెట్టుకో అంటాడు ప్రసన్నకుమార్ భాటియా.. 

అలాగే అంటూ తల ఆడిస్తూ .. మీరు ఓ విజ్ఞానశాస్త్ర అధ్యాపకులు కదా మీకేమనిపిస్తుంది దాన్ని చూస్తుంటే అడుగుతాడు మోహన్.. 

దాని దగ్గరకు వెళ్ళి పరీక్షగా చూస్తూ, ఆ సీసాను అటు ఇటు కులికించి నెమ్మదిగా వాసన చూస్తాడు.. ప్రసన్నకుమార్ భాటియా..


To be continued …
Written by : BOBBY

No comments:

Post a Comment