Tuesday, April 11, 2017

“పల్లె” పిలుస్తోంది..



“పల్లె” పిలుస్తోంది.. 
**************


కాటువేసే కాలుష్య సర్పం 
పచ్చదనం నాగస్వరం ముందు తలవాలుస్తుంది..! 
పర్యావరణం పరదా విప్పుకొని 
పసిమి ఛాయ ముఖంతో ఎదురొస్తోంది.. !
పల్లె శరీరంలోకి పరకాయ ప్రవేశం చేస్తే,
పసిడి నవ్వుల పెదవి పేరు పేరునా పలకరిస్తుంది..!
పల్లె మన తరతరాల వారసత్వ సంపద .. !
పల్లె మన పంచప్రాణాల చెలికాడు.. !
తాటి ముంజెలా, 
చెరుకు పానకంలా,
నిమ్మపూల వాసనలా,
పల్లె నవ్వు ఎంత కమ్మగా ఉంటుంది.. !
పల్లెలో వీధి, వీధినీ కలిపే రహదారి,
మనిషినీ, మనిషినీ కలిపే కరచాలనంలా ఉంటుంది.. !
నగరమంతా తిరిగి, తిరిగి 
పలకరింపుల పరామర్శకు మొహం వాచి 
పల్లె ఒడికి చేరగానే,
పెదవి మీద గుమ్మపాల ధార కురుస్తుంది.. !!
ఉట్టిలోని వెన్నగిన్నె వీపు నిమిరుతుంది.. !!
మజ్జిగ చిలికే కవ్వం చప్పుడు గుండె సంగీతమవుతుంది..!!
పైరు సముద్రం నడుమ దీవిలా ఉంటుంది పల్లె.. !!
పాపాయి గుండె మీద పచ్చల హారంలా ఉంటుంది పల్లె.. !!
తాటాకు చాప మీద ఆరబెట్టిన మామిడి తాండ్ర తోనూ, 
అవ్వ గంపలోని ఉడకబెట్టిన చిలగడ దుంపలతోనూ, 
చూపు జతకట్టినప్పుడు.. 
పల్లె మన భుజం మీద చెయ్యేసి బాల్యంలోకి లాక్కుపోతుంది.. !!
మస్తాన్ తాత భుజం సవారీ ఇప్పటికీ గుర్తొస్తుంది.. !!
డేవిడ్ మామ సైకిల్ గంట చెవుల్లోనే కాపురముంటుంది ..!!
తాటిచెట్టు మీద కల్లు గీసే యువకుడూ,
పొలంలో నడుం వంచిన అమ్మాయీ,
కనుపాపల్లో బొమ్మల కొలువు తీరుతారు..!!
పట్టె మీదుగా కాలువ దాటుతున్న పాదాల కదలికలు.. !!
అత్యంతాద్భుత అవ్యక్తానుభూతి కావ్యాల్ని నిర్మిస్తాయి..!!
నగరంలోకి సూర్యుడు పల్లెను పలకరించే వస్తాడు.. 
వెన్నెల పల్లెలోని పడుచుపిల్ల ముక్కుపుల్లలా మెరుస్తుంది.. !!
రైల్లోనో, బస్సులోనో పల్లెను స్పృశిస్తూ పోతున్నప్పుడు, 
గొప్ప క్షణాలేవో జారిపోతున్నట్టు, 
గుండెలో గొడవ గొడవై పోతుంది..!!
మామిడి కొమ్మకు వ్రేలాడే తేనెపట్టూ, 
జామకాయను కోరికే రామచిలుకా, 
ఈతమట్ట చివరన ఊగే పిచ్చుక గూడూ,
చెంగు చెంగున గెంతే కోడెదూడా,
చేప పిల్లను వేటాడే తెల్లకొంగా, 
ఏ కుంచెకూ అందని సజీవ చిత్రాలై చూపుల్ని కట్టేస్తాయి..! 
శ్రమజీవన తాత్వికత పునాదిగా పల్లె, 
ఒక విశ్వాస ఛత్రం నీడలోకి ఆహ్వానిస్తుంది..!!


అనిర్వచనీయమైన ఆత్మీయుతా దృశ్యాల వేదిక – మన పల్లెటూరు .. !!

దేశం చుట్టూ పేరుకున్న ఓజోన్ పొర – మన పల్లెటూరు .. !!

Written by : Bobby

No comments:

Post a Comment