Saturday, October 8, 2016

విజ్ఞాన సముపార్జన



నేటి అడ్డద్రోవల సమాజంలో పలువురు ఏదో ఒకటో రెండో పుస్తకాలు చదివి, ఆ ఫలానా రంగంలో నిష్టాతులు కావాలని తాపత్రయపడటం మనం చూస్తూనే వున్నాం. చివరకు ఈ ప్రయత్నం ఫలించక వారు మొత్తం విజ్ఞాన సముపార్జననే సందేహిస్తుంటారు..

అయితే విజ్ఞాన సముపార్జన కూడా బిడ్డకు జన్మనిచ్చేందుకు తల్లి తొమ్మిది నెలలపాటు మోసి ప్రయాసపడినట్లే వుంటుంది.. ఎంపిక చేసుకున్న రంగంలో దీర్ఘకాలంపాటు నిరంతర కృషి చేయకుండా ఎవ్వరికీ సత్ఫలితాలు అందవు... తొలి ప్రయత్నాలలో అపరిపక్వంగా వున్న విజ్ఞానం, దానిని ఆచరణలో పెట్టడం ద్వారా, మరింత లోతుగా అధ్యయనం చేయటం ద్వారా పరిపక్వమవుతుంది. ఈ మొత్తం ప్రక్రియకు సహనం, ఓర్పు, కృషి ఎంతో అవసరం...

అలాగే విజ్ఞాన సముపార్జన ఏక బిగిన నింగివైపు దూసుకెళ్ళే రాకెట్ వంటిది కాదు. విజ్ఞాన సముపార్జనలో ప్రతీ నూతన దశ వెనుకా దీర్ఘకాలపు, గ్లామర్ లేని నిశ్శబ్ద కృషి వుంటుంది. దీని అంతిమ ఫలితంగా విజ్ఞాన ఫలం తాలూకు పరిపక్వ ఫలాలు ఆ వ్యక్తికి అందుతాయి.. ఇది నిరంతర అధ్యయనంలో వున్న వ్యక్తి జీవితంలో వుండే రెండు దశలు .. 

వ్యక్తిలో ఈ రెండు దశలు మధ్యకాలం యెంత తక్కువగా వుంటే ఆ వ్యక్తి ఆ రంగంలో అంత శ్రమించినట్లు, లోతులకు వెళ్ళినట్లు అర్ధం.. ఈ విజ్ఞాన సముపార్జన ప్రక్రియ సరైన దారిలో సాగి, సత్ఫలితాలను ఇవ్వాలంటే వ్యక్తి తాను అధ్యయనం చేసిన దానిని, లేదా తన అనుభవం లోనికి వచ్చిన దానిని గుడ్డిగా స్వీకరించరాదు. ప్రతీ దానిని సందేహించి ప్రశ్నించడం అవసరం.. అదే నిజమైన తాత్వికుని మర్మ రహస్యం.. 

Bobby Nani

No comments:

Post a Comment