Friday, October 21, 2016

ఈ రోజు ఓ వార్త నన్ను విస్మయానికి గురిచేసింది..



ఈ రోజు ఓ వార్త నన్ను విస్మయానికి గురిచేసింది.. 550 కోట్లకు పై చిలుకు ఖర్చుతో.. 11 రోజుల పెండ్లి సంబరాలట .. ఎల్.ఇ.డి లో పెండ్లి పత్రికలట .. వినడానికి చాలా బాగుంది కదూ.. 

పెండ్లి అంటే ఆకాశమంత పందిరి.. భూదేవంత విస్తరి మాత్రమే కాదు.. తరతరాలు మనల్ని గుర్తుపెట్టుకునే ఓ గొప్ప రోజు కావాలి ఆ రోజు.. ఓ నిండు జీవితానికి తొలి అడుగే ఈ పెండ్లి పీటలు.. 

మీ అమ్మాయి బ్రహ్మణి మీద మీకు యెంత ప్రేమ వుందో అర్ధం అయింది .. అందుకు చాలా సంతోషంగా వుంది.. 

ప్రతీ తండ్రి ఔరా అనుకునే విషయం ఇది.. 

ప్రతీ వ్యక్తి అబ్బురపడే సందర్భం ఇది... 

ప్రతీ అల్లుడు అసూయ చెందే రోజిది...

మీరన్నట్లు నిజంగానే చరిత్రలో నిలిచిపోతుంది .. ఆ పదకొండు రోజులు మాత్రమే .. !! తరువాత షరా మాములే.. తిన్న ఆహారం, పంచిన కానుకలు మచ్చుకు కూడా గుర్తుండవు ఈ జనాలకు.. 

అందుకు గల కారణం ఒక్కటే... మీరేంటో చూపించుకునేందుకు ఇంత ఆర్భాటం చెయ్యడం..అలా కాకుండా జనం కోసం మీరు ఖర్చు పెట్టివుంటే వారి ఆఖరి శ్వాస వరకు అది వారికి గుర్తుకు వుంటుంది.. 

మీరు అనుకుంటున్నట్లుగా "సంతోషం" అంటే దేశ విదేశాలనుంచి వచ్చిన మీ అతిధులు భుజించే అర్ధ ఆహారంలో ఉండనే ఉండదు .. 

మీరు చూపించే ఈ ఖరీదైన దగ దగ మెరుపుల పూతలలో ఉండనే ఉండదు.. 

అబ్బా అని పొగిడే ఈ జనాల నాలుకల మీద ఉండనే ఉండదు.. 

ఇదంతా ఆ పదకొండు రోజుల ముచ్చటే .... తరువాత మిగిలింది వ్యర్ధమైన ఆహారం, విడిచిన ఎంగిలి విస్తరులే ... 

నిజమైన సంతోషం అంటే "ఆశీర్వాదం" మీ బిడ్డకు అదే చివరివరకు తోడై, నీడై, రక్షణై నిలిచి వుంటుంది.. అలాంటి ఆశీర్వాదం ఎక్కడ దొరుకుతుందో తెలుసా ?? మూడు పూటలా పస్తులుంటున్న నిరుపేదల దగ్గర.. మీ దగ్గర లేనిది వారి దగ్గర వున్నది అదే.. మీరు కొనలేనిది, విలువ కట్టలేనిది కూడా అదే.. ప్రతీ మనిషికి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి వసతి, చెయ్యడానికో పని ఇది చాలా ముఖ్యం.. ఇలాంటి కనీస అవసరాలు నోచుకోకుండా అతి దారుణమైన, దుర్భరమైన, దుర్భేధ్యమైన జీవనాన్ని వారు గడుపుతున్నారు.. 

ఈ వివాహ మహోత్సవం సందర్భంగా మీరు అలాంటివారికి ఏమైనా చేసుంటే ... మీరు 550 కోట్లు కాదు మరో 550 కోట్లు ఖర్చు పెట్టిన దానికన్నా మరింత ఆనందాన్ని, సంతృప్తిని పొందుతారు అని నేను ఖచ్చితంగా చెప్పగలను..

చరిత్ర అంటే అది.. 

ఆనందం అంటే అది..

వివాహానికి తొలి అడుగు అంటే అది.. 

అందరూ గొప్పగా చెయ్యాలి, గొప్పగా విందు అందించాలి అని చూసేవారే .. ఆ గొప్ప కొన్ని గంటల్లో విసర్జించబడుతుంది అని మర్చిపోతున్నారు.. గొప్పగా అంటే కడుపులోకి కాదు గుండెల్లోకి వెళ్ళాలి... అలా మీరు చెయ్యగలగాలి అని ఆశిస్తూ సోదరి బ్రహ్మణి కి హృదయపూర్వక శుభాకాంక్షలు .. 

స్వస్తి ___/\___

Bobby Nani

No comments:

Post a Comment