Monday, October 24, 2016

ఆదివారంనాడు నేను, నా మిత్ర బృందం కలిసి వెళ్ళిన శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ క్షేత్ర విశేషాలు, వింతలు మరియు నా అనుభవాలు ...

ఆదివారంనాడు నేను, నా మిత్ర బృందం కలిసి వెళ్ళిన శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ క్షేత్ర విశేషాలు, వింతలు మరియు నా అనుభవాలు ... 


అనుకున్న సమయం కన్నా ఓ గంట లేటుగా బయలుదేరాల్సి వచ్చింది .. అందుకు గల కారణం నా మిత్ర బృందం లోని ఒకరి పెళ్లి చూపులకు సంబంధించిన తన చిత్రాన్ని అమ్మాయి ఇంటి వారికి అందజేయ్యాల్సిన పరిస్థితి రావడం.. ఇది చాలా శుభ పరిణామం.. ఆ పెనుశిలేశ్వరుడి కరుణా, కటాక్షాలు ఆ ఒక్కటి కాబోతున్న జంటపై ప్రసరించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ... 


ముందుగా దక్షిణ భారతదేశంలో ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా ఈ పెసుశిల (పెంచలకోన) పేరుగాంచింది. ఈ పుణ్య క్షేత్రం దర్శించుకున్న వారి పాపాలు తొలగిపోతాయని భక్తులు భావిస్తారు.. అంతే కాదు ఓంతో పాసస్త్యం గల శ్రీ లక్ష్మి సమేత పెనుశిల లక్ష్మి నారసింహ స్వామి భక్తులకు ఇలవేల్పుగా మారారు.. చెంచు రాజు కుమార్తె చెంచులక్ష్మి సంచరించిన నాటి చెంచులకోనే నేటి పెంచలకోన గా పురాణాలు చెప్తున్నాయి... దట్టమైన తూర్పు కనుమలు మధ్యన వున్న కీకారణ్యం అయినప్పటికీ ఇక్కడ ఒంటిగా వున్నా కూడా ఎలాంటి ఆపదలు, క్రిమి కీటకాలనుంచి జంతువులనుంచి ఆపదలు తలెత్తవని అందరూ నమ్ముతారు.. ఇక విషయంలోకి వెళ్తున్నా...



అరవై కిలోమీటర్ల వేగంతో బండి వెళ్తోంది.. దానికి రధ సారధిని నేనే.. వెనుక కూర్చున్న నా మిత్రుడు ఎన్నో కబుర్లు చెప్తూ వున్నాడు.. ఆ లేలేత సూర్య కిరణాల చివుక్కు చివుక్కు మనే చక్కలి గిలిగింతల నులువెచ్చని వెలుగులలో ... నల్లని తారు రోడ్డు పై మా ప్రయాణం సాగుతుండగా .... బాగా తల నెరిసిన ఓ వృద్ద పురుషుడు చేతి కర్ర సాయంతో దీటుగా నిలబడి అక్కడున్నటువంటి వృక్షాలకు కాపలాగా, ఓ సలహా దారునిగా ఓకింత అనుభవ గర్వంతో, చిరునవ్వు చిందిస్తూ వున్నట్లుగా కుడిచేతిప్రక్కన కనపడిందో పెద్ద వృక్షం ... ఆ వృక్షానికి అన్నీ ఆకులు కాగితాలలా తెల్లగా వున్నాయి.. పచ్చదనం అనేది లేకుండా సజీవంగానే నిలబడి వుంది.. అది చూడగానే నాకు కలిగిన మొదటి అనుభూతి ఇది.. అక్కడవున్న చుట్టుప్రక్కల వృక్షాలకు ఓ పెద్ద తలకాయిలా ఆ వృక్షం ఉంది అనిపించింది.... 


80 కిలోమీటర్ల మా ప్రయాణం ముందు ఉంది .. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, ఆ రోడ్డు స్థితిగతులను బట్టి నేను సారధ్యం వహిస్తూ వున్నాను.. నా మిత్రుడు ఏమో నన్ను అలరింప చేస్తూ మాట్లాడుతూనే వున్నాడు.. రోడ్డుకు ఇరుప్రక్కల యవ్వన కోమలాంగులు, అపర సౌందర్యవతులు అయిన నర్తనలు వరుసగా వయ్యారంగా కదులుతూ .. స్వయానా వారి హస్తములతో మధుర పరిమళ గంధపు జల్లులలను, కుసుమములను మాపై చల్లుతూ ఆహ్వానం పలికే ద్వారపాలకులలా (ఓ మోస్తరు ఆకృతి గల వృక్షాలు మాపై వాటి ఆకులను, పువ్వులను విసురుతున్నట్లు) అనిపిందింది.... ఇది నాకు కలిగిన రెండవ అనుభూతి.. 


మరికొద్ది దూరం లో మేము పెద్ద జంక్షన్ నుంచి మరో రోడ్ లోకి ప్రవేశించాలి అనుకుంటూ వుండగా.. అక్కడ ఒక చిన్న దుకాణం చూసాము.. అది శీతల పానియాల దుకాణం.. ఇంకేముంది వెళ్లి రెండు సుగంధ పానీయం చెప్పి అందులో తప్పకుండా నిమ్మకాయ కలపమని చెప్పాము.. చెప్పిన వెనువెంటనే చేతిలోకి వచ్చి వాలింది ఓ తియ్యనైన, పుల్లనైన శీతల సుగంధ పానీయం.. మెల్లి మెల్లిగా దాని రుచిని ఆస్వాదిస్తూ ప్రతీ గుటకకు అబ్బా బాగుంది కదా.. అని చెప్పుకుంటూ చివరి బొట్టు వరకు పూర్తి చేసి బండి దగ్గరకు వెళ్లేముందు సూర్యభగవానుడి అగ్ని కిరణముల జ్వాలలకు తాళలేక జేబులో వున్న చేతి రుమాలు తీసి బాగా తడుపుకొని ముఖానికి కట్టుకొని, దరిమిల్లా కళ్ళజోడు పెట్టుకొని మరింత రెట్టింపు ఉత్సాహంగా ముందుకు కదిలాం.. మార్గ మధ్యంలో రాక్షస జాతికి చెందిన పెద్ద పెద్ద మర్రి చెట్లు వాటి చేతులవంటి ఊడలను మనసారా చాచుతూ పరుగు పందెం లో విజేతగా నిలిచిన క్రీడాకారునికి ఇరుప్రక్కల ఉన్న వీక్షకులు అభినందనలతో చేతులు జాపి ఆ విజేతను తాకాలని ఎలా అయితే ఆరాటపడతారో అలా ఆ ఊడలు మమ్ములను తాకేయత్నం చేసినట్లు నాకు అనిపించింది.. నాలో నేనే నవ్వుకొని అయినా నా పిచ్చి కాని సాధించడానికి నేనేం చేసానులే.. అని అనుకుంటూ ముందుకు వెళ్లాం...

సన్నని దారి ఇరుప్రక్కలా దూరాన వున్న కొండలు నిశ్చలంగా ఎన్నో ఏళ్ళనుంచి అవే రూపురేఖలతో అటు, ఇటు, వెళ్ళే మాలాంటి వాళ్ళను చూసి పలకరిస్తున్నట్లుగా అనిపించింది.. కంటి చూపు మేరా లే లేత ఆకుపచ్చని తివాచి కప్పినట్లు ఉండే పొలాలలో అప్పుడే వచ్చిరాని చిన్న చిన్న మొలకలతో కంటికి చాలా ఆహ్లాదకరంగా మారి ఓ పచ్చని ప్రపంచంలో మేము మాత్రమే సవారీ చేస్తున్న తుమ్మెదలమా అని అనిపించింది ఆ ఆక్షణమున .... నిజంగా ఆ క్షణాన తుమ్మెదలా మర్చవయ్యా..!! అని అడగాలనిపించేంత ఆశ కలిగింది నాలోన.. అల్లరి చేసిన బాల్యం ఒక్కసారి కళ్ళముందు కదలాడింది... అక్కడక్కడా మార్గ మధ్యలో పొడవైన తాటి చెట్లు, ఈత చెట్లు, నానాజాతి ఫల వృక్షాలు మాకు ఆహ్వానం పలుకుతున్నట్లు గా వుంది.. ఇరువైపులా పచ్చని పొలాల మధ్యన నల్లని తారురోడ్ పై మా ప్రయాణం స్వర్గానికి వెళ్ళే మార్గం లా ఉంది .. 


ఎన్నటికీ తరగని మధుర జ్ఞాపకాలు, విలువైన జ్ఞాపకాలు కూడా ఇవే... వీటికన్నా ఈ ప్రపంచంలో మరో విలువైనది ఉందంటే నేను నమ్మను.. నిజమైన సుఖాలు, సంపదలూ నా దృష్టిలో ఇవే .. బండిని వేగంగా పోనిస్తున్నాను.. కళ్ళూ విప్పార్చి మనసు లో తలపు తెరలను కూడా బాహాటం గా తెరిచి పెట్టి నా ముందు పరుగులు తిస్తున్న దృశ్య మాలికలను చూస్తూ క్షణం కూడా రెప్ప వెయ్యకూడదు అని మనసులో అనుకుంటూ ఎంత హాయిని పొందానో.. 


ఆ తన్మయత్నంలో వుండగా .. ఎదురుగా శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దివ్యమైన కోవెల దర్శనం ఇచ్చింది... ఆహా ఆ దివ్య సుందరమైన కోవెల వెనుక వున్న పర్వతాన్ని చూస్తుంటే మనసు పడే ఆరాటం ఆ సమయంలో ఒక్కటే .. బిర బిరా వెళ్లి స్వామివారిని చూడాలని .. అనుకున్నట్లే, అనుకున్న సమయానికే లోపలకు వెళ్లాం.. యెంత అందగాడివయ్యా ఓ పెనుశిలవాసా .. అందుకే కదా మా తల్లి చెంచులమ్మ నీ మాయలో పడిపోనాది .. పచ్చని పసిడి కనకముతో ధగ, ధగల మెరుపు సౌందర్య తెజోవిరాజితముల కాంతులతో సకల ప్రాణకోటికి రక్షణమూర్తివై వెలుగొందుతూ భక్తుల పాలిట ప్రతినిత్యం కొంగు బంగారమై విరాజిల్లే ఆ మహిమాన్విత దివ్య సుందర సుమధుర శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ మూర్తి దివ్యమంగళ దర్శనంతో మనసూ, తనువూ పులకరించి, పునీతమై పరవశించి పోయింది.. మాకోసమే అన్నట్లుగా ఓ పదినిమిషాలు అలానే ఆయన్ని చూస్తూ ఉండిపోయాను.. ఆ రూప దర్శనంతో కోరికలు కూడా మర్చిపోయి అలా చూస్తూ నిలిచిపోయాను.. 


బయటకు వచ్చి ఎదురుగా వున్న వానరుడు, సుగ్రీవుని మంత్రి, రాముని దూత, అతిబలశాలియు అసహాయశూరుడున్నూ అయిన హనుమంతుని వద్దకు వెళ్లి అక్కడనుంచి శ్రీ చెంచు లక్ష్మీ అమ్మవారిని దర్శించాము.. ముదురు కుంకుమ రంగు చీరతో, చేతి గాజు వంటి ముక్కు పుడకతో, మేనిమి ఛాయ కలిగిన మోముతో చల్లగా చూసే ఆ తల్లి కరుణ, కటాక్షముల ఆనంద వీక్షణ మాపై ప్రసరించినట్లు అనిపించింది.. ఏదో తెలియని ఉత్సాహం మా లోలోన.. చాలాసేపు అక్కడ కబుర్లాడుకొని కోనేరువైపు అడుగులేశాము.. అక్కడ నీరు పరిశుబ్రంగా లేనందున అన్నదాన శిబిరానికి వెళ్లాం.. 


ఒక్క బంతిలో దాదాపుగా 350 మంది భక్తులు కూర్చుని తినగలిగే వసతిని కల్పించారు.. అందులో మేము వెళ్లి కూర్చున్నాం.. ఎప్పుడో చిన్నప్పుడు చూచిన విస్తరాకులలో భోజనం.. అడ్డ చెట్టు ఆకులతో కలిపి సన్నని పుల్లలతో చక్కగా అల్లినటువంటి ఈ విస్తరాకులు చాల పలుచగా, నాణ్యతగా, విస్తారంగా ఉండి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి కాబట్టి పూర్వం నుంచి ఈ చెట్టు ఆకులను విస్తరాకుల తయారిలో ఉపయోగిస్తున్నారు. వీటిల్లో తింటే ఆరోగ్యం కూడాను.. అలాంటి విస్తరాకులలో ముందుగా క్యాబేజీ తాలింపు, బీరకాయ పచ్చడి, అన్నం, సాంబారు, రసం, మజ్జిగ వెరసి కమ్మని భోజనం .. యెంత రుచిగా ఉందో ఇప్పుడు చెప్తుంటే కూడా నోట్లో నుంచి నీరు ఊరుతోంది .. తినే ముందు ఇలా అనుకున్నాం ఈ మధ్యాహ్న వేళ, ఈ పెనుశిల క్షేత్రమున, చుట్టూ ఉన్నటువంటి అటవీ మధ్యమున మాకు ఇంత కమ్మని నాలుగు రుచుల భోజనం అందించి మా కడుపు నింపిన ఆ దాతకు దానికోసం పనిచేసిన పనివారమంతటికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారు అందరూ సుఖ, శాంతులతో వర్ధిల్లాలని చిన్న ప్రార్ధన చేసుకొని ఒకపట్టు పట్టేసాం.. 

బయటకు రాగానే ఐస్క్రీం బండి హై హై అనుకుంటూ అల్లరిచేసి అమ్మదగ్గర చిల్లర అడిగి అప్పలు కొనుక్కుని తినే చిన్న పిల్లాడిలా దానిముందు వాలిపోయాను..అందరం తలో చాకోబార్ తీసుకొని తినేశాం.. ఓ 10 నిమిషాల విశ్రాంతి అనంతరం అసలైన పయనానికి సిద్దం అయ్యాం.. 


అడవిలోపలకు 3 కిలోమీటర్ల ప్రయాణం మొత్తం ఎటుపడితే అటు గుట్టలు గుట్టలుగా ఉన్న రాళ్ళు, ఇదే దారి.. ఇలానే దాటుకుంటూ వెళ్ళాలి.. వేసే ప్రతీ అడుగు జాగ్రత్తగా వెయ్యాలి.. లేకుంటే ప్రక్కకు తొలిగి లేదా విరిగే అవకాశం ఎక్కువ.. అలా వెళ్తూ వున్నాం.. కళ్ళు పట్టనంత సౌందర్యం తో కూడిన పర్వతాలు, చెట్లు.. ఆ చెట్ల నుంచి వస్తున్న సుగంధంతో కూడిన స్వచ్చమైన గాలి.. ఇలాంటి గాలి పీల్చి ఎన్నో రోజులు అయింది అని అనుకుంటూ ముందుకు వెళ్తూ వున్నాం.. ఇక ఆ ప్రయాణపు దారిలో మధ్య మధ్యలో కొండపై నుంచి విరిగిపడ్డ పెద్ద పెద్ద రాళ్ళ గుట్టలు దట్టమైన చెట్లు, సర్పాకృతి కలిగిన గుబురు గుబురు పొదలు, అవన్నీ దాటుకుంటూ ఆనందంతో, ఆశ్చర్యంతో, ముందుకు కదులుతూ వెళ్తూ ఉన్నాము.. ఎన్ని సార్లు ఇక్కడకు వచ్చినా ఎప్పుడూ కొత్తగానే కనిపిస్తుంది అదేంటో నాకు... ఎక్కడా లేనన్ని రకరకాల, రంగురంగుల పూలమొక్కలు, జాజి, మొదలైన పూ పొదలు, నేరేడు, మారేడు, మోదుగ ఇలా నానావిధ ఫల, పుష్ప, వృక్షాదులు మా కన్నులకు కనువిందు చేస్తూ, మా మనసును అమాంతం లాగేసుకుంటూ వున్నాయి.. 


ఆ అడవిలో అణువణువునా అందమైన దృశ్యం తాండవిస్తోంది.. దారం తెగిన గాలి పతంగం లా నేను ఆ అడవిలో స్వేచ్చగా తిరుగుతున్నాను.. “అందం ఉన్నచోట ఆపద కూడా పొంచి ఉంటుంది” అని మామ చెప్పిన మాట గుర్తుకు వచ్చింది.. ఇక జాగ్రత్త పడి ఒక వీడియో తీస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది.. వచ్చి రాగానే మొదలెట్టేసా.. ఈ కొండలను వాటి ప్రాముఖ్యతను నాకు తెలిసినంతలో వివరిస్తూ ఓ 6.30 నిమిషాల వీడియో కూడా తీసా.. దాదాపుగా 50 నిమిషాలు నడిచిన అనంతరం చివరికి వచ్చాము.. నిజానికి అక్కడ జలపాతం లేదని మాకు ముందుగానే తెలుసు.. అయినా ఒక్క జలపాతానికే నేను ప్రాధాన్యత ఇవ్వబోను.. అది లేకుంటే ఏం మరెంతో అందం అక్కడ మెండుగా వుంది.. నిజంగా అదో అద్బుతమైన ప్రదేశం.. ఒకప్పుడు తొమ్మిది గుండాలు అని ఉండేవట .. గుండం అంటే కొండనుంచి కోనేరులా జాలువారి నీరు నిలిచిన ఓ అందమైన ప్రదేశం అని అర్ధం.. అలాంటి గుండాలు నేను కొన్ని సంవత్సరాలకు ముందు 3 చూడగలిగాను.. తరువాత అక్కడనుంచి కొండచర్యలను పట్టుకొని వ్రేలాడుతూ పోవాలని చెప్పారు.. చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే 7 గుండాల దాకా వెళ్ళారని అక్కడ నానుడి.. 9 వరకు ఎవ్వరూ వెళ్లలేరని అది అసాధ్యం అని అంటుంటారు.. 9 వ గుండం దగ్గర స్వామివారు స్వయంబు బోర్లా పడి పిరుదులు పైకి లేచినట్లు ఉంటారని అక్కడ స్వామివారు సంచరిస్తూ ఉంటారని శాస్త్రాలు చెప్పివున్నాయి.. ప్రస్తుతం ఇప్పుడు కేవలం ఒక్క గుండం దగ్గరకే వెళ్ళగలం.. కొన్ని కొండచర్యలు విరిగి పడి మిగతా గుండాలకు వెళ్ళే దారిని పూర్తిగా మూసివేశాయి.. 





ఆ ప్రాంతంలోనే షుమారు 2 గంటలు గడిపాము.. ఎన్నో జీవరాశుల్ని పరిశీలించాము, మొక్కలను పరీక్షించాము, చిత్ర విచిత్ర విన్యాసాలు కూడా చేసేశాము.. అనేక చిత్రాలు క్లిక్ మనిపించాము... తరువాత తిరిగి ఇంటిముఖం పట్టాము.. ఎక్కడా ఇబ్బంది లేకుండా సజావుగా, సాఫీగా అందరం క్షేమంగా ఇంటికి చేరాము..

ప్రతీ ఒక్కరు దర్శించి పరవశించవలసిన మహిమాన్విత దివ్య సుందర క్షేత్రం .. వీలుచూసుకొని తప్పక వెళ్తారు కదూ.. 













స్వస్తి. ___/\___



No comments:

Post a Comment