ఊరు దాటుతున్నప్పుడే తెలుస్తుంది
కనుకొలనుల్లో అశ్రువల్లే కదిలే ఆ
ఊరు విలువేంటో..!!
పుట్టి పెరిగిన ఊరంటే
అందరికీ మక్కువే మరి..!!
తొలిసంజ నారింజ కాంతిలో
నా సింహపురి (నెల్లూరు) బంధూక పుష్పములా
విప్పారుతుంది
శతపత్రవక్ర రేఖల వలయాలవల్లే
దైనందిన నా నగర పరిమళం నన్నల్లుకుంటుంది
పాయలు పాయలుగా నవ్వుతూ
పరవళ్లుతొక్కే పెన్నమ్మ వయ్యారాలు
నదీ ఒడ్డున నిమ్మళంగా
పవళించిన రంగనాధుని సోయగాలు
దేశ నలుమూల కోర్కెలు తీర్చి
నిర్మలంగా చూస్తున్న నెల్లూరి కోర్కెల కొలను
పాడి పంటల అమృత ధార సోమశిల సొగసులు
రాతి కొండల అభయారణ్యాల నడుమన
విరాజిల్లే పెనుశిలేశ్వరుడు
వేళ తప్పని నమాజులు
క్రమం తప్పని ప్రార్ధనలు
విస్తారమైన నెల్లూరి సాగర తీరాల
కమనీయ దృశ్య మాలికలు..!!
ఎన్ని చూసిన
ఎంత తిరిగినా
నా సింహపురి
తనలోని రహస్యాన్ని
నాకు ఎప్పటికీ చెప్పదు ఎందుకో..!!
సంజెవేళకు మళ్ళీ వాడిన పువ్వులా
ముడుచుకుంటుంది
అలసిన గుమస్తాల్ని నీరసంగా ఆహ్వానిస్తుంది
చీకటిని మెల్లిగా అన్వయించుకుంటుంది
తళుకుబెళుకుల విద్యుద్దీపాల కాంతుల్లో
తనని తాను మర్చిపోయి మంచులా రాలిపోతుంది
రేపటి నూతనోదయానికై..!!
అయినా
సింహపురి అంటే అమిత వాత్సల్యం
జ్ఞాపకాలను వెతుక్కుంటూ
వ్యాపకాలను పోగేసుకుంటూ
అల్లరి ఆటలు ఆడిన చోట
నన్ను నేనే మర్చిపోతుంటాను
బహుశా
నా ప్రస్థానం ముగిసిందేమో
మరో ప్రస్థానం మొదలైందేమో..!!
Written by: Bobby Aniboyina
Mobile: 9032977985
No comments:
Post a Comment