Monday, July 24, 2023

వాసంతిక ...

 



 

అడుగులిడునంత మదిదోచు వసంత గతులు

పలుకబోవఁగ పువ్వాడి మధురిమల్ పులకరింపులు

రాగమిగడగ  సుదతి  రసరేఖ  సరిగమలు

యోరచూపులొలుకు వాసంతిక

సమ్మోహనాస్త్రమ్ములే ఈ విశ్వమ్మునకు

జగతి  నందాలు చివురించు  అందాల వాసంతిక అవతరించగన్..!!

 

తనని చూడాలంటె చైత్రమాసపు తొలి జామునే చూడాలి

దానిమ్మ పలువరుసలు 

తమలపాకు నేత్రములు

గాండీవపు కనుసోగలు

పనసతొనల అధరములు

మకరికల చిరు చెంపలు 

పారాణి హస్తాగ్రములు

ఏమాటకామాటే 

రాగతాళ నాట్యములతో 

తద్దిమ్మి తకదిమ్మి ధిమిధిమియనుచు 

శోళపద్మపు నాట్య ముద్రలతో 

ధీంతాన ధీం తాన ధింధిమిధ్వనులతో 

రాగమొక తాళమై 

తాళమొక గానమై 

గానమొక వాయువై 

వాయువొక ప్రాణమై 

తన్మయత్వంబొందు నీ 

కాలి అందియల ఘల్లు ఘల్లు లు

జాలువారు కురులు విరులు 

చకోరి పలుకుల చకచకలు

పసిడిఛాయ ధగధగలు 

క్షణకాలమైనా చాలదటే  ..!!

 

ఎక్కడిదే ఇంతందం నీకు 

ఏ ఉలికారుడు  చెక్కాడే నిన్నింతలా 

ప్రభాత కాంతిని మింగే నల్లని ముంగురులు

ఎర్ర మందారమై ఆగి ఆగి విచ్చుకునే ఆ పెదవులు 

కిన్నెర కాంతను తలదన్నే లలాట లావణ్యములు 

పూర్ణకుంభములవంటి బిగుతైన స్తన సంపదలు..!!

 

నేత్రాలు కాదే అవి తెల్ల తామర రేకులు

నీలో వున్నది అందం కాదె బ్రహ్మాండం 

అందుకే   నువ్వెప్పుడూ నాకు ప్రత్యేకమే..!!

అలకతో ఆ  మూతిని ముప్పదియారు వంకలు 

తిప్పితేనే కదా అసలైన అందం నీలో మొలిచేది 

వెన్నెల కాంతుల్లో గుప్పుమను మల్లెల సొగసుల్లో 

వెచ్చని నీ దేహ పరిమళం నిజంగా ఓఅద్బుతమేనే

నీ శగ శరముల తాపములకు 

ఏ మన్మధుడు నిలవగలడే 

ఆ నిట్టూర్పు మేళవింపులను  

ఏ కృతికర్త తీర్చగలడే..!!

 

Written by: Bobby Aniboyina

Mobile: 9032977985


No comments:

Post a Comment