Thursday, February 24, 2022

గుప్పిట బంధిస్తే గప్చిప్గా ఆగేదా మనసు..



లేలేత పెయ్య పొదుగులోని పాలను జుర్రి
మేఘం నేలను తాకినట్లు వాలే శ్వేత కొంగలా
గాలివాటుకు తన దారి మార్చుకునే సీతాకోకచిలుకై
ఊళ్ళో చెరుకు లారీ వెనకాల ఉరకలెత్తి పరుగులెత్తే పిల్లాడి కోరికలా
మనసెప్పుడూ వయసు తెలియని పసిదే..!!

నక్షత్రాల ఆకాశం,
మేఘాల గర్జన
జల జలా రాలే జలతార్ల పొందిక
ముంచెత్తే మట్టి సుగంధ తెరల ఆఘ్రాణ వీచిక
మనసారా వడ్డించే మబ్బుల తొలకరుల అల్లిక
వానా వాయువు కలిసిన పిల్లగాలి తాకిళ్ళలో
తనువూ, మనసూ పరి పరి విధముల తన్మయత్వము నొసగగ..!!

అమ్మ చేతి గోరుముద్దల గారాబం,
నిద్రిస్తున్నప్పుడు ప్రేమగా నాన్న తడిమే చేతి స్పర్శ
మొదటిసారి కళ్ళు కలిపే పడుచుపిల్ల కొంటె చూపు
బెత్తం పట్టుకొని మాస్టారు వేసిన మొదటి దెబ్బ
మరణించే నాటికైనా సరే మనసులో
అలానే ముద్రించి వుండే మరపురాని జ్ఞాపకాలు..!!


నాలుగు పలకల ఎసి గదులలో
మగ్గి మగ్గి కృంగి కుశించి పోయే నీ దిన చర్యలో
ప్రతీ సాయంత్రం ఓ అద్బుతమే
మనం బ్రతికే క్షణాల్లోంచి
జీవించే ఒక్క నిమిషం
కాలం కరిగిపోయినా, చెరిగిపోయినా
కలకాలం నీ కళ్ళ ముందు ఆవిష్కారమయ్యే
ఓ గొప్ప చిత్రం సాయంత్రం..!
దాన్ని కాసేపైనా చూడు కళ్ళారా..!!

Written by: Bobby Aniboyina
Mobile: 9032977985

No comments:

Post a Comment