1st Part
పడమటి దిక్కున సూరీడు ఎత్తైన భవనాల మీంచి మెల్లిగా క్రిందకు దిగుతున్నాడు
రైలు పట్టాలకు కూతవేటు దూరంలో తాటాకుల గుడిసె లో ఓ ఏడేళ్ళ పిల్లాడు ముందున్న వసారా గుంజకు తల ఆంచి పనికి వెళ్ళిన తల్లితండ్రుల కోసం ఎదురు చూస్తూ వున్నాడు.
అటుగా వెళ్తున్న ఓ రైలులోంచి ఎవరో రాసుకున్న కన్నీటి ఉత్తరం ఎరుగుకుంటూ పిల్లాడి ముందుకు వచ్చివాలింది..
కన్నీటితో తడిచిన ఆ అర్ధం కాని రాతలను చూస్తూ అలానే ఉండిపోయాడు..
ఇంతలో ఆ పిల్లాడి అమ్మ రానేవచ్చింది
పిల్లాడిని ఒడిలోకి లాక్కుని.. ఉత్తరం తీసి ఒక్కో అక్షరం ఒక్కో అక్షరం కూడుకుంటూ చదవడం మొదలు పెట్టింది..!!
“నా భర్త కనపడకుండా పోయి నేటికి సంవత్సరం కావస్తోంది”.. అని ఆ ఉత్తరం లో రాసుంది..
తన భర్త కనపడకుండా పోయి సంవత్సరం అయిందా .. !! అయ్యో ..!! ఎమైవుంటారు .. అంటూ కళ్ళు పెద్దవి చేసి ఒకింత ఆశ్చర్యంతో, ఒకింత తెలుసుకోవాలనే తపనతో మళ్ళి చదవడం మొదలు పెటింది..!
అప్పుడే చలికాలం కొంచం కొంచంగా ముగుస్తుంది..నేను నా భర్త నా ఒక్కగానొక్క అబ్బాయి కలిసి సంతోషంగా జీవిస్తున్నాం. ఎప్పటిలాగే ఇద్దరం ఆఫీసులకు వెళ్ళాము ఆ రోజు మా అబ్బాయి ఇంట్లోనే వున్నాడు. నేను త్వరగా పని ముగించుకొని మా అబ్బాయి కోసం పరుగుపరుగున వచ్చేసాను.. రాగానే వాడిని దగ్గరకు తీసుకొని వాడితో ఆడుకుంటూ వుండగా మా బాల్కనీలో గాలికి కొట్టుకొచ్చిన ఓ కాగితం కనిపించింది. మడిచి పారేద్దాం అనుకునే లోపు ఏం కాగితం? ఇది అనుకుంటూ చూసాను.. మొదట్లోనే “నా భర్త కనపడకుండా పోయి నేటికి సంవత్సరం కావస్తోంది” అనే వాక్యాన్ని చూసాను. ఎందుకో తెలియదు నేను ఆ క్షణం ఆ కాగితం చదవకుండా వుండాల్సిందేమో.
మాలానే వాళ్ళకు ఒక బాబు అంతా మా కుటుంబం లా వుంది వాళ్ళ కథ. అది చదివిన కాసేపటికే నా భర్త ఆచూకి నేను కోల్పోయాను.. కాగితం చదివితే అందులో వున్నట్లు జీవితం అవుతుందా ? ఇలాంటి పిచ్చి నమ్మకాలు నేను నమ్మను... కానీ ఏదో మాయ వుంది అందులో. ఇదంతా చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది నాకు ...
అక్కడ వరకు ఆ ఉత్తరం చదువుతున్న తను ఒక్కసారిగా ఒలిక్కిపడి ఉత్తరాన్ని పక్కకు నెట్టేసింది.. ముఖమంతా చెమటలు, గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది.. తనకు తెలియకుండానే తన చేతులు వణుకుతున్నాయి. ఒడిలో వున్న పిల్లాడిని కూడా పక్కకు నెట్టేసింది.. మౌనంగా ఏదో ఆలోచిస్తూ అలానే కూర్చుండిపోయింది..
తన మనసులో కొన్ని వేల ఆలోచనలు ..
ఏది నిజం,
ఏది అబద్దం ..
వాళ్ళలానే తన కుటుంబానికి కూడా ఏమన్నా అవుతుందా అనే ఒక నిస్సహాయ స్థితిలోకి తను వెళ్ళిపోయింది.. ఈ ప్రపంచాన్ని వదిలి తన మనసు ఎక్కడెక్కడికో పరుగులు తీస్తుంది.. పిల్లాడు అమ్మా అంటున్న పిలుపు కూడా వినపడనంత దూరంగా తన మనసు దాని ఉనికిని కోల్పోయింది..!!
మెల్లిగా చీకటి పడుతోంది ..
To be Continued...
Written by: Bobby Aniboyina
Mobile : 9032977985
No comments:
Post a Comment