Wednesday, February 16, 2022

మీనాక్షి సుందరం...


3rd Part

నా పేరు మీనాక్షి సుందరం ..
నా భర్త పేరు సుందరం అయ్యంగార్ ..
మాకు ఒక అబ్బాయి ..
నా భర్త చాలా పెద్ద రచయిత. తను రాసిన పుస్తకాలు ఊరంతా చదివేవారు.. అందరూ గొప్పగా పొగిడేవారు. కానీ నేనెప్పుడు ఆయన రాసిన ఒక్క అక్షరం కూడా చదివేదాన్ని కాదు. దానికి కారణం లేకపోలేదు..నా భర్త రాసినవి నేను చదవడం కన్నా పదిమంది చెప్తుంటే విని ఆనందించడం నాకు ఇష్టం.. కానీ నా భర్తకు అలా కాదు .. ఊరంతా చదివిన దానికన్నా తన భార్య ఒక్కసారి చదివితే చాలు అనే కోరికతో వుండే వారు. చదవకుండా ఆటపట్టించాలనే అల్లరి నాది. ఎలా అయినా నా చేత చదివించాలనే తపన తనది.మొదట్లో సరదాగా వున్న మేము పోను పోను చాలా మొండిగా మారిపోయాము.

రోజులు గడుస్తున్నాయి.. మా మధ్య దూరం కూడా పెరుగుతూ వస్తుంది.

నాపై వున్న కోపంతో తన రచనలు మరింత శక్తివంతముగా మార్పు చెందాయి..ఒక స్త్రీ అంతరంగాన్ని అద్దంపట్టేలా తను రాసే రచనలు చదివి ఎందరో స్త్రీలు నన్ను కలిసి నాకు ప్రత్యేక అభినందనలు తెల్పేవారు.. ఇంతలా స్త్రీ ని అర్ధం చేసుకునే భర్త, ఇంత గొప్పగా రాసే రచయిత నీకు దొరకడం నువ్వు చాలా అదృష్టవంతురాలివి అంటూ నన్ను వేనోళ్ళ తో కొనియాడేవారు.

నిజమే తను ఓ గొప్ప రచయిత. అది నచ్చే నా కళ్ళతో కాకుండా తన కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూడటం మొదలు పెట్టాను.. ఇప్పుడున్న మేము  ఒకప్పుడు ఇలా వుండేవాళ్ళం కాదు.

తను గాంధార  లిపి నేర్చుకుంటున్న రోజులవి.
ఏదో సాధించాలి.. ఈ ప్రపంచానికి మరేదో చెప్పాలనే తాపత్రయం తనది. దానికోసం ఎన్నో మర్మాలను అభ్యసించాడు..మనుగడ లో లేని పాత లిపి లను మంత్రాలను పునరుద్ధరించడానికి భగీరథ దీక్ష పూనాడు.. రాసే ప్రతీ అక్షరంలో  సమ్మోహనా బీజాలను నాటుతూ రాసేవాడు.. అందుకే తన అక్షరాలు ఎవరు చదివినా వాటికి ఇట్టే కట్టుబడిపోయేవారు.

తనను ఎప్పుడు ఎలా ఇష్టపడ్డానో నాకే తెలియదు. తను మైమరిచి రాస్తున్నప్పుడు తననే చూస్తూ వుండటం నాకు చాలా ఇష్టం. కానీ ఒకరోజు నేను తనని అలా చూస్తూ వుండగా తను ఉన్నట్టుండి తలపైకెత్తి నన్ను అలానే చూస్తూ వున్నాడు..నాకు కంగారేసి తల దించేసాను. కాసేపటికల్లా నాముందుకు వచ్చి ఓ కాగితం పెట్టి వెళ్ళిపోయాడు.. ఆ కాగితం చదవాలని వుంది. కానీ నేను చదవడం కన్నా తనచేతనే అది చదివించి వినాలనిపించింది. మరుసటిరోజు ఉదయం మళ్ళి నా దగ్గరకు వచ్చి నిల్చున్నాడు. మీ నిర్ణయం చెప్పలేదు అని హుందాగా చేతులుకట్టుకొని అడిగాడు. నేనేమో తలపైకెత్తలేదు.

నేను చదవలేదు అంటూ చిన్నగా గొణిగాను.

చదవడం రాదా అంటూ తను అడిగాడు

వచ్చు అంటూ నేను తల ఊపాను

మరెందుకు చదవలేదు అంటూ తన ప్రశ్న

మీరు చదివితేనే వినాలని నా సమాధానం

అయితే సరే వినండి అంటూ తను మొదలుపెట్టాడు

“కళ్ళులేని కాలం
చెవులు లేని కలంతో
నోరులేని కాగితాల పై
కన్నీటి అక్షరాలతో నే
వ్రాస్తున్న సమయాన

చాటుమాటు కొంటె చూపుల పలకరింపులతో..
హృదయానికి గిలిగింతలు పెట్టావు
చిరునవ్వుల చిరుజల్లులతో..
నా మదిలో సరికొత్త ఆశలు రేపావు..
నీ పలుకుల పదనిసలతో..
మౌనం నా భాషగా మార్చావు..
నీ అందెల సవ్వడులతో..
నన్ను మైమరిపింప చేశావు..
నీ ఊహల పరవళ్ళతో..
నా  గుండెని ప్రేమ గోదావరి చేశావు..
నీ తలపులే అణువణువపు అయువుగా పోసావు..

గంగానది తరగలలో కనిపించు ఆ స్వచ్ఛత..
నీ కనుదమ్ములలో చూచి ఉప్పొంగితిని ..
పొంగి పొరలు గోదావరి కెరటాల మధుర తాకిడితో..
పొంగిన నీ ఎద పులకించగ చూచితిని..

ఊహల ఉయ్యాలలో నను ఊగించుట న్యాయమా ?
నీ తలపుల తరంగాలలో నను తేలించుట ధర్మమా ?
ఊహల వుచ్చులనుండి నా కేనాటి కీ విముక్తి ?
ఆలోచన అలలనుండి ఏనాడు తీరానికి ?
నీ కొరకై వేచిచూసి, నిరీక్షించి, నీరసించి వున్నాను
కరము చాచి అడుగుతున్నా
కనికరించి పాణిగ్రహీతవౌతావో..
కనురెప్పను దాటించి కనుమరుగవుతావో నీ ఇష్టం.

మౌనమై నీవుంటే నాపై మనసులేదనుకుంటాను
మాటలు కలిపి ముందుకొస్తే ఆమోదయోగ్యమనుకుంటాను..
నీ రాకకై
నీ నిర్ణయానికై ఎదురు చూస్తూ”..!!

తను అలా చెప్పగానే అప్పటిదాకా తను అనే భావన ఒక్కసారిగా నా దనే ప్రేమ కలిగింది. కంటి నిండా నీరు.. తనకు చూపించలేకపోయాను… మౌనంగా లేచి తనని హత్తుకున్నాను.. ఆరోజే మా పెళ్ళి కూడా జరిగిపోయింది.. అందరినీ ఎదిరించి చాలా దూరంగా వచ్చేశాము.

To be Continued...

Written by: Aniboyina Bobby
Mobile : 9032977985

No comments:

Post a Comment