Thursday, February 17, 2022

మీనాక్షి సుందరం...

4th Part

తను ఉద్యోగం చేస్తూనే ఎన్నో పుస్తకాలు రాసేవాడు.. చదివిన ప్రతీ ఒక్కరు పొగడ్తలతో ముంచెత్తేవారు..అలా తన ప్రస్థానం మొదలు అయింది. ఎన్నో పుస్తకాలను రచించాడు. ఎంతో గొప్పస్థాయికి చేరుకున్నాడు.. ఆ పరుగులు తీసే క్రమంలోనే నాకు దూరం అవుతూ వచ్చాడు. ఎన్నిసార్లు దగ్గరకు వెళ్ళినా తన రాతలు తనవే, తనలోకం తనదే.. తను రాసి బయటకు వచ్చే ప్రతీ పుస్తకం మొదట నాకే వచ్చి చేరుతుంది. అవన్నీ నేను భద్రపరిచే దాన్నే కానే తెరిచి ఏనాడు చదవలేదు.

కాలం చాలా వేగంగా ముందుకు వెళ్తోంది..

అక్షరం ఒక మత్తు అని నాకు అప్పుడే అర్ధం అయింది.. నా బాధలు, నా కన్నీళ్ళు తనకు అక్కర్లేదని నాకు అనిపించింది. అదే రోజు రాత్రి ఇంట్లో చాలా పెద్ద గొడవ అయింది.. అంతా నేనే మాట్లాడాను.. కొన్ని సంవత్సరాలుగా నేను పడుతున్న మానసిక క్షోభను ఆ రోజు రాత్రి అరిచి మరీ చెప్పాను..తను ఒక్క మాట కూడా మాట్లాడకుండా లేచి వెళ్ళిపోయాడు. చివరిసారిగా నేను తనని చూడటం అదే..

రోజులు, వారాలు, గప్చిప్గా గడిచిపోతున్నాయి ఎక్కడా తన ఆచూకి లేదు. తన రాతలు లేక జనాలు పిచ్చెక్కిపోతున్నారు. ఒక్కసారిగా తనని నమ్ముకున్న వాళ్ళకు ఊపిరి తీసుకోవడం ఆగినట్లు అనిపించింది. తన చేతి కలం పనిచేస్తున్నంత వరకు చాలా అందంగా కనిపించిన ప్రపంచం తన కలం ఆగగానే ఒక్కసారిగా అందవిహీనంగా నాకు కనిపిస్తోంది..ఆ చివరి మాట నేను అనకుండా వుండాల్సిందేమో.. నాలో నేనే సిగ్గు పడుతున్నా.. తను ఇదంతా చేస్తుంది నా కోసమే కదా.. నాకు దూరం గా ఉండాలని తనుకూడా కోరుకోలేదేమో..విధి అలా రాసిందేమో మా రాతను.. అయ్యో నేనే అర్ధం చేసుకోకుండా తనని చాలా అనేసానే.. క్షమించు అని తనను అడగటానికి కూడా ఇప్పుడు తను నా ముందు లేడే అని కన్నీళ్ళతో బాధ పడుతున్న సమయంలో తలగడ కింద వున్న తన భర్త రాసిన ఆఖరి పుస్తకాన్ని చదవాలని నిర్ణయించుకుని పుస్తకం తీసుకొని గుండెలకు ప్రేమగా హత్తుకొని ఆ పుస్తకాన్ని తెరిచింది.

అందులోంచి ఓ ఉత్తరం జారి పడింది. అది స్వయంగా తన భర్త రాసిన చేతి వ్రాత.

"నా భర్త కనపడకుండా పోయి నేటికి సంవత్సరం కావస్తోంది”  అనే వాక్యాన్ని చూసి ఆశ్చర్య పోతుంది.. నా భర్త ఏంటి ఇలా వ్రాశాడు అని ఆలోచనలో పడుతుంది.. అయినా  చదవడం మొదలు పెడుతుంది.

నువ్వు ఈ ఉత్తరం చదువుతున్నావు అంటే నీ భర్త నీకు దూరంగా ఉన్నాడని అర్ధం.. నిజమే కాలంతో పరుగులు తీస్తూ మీకు ఓ మంచి జీవితాన్ని ఇవ్వాలని అనుకుంటాం..మీ ఒడిలో తలపెట్టి..ఎన్నో కబుర్లు చెప్తూ.. పున్నమినాటి రాత్రులను ఆరగించాలని మాకూ ఉంటుంది.. కానీ ఒకటి కావాలనుకుంటే మరోటి త్యజించాల్సిందే.. ఇదే సృష్టి ధర్మం..

మగాడి బాధ ఓ నిశ్శబ్ద సముద్రం.. అతని కన్నీళ్ళు కనిపించని మహాకడలి.. తను నవ్వుతున్నంత అందంగా ఉండదు తన జీవితం. ప్రతిక్షణం ఎన్నో ఒడిదుడుకులు.. మండుతున్న కొలిమి తన రోజువారీ జీవితం..

అర్ధం చేసుకోవాల్సిన అర్ధాంగి కూడా.. పెదవులనుంచి యమపాశాలను వదులుతుంటే. తాను ఏమైపోవాలి, ఎవరితో చెప్పుకోవాలి..అందుకే నా కన్నీటినే సిరా గా మార్చి, నేను నమ్మిన అక్షరాన్నే ఆయువుగా పోసి.. నేర్చిన విధ్యనే మంత్రోచ్ఛారణ గా మలచి రాస్తున్నా..

"నా భర్త కనపడకుండా పోయి నేటికి సంవత్సరం కావస్తోంది”

అవును నువ్వు చదివింది నిజమే..

To be Continued...

Written by: Aniboyina Bobby
Mobile : 9032977985

 

No comments:

Post a Comment