Tuesday, February 15, 2022

మీనాక్షి సుందరం...

 

2nd Part

పక్కింటి అత్త గారి పిలుపులు పదే పదే ఎక్కడో మూలాన వినిపిస్తూ వున్నాయి. పరధ్యానంగా వున్న తను ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చి చీరంచుతో ముఖాన్ని తుడుచుకొని పలకడానికి ప్రయత్నిస్తుంటే గొంతులోంచి మాట రావట్లేదు .. అతికష్టంగా “ఆ” అంటూ పలికింది .. ఏంటమ్మాయ్ ఇందాకట్నుంచి పిలుస్తుంటే ఎక్కడ ఆలోచిస్తున్నావ్?

ఇంతకీ మీ ఇంటాయన వచ్చాడా ? అని అడిగింది
ఆ మాట వినగానే మళ్ళి ఆలోచనలో పడింది
ఇదిగో అమ్మాయ్ నిన్నే మాట్లాడుతుంటే ఎక్కడో ఆలోచిస్తున్నావ్ ?

మీ ఇంటాయన వచ్చాడా ? అని మళ్ళి అడుగుతుంది..

వణుకుతూ, లేదు... లేదు.. ఇంకా రాలేదు అని తడి ఆరిన గొంతుకతో అంటుంది.

సరే వచ్చాక నన్ను కేకెయ్యి వాడితో కొంచం మాట్లాడాలి అని లోపలకు వెళ్ళిపోయింది.
పిల్లాడేమో ఆకలికి అమ్మా అమ్మా అంటున్నాడు ... ముందు వాడికి అన్నం పెట్టాలని నిశ్చయించుకొని జారిన జడను ముడిపెట్టి కోకను బిగించి కట్టి పొయ్యి మీద ఎసరు పెట్టి ఊదురు గొట్టం తో మెల్లిగా ఊదుతూ మంట రాజేస్తుంది..

పిచ్చి పిచ్చి ఆలోచనలు తనలో..

అసలు ఆ ఉత్తరం ఏంటి ?

ఎక్కడ నుంచి వచ్చింది..

నేనెందుకు దాన్ని చదివాను..

అసలేంటి ఇదంతా..

నిజంగా అలా అందులో వున్నట్లు జరుగుతుందా..

ఒకవేళ అలా జరిగితే నా పరిస్థితి ఏంటి ?

నేనేం చెయ్యాలి ??

ఎవరికి చెప్పాలి..?  ఎవరు నమ్ముతారు ??

ఇలా వంద ఆలోచనలు తనలో..

అంతలోనే ఆ ఉత్తరం పట్టుకొచ్చి అమ్మా ఇదిగో అంటూ ఆ పిల్లాడు తన ముఖముకు దగ్గరగా పెడతాడు.. అది చూడగానే కరెంట్ షాక్ తగిలినట్లుగా తను దూరం గా ఎగిరి పడుతుంది..

ఎందుకమ్మా అంత భయపడుతున్నావ్ ?

అసలు ఆ ఉత్తరం లో ఎముందమ్మా ?

నాన్నేంటి ఇంకా రాలేదు ?

ఇలా ప్రశ్నలు వేస్తున్న పిల్లాడిని దగ్గరకు లాక్కుని..
నాన్న కాసేపట్లో వచ్చేస్తాడు.. ఈలోపు నువ్వు  తినేసి చక్కగా బజ్జో అంటూ పిల్లాడికి కొన్ని మాటలు చెప్పి అన్నం తినిపించి పడుకోబెడుతుంది. అప్పటికే సమయం తొమ్మిదింపావు..!!

ఆరు గంటలకే ఇంటికొచ్చే భర్త తొమ్మిది దాటినా ఇంకా రాలేదు.. తనలో భయం, కంగారు మరింత పెరిగింది..

ఇందాక పిల్లాడు ఇచ్చిన ఉత్తరం గాలికి రెప రెపలాడుతూ శబ్దం చేస్తుంది..!

ఆ ఉత్తరం పూర్తిగా చదివితే బహుశా మార్గం కూడా అందులో ఏమైనా ఉంటుందేమో అని అనుకుంటుంది.. కానీ మళ్ళి ఆ ఉత్తరం చదివితే ఇంకేమైనా కొత్త సమస్యలు వస్తాయేమో అని మళ్ళి భయపడుతోంది.. ఏమి అర్ధం కాని అయోమయ స్థితిలో ఉండిపోయింది..

సమయం మెల్లిగా గడుస్తోంది..
కొంత సమయం తరువాత … కిరోసిన్ లాంతర్ వెలిగించి తలుపుతీసి ఇంటి గడప దగ్గర కూర్చుని భర్త రాక కోసం ఎదురు చూస్తూ వుంది.

ఒక్కో క్షణం ఒక్కో యుగమై తలపిస్తోంది..

రైళ్ళు పరుగెడుతూ వెళ్తున్నాయి.. రెప్పలు వాలుతూ వున్నాయి..

గంతలు కట్టిన గుర్రపు బండిలా తన మనసు ఎటు పడితే అటు వెళ్తోంది..

ఏది అయితే అది అవుతుందని నిశ్చయించుకొని ఉత్తరం చేతుల్లోకి తీసుకుంటుంది..!!

లాంతరు వెలుగులో గుమ్మం దగ్గరే కూర్చుని చివరకు ఆ ఉత్తరం చదవడం ఆరంభించింది..

మా బాల్కనీలో గాలికి కొట్టుకొచ్చిన ఓ కాగితం కనిపించింది. మడిచి పారేద్దాం అనుకునే లోపు ఏం కాగితం? ఇది అనుకుంటూ చూసాను.. మొదట్లోనే  “నా భర్త కనపడకుండా పోయి నేటికి సంవత్సరం కావస్తోంది” అనే వాక్యాన్ని చూసాను. ఎందుకో తెలియదు నేను ఆ క్షణం ఆ కాగితం చదవకుండా వుండాల్సిందేమో… కానీ మనసు ఆగలేదు.. చదవడం మొదలు పెట్టాను…

To be Continued...

Written by: Aniboyina Bobby
Mobile : 9032977985


No comments:

Post a Comment