Friday, February 18, 2022

మీనాక్షి సుందరం...

 

5th Part (ఆఖరి భాగం)

ఇది సామాన్యమైన వాక్యం కాదు..దీని శక్తి సామర్ధ్యాలు చదివిన తరువాత నీకు తప్పక అర్ధం అవుతుంది. ఈ ఉత్తరం ప్రపంచ నలుమూలలకు వెళ్తుంది. ఇందులో జీవం ఉంది. ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది.. ఎవరి దగ్గరకు చేరాలో ఖచ్చితంగా వారి దగ్గరకే ఇది చేరుతుంది. ఎవరు అయితే చదువుతారో వారికి ఎడబాటు తప్పదు..ఇది సత్యం. వాళ్ళ లోపాలను వాళ్ళు అర్ధం చేసుకున్న రోజు ఈ ఉత్తరం కనుమరుగై మరొకరి చెంతకు చేరుతుంది.

నీ భర్త నిన్ను విడిచి ఎక్కడికీ వెళ్ళడు.. ఈ ఉత్తరం నీ చేయి విడిచిన వెంటనే నీ భర్త నీ చెయ్యి పట్టుకుంటాడు.. జీవితంలో పట్టువిడుపులు ఉండాలి. ముఖ్యంగా భార్య భర్తల మధ్యలో.. అది మీకు తెలియాలనే ఇదంతా.. ఒక రచయితగా ఎన్నో పుస్తకాలు రాసినా తృప్తి కలగలేదు.. ఈ చిన్న ఉత్తరం నాకు ఎంతో తృప్తి ని ఇస్తోంది.. ఎందుకంటే ఇది నా భార్య మీనాక్షి సుందరం చదువుతోంది..!!

స్వస్తి… 

మీ .. సుందరం అయ్యంగార్..!!

లాంతరు మిణుకుమిణుకు మంటోంది. ఉత్తరం చదువుతున్న తన కంట్లో నిండా నీరే.. టప టపామని ఆ ఉత్తరం మీద రాలుతున్నాయి.. ఒక్కసారిగా ఊపిరి గట్టిగా తీసుకుని వదిలింది… అప్పటికే సమయం నడిరేయి దాటింది..

ఇక ఈ ఉత్తరం తన చేయిదాటి వెళ్ళేదాకా తన భర్త తన దగ్గరకు రాడని తనకు అర్ధమౌతుంది.. తను వచ్చేదాకా తన జ్ఞాపకాలతో బ్రతకాలని తను నిశ్చయించుకుంటుంది… 

ఒక్కటి మాత్రం మనసులో గట్టిగా అనుకుంటుంది.. ఇలాంటి ఎడబాటే లేకుంటే దగ్గరగా ఉన్నామనుకుంటున్న మా లాంటి భార్య భర్త లు ఎప్పటికీ దూరంగానే వుంటారు.. దగ్గరగా ఉండటం అంటే పక్కపక్కనే ఉండటం కాదు.. మనసుకు మరోమనసు హత్తుకొని ఉండటం అని అర్ధం చేసుకున్నాను..రాసిన రచయిత కు నిజంగా కన్నీటితో ధన్యవాదాలు అని మనసారా కోరుకుంటుంది..!!

కొన్ని రోజులు గడిచాయి..

తన భర్త కోసం కళ్ళల్లో వత్తులు వేసుకొని చూస్తూనే ఉంది..

పోపుడబ్బాలో పెట్టిన ఉత్తరం కనిపించలేదు.. ఇళ్ళంతా వెతికింది.. ఎక్కడా దొరకలేదు..

అమ్మి అంటూ తన భర్త గొంతు..కళ్ళు...కాళ్ళు ఇక ఒక్క క్షణం కూడా ఆగలేదు..పరిగెత్తుకుంటూ వెళ్ళింది.. అమాంతం తన భర్త కౌగిట్లో వెన్నెల కరిగిపోయింది.. తన ముఖమంతా ముద్దులు కురిపించింది.. తనని ఓ చంటి బిడ్డలా చేతుల్లోకి తీసుకుంది.. గోరు ముద్దలు తినిపించింది.. ఆరోజంతా తనతో కబుర్లు చెప్తూనే ఉండిపోయింది.. తన భర్త కూడా తనని చంటి పాపలా ఒడిలో పడుకోబెట్టుకొని ప్రేమగా తన తల నిమురుతూ సంతోషం గా ఉండిపోయాడు.. 

ఇక్కడ ఈ ఉత్తరం ప్రస్థానం ముగిసింది.. 

మరోచోట దాని ప్రస్థానం మొదలైంది..

స్వస్తి…

మీ … బాబీ అనిబోయిన..

Mobile : 9032977985


No comments:

Post a Comment