Thursday, February 3, 2022

నాలో నేనే నాతో నేనే..



అద్వైతము చదివినవాడికి
నల్లమబ్బు చిందించే అశ్రువులు ఓ లెక్కా
పరామర్శలు, ఓదార్పులు మరణించిన వాడ్ని బతికిస్తాయా
కాగితపు చేలో శ్రమించి అక్షర నీడన విశ్రమించే
శ్రమైక జీవన సౌందర్య కథానాయకుడకు
సుఖ, దుఖాలు ఏపాటివి..!!

కాలం ఎన్ని అగాధాలనైనా మారుస్తుంది
ఎక్కడో పర్వత సానువుల్లో ప్రకంపిస్తున్న ఓ చావు కేక
గాలికి కొట్టుకొచ్చి చెవికి వినిపిస్తుంటుంది
ఎదురుగా వున్నతను
గుండ్రం గుండ్రం గా సిగరెట్ పొగలూదుతూ
ఖుషీగా వున్నాడు
ఎవరికి ఏమి పట్టవు.. ఎవడి జీవితం వాడిది మరి..!!

ఫోక్ సంగీతపు నిషాకి నిలువునా అతుక్కుపోయి
ఆల్కాహాలిక్ మత్తు గ్లాసుల చీర్స్ చప్పుళ్ళ ఆలింగనాల్లో
ఒళ్ళు తెలియక తడబడు అడుగులతో వున్నవాళ్ళకు
ప్రవచనాలు ఏం రుచిస్తాయ్..!
వేగంగా కదిలే కాలానికి
కాళ్ళు బారాజాపి కూర్చున్న వాడికి
ఏం చెప్పగలం..!!

తోడేళ్ళ మాటల బలంతో
అమాయక గొర్రెను బలిచేసే
ఈ మనుష్యుల మధ్యన
నీకు నువ్వే ఓ పనిముట్టువై
నీ జీవిత అధ్యాయాన్ని నువ్వే పునర్లిఖించుకో
ఈ ఇరవయ్యొకటో శతాబ్దపు పుస్తకం నిండా అచ్చు తప్పులే..!!

Written by: Bobby Aniboyina
Mobile : 9032977985

1 comment:

  1. అవును అన్నీ అచ్చు తప్పులే.....బాగుంది నాని

    ReplyDelete