మదిలో మెదిలే అనేకానేక ప్రవాహ సంద్రంలో.... (కరుణ, శాంత, రౌద్ర, వీరాద్భుత, హాస్య, శృంగార, భయానక, బీభత్సములు, నవరసములు, రతి, శోక, నిర్వేద, క్రోధోత్సాహా, విస్మయ, భయ, జుగుప్సలు, నవ, స్థాయి, భవములు) ఇలా కొన్నిటిని ఏర్చి, కూర్చి సమాజహితానికి ఓ అక్షర ఖడ్గంగా మార్చే సంకల్పమే నా ఈ అక్షరారణ్యం ....
Thursday, February 24, 2022
గుప్పిట బంధిస్తే గప్చిప్గా ఆగేదా మనసు..
Friday, February 18, 2022
మీనాక్షి సుందరం...
5th Part (ఆఖరి భాగం)
ఇది సామాన్యమైన వాక్యం కాదు..దీని శక్తి సామర్ధ్యాలు చదివిన తరువాత నీకు తప్పక అర్ధం అవుతుంది. ఈ ఉత్తరం ప్రపంచ నలుమూలలకు వెళ్తుంది. ఇందులో జీవం ఉంది. ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది.. ఎవరి దగ్గరకు చేరాలో ఖచ్చితంగా వారి దగ్గరకే ఇది చేరుతుంది. ఎవరు అయితే చదువుతారో వారికి ఎడబాటు తప్పదు..ఇది సత్యం. వాళ్ళ లోపాలను వాళ్ళు అర్ధం చేసుకున్న రోజు ఈ ఉత్తరం కనుమరుగై మరొకరి చెంతకు చేరుతుంది.
నీ భర్త నిన్ను విడిచి ఎక్కడికీ వెళ్ళడు.. ఈ ఉత్తరం నీ చేయి విడిచిన వెంటనే నీ భర్త నీ చెయ్యి పట్టుకుంటాడు.. జీవితంలో పట్టువిడుపులు ఉండాలి. ముఖ్యంగా భార్య భర్తల మధ్యలో.. అది మీకు తెలియాలనే ఇదంతా.. ఒక రచయితగా ఎన్నో పుస్తకాలు రాసినా తృప్తి కలగలేదు.. ఈ చిన్న ఉత్తరం నాకు ఎంతో తృప్తి ని ఇస్తోంది.. ఎందుకంటే ఇది నా భార్య మీనాక్షి సుందరం చదువుతోంది..!!
స్వస్తి…
మీ .. సుందరం అయ్యంగార్..!!
లాంతరు మిణుకుమిణుకు మంటోంది. ఉత్తరం చదువుతున్న తన కంట్లో నిండా నీరే.. టప టపామని ఆ ఉత్తరం మీద రాలుతున్నాయి.. ఒక్కసారిగా ఊపిరి గట్టిగా తీసుకుని వదిలింది… అప్పటికే సమయం నడిరేయి దాటింది..
ఇక ఈ ఉత్తరం తన చేయిదాటి వెళ్ళేదాకా తన భర్త తన దగ్గరకు రాడని తనకు అర్ధమౌతుంది.. తను వచ్చేదాకా తన జ్ఞాపకాలతో బ్రతకాలని తను నిశ్చయించుకుంటుంది…
ఒక్కటి మాత్రం మనసులో గట్టిగా అనుకుంటుంది.. ఇలాంటి ఎడబాటే లేకుంటే దగ్గరగా ఉన్నామనుకుంటున్న మా లాంటి భార్య భర్త లు ఎప్పటికీ దూరంగానే వుంటారు.. దగ్గరగా ఉండటం అంటే పక్కపక్కనే ఉండటం కాదు.. మనసుకు మరోమనసు హత్తుకొని ఉండటం అని అర్ధం చేసుకున్నాను..రాసిన రచయిత కు నిజంగా కన్నీటితో ధన్యవాదాలు అని మనసారా కోరుకుంటుంది..!!
కొన్ని రోజులు గడిచాయి..
తన భర్త కోసం కళ్ళల్లో వత్తులు వేసుకొని చూస్తూనే ఉంది..
పోపుడబ్బాలో పెట్టిన ఉత్తరం కనిపించలేదు.. ఇళ్ళంతా వెతికింది.. ఎక్కడా దొరకలేదు..
అమ్మి అంటూ తన భర్త గొంతు..కళ్ళు...కాళ్ళు ఇక ఒక్క క్షణం కూడా ఆగలేదు..పరిగెత్తుకుంటూ వెళ్ళింది.. అమాంతం తన భర్త కౌగిట్లో వెన్నెల కరిగిపోయింది.. తన ముఖమంతా ముద్దులు కురిపించింది.. తనని ఓ చంటి బిడ్డలా చేతుల్లోకి తీసుకుంది.. గోరు ముద్దలు తినిపించింది.. ఆరోజంతా తనతో కబుర్లు చెప్తూనే ఉండిపోయింది.. తన భర్త కూడా తనని చంటి పాపలా ఒడిలో పడుకోబెట్టుకొని ప్రేమగా తన తల నిమురుతూ సంతోషం గా ఉండిపోయాడు..
ఇక్కడ ఈ ఉత్తరం ప్రస్థానం ముగిసింది..
మరోచోట దాని ప్రస్థానం మొదలైంది..
స్వస్తి…
మీ … బాబీ అనిబోయిన..
Mobile : 9032977985
Thursday, February 17, 2022
మీనాక్షి సుందరం...
4th Part
తను ఉద్యోగం చేస్తూనే ఎన్నో పుస్తకాలు రాసేవాడు.. చదివిన ప్రతీ ఒక్కరు పొగడ్తలతో ముంచెత్తేవారు..అలా తన ప్రస్థానం మొదలు అయింది. ఎన్నో పుస్తకాలను రచించాడు. ఎంతో గొప్పస్థాయికి చేరుకున్నాడు.. ఆ పరుగులు తీసే క్రమంలోనే నాకు దూరం అవుతూ వచ్చాడు. ఎన్నిసార్లు దగ్గరకు వెళ్ళినా తన రాతలు తనవే, తనలోకం తనదే.. తను రాసి బయటకు వచ్చే ప్రతీ పుస్తకం మొదట నాకే వచ్చి చేరుతుంది. అవన్నీ నేను భద్రపరిచే దాన్నే కానే తెరిచి ఏనాడు చదవలేదు.
కాలం చాలా వేగంగా ముందుకు వెళ్తోంది..
అక్షరం ఒక మత్తు అని నాకు అప్పుడే అర్ధం అయింది.. నా బాధలు, నా కన్నీళ్ళు తనకు అక్కర్లేదని నాకు అనిపించింది. అదే రోజు రాత్రి ఇంట్లో చాలా పెద్ద గొడవ అయింది.. అంతా నేనే మాట్లాడాను.. కొన్ని సంవత్సరాలుగా నేను పడుతున్న మానసిక క్షోభను ఆ రోజు రాత్రి అరిచి మరీ చెప్పాను..తను ఒక్క మాట కూడా మాట్లాడకుండా లేచి వెళ్ళిపోయాడు. చివరిసారిగా నేను తనని చూడటం అదే..
రోజులు, వారాలు, గప్చిప్గా గడిచిపోతున్నాయి ఎక్కడా తన ఆచూకి లేదు. తన రాతలు లేక జనాలు పిచ్చెక్కిపోతున్నారు. ఒక్కసారిగా తనని నమ్ముకున్న వాళ్ళకు ఊపిరి తీసుకోవడం ఆగినట్లు అనిపించింది. తన చేతి కలం పనిచేస్తున్నంత వరకు చాలా అందంగా కనిపించిన ప్రపంచం తన కలం ఆగగానే ఒక్కసారిగా అందవిహీనంగా నాకు కనిపిస్తోంది..ఆ చివరి మాట నేను అనకుండా వుండాల్సిందేమో.. నాలో నేనే సిగ్గు పడుతున్నా.. తను ఇదంతా చేస్తుంది నా కోసమే కదా.. నాకు దూరం గా ఉండాలని తనుకూడా కోరుకోలేదేమో..విధి అలా రాసిందేమో మా రాతను.. అయ్యో నేనే అర్ధం చేసుకోకుండా తనని చాలా అనేసానే.. క్షమించు అని తనను అడగటానికి కూడా ఇప్పుడు తను నా ముందు లేడే అని కన్నీళ్ళతో బాధ పడుతున్న సమయంలో తలగడ కింద వున్న తన భర్త రాసిన ఆఖరి పుస్తకాన్ని చదవాలని నిర్ణయించుకుని పుస్తకం తీసుకొని గుండెలకు ప్రేమగా హత్తుకొని ఆ పుస్తకాన్ని తెరిచింది.
అందులోంచి ఓ ఉత్తరం జారి పడింది. అది స్వయంగా తన భర్త రాసిన చేతి వ్రాత.
"నా భర్త కనపడకుండా పోయి నేటికి సంవత్సరం కావస్తోంది” అనే వాక్యాన్ని చూసి ఆశ్చర్య పోతుంది.. నా భర్త ఏంటి ఇలా వ్రాశాడు అని ఆలోచనలో పడుతుంది.. అయినా చదవడం మొదలు పెడుతుంది.
నువ్వు ఈ ఉత్తరం చదువుతున్నావు అంటే నీ భర్త నీకు దూరంగా ఉన్నాడని అర్ధం.. నిజమే కాలంతో పరుగులు తీస్తూ మీకు ఓ మంచి జీవితాన్ని ఇవ్వాలని అనుకుంటాం..మీ ఒడిలో తలపెట్టి..ఎన్నో కబుర్లు చెప్తూ.. పున్నమినాటి రాత్రులను ఆరగించాలని మాకూ ఉంటుంది.. కానీ ఒకటి కావాలనుకుంటే మరోటి త్యజించాల్సిందే.. ఇదే సృష్టి ధర్మం..
మగాడి బాధ ఓ నిశ్శబ్ద సముద్రం.. అతని కన్నీళ్ళు కనిపించని మహాకడలి.. తను నవ్వుతున్నంత అందంగా ఉండదు తన జీవితం. ప్రతిక్షణం ఎన్నో ఒడిదుడుకులు.. మండుతున్న కొలిమి తన రోజువారీ జీవితం..
అర్ధం చేసుకోవాల్సిన అర్ధాంగి కూడా.. పెదవులనుంచి యమపాశాలను వదులుతుంటే. తాను ఏమైపోవాలి, ఎవరితో చెప్పుకోవాలి..అందుకే నా కన్నీటినే సిరా గా మార్చి, నేను నమ్మిన అక్షరాన్నే ఆయువుగా పోసి.. నేర్చిన విధ్యనే మంత్రోచ్ఛారణ గా మలచి రాస్తున్నా..
"నా భర్త కనపడకుండా పోయి నేటికి సంవత్సరం కావస్తోంది”
అవును నువ్వు చదివింది నిజమే..
To be Continued...
Written by: Aniboyina Bobby
Mobile : 9032977985
Wednesday, February 16, 2022
మీనాక్షి సుందరం...
3rd Part
నా పేరు మీనాక్షి సుందరం ..
నా భర్త పేరు సుందరం అయ్యంగార్ ..
మాకు ఒక అబ్బాయి ..
నా భర్త చాలా పెద్ద రచయిత. తను రాసిన పుస్తకాలు ఊరంతా చదివేవారు.. అందరూ గొప్పగా పొగిడేవారు. కానీ నేనెప్పుడు ఆయన రాసిన ఒక్క అక్షరం కూడా చదివేదాన్ని కాదు. దానికి కారణం లేకపోలేదు..నా భర్త రాసినవి నేను చదవడం కన్నా పదిమంది చెప్తుంటే విని ఆనందించడం నాకు ఇష్టం.. కానీ నా భర్తకు అలా కాదు .. ఊరంతా చదివిన దానికన్నా తన భార్య ఒక్కసారి చదివితే చాలు అనే కోరికతో వుండే వారు. చదవకుండా ఆటపట్టించాలనే అల్లరి నాది. ఎలా అయినా నా చేత చదివించాలనే తపన తనది.మొదట్లో సరదాగా వున్న మేము పోను పోను చాలా మొండిగా మారిపోయాము.
రోజులు గడుస్తున్నాయి.. మా మధ్య దూరం కూడా పెరుగుతూ వస్తుంది.
నాపై వున్న కోపంతో తన రచనలు మరింత శక్తివంతముగా మార్పు చెందాయి..ఒక స్త్రీ అంతరంగాన్ని అద్దంపట్టేలా తను రాసే రచనలు చదివి ఎందరో స్త్రీలు నన్ను కలిసి నాకు ప్రత్యేక అభినందనలు తెల్పేవారు.. ఇంతలా స్త్రీ ని అర్ధం చేసుకునే భర్త, ఇంత గొప్పగా రాసే రచయిత నీకు దొరకడం నువ్వు చాలా అదృష్టవంతురాలివి అంటూ నన్ను వేనోళ్ళ తో కొనియాడేవారు.
నిజమే తను ఓ గొప్ప రచయిత. అది నచ్చే నా కళ్ళతో కాకుండా తన కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూడటం మొదలు పెట్టాను.. ఇప్పుడున్న మేము ఒకప్పుడు ఇలా వుండేవాళ్ళం కాదు.
తను గాంధార లిపి నేర్చుకుంటున్న రోజులవి.
ఏదో సాధించాలి.. ఈ ప్రపంచానికి మరేదో చెప్పాలనే తాపత్రయం తనది. దానికోసం ఎన్నో మర్మాలను అభ్యసించాడు..మనుగడ లో లేని పాత లిపి లను మంత్రాలను పునరుద్ధరించడానికి భగీరథ దీక్ష పూనాడు.. రాసే ప్రతీ అక్షరంలో సమ్మోహనా బీజాలను నాటుతూ రాసేవాడు.. అందుకే తన అక్షరాలు ఎవరు చదివినా వాటికి ఇట్టే కట్టుబడిపోయేవారు.
తనను ఎప్పుడు ఎలా ఇష్టపడ్డానో నాకే తెలియదు. తను మైమరిచి రాస్తున్నప్పుడు తననే చూస్తూ వుండటం నాకు చాలా ఇష్టం. కానీ ఒకరోజు నేను తనని అలా చూస్తూ వుండగా తను ఉన్నట్టుండి తలపైకెత్తి నన్ను అలానే చూస్తూ వున్నాడు..నాకు కంగారేసి తల దించేసాను. కాసేపటికల్లా నాముందుకు వచ్చి ఓ కాగితం పెట్టి వెళ్ళిపోయాడు.. ఆ కాగితం చదవాలని వుంది. కానీ నేను చదవడం కన్నా తనచేతనే అది చదివించి వినాలనిపించింది. మరుసటిరోజు ఉదయం మళ్ళి నా దగ్గరకు వచ్చి నిల్చున్నాడు. మీ నిర్ణయం చెప్పలేదు అని హుందాగా చేతులుకట్టుకొని అడిగాడు. నేనేమో తలపైకెత్తలేదు.
నేను చదవలేదు అంటూ చిన్నగా గొణిగాను.
చదవడం రాదా అంటూ తను అడిగాడు
వచ్చు అంటూ నేను తల ఊపాను
మరెందుకు చదవలేదు అంటూ తన ప్రశ్న
మీరు చదివితేనే వినాలని నా సమాధానం
అయితే సరే వినండి అంటూ తను మొదలుపెట్టాడు
“కళ్ళులేని కాలం
చెవులు లేని కలంతో
నోరులేని కాగితాల పై
కన్నీటి అక్షరాలతో నే
వ్రాస్తున్న సమయాన
చాటుమాటు కొంటె చూపుల పలకరింపులతో..
హృదయానికి గిలిగింతలు పెట్టావు
చిరునవ్వుల చిరుజల్లులతో..
నా మదిలో సరికొత్త ఆశలు రేపావు..
నీ పలుకుల పదనిసలతో..
మౌనం నా భాషగా మార్చావు..
నీ అందెల సవ్వడులతో..
నన్ను మైమరిపింప చేశావు..
నీ ఊహల పరవళ్ళతో..
నా గుండెని ప్రేమ గోదావరి చేశావు..
నీ తలపులే అణువణువపు అయువుగా పోసావు..
గంగానది తరగలలో కనిపించు ఆ స్వచ్ఛత..
నీ కనుదమ్ములలో చూచి ఉప్పొంగితిని ..
పొంగి పొరలు గోదావరి కెరటాల మధుర తాకిడితో..
పొంగిన నీ ఎద పులకించగ చూచితిని..
ఊహల ఉయ్యాలలో నను ఊగించుట న్యాయమా ?
నీ తలపుల తరంగాలలో నను తేలించుట ధర్మమా ?
ఊహల వుచ్చులనుండి నా కేనాటి కీ విముక్తి ?
ఆలోచన అలలనుండి ఏనాడు తీరానికి ?
నీ కొరకై వేచిచూసి, నిరీక్షించి, నీరసించి వున్నాను
కరము చాచి అడుగుతున్నా
కనికరించి పాణిగ్రహీతవౌతావో..
కనురెప్పను దాటించి కనుమరుగవుతావో నీ ఇష్టం.
మౌనమై నీవుంటే నాపై మనసులేదనుకుంటాను
మాటలు కలిపి ముందుకొస్తే ఆమోదయోగ్యమనుకుంటాను..
నీ రాకకై
నీ నిర్ణయానికై ఎదురు చూస్తూ”..!!
తను అలా చెప్పగానే అప్పటిదాకా తను అనే భావన ఒక్కసారిగా నా దనే ప్రేమ కలిగింది. కంటి నిండా నీరు.. తనకు చూపించలేకపోయాను… మౌనంగా లేచి తనని హత్తుకున్నాను.. ఆరోజే మా పెళ్ళి కూడా జరిగిపోయింది.. అందరినీ ఎదిరించి చాలా దూరంగా వచ్చేశాము.
To be Continued...
Written by: Aniboyina Bobby
Mobile : 9032977985
Tuesday, February 15, 2022
మీనాక్షి సుందరం...
2nd Part
పక్కింటి అత్త గారి పిలుపులు పదే పదే ఎక్కడో మూలాన వినిపిస్తూ వున్నాయి. పరధ్యానంగా వున్న తను ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చి చీరంచుతో ముఖాన్ని తుడుచుకొని పలకడానికి ప్రయత్నిస్తుంటే గొంతులోంచి మాట రావట్లేదు .. అతికష్టంగా “ఆ” అంటూ పలికింది .. ఏంటమ్మాయ్ ఇందాకట్నుంచి పిలుస్తుంటే ఎక్కడ ఆలోచిస్తున్నావ్?
ఇంతకీ మీ ఇంటాయన వచ్చాడా ? అని అడిగింది
ఆ మాట వినగానే మళ్ళి ఆలోచనలో పడింది
ఇదిగో అమ్మాయ్ నిన్నే మాట్లాడుతుంటే ఎక్కడో ఆలోచిస్తున్నావ్ ?
మీ ఇంటాయన వచ్చాడా ? అని మళ్ళి అడుగుతుంది..
వణుకుతూ, లేదు... లేదు.. ఇంకా రాలేదు అని తడి ఆరిన గొంతుకతో అంటుంది.
సరే వచ్చాక నన్ను కేకెయ్యి వాడితో కొంచం మాట్లాడాలి అని లోపలకు వెళ్ళిపోయింది.
పిల్లాడేమో ఆకలికి అమ్మా అమ్మా అంటున్నాడు ... ముందు వాడికి అన్నం పెట్టాలని నిశ్చయించుకొని జారిన జడను ముడిపెట్టి కోకను బిగించి కట్టి పొయ్యి మీద ఎసరు పెట్టి ఊదురు గొట్టం తో మెల్లిగా ఊదుతూ మంట రాజేస్తుంది..
పిచ్చి పిచ్చి ఆలోచనలు తనలో..
అసలు ఆ ఉత్తరం ఏంటి ?
ఎక్కడ నుంచి వచ్చింది..
నేనెందుకు దాన్ని చదివాను..
అసలేంటి ఇదంతా..
నిజంగా అలా అందులో వున్నట్లు జరుగుతుందా..
ఒకవేళ అలా జరిగితే నా పరిస్థితి ఏంటి ?
నేనేం చెయ్యాలి ??
ఎవరికి చెప్పాలి..? ఎవరు నమ్ముతారు ??
ఇలా వంద ఆలోచనలు తనలో..
అంతలోనే ఆ ఉత్తరం పట్టుకొచ్చి అమ్మా ఇదిగో అంటూ ఆ పిల్లాడు తన ముఖముకు దగ్గరగా పెడతాడు.. అది చూడగానే కరెంట్ షాక్ తగిలినట్లుగా తను దూరం గా ఎగిరి పడుతుంది..
ఎందుకమ్మా అంత భయపడుతున్నావ్ ?
అసలు ఆ ఉత్తరం లో ఎముందమ్మా ?
నాన్నేంటి ఇంకా రాలేదు ?
ఇలా ప్రశ్నలు వేస్తున్న పిల్లాడిని దగ్గరకు లాక్కుని..
నాన్న కాసేపట్లో వచ్చేస్తాడు.. ఈలోపు నువ్వు తినేసి చక్కగా బజ్జో అంటూ పిల్లాడికి కొన్ని మాటలు చెప్పి అన్నం తినిపించి పడుకోబెడుతుంది. అప్పటికే సమయం తొమ్మిదింపావు..!!
ఆరు గంటలకే ఇంటికొచ్చే భర్త తొమ్మిది దాటినా ఇంకా రాలేదు.. తనలో భయం, కంగారు మరింత పెరిగింది..
ఇందాక పిల్లాడు ఇచ్చిన ఉత్తరం గాలికి రెప రెపలాడుతూ శబ్దం చేస్తుంది..!
ఆ ఉత్తరం పూర్తిగా చదివితే బహుశా మార్గం కూడా అందులో ఏమైనా ఉంటుందేమో అని అనుకుంటుంది.. కానీ మళ్ళి ఆ ఉత్తరం చదివితే ఇంకేమైనా కొత్త సమస్యలు వస్తాయేమో అని మళ్ళి భయపడుతోంది.. ఏమి అర్ధం కాని అయోమయ స్థితిలో ఉండిపోయింది..
సమయం మెల్లిగా గడుస్తోంది..
కొంత సమయం తరువాత … కిరోసిన్ లాంతర్ వెలిగించి తలుపుతీసి ఇంటి గడప దగ్గర కూర్చుని భర్త రాక కోసం ఎదురు చూస్తూ వుంది.
ఒక్కో క్షణం ఒక్కో యుగమై తలపిస్తోంది..
రైళ్ళు పరుగెడుతూ వెళ్తున్నాయి.. రెప్పలు వాలుతూ వున్నాయి..
గంతలు కట్టిన గుర్రపు బండిలా తన మనసు ఎటు పడితే అటు వెళ్తోంది..
ఏది అయితే అది అవుతుందని నిశ్చయించుకొని ఉత్తరం చేతుల్లోకి తీసుకుంటుంది..!!
లాంతరు వెలుగులో గుమ్మం దగ్గరే కూర్చుని చివరకు ఆ ఉత్తరం చదవడం ఆరంభించింది..
మా బాల్కనీలో గాలికి కొట్టుకొచ్చిన ఓ కాగితం కనిపించింది. మడిచి పారేద్దాం అనుకునే లోపు ఏం కాగితం? ఇది అనుకుంటూ చూసాను.. మొదట్లోనే “నా భర్త కనపడకుండా పోయి నేటికి సంవత్సరం కావస్తోంది” అనే వాక్యాన్ని చూసాను. ఎందుకో తెలియదు నేను ఆ క్షణం ఆ కాగితం చదవకుండా వుండాల్సిందేమో… కానీ మనసు ఆగలేదు.. చదవడం మొదలు పెట్టాను…
To be Continued...
Written by: Aniboyina Bobby
Mobile : 9032977985