Tuesday, December 1, 2020

వైతాళికుడు...


 కవి జీవితమెంతటి దుర్భరమో చెప్పే మహాదర్పణం నే రాసిన ఈ కవిత.. కవి కావాలన్న ఊహ రావడమే గొప్ప విషయం అసలు.. అతడు మలిచే ప్రతీ అందానికి తానెప్పుడూ మూల్యం చెల్లిస్తూనే ఉంటాడు.. అలా అని తన రాతలు మానడు, మానలేడు.. మూల్యం అయినా మాలిన్యమైన చిరునవ్వుతో స్వీకరిస్తాడు.. ఒక సమాజం బాగుపడాలన్నా బ్రష్టు పట్టాలన్నా కవి చేతుల్లోనే ఉంటుందనేది నేను నమ్మిన సిద్ధాంతం. అందుకే అతడి రాతలు ఎంత శక్తివంతముగా వుంటే అతని చుట్టూ వున్న సమాజం అంత పటిష్టమౌతుంది. మునుపటి కవులను ఒక్కసారి పరిశీలిస్తే ఏ ఒక్కరి జీవితపు చివరిలో ప్రశాంతంగా వున్నట్లు అనిపించలేదు నాకు.. దీనికి కారణం వారు అల్లిన సుందరమైన భావాలకు మూల్యమేమో.. ఒకటి కావాలనుకుంటే మరోటి వదులుకోవాలి.. అందుకే వారు వారి జీవితాన్నేఅక్షరానికి అంకితమిచ్చారు.. అందుకే కవి ఏక వర్ణం తాగి ఏడు వర్ణాలను చిమ్ముతాడు.. అంతటి ఆ వైతాళికునికి చిరు అక్షర నీరాజనం.


వైతాళికుడు
***********
అదృష్టం
ఆమడదూరం లో
గుమ్మం ముందు నిల్చుంది
దరిద్రమేమో
కులాసాగా వాలు కుర్చీలో
కాళ్ళు బారసాచి
నడిఇంట్లో కూర్చుంది..!!

వినపడకుండా కుతకుత మంటూ
కనపడకుండా సలసల కాగుతోంది రుధిరం
నా నరాల తీగల్లో.. !
అదును చూచి భయపెడుతుంది జీవితం
దుప్పటి కప్పుకుని
గజగజ మంటోంది యౌవనం..!
బంగారు పూత పూసి
వేదికపై నాకు కప్పిన నల్ల శాలువాతో
బాధల బరువుల్ని గప్చిప్గా కప్పేసా..!!

వేవేల కరతాళధ్వనుల మధ్యన
సత్కరింపబడిన కవి నిజ జీవితం ఇదే..!
రాసే అక్షరమంత రంగులమయం కాదు
అతడి జీవితం.. అత్యంత దుర్భరమైనది..
కమిలిన చేతి గాయాలతో
సుందరమైన భావాలను అల్లగల సౌశీలుడు..!
మనసులను ఆహ్లాదపరిచేలా రాసే
ప్రతీ భావనకు అతడు మూల్యం చెల్లించాల్సిందే మరి!!
అందుకే అతడి జీవితమెప్పుడూ
పనికిరాని ఓ చిత్తు కాగితం..!!

అందరి మనసులను రంజింప చేసే
అతడి అంతరంగం ఎవరికీ అంతుపట్టని
సమస్యల చదరంగం ..!
ఉరుముల మెరుపులకు
ఉధృత జల తరంగాల ఉప్పెనలకు
అదిరే బెదిరే మనస్సు కాదతడిది
కంటికి తడి తాకినా,
తపో నిమగ్న మనస్సుతో,
నిశ్చల దీక్షతో,
ఒక్కుమ్మడిగా లేస్తున్న
భీకర సముద్ర కెరటం అతడు..!
దరిద్రం సహస్రబాహువులెత్తి బెదిరించినా
వెయ్యి తుపాకుల ముందుకూడా
తలవంచని ధైర్యం అతడిది..!

అందుకే..!
వెలుగును చూడాలని ఆశపడే అభాగ్యులకై
అంధకారపు నిశీధము చీల్చుకుంటూ
ఉదయిస్తున్నాడదిగో తూర్పున వైతాళికుడై..!!

Written by: Bobby Aniboyina
(01st December, 2020)

No comments:

Post a Comment