హేమంతఋతువు అంటే అందరికీ గుర్తొచ్చేది ఎముకులు కొరికే చలి.. వెచ్చదనం కోసం ప్రతీ ప్రాణి తడిమి తడిమి ప్రాకులాడుతుంది.. మొన్ననే కార్తీక మాసము వెళ్ళి మార్గశిరము అడుగుపెట్టింది.. చలి తీవ్రత అధికంలో వుంటుంది... ఇలాంటి చల చల్లని వేళలో ప్రకృతిపై వెచ్చని కవిత రాయాలని ఓ చిలిపి కోరిక పుట్టింది నాలో.. ఇంకేముంది అనుకున్నదే తడువుగా ఇలా మీ ముందుకు వచ్చి వాలింది.. ప్రకృతి ప్రేమికులు అభిప్రాయాలు చెప్పాలి మరి...
హేమంతము
***********
అదో
హేమంతఋతువు
మార్గశిర మాసము
మంచుబిందువులు
పూవు పూవున మసలుకొని
ఆకు ఆకునా జారుతున్నవి..!!
ఓ
అసుర సంధ్య వేళన
నేత వృక్షము కింద
చలితో చతురతలాడు సమయాన
రమణీయ పుష్ప సుగంధ వాయువులు
నా ముక్కు పుటాలనదరకొడుతూ వీస్తున్నవి..!!
మకరందమును గ్రోలు తుమ్మెదలు
మత్తెక్కి వెల్లికిల పడి వున్నవి
మావి చిగుళ్ళను చిదుము పికములు
కదలలేక వదలలేక బ్రేవుమనుచున్నవి
కనుల విందైన వెన్నెలలు
కాసేపట్లో కురియు సమయమది
చకోరములు ఒకే కొమ్మపై కూర్చుని
వెన్నెలను జుర్రి వెచ్చబరుచు కోరికయది
ఇదే హేమంతఋతు శోభితము..!!
హిమముచే కప్పబడిన
హేమంతఋతువున
ప్రకృతి వెలుగుకై వెదుకులాడెను
చల్లని వేళలో హేమంత క్రాంత
పాత చీర విడిచి కొత్త ఆమని పొందెను..!
మారాకులు వేసిన తమలపాకు తీవలు
వెన్ను వదిలిన చెఱుకు పైరు..!
మంచు కొండ మీద ఆడపడుచులు
ఆశ కొలది అలంకరించుకున్న భూషణములవలె
సొరపూలు, చంపసరాలు, గడ్డిపూలు..!!
ఒకపక్క
ఉత్తరపు దిక్కు
మలయమారుతం
చలితో వీస్తూ
మన్మథుని పంచ బాణములు
కామినీ, కాముకుల
లేత బుగ్గపై చిటిక వేసినట్లు,
కవ్వించి మనోల్లాసము గావించెను..!!
మరుపక్క
కోటివత్తుల దీపవృక్షము
కిరణ హారతులిచ్చె..!
కింశుక ప్రసవ వనిత
కొమ్మకొమ్మను సింగారించుకుని
ప్రియ వసంతునిపై
పూల వర్షము కురిపించె..!!
ససంధ్యమున
కొదమ లేగలకు
పాలుగుడపగ
చెంగుచెంగున పరుగెత్తు
నిండు పొదుగుల
చింబోతుల చిందులు..!
తొడిమ వీడని పూల
బిడియంపు బరువుతో
కన్నె పడుచులవలె..
గుప్పుమను గుబాళింపులు...!
హేమంతఋతు శోభితమ్ములివే..!!
Written by: Bobby Aniboyina
No comments:
Post a Comment