ఇది పూర్తిగా భావ కవిత్వం.. ఇందులో మూడు (తార్తీయ) భావాలను పొందుపరిచాను.. భావకవిత్వం కాబట్టి మొదటగా సున్నితమైన భావాలతో మధురంగా మొదలౌతుందీకవిత్వం... తరువాత వేదనను పులుముకొని చివరన చిల్కరింపు గల హాస్యంతో ముగుస్తుంది.. ఇలాంటివి రాయాలంటే కొంచం తటపటాయించాలి..అయినా అక్షరీకరించి మీకోసం అందిస్తున్నాను..అభిప్రాయాలు చెప్పాలి మరి..!!
తార్తీయ భావన
*************
గత రాత్రి
జలధారలో తడిచి ముద్దై
అలసి మత్తిల్లిన వేళ
పర్యంకముపై ఆదమరిచి
నిదురించు సమయాన
తెల తెల్లవారున
నింగినుంచి ఒక్కొక్కటిగా
సూర్య కిరణాలు నా..
చెక్కిలిపై రాలిపడుతున్నాయి..!!
మబ్బుల్లోంచి బయటపడ్డ
రెండు సూర్య గోళాల్లా నా
కనురెప్పలను దాటుకొని
బయటపడ్డాయి ఉద్భ్రమ నేత్రాలు
కొంచం కొంచంగా నా వాకిట్లోని
పారిజాత చెట్టుపై
పిచ్చుకలు వెదజల్లే
అల్లరి పాటల పాదాలు
నా చెవులపై వచ్చి వాలుతున్నాయి..!!
ఫెళ ఫెళ మను ధ్వనులతో
వొళ్ళు విరుచుకుంటూ
లేచి కూర్చున్నాను
నెమ్మది నెమ్మదిగా
సూర్యుడు ఆకాశం మీదికి
చేంతాడు పట్టుకుని
ఎక్కుతున్నాడు..!
పొరుగింటి శర్మా గారు
పడక కుర్చీలో జారబడి
వార్తల్ని విప్పదీసుకుంటూ వున్నారు..!!
యీ,
అనంత సూర్యోదయాన్ని
హృదయపూర్వకంగా
ఆహ్వానిస్తూ నిల్చున్నాను..!!
ఎక్కడ చూసినా (కంటి)నీరే
కళ్ళ కాటుక అరగదీసుకుంటూ
రాత్రి ఒక్కత్తే భోరుభోరున
మేఘం కార్చిన కన్నీరేమో
అయినా అంత వేదన ఏంటో తనకు
మనిషి చేసే మారణహోమాగ్నికి
నిప్పులు కురవాల్సింది ..
గప్చిప్గా
కన్నీరుతో తనగోడు చెప్పుకుంటుంది..!!
అయినా
నా పిచ్చి కానీ
గుక్కపట్టి ఏడ్చే మేఘాన్ని
పిడికిట పట్టగలనా నేను,
దాని బాధను తీర్చగలనా
సముదాయించగలనా నేను,
సముదాయించి ఓదార్చగలనా!
ఓదార్చి సేదతీర్చగలనా..!!
ఎన్నో అనుకుంటూ
ఇంటినుంచి బయటపడతాం
పక్కింటి శర్మ గారు పలకరిస్తారు
సమస్త తప్పిదాలకు
ప్రకృతిదే తప్పంటూ దుమ్మెత్తిపోస్తారు
ఏదో తెలుసుకోవాలనే ఆరాటం మెదుల్తుంది
పురాణాలు తిరగేస్తాం,
పంతుళ్ళుతో చర్చిస్తాం,
ఏదో తెలుసుకున్నట్లే అనిపిస్తది
అర్ధమయినట్లే తోస్తది
తిరుపతి వెంకన్న కలలోకొచ్చే
తల నున్నగా రుద్దుకుంటూ ఇంటికి వచ్చే
వారం దాకా హరినామమే
రహస్యం తెలిసిపోయినట్లు అనిపిస్తది
మళ్ళి నిన్ను
మోకాలు లోతు నీళ్ళలోంచి వస్తున్న
కన్నె పిల్ల కవ్విస్తుంది
ఇంకేముంది..
ఐపాయ్..!!
ఇదేరా జీవితం అంటే..!!
Written by: Bobby Aniboyina
(04th December, 2020)
No comments:
Post a Comment