పాలకడలి ప్రభవించు
పార్ధేవి వోలె..!
ఉదయగగనమున విహరించు
ఉషోదయము వోలె..!
అరుణ కమలమును
కరమున దాల్చు అలివేణి వోలె..!
వీణ వాయించినా,
విల్లు సంధించినా,
పూమాల అల్లినా,
కరవాలము చేబూనినా,
తనకు తానె సాటి
లేనే లేదిక పోటీ..!!
మనసుపడిన
స్త్రీ గాఢ పరిష్వంగంలో
ప్రాపంచిక బాధల్నిసైతం
గప్చిప్గా మర్చిపోవచ్చు
స్త్రీ
అంతరంగం
మబ్బుపట్టిన ఆకాశం..!
కాస్త ప్రేమ చూపిస్తే
జలజలామని కరిగి
వర్షిస్తుంది
వినీలాకాశంలా
దర్శనమిస్తుంది..!!
కన్నులు
విట్టార్పి చూడాలే కానీ
రసరమ్యమైన స్త్రీ
ఆడతనంలో అణువణువున
ఉప్పొంగే భావాలే..!
అందుకే
తాను విచ్చుకుంటుంది
వెచ్చని బాహువుల మధ్యన బంధూక పుష్పమై..!
తాను నర్తిస్తుంది
హృదయవేదిక పై అనురాగ స్రవంతియై..!
తాను వర్షిస్తుంది
మనసైన మగని గుండెపై విలాసవతియై..!!
ఒక
విపంచి
పలికించలేని వేవేల
భావాలను, భావోద్వేగాలను సైతం
అలవోకగా, అత్యంత మధురంగా
స్త్రీ స్పృశించగలదు..!!
తన పాదాలు
ప్రభాత వేళలో ఒక్కొక్కటిగా రాలే
పారిజాతకుసుమాలు..!
దోర గోరింట అంటిన
మధుర పాదాగ్రమములు..!
పీటపై నుంచి
కాలు జాపి
ఒకింత ముందుకు వాలి
పారాణి పరవశంతో
ఎర్రపడిన పాదాలకంటిన
వెండి వెలుగుల అందియలను
మధురముగ తొలగించే ఆ
కరములు తప్పించి
నా పెదవుల సాయంతో
ఆమూలాగ్రము మీటాలనుంది..!!
మత్తెక్కించే
ఆ మల్లెపూల మెడను
నాలిక కొనలతో ఆరాధిస్తూ,
పెదవితుమ్మెద వాలని
ఆమె నవనీత నడుముకు
ముద్దుల వడ్డాణం తొడగాలనుంది..!!
మనసెరిగి నడుచుకునే
మగని సాంగత్యంలో
స్త్రీ భావోద్వేగాలు
ప్రాతఃకాలమున
శ్వేతమధుకములా
పురివిప్పుతాయి..!!
ఆమెలో
ఆమెకే తెలియని
అలౌకికభావాలు ఎన్నో
ఆమె అణువణువున
అంగాంగమ్మున
అమరి ఉంటాయి
ఒక కుసుమం
ఎన్ని పరిణామాలుగా
వికసించగలదో
ఒక స్త్రీ పరిపరివిధాలుగా
తనలో తాను మార్పు చెందగలదు..!!
స్త్రీ
కన్నులు మాట్లాడే
కలువ భాషకు
తియ్యని కౌగిలింతలే
సమాధానాలు..!!
తనకు తానుగా
కోరికతో,
ఉద్రేకముతో,
నీ దేహంపై నర్తించినప్పుడే
నిజమైన సౌఖ్యం
అంతే కాని
బలవంతపు,
బలాత్కారపు
సంయోగం కాకూడదు..!!
సాత్వికమైన స్త్రీ
తన మానసమును
కుసుమముగా చేసి
మనసైన మగని పాదాలను
మనసారా పూజిస్తుంది..!!
ఇదే స్త్రీ లక్షణం
విలక్షణం..!!
Written by: Bobby Aniboyina
No comments:
Post a Comment