Thursday, November 26, 2020

అభినవ సత్యభామ ...


 


తానో వికసించిన యౌవన కుసుమం
రసికతను రంగరించు చిలిపి వలపుల కన్నెవనం
ఒక కరమున గులాబీలను పూయించగలదు
మరు కరమున గాండీవ శరములు సంధించనూ గలదు
తానె .. నా యీ అభినవ సత్యభామ..!!

ఆమె
పుట్టుకతోనే
లక్ష్మీకళ తాండవించిందాయింట్లో..!
ఆమె పలుకులే
మధుర సుధా చక్కెరకేళీ కలకంఠములు..!

చిలుకలకు పద్యాలను,
నెమళ్ళకు నాట్యములను,
చకోరములకు తియ్యని తడి ముద్దులను,
నేర్పగల రుచిరాంగి తను..!!

లోకసాక్షి అయిన సూర్యుడే విప్పార్పక
తలవంచి ఆమె అందానికి నిస్తేజుడౌతాడు
మానవ మాత్రులం మనమెంత..!

ఆమెను దర్శించాలంటే
వెంట్రుకలు నిక్కబొడుచుకున్న
కార్తీకమాసపు చలికౌగిలిలోనే చూడాలి
వెచ్చని ఆమె దేహం పచ్చని పసిడిలా
మిసిమిసుల మిరుమిట్లుతో
అష్టోత్తరం తొడిగిన అమ్మణ్ణి లా వుంటుంది..!!

సహజంగా ఆమె శరీర పరిమళం
పద్మ గంధపు సువాసన చిందు
సమ్మోహన భరితములు..!

కోపంలో అగ్నిజ్వాలలై దహించే సూర్యబింబం లా
శాంతంలో అమృత ప్రవాహమై ప్రకాశించే చంద్రబింబం లా
తనని తాను స్వభావించుకునే మూడు పదుల స్త్రీ తత్వం తనది..!!
పూర్ణ వికసితకుసుమం తాను..!!

నాకు తెలియక అడుగుతాను
ఆ బ్రహ్మ మతుండే చేశాడంటావా
లేక
సుధా పానీయము సేవించి
మత్తెక్కి చేశాడంటావా..!!

Written by: Bobby Aniboyina

No comments:

Post a Comment