Friday, December 11, 2020

నేడు పుస్తకం కొని చదివేవాడు కరువయ్యాడు...


 నేడు పుస్తకం కొని చదివేవాడు కరువయ్యాడు అండి.. దానిపై చిన్న “చాటవ” తో మొదలెడుతూ చిరు భావన..!!


పవలు, రేయి అన్నపానాదుల్ మరిచి
వ్రాసెడు కవి శ్రమ వీధిపాలయ్యే..!
వీధిపాలయ్యే ... వీధిలోని అసురపాలయ్యే ..
పుస్తక మెందుకురా నీకు దండగ .. చవట
బొక్కడానికి దండిగ ఉత్తుత్తి
ఉచిత ఆనులైను ప్రతులుఁడగ..!!


అన్నీ
మారుతున్నాయ్..!!
ఊరు మారింది,
ఇల్లు మారింది,
నువ్వు మారావ్,
నేనూ మారాను,
అలానే
పుస్తకమూ మారింది..! మారుతోంది..!!

పుస్తకం అంటే గుర్తొచ్చింది
కొన్ని పుస్తకాలను రుచి చూడాలి
కొన్నిటిని నమలాలి
కొన్నిటిని అమాంతం మింగేయాలి
అన్నాడో విదేశీ రచయిత.. !!

తల్లి బుద్దిని,
తండ్రి తోవను,
గురువు జ్ఞానాన్నిస్తే
పుస్తకం
నిన్ను నీకే
కొత్తగా పరిచయం చేస్తుంది..!!

పువ్వారుల వలె
స్వలాభపేక్ష లేక
నల్దిక్కులకు పరిమళాలు
వెదజల్లే సద్గుణం
కలిగినదే పుస్తకం..!!

నేస్తాలు లేనప్పుడు
సమస్త నేస్తాలు
పుస్తకాలే అవుతాయి
ఒక్కో పుట
తిప్పుతూ
అర్ధం కానివి
మళ్ళి మళ్ళి చదువుతూ
మునివేళి కొసలతో
సుకుమారంగా మీటుతూ
కాగితాన్ని హత్తుకున్న
నల్లని సిరా నుంచి వచ్చే
సువాసనలను ఆస్వాదిస్తూ
చదవడం అనేది అనుభవైక్యమే కానీ
వర్ణింపశక్యము కాదది..!!

నాటి మధురాలు
నేడు కరువౌతున్నాయి
పి.డి.ఎఫ్ అనే
దౌర్భాగ్యపు సంస్కృతి
“కవి” భావాలను పురుగులా తినేస్తుంది..
వెక్కి వెక్కి ఏడుస్తూ,
పుస్తకం కన్నీరు పెడుతోంది..!!

దయచేసి అన్నీ రకముల పుస్తకాలను ఆదరించండి.. కాగితానికి మునుపటి వైభవాన్ని అందించండి..!!
పుస్తకాన్ని పదిలపరచండి..!!
పుస్తకం లేని గది ఆత్మలేని శరీరంతో సమానం..!!

అసమానమైన పుస్తక జ్ఞానాన్ని అందరికీ అర్ధమయ్యేలా చెప్పే ముఖ్య బాధ్యత నేటి యువ రచయితలది, యువ కవులది .. వారి భుజస్కంధాలపై యీ మహాయజ్ఞాన్ని జరిపేందుకు సాహిత్య మిత్రులంతా చేయి చేయి కలపాలని కోరుకుంటున్నాను..!!

Written by: Bobby Aniboyina

1 comment:

  1. ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగే జనాలున్న దేశం మనది

    ReplyDelete