జీవితాన్వేషణలో
జీవన సంఘర్షణలో
నెత్తురు వేడెక్కి వాడిగా
జొచ్చుకుపోవాల్సిన కవి
చిత్తుగా, తాగిన తిక్కలో
చీకటిని పోగేసుకుంటున్నాడేంటి..!!
కిరాయికి అక్షర హత్యలు చేస్తున్నాడేంటి ..!!
అయినా
ఓ కవీ
పట్టెడు మెతుకులు పట్టే కడుపుకు
గుప్పెడు డబ్బుల కమ్ముడుపోయి
ఎలా రాయగలుగుతున్నావ్ ..!
జీవం లేని స్పటికాక్షరాలను..!!
భజంత్రీలకు,
భజనలకు,
నీ పదసంపదనంతా
తగలేస్తున్నావా
ఉద్యమాన్ని నడిపించాల్సిన శక్తితో
ఉన్మాదిలా ఆశక్తుడవౌతున్నావు..!!
నాటి
నీ కవితా సింధూరం తో
నెత్తురు మరిగించిన రోజులు
నేడు లేవేమి ??
సమకాలిన ప్రజా జీవితాలకు
అద్దం పట్టాల్సిన కవి
నేడు రసస్ఫూర్తి లేక
వాసన లేని కుసుమమయ్యాడు..!!
జాతి మనుగడను శాసించాల్సింది నీవే..
లే
కదులు..
కదిలించు..నీ కలాన్ని
వినిపించు అందరి గళాన్ని..!!
No comments:
Post a Comment