ముఖ్యంగా దీనికి స్త్రీ మూర్తులు దూరంగా ఉండుట శ్రేయస్కరం.
ఉత్ప్రేక్షాలంకారముతో కూడుకున్న అష్టపదుల గజగమన వర్ణన ఇది..ఇందులో పదాలు మీకు చాలావరకు అర్ధం కావు.. కాకూడదు కాబట్టే గజగమన అయింది..
పరిపూర్ణ
కలాపా కోపవతీకుసుమ
శ్వేతచాప కుటిలతతమనశ్చాపల
దీపతవిమలద్విలాస విబలా విభ్రమా
తృట్యమానసధరణీ లబ్ధవర్ణ సామంత
మహీ కాంతాగళ కనక కలశకసదకలంక
కన్యకా కర్పూరగంధిని నమస్తే.. సమోస్తుతే..!!
నిఘంటువు దగ్గర పెట్టుకుంటే కొంతమేర అర్ధం అయ్యేందుకు అవకాశం వుంది.. ఒక స్త్రీని వర్ణించాలంటే ఆమెకు ముందుగా కృతజ్ఞతలు తెలపాలి.. ఎందుకంటే అంతటి సువర్ణ శోభితమైన దేహాన్ని వర్ణించే అవకాశం కల్పించినందుకు.
ఊహల్లో ఏర్పరుచుకున్న రూపవతి అయినా సరే ఆమెకు కృతజ్ఞత చెప్పి తీరాలి..
అందుకే నా ఈ “ఋషీక” పై చిరు స్తోత్రమును ఆమెకు అర్పిస్తూ ..!!
ఋషీక
*****
ప్రత్యూషములోనే ప్రాచితీర్చి
అనుదిన శృంగారంగ
తమతమ ఇండ్ల ముంగిట
గ్రామ భామలు తీర్చే రంగు రంగుల
రంగవల్లికలు చూస్తూ,
ప్రొద్దు ప్రొద్దుల పుష్కలంగా పాలు చవిగొని
పచ్చని చెంగనాలెత్తే లేగల క్రీడలు కాంచుతూ
దధిమధనధ్వనులతో మిళితమై
కుటీరాంతరాళములనుంచి వచ్చే
ధవళ స్వాదు గేయాలను ఆలపిస్తున్నదెవరా అని
చాటుమాటున దాగి కన్నులువిప్పార్పి చూస్తిని..!!
అబ్బా.. ఏ మందమో..!!
“ఋషీక” యగు ఆ కన్య
తామరపూవు వంటి ముఖముతో
మల్లెల పలువరుసతో,
లత్తుకనంటిన మిసిమిసిల రజనుతో,
విపంచి పలికించని వేవేల భావాలను
అలవోకగా పలికించగల గజగమన మామె..!
నీటి బిందువులతో మెరిసే ఆమె
శ్వేత గులాబిలా విచ్చుకుని
తలస్నానమాచరించి అగరు ధూపం వేసుకొని
తుమ్మెద చాలు వంటి జడను
పాయలు పాయలుగా విడదీసుకొని
సరసపు జలంబును సౌకుమారముగ విదిలించుచూ..!
అర్ధ చంద్రుని భంగిమతో,
ఆంగికాభినయముతో,
నాగువంటి వెన్నుతో,
లేలేత సంపెంగ తీగల బాహువులెత్తి
చంకన చనుగుబ్బలు
గుండ్రని పూ బంతుల ఎద సొత్తులై
విరాజిల్లు వేళ,
కుచ సౌందర్య మొనలపై
మిశ్రిత వర్ణపు బొండు మల్లియలు
నిక్క బొడిచి నీల్గిన వేళ,
నడుము నాభీయమున
నిత్య హోమము జరిగెడి వేళ
అవ్యక్త భొతిక ద్రవ్యాలతో ఆమె దేహం
సమ్మోహన పరిమళాలు ప్రసవించు వేళ
రెండు పయోధరముల మధ్య
జనియించే మెరుపు వంటి నవనీత
దేహముతో ఆమె ప్రకాశించెడివేళ
నఖశిఖ పర్యంతం ఆమెను
కన్నులతో ఆఘ్రాణించు వేళ
ఆమె ఆధర చుంబనారాధితుడనై
మైమరిచి వినీలాకాశ వీధుల్లో విహరించు వేళ
ఆమె అణువణువున అందములే,
అంద చందములే !
ఆనంద నందనములే..!!
అరటాకు నడుమొంపును ఊగి ఊగి చుంబించే ఆ తడి కురులు
చవితి చంద్రుని వంటి ఆ నితంబ పీఠములు
ఏమాటకామాటే
ఆమెలోని సాత్విక సౌష్టవములు జూచి
నా మానస ప్రవృత్తి
కందళ తాళ ఆనంద నాదములతో మున్గి తేలుతూ,
చతుర్ధావస్థతో ప్రతిధ్వనులు గావిస్తున్నాయి..!
లయబద్దముగా నాట్యము లాడే ఆమె ఆపాదమస్తకము
నావంటి సంసారికే కాదు..
సాధువునికి సైతం తన మనఃపలకముపై
చెరగని ముద్రను వేసి సమ్మోహనము గావించగలదు..!!
Written by: Bobby Aniboyina
(23rd Nov, 2020)
No comments:
Post a Comment