Saturday, November 7, 2020

అస్పృశ్య దృశ్యము



సిగ్గును జారవిడిచిన రాతిరికి
సాక్షిగా నిలబడిన వీధి లాంతరు
సందు చివర మలుపున మిణుకు మిణుకు మంటూ వుంది..!

నిశ్శబ్ద శూన్యంలో
నా మనోరధాన్ని దిగి ఒంటరిగా నడుస్తున్నా
మరో ఏడు ఫర్లాంగులే మిగిలివుంది నా గమ్యానికి
శతాబ్దాలనాటి కుళ్ళిన చెట్టు క్రింద
నా కోసం రెండు కళ్ళు ఎదురుచూస్తున్నాయి..!!
కక్కిన మౌనాన్ని తిని బ్రతుకుతున్న కళ్ళు
సగం చచ్చిన దేహాన్ని ప్రపంచానికి అప్పగించిన కళ్ళు..!!

నగ్న శరీరంతో ఎదురుపడ్డ మానవుడు
సగం యౌవనం, సగం వృద్దాప్యంతో
ఆయుర్దాయాన్ని లెక్కలు వేస్తున్నాడు
నా చుట్టూ పాపంతో వికసించిన పద్మాలు
భరించలేని దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి
వాటి మధ్య నల్లగా నలలుపెక్కిన నీళ్ళలో
వరాహం మూలుగులు వింటూ ... నే నడుస్తున్నా..!!

వీపులపై
ఫెళ ఫెళా విరుగుతున్న వెండి కొరడా దెబ్బలు..
ప్రాణం పోయేలా రోదిస్తున్న ఆర్తనాదాల అరుపులు
ముక్కుపుటాలు అదరగొట్టే ఘాటైన
వాసనలతో చిక్కగా ప్రవహించే నెత్తుటి ఏరు
మరణం శ్వాస తీసుకుంటున్నట్లు వుంది ఆ ప్రాంతమంతా..!!

ఒకే
తీగపై ఉదయ, సంధ్యలను చూస్తూ నడుస్తున్నా,
పుడమి
పొత్తిళ్ళలో విశ్వం రహస్యాలను విప్పడం .. నే చూస్తున్న,
నీలంగా కదుల్తున్న రెండు ఆకారాలు
ఏవో ఉచ్చరిస్తూ,
ఎవరినో ఆరాధిస్తూ,
మృత్యువును మకరందంలా తాగుతూ,
శుష్కించిన రెండు పెదవులను నే చూస్తూ.. నడుస్తున్నా..!!

ప్రయోజనం లేకుండా పొడిచే పగటి చుక్కలను దూరంనుంచి తో .... కాడించే ధూమాకేతువులను ఎవడి కాంతినో అరువు దెచ్చుకొని నిగనిగలాడే చంద్రబింబాన్ని పనిలేకుండా పరిభ్రమించే అనంత గ్రహ గోళాలను క్షణం సేపు మిడిసిపడే మిణుగురు పుర్వులను అకారణంగా ముఖం చిట్లించుకునే ఆస్తమ సంధ్యను అణువణువూ ఈ బ్రహ్మాండంలో వున్న జీవినీ, మృత్పిండానినీ నే
చూస్తున్నా.. చూస్తూ నడుస్తున్నా.. !!
నడుస్తూనే వున్నా.. జీవితపు ఆఖరి పుట వరకు..!!

Written by: Aniboyina Bobby Nani

No comments:

Post a Comment