Wednesday, November 11, 2020

మజిలీ ...



జీవితపు పరుగులో
ఆఖరి పేజీ చేరేవరకు
ఎన్ని మజిలీలో.. !!

కాలాన్ని వెనక్కి జరిపి
నా పసితనాన్ని
కౌగిలించుకోవాలనుంది..!!

నా
బాల్యం లోకి వెళ్ళి
పుస్తకాలలో ... నే దాపెట్టిన
ఎండిపోయిన ఆకుల్ని
ఒక్కొక్కటిగా తీసి
కళ్ళారా ఓ సారి చూసుకోవాలనుంది..!!

నేనింకా
అమ్మ పొత్తిళ్ళలో
గాఢంగా నిద్రపోతున్న శిశువునే..
ఆగి ఆగి నా తలను
ఆదుర్దాగా నిమురుతూ
ముద్దు పెట్టుకునే అమ్మ స్పర్శ
ఇంకా నాకు తెలుస్తూనే వుంది..!!

ఊపిరిపోసుకున్న
ఒక్కో అక్షరాన్ని
అరిగిన పెన్సిలుతో
అదిమి పట్టుకొని
రాసిన రాతలను గుర్తుకు తెస్తోంది..!!

దోసిళ్ళ కొద్దీ
గతాన్ని మళ్ళి
మనసారా త్రవ్వుకోవాలనుంది..!!

ప్రతీ మజిలీ దగ్గర
గతం కన్నీటిమరకగా మిగిలిపోతుంది..
వెన్నెల రాత్రుల అమాయకత్వాన్ని
అమాస నిశీధముల వేళాకోళాన్ని
వేకువనే పుష్పించే ప్రభాత కుసుమాన్ని
సాయం సంధ్యలో
వెన్నెలరజనుతో మెరిసే ఆఖరి కిరణాన్ని
చూసినప్పుడల్లా.. మనసుకు ఏదో
ఒక కొత్త పరిమళం హత్తుకుంటుంది..!!

మొదటగా రాలిపడే
వర్షపు చినుకు భూమిని ముద్దాడే
సంగీతాన్ని వింటూ... పిడికిట్లోంచి
చేజారిపోయే సముద్రపు ఇసుకలా
అన్నీ చూస్తూనే వుండిపోతా స్తబ్దుగా .. !!

జ్ఞాపకాల నొప్పి
గొంతుకు అడ్డంపడినప్పుడల్లా
మెడను మెలితిప్పే మజిలీ
గుర్తుకువస్తూనే వుంటుంది..!!

Written by: Aniboyina Bobby Nani

No comments:

Post a Comment