SOCOTRA
-The Mysterious Island-
మునుపటి భాగాన్ని మనం ఒక్కసారి మననం చేసుకుందాం ...
కాసేపటికల్లా ఆ తాండవం ముగిసింది .. రొప్పుతున్న శ్వాసతో , తడిచిన స్వేదమయ దేహంతో పద్మాసనం మీద కూర్చుని అందరినీ దగ్గరకు పిలుస్తాడు ఆ అఘోరా..
తరువాత ఏంటో చూద్దాం పదండి..
22nd Part
నమ్మశక్యం కాని కొన్ని విషయాలు ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను.. సావధానులై వినండి.. అంటూ ఇలా మొదలు పెడతాడు...
అది క్రీస్తుపూర్వం నాలుగవ శతాబ్దం .. ఈ దీవికి కొంతదూరంలో … సముద్రం వొడ్డున నుంచి కాస్త లోపల వరకు అక్కడక్కడా రాళ్ళు ఏర్పడి ఉండేవి.. ప్రతీ రోజూ సాయంత్రం వేళ ఈ దీవికి సంబంధించిన స్థానిక తెగల వారి పిల్లలు (నక్షత్, వాసుర) ఇద్దరు ఆ సముద్రంలోని రాళ్ళ మీద కూర్చుని ఆడుకుంటూ వుండేవారు.. ఆ ఇద్దరికీ ఒకరంటే మరొకరికి ఎనలేని ప్రేమాభిమానాలు ఉండేవి..
అలా వుండగా ఒకరోజు అనుకోకుండా వాసుర అనే అమ్మాయి ఆ సముద్రంలో జారి పడిపోయింది.. వాసుర కుటుంబ సభ్యులు అందరూ కలిసి తలోదిక్కున వెతికినా ఆమె ఆచూకి ఏ మాత్రం దొరకదు.. ఇంకా వెతుకుతూనే వుండగా.. ఈ దీవికి సంబంధించిన మరో తెగ వారు వీరి స్థావరాలను చుట్టు ముట్టి వీరిపై రెప్పపాటు కాలంలో దాడి చేసి ఆ ప్రాంతం నుంచి వీరందరినీ వెళ్ళగొడతారు.. యుద్ధం అనంతరం కనిపించే దృశ్యం కష్టాలు, కన్నీళ్ళుతోనే నిండి వుంటుంది.. బిక్కుబిక్కుమంటూ నిద్రాహారాలు మాని ప్రాణం దోసెట్లో పెట్టుకొని బ్రతుకు జీవుడా అంటూ అక్కడనుంచి వెళ్ళిపోతారు... కానీ నక్షత్ మాత్రం వాసుర గురించే ఆలోచిస్తూ నవ్వడం, ఏడవడం, ఆఖరికి మాట్లాడటం కూడా మర్చిపోయాడు.. !
ఆరోజు వాసుర కుటుంబ సభ్యుల ఆక్రందన అక్కడ వున్న ప్రతీ మనిషికీ కన్నీరు తెప్పించి అందరి హృయాలను కదిలించింది..అందరూ ఓ సురక్షిత ప్రాంతానికి వెళ్ళాలని ఎంతో దూరం ప్రయాణించి ప్రయాణించి చీకటి పడ్డాక మార్గ మధ్యలో ఓ ప్రదేశంలో ఆగుతారు.. అందరూ ఆదమరిచి గాఢ నిద్రలో వుండగా.. నక్షత్ మాత్రం ఒంటరిగా అక్కడనుంచి వెనక్కు వచ్చేస్తాడు.. వారి తల్లి, తండ్రి నేర్పిన నక్షత్రాల మార్గాన్ని అనుసరిస్తూ, తన చేతివేళ్లను ఆకాశానికి చూపిస్తూ కొన్ని నక్షత్రాలతో మార్గాన్ని కొలుస్తూ ఆ చీకటిలో ఎలాగోలా తను, వాసుర ఆడుకునే ఆ సముద్రపు వొడ్డుకు వచ్చి అక్కడవున్నటువంటి రాళ్ళపై కూర్చుని సముద్రాన్నే చూస్తూ ఉంటాడు..
అప్పుడే ఆశ్చర్యంగా నక్షత్ కు ఓ స్వరం వినిపిస్తుంది..!!
వేగం పెరిగిపోతున్న తన గుండెను అరచేతిలో అదిమిపెట్టి.. భయంతో అటు, ఇటూ చూస్తాడు. మరలా మరలా అదే స్వరం వినపడుతూనే వుంది.. బాగా వింటే అది వాసుర స్వరం…!! ఇంకా ఇంకా బిగ్గరగా, దగ్గరగా వినపడుతోంది.. బాగా గమనిస్తే అది సముద్రంలోంచి వస్తున్నట్లు నక్షత్ గ్రహిస్తాడు.. వెంటనే నీళ్ళలోకి దూకే ప్రయత్నం చేయబోతుండగా.. అప్పుడే నీళ్ళలోనుంచి తల బయటపెట్టి నవ్వుతూ చూస్తుంది వాసుర..!
ను.. ను..ను.. వ్వు.. బ్రతికే వున్నావా..?? అంటూ అతి కష్టం మీద తడబడుతూ మాట్లాడుతాడు నక్షత్..
అవును నేను సజీవంగానే ఉన్నాను… అంటూ సమాధానం ఇస్తుంది వాసుర…
ఎలా నువ్వు బ్రతికావు ?
ఎలా నువ్వు ఇంత లోతు నీళ్ళలో ఈదుతున్నావు..? నీకు ఈతకూడా రాదుగా అంటూ నక్షత్ అడుగుతాడు..
ఇవన్నీ తెలుసుకోవాలంటే నాతోపాటే వున్న ఈ అక్కను అడుగు అని అంటుంది వాసుర..
ఆ మాట ముగిసేలోపు ఓ అందమైన యువతి నీళ్ళలోనుంచి తల బయటపెడుతుంది .. ఆమె ముఖం ఆ చీకటి వేళలో కొలనులో పూచిన శ్వేత కలువలా వుంది.. ఆశ్చర్యంతోనూ కాస్త భయంతోనూ నక్షత్ కాస్త వెనక్కు జరుగుతాడు..!!
భయపడకు నా వల్ల నీకెలాంటి ఆపద వుండదు అని అంటుందామె..
నిజమే ఈ అక్క చాలా మంచిది భయపడకు నన్ను నమ్ము... అంటుంది వాసుర…
కాస్త ధైర్యం తెచ్చుకుని ముందుకు జరిగి కూర్చుంటాడు నక్షత్..
ఏది నీ చేతిని ఇలా ఇవ్వు.. నేను తాకుతాను అంటూ కోమలమైన తన చేతిని నక్షత్ ముందుంచుతుంది..
ఇంతకీ మీరు ఎవరు ?? అంటూ ప్రశ్నిస్తాడు నక్షత్..
నా పేరు ఆత్మాశి … నేనో మత్స్యక ను.. ఈ సముద్రానికి నియంత్రణ ను … మీ దృష్టిలో సముద్రాలు ఏడు.. కానీ నాకు ఒకే ఒక్క సముద్రం.. అది ఈ ప్రపంచమంతా వుంది.. ఈ సముద్రానికి శక్తినీ నేనే.. అశక్తతను నేనే..!! ఇక ఇప్పుడు ముట్టుకోవచ్ఛా అని అడుగుతుంది..
నక్షత్ లో భయం పోయి .. నవ్వుతూ తన చేతిని ఆమెకు అందిస్తాడు.. తన చేతిని ముట్టుకోగానే ఆమె... నక్షత్ యొక్క భూత, భవిష్యత్తు, వర్తమానాలను చూస్తుంది!!
నువ్వు చాలా ధైర్యవంతుడివి.. గొప్ప స్థాయికి వెళ్తావు… నీ రాతలు శతాబ్దాల తర్వాత కూడా ఎందరో చదువుతారు.. నీ ద్వారానే ఓ మనుగడ కోల్పోయిన లిపి ఒకటి బయటకు వస్తుంది.. మన ముందు జరుగుతున్న ఈ కథకు నువ్వే కృతికర్తవు అవుతావు.. !!
మీరు ఏమంటున్నారో నాకు అసలు అర్థం కావట్లేదు అంటాడు నక్షత్.. !!
మీరిద్దరూ నాతో వచ్చేస్తారా..!!
మిమ్మల్ని ఓ సురక్షితమైన ప్రదేశానికి తీసుకువెళతాను.. అది చాలా అందంగా వుంటుంది..మీకు బాగా నచ్చుతుంది కూడా.. అక్కడ మీరు ఎంచక్కా ఆడుకోవచ్చు, ఎంతో నేర్చుకోవచ్చు అంటుంది..
అలాగే అంటారు ఇద్దరూ..
ఆ ఇద్దరినీ తన గుండెలకు హత్తుకుంటూ..మీ తల్లిదండ్రులకు నేను వర్తమానము పంపుతాను.. మీరు సురక్షితంగా వున్నారని…
ఇక బయలుదేరుదామా ?? అంటుందామె..
సరే అని తల ఊపుతారు ఇద్దరూ..
ఇద్దరినీ తన గుండెలకు అదుముకుని.. మెరుపు వేగంతో అక్కడనుంచి చంద్రిక కొలను దగ్గరకు వెళ్తుంది..!!
ఆ కొలనుకు దగ్గరలో కొన్ని అందమైన కుటీరములు వున్నాయి..చాలామంది పిల్లలు ఆడుకుంటూ వున్నారు.. ఆ కొలను ఎంత అందంగా ఉండేదంటే ప్రపంచంలో మరేచోటు ఇంత అందంగా వుండదు అనిపించేంతలా.. పగటిపూట ఆ కొలను స్వచ్ఛముగానూ, రాత్రిపూట నీలంగానూ మనకు తెలియకుండానే మన కళ్ళు పెద్దవి చేసి చూసేంతలా అమిత ఆశ్చర్యంగానూ, అందంగానూ వుంటుంది..
అక్కడ ఉన్నటువంటి పిల్లలకు ఈ మత్స్యకనే తల్లి, తండ్రి, గురువు, దైవం.. !
అన్నీ తానై నేర్పుతుంది.. ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా నీటిలో ఊపిరి తీసుకోవాలో, తుదకు ఎలా ఈదాలో కూడా నేర్పుతుంది.. అలా కొన్నేళ్ళు గడిచాక రాబోయే ఉపద్రవాన్ని గ్రహించి వయస్సుకొచ్చిన వాసుర, నక్షత్ లకు ఆ కొలనుకు సంబంధించిన అతి ముఖ్యమైన రహస్యాన్ని చెప్పాలనుకుని వారి ఇరువురిని నీటిలోకి రమ్మని పిలుస్తుంది.. అప్పటికే అన్నిటిలో శిక్షణ పొందిన వాసుర, నక్షత్ లు మత్స్యకతో పాటు తను ఏర్పరిచిన నీటి బుడగ వంటి వలయంలో వందలకొద్దీ అడుగుల లోపలకు వెళ్తారు.. ఇప్పటివరకు వారి హద్దులు దాటి ఇంత లోపలకు ఎప్పుడూ వెళ్ళలేదు.. మొదటిసారి లోతుకు వెళ్తుంటే వారి ఆశ్చర్యానికి అవధులు లేకుండా పోయాయి.. క్షణాలు కాస్త నిమిషాలై.. నిమిషాలు కాస్త గడియలైనాయి.. ఈ ప్రపంచానికి సంబంధం లేని ఓ రహస్య ప్రదేశానికి మత్స్యక వారిని ప్రత్యేకంగా తీసుకువెళ్తుందనే విషయం వారికి అర్ధం అయింది.. అంతలో వేగంగా ముందుకు కదుల్తున్న మత్స్యక వెనక్కి తిరిగి వాసుర, నక్షత్ లను గమనించింది వారు ఎలా వున్నారు..ఈ నీటి ఒత్తిడిని వారు తట్టుకోగలుగుతున్నారా లేదా ?? వారి మానసిక, శారీరక పరిస్థితి ఎలా వుంది అనే తదితర విషయాలను గమనిస్తూ వారికి సైగ చేసింది.. ఎలాంటి ఇబ్బంది లేదు అని వాసుర, నక్షత్ లు ప్రతి సైగ చేసారు.. మళ్ళి మత్స్యక ముందుకు కదలసాగింది..
అలా ముందుకు వెళ్తూ వెళ్తూ వుండగా వాసుర, నక్షత్ లకు ఓ వెలుగు కనిపించింది.. కళ్ళు రెండూ పెద్దవి చేస్తూ ఆ వెలుగును సమీపించారు.. పండు వెన్నెల వంటి కాంతులలో రెండు శ్వేత వర్ణం గల చేపలు తిరుగుతూ వున్నాయి.. వాటి చుట్టూ ఆకు పచ్చని వర్ణం గల ఓ వలయం వాటికి రక్షణ కల్పిస్తున్నట్లుగా వుంది.. ఆ ఆకుపచ్చని వలయాన్ని తాకడం సరికదా దాని దరిదాపుల్లోకి కూడా చేరలేపోయారు.. అందుకు కారణం ఆ వలయం నుంచి విస్తారంగా కర్బన ద్వి ఆమ్లజని వాయువు అధికశాతం వెలువడుతూ వుంది.. అప్పటివరకు బాగున్న వాసుర నక్షత్ లకు ఊపిరి అందడం భారమైపోయింది.. చేతులు, కాళ్ళు గిలగిలా కొట్టుకోవడం మొదలుపెట్టారు... అది గమనించిన మత్స్యక మరోసారి తన ఊపిరి తీసి ఓ గాలి బుడగ వంటి వలయాన్ని ఏర్పరిచి వాసుర, నక్షత్ లను అందులోకి పంపి వారిని కాస్త దూరంగా పెట్టింది.. తను ఆ శ్వేత వర్ణం గల చేపల వద్దకు వెళ్లి తన మెడలో వున్న తాబేలు హారాన్ని తీసి ఆ వలయం లోపలకు త్రోసింది..
To be continued …
Written by : BOBBY
No comments:
Post a Comment