Wednesday, December 4, 2019

SOCOTRA (The Mysterious Island) from Bobby... 23rd Part

SOCOTRA

                                      -The Mysterious Island-


మునుపటి భాగాన్ని మనం ఒక్కసారి మననం చేసుకుందాం ... 

అలా ముందుకు వెళ్తూ వెళ్తూ వుండగా వాసుర, నక్షత్ లకు ఓ వెలుగు కనిపించింది.. కళ్ళు రెండూ పెద్దవి చేస్తూ ఆ వెలుగును సమీపించారు.. పండు వెన్నెల వంటి కాంతులలో రెండు శ్వేత వర్ణం గల చేపలు తిరుగుతూ వున్నాయి.. వాటి చుట్టూ ఆకు పచ్చని వర్ణం గల ఓ వలయం వాటికి రక్షణ కల్పిస్తున్నట్లుగా వుంది.. ఆ ఆకుపచ్చని వలయాన్ని తాకడం సరికదా దాని దరిదాపుల్లోకి కూడా చేరలేపోయారు.. అందుకు కారణం ఆ వలయం నుంచి విస్తారంగా కర్బన ద్వి ఆమ్లజని వాయువు అధికశాతం వెలువడుతూ వుంది.. అప్పటివరకు బాగున్న వాసుర నక్షత్ లకు ఊపిరి అందడం భారమైపోయింది.. చేతులు, కాళ్ళు గిలగిలా కొట్టుకోవడం మొదలుపెట్టారు... అది గమనించిన మత్స్యక మరోసారి తన ఊపిరి తీసి ఓ గాలి బుడగ వంటి వలయాన్ని ఏర్పరిచి వాసుర, నక్షత్ లను అందులోకి పంపి వారిని కాస్త దూరంగా పెట్టింది.. తను ఆ శ్వేత వర్ణం గల చేపల వద్దకు వెళ్లి తన మెడలో వున్న తాబేలు హారాన్ని తీసి ఆ వలయం లోపలకు త్రోసింది..


తరువాత ఏంటో చూద్దాం పదండి..
23rd Part
ఆశ్చర్యంగా ఆ ఆకుపచ్చని వలయం రంగు మారి నిర్మలమైన శ్వేతవర్ణంలోకి మారింది.. తన రెండు చేతులను లోపలకు పోనిచ్చి ఆ చేపలకు దగ్గరగా పెట్టింది.. తరువాత ఆ రెండు చేపలు తన మునివేళ్ళను ముద్దాడుతూ వుండగా.. మత్స్యక మాత్రం తన రెండు కళ్ళను మూసి ఊ.. కొడుతున్నట్లుగా తలను పైకి, కిందకు ఊపుతోంది .. తనలోకి ఓ నూతన శక్తి ప్రవహించినట్లుగా తన దేహం అంతా వెండి వెలుగులతో ప్రకాశించిపోయింది.. వాసుర, నక్షత్ లు మాత్రం ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ఆశ్చర్యపోయారు.. 

కాసేపటికి మత్స్యక తన చేతులను తీసి వెనక్కు రాగానే మళ్ళి ఆ ఆకుపచ్చని వలయం యధావిధిగా ఏర్పడిపోయింది.. వాసుర, నక్షత్ లకు సైగ చేసి పైకి రమ్మని పిలుస్తుంది.. ఆ చంద్రిక కొలను నీళ్ళ పైభాగానికి చేరుకున్నాక వాసుర, నక్షత్ లకు ఇలా చెప్పడం ఆరంభించింది.. 


సృష్టి ఆవిర్భావ సమయంలో ఏర్పడిన కొలను ఇది..చంద్రిక అంటే స్వచ్ఛమైనది అని . చంద్రుని అంత స్వచ్ఛతను కలిగి ఉంటుందని అర్ధం..చంద్రుని నుంచి ఏర్పడే వెన్నెల కిరణాల ద్వారా ఎప్పటికప్పుడు తన శక్తిని గ్రహిస్తూ కాల చక్రాన్ని ఓ క్రమమైన దారిలో ఉంచుతూ దాన్ని నియంత్రిస్తూ వుంటుంది.. పరిభాషలో చెప్పాలంటే భగవంతుని శక్తి స్వరూపం అని చెప్పొచ్చు.. కాలానికి మరో ప్రక్కకు వెళ్ళే మార్గాలు (కాలరంధ్రములు) ఆకాశంలోనే కాదు భూమి మీదనూ వున్నాయి.. కానీ అవి అత్యంత రహస్యముగాను, ఎవరి దృష్టి పడకుండా గుప్తముగానూ ఉంటున్నాయి.. వాటిలో ఈ చంద్రిక కొలను ముఖ్యమైనది... 


జీవం ఏర్పడాలంటే ఏడు ధాతువులు చాలా ముఖ్యంగా వుండాలి... 

ఆ ఏడు ధాతువులకు కేంద్రబిందువే ఈ చంద్రిక కొలను.. అక్కడ కనిపిస్తున్న రెండు మీనముల వయస్సు ఎన్నో లక్షల సంవత్సరాలు…వాటి రక్షణను మా సంతతివారు ఇప్పటివరకు అత్యంత రహస్యముగా కాపాడుతూ వస్తున్నారు.. మనుషుల మేధోసంపత్తి ఎంతో అభివృద్ధి చెందుతూ వుంది.. ఈ ప్రదేశానికి ప్రమాదం పొంచి వుంది అంటే అది ముమ్మాటికీ మనిషి వల్లే వుంటుంది.. సముద్రాన్ని నియంత్రించగలిగే శక్తి ఆ రెండు మీనాలకు వుంది.. దాన్ని చేజిక్కించుకోవాలనే దుర్భుద్ది మనిషికి ఏనాడైతే కలుగుతుందో ఆనాటినుంచే మనిషి అంతం మొదలౌతుంది.. అది ఈ సృష్టి స్థితిగతులనే మార్చేస్తుంది.. 

ఇప్పటివరకూ ఈ బాధ్యతను నేను మోసాను.. ఇకపై నాకు జన్మించబోయే జలకూన ఈ బాధ్యతను చూస్తుంది.. అది మీ ఇద్దరే చెయ్యాలి.. కొన్ని రోజుల్లో నా నుంచి నా జలకూన బయటకు వచ్చి ఈ ప్రపంచాన్ని చూడబోతోంది.. తనకు నేను చెప్పిన ఈ విషయాలన్నీ మీరు చెప్పాలి.. నా కానుకగా ఈ తాబేలు హారాన్ని తనకు ఇవ్వాలి… 

అని మత్స్యక చెప్తూ వుండగా మధ్యలో వాసుర జోక్యం చేసుకొని ఇలా అంటుంది.. 

పాపకు మేము చెప్పడం ఏంటి.. మీరెక్కడికి వెళ్తారు.??

అసలు మమ్మల్ని లోపలకు ఎందుకు తీసుకువెళ్ళారు ?? 

ఎప్పుడూ లేనిది ఇవాళ ఇదంతా ఎందుకు చూపించారు ?

ఎవ్వరికీ తెలియని ఎన్నో రహస్యమైన విషయాలను ఇప్పడు మాకు ఎందుకు చెప్పారు ?? 

ఇందాక ఆ చేపలతో మీరు ఏదో మాట్లాడుతున్నట్లు తలను పైకి, కిందకు ఊ పారు .. ఏం విన్నారు ?

వాటితో ఏం మాట్లాడారు.. ?? 

అసలు మీ వయస్సు ఎంత ?? 

ఎందుకని మీరు బయటకు వెళ్ళిన ప్రతీసారి పసిపిల్లల్ని ఎవరినో ఒకరిని తీసుకొచ్చి ఇక్కడ పెంచుకుంటున్నారు ?? 

ముందు వీటికి అన్నిటికీ మీరు సమాధానం చెప్పండి.. తరువాత మీరు చెప్పేది మేము తప్పక వింటాము అని వాసుర భయపడుతూనే అంటుంది.. 

ఇవన్నీ విన్న మత్స్యక చిరునవ్వు చిందిస్తూ.. 

ఓ ఉపద్రవం రాబోతుంది. దాని మూల్యం నా ప్రాణం.. కొన్ని రోజులతరువాత ఇక నేను ఉండకపోవచ్చు నా పాపను మీరే జాగ్రత్తగా చూసుకోవాలి.. అచ్చం మీలానే పెంచాలి.. అందుకే నా తరువాత నా పాపకు (జలకూనకు) చెప్పడానికి మిమ్మల్ని ఎంచుకున్నాను.. ఈ రహస్యాలన్నీ మీకు చెప్పాను.. ఆ రెండు మీనాలతో ఏం మాట్లాడాను ఏం విన్నాను అనే కదా నీ సందేహం.. 

జరగబోయే పరిణామాన్ని వివరించాను.. తరువాత ఇక్కడి విషయాలను వాసుర, నక్షత్ లకు చెప్తున్నాను అని అంగీకారం తీసుకున్నాను.. వారి అంగీకారం తీసుకున్నాకే మీకు ఇవన్ని చెప్పాను.. ఇకపోతే నా వయస్సు.. కొన్ని శతాబ్దాలు..!!

మనుషులు బ్రతికే నూరేళ్ళు నాకు ఒక్క సంవత్సరముతో సమానం..!!

బయటకు వెళ్ళిన ప్రతీసారి నేను పిల్లలను తీసుకురావట్లేదు.. 

అసలు బయటకు వెళ్లేదే వారికోసం.. వారి రక్షణ .. నా బాధ్యత..!!

మీతో వున్నవారు మరియు ఇక్కడ వున్న ప్రతీ ఒక్కరు ఒక్కో ప్రత్యేకమైన వారు.. వారు ఆపదలో ఉన్నప్పుడే నేను ఇక్కడనుంచి వారికోసం వెళ్తాను .. వారిని ఇక్కడకు తెచ్చి సంరక్షిస్తాను.. అంటూ సమాధానం ఇచ్చి ఇంకేమన్నా సందేహాలు ఉన్నాయా అని ప్రశ్నిస్తుంది మత్స్యక.. 

వాసుర, నక్షత్ లు ఇద్దరూ కంటి నిండా నీరు పెట్టుకొని ఏడుస్తున్నారు.. 

ఇద్దరినీ దగ్గరకు లాక్కొని గుండెలకు హత్తుకుంటుంది మత్స్యక.. 

ఏడవకండి ..ఏడవకండి అని తన చేతులతో నక్షత్ వాసుర లను నిమురుతూ .. ఇప్పటికే చాలా కాలం బ్రతికేసాను.. ఎన్నో చూసాను..ఎంతో చేసాను.. నా చేతులతో ప్రేమగా పెంచి పెద్ద చేసినవారే నా కళ్ళముందు చనిపోతుంటే అంతకన్నా నరకం మరోటి ఉందంటారా చెప్పండి.. ఈ సృష్టిలో శాశ్వతం అనేది ఏదీ లేదు.. కానీ మనం బ్రతికినన్ని రోజులు మనం గడిపినవారి జ్ఞాపకాలే మనతోపాటు వుండేది.. అవే శాశ్వతం.. !

మీరే లేకపోతే ఇక మా జీవితానికి అర్ధమే లేదు.. మీరు మాతో వుండాలి.. మీనుంచి మేమెంతో నేర్చుకోవాలి అని వాసుర, నక్షత్ లు ఆమెను మరింత గాఢముగా హత్తుకొని పసిపిల్లల్లా ఏడుస్తారు… 



కాలానికి అనుగుణంగా నడుచుకోవాలే కానీ.. దాన్ని మార్చాలని ప్రయత్నించకూడదు.. ప్రయత్నించలేము కూడానూ .. “ప్రియమైన వారిని విడిచి వెళ్ళడం అంటే కేవలం దేహాన్ని వారికి దూరం చెయ్యడమే.. జ్ఞాపకాలను కాదు”.. అంటుంది మత్స్యక..వారి ఇరువురి కన్నీరును తుడుస్తూ..!



To be continued …

Written by : BOBBY

No comments:

Post a Comment