Sunday, December 1, 2019

SOCOTRA (The Mysterious Island) from Bobby... 20th Part

SOCOTRA

                                      -The Mysterious Island-


మునుపటి భాగాన్ని మనం ఒక్కసారి మననం చేసుకుందాం ... 

కొన్నిసంవత్సరాలకు ముందు ఈ చోటంతా మా యక్షామీల నివాస స్థావరం.. మాలో అందరూ మూడు వందలనుంచి అయిదు వందల ఏళ్ళ దాకా జీవిస్తారు.. ఈ రహస్యం మాకు తప్ప మరెవ్వరికీ తెలియదు.. దీనికి కారణం మా ఆడవారిలో వున్న “మంత్రదములు”. ఇవి ఒక తరమునుంచి మరు తరమునకు మర్మముగా అందించబడుతూ వస్తున్నవి.. వాటివల్లనే మా సంతతి ఇంత రహస్యముగా జీవించుచున్నది.. అంతే కాదు మేము సూర్య, చంద్రుల తేజస్సునుంచి శక్తిని పొందుతాము.. నక్షత్రాలే మా దిక్కులు, మాలో చనిపోయినవారిని ఒక్కో నక్షత్ర్రంగా భావిస్తాము.. ఇలా మనుగడ సాగిస్తూ వున్న మా స్థావరంలోకి అనుకోకుండా ఒకరోజు ..

తరువాత ఏంటో చూద్దాం పదండి..
20th Part

చిన్మయానంద్ భాటియా గారు వచ్చారు.. మా స్థావరం తెలిసిన వారిని మేము ప్రాణాలతో వదిలింది లేదు.. కానీ వారు చెప్పిన విషయాలు విన్నాక వారివద్దనున్న ఆధారాలు చూపించాక మా భవిష్యత్తు మమ్మల్ని వెతుక్కుంటూ వారి రూపంలో వచ్చిందని అర్ధం అయింది.. 


వారు చెప్పిన విషయాలు ఏమంటే ?

ఈ ప్రదేశానికి కొందరు రాబోతున్నట్లు… వారు మమ్మల్ని గుర్తించినట్లు..మమ్మల్ని వారు పట్టి బంధించి చిత్రహింసలు చేసి ఏవేవో పరీక్షలు మాపై చేస్తున్నట్లు చెప్పారు.. వారు గీసిన చిత్రాలు, ఈ ప్రాంతానికి సంబంధించిన పటము మమ్మల్ని ఏం చెయ్యబోతున్నారనే తదితర అంశాలు అన్నీ మాకు చూపించి మమ్మల్ని హెచ్చరించారు.. ఇక్కడనుంచి వెళ్ళిపొమ్మని మరీ మరీ చెప్పారు.. 


కానీ మేమే వారి మాట నమ్మినా కూడా మాపై మాకున్న మంత్రముగ్ధపై నమ్మకంచే అక్కడే ఉండిపోయాము.. దాని పర్యవసానం మా జాతినందరినీ పోగొట్టుకొని ఆఖరి స్త్రీ గా మిగిలాను.. 

వారు కేవలం ఆడవారిపైనే దృష్టిసారించేవారు..వారినే ఎంచుకునేవారు.. వారినే లక్ష్యంగా పెట్టుకునేవారు … 

మా పూర్వీకులు ఆడవారు చాలా శక్తివంతులు ..వారికి వున్న ప్రత్యేకమైన నైపుణ్యాలతో వారిని వారు చాలా సునాయాసంగా రక్షించుకోగలరు.. కానీ ఏ ఒక్కరూ ఆ మానవుల ధాటికి నిలవలేకపోయారు.. 

చిన్మయానంద్ భాటియా గారు చెప్పారు మీరెంత మంత్రముగ్ధులైనా వారి పరిజ్ఞానం ముందు నిలబడలేరు.. మీ బలహీనతలు వారికి మీకన్నా బాగా తెలుసు.. మిమ్మల్ని ఈ రోజు కాదు.. గడిచిన ఎన్నో సంవత్సరములనుంచి గమనిస్తున్నారు.. మీ గురించి మొత్తం వారికి తెలుసు.. వారు చేసే ప్రయోగాలకు ప్రపంచంలో వున్న అత్యంత ప్రత్యేకమైన మీరే కావాలి.. అందులోనూ ఆడవారు.. పదే పదే ఈ విషయాలు చెప్పి మమ్మల్ని హెచ్చరించి మమ్మల్ని వెళ్ళిపొమ్మని చెప్పేవారు.. 


ఎన్నో ఏళ్ళుగా మా రక్తం, మా పూర్వీకుల రక్తం ఈ నేలపై చిమ్మబడి డ్రాగన్ వృక్షాల రూపంలో అవి మరలా జన్మించినట్లు అనిపిస్తుందటుంది నాకు అని కళ్ళు తుడుచుకుంటుండగా 


బాధపడకండి అమ్మా అంటూ ప్రసన్నకుమార్ భాటియా ముందుకొచ్చి.. 

అసలు ఆడవారిని వారు ఏం చేస్తున్నారు ? అని ప్రశ్నిస్తాడు.. 

అది తెలుసుకోవాలనే నేను ఓ రోజు వారి స్థావరానికి వెళ్ళాను .. ఆ రెండు కొండల మధ్య చీలికలో ఓ పెద్ద నేలమాలిగ వున్నది.. అందులో వింత వింత కట్టడాలు చాలానే వున్నాయి.. వెళ్తూ వెళ్తూ వుండగా.. ఓ చోట స్త్రీ రోదన వినిపిస్తే అటువైపుగా వెళ్ళి చూసాను.. ఓ గదిలో ఆమెను నగ్నంగా చేసి కాళ్ళు రెండూ, చేతులు రెండూ ఎడం చేసి ఓ సన్నని కర్రలాంటి ధృడమైన దానికి తలక్రిందులుగా వ్రేల్లాడదీసి కట్టేసి వున్నారు.. ఏదో సూది మందు వెయ్యగానే ఆమె శరీరం అంతా పసుపు రంగులోకి మారిపోయింది.. అలా మారినప్పటినుంచి ఆమె రోదన ఎక్కువైపోయి ఆమె కన్నీళ్ళు నిరంతరముగా రావడం మొదలు పెట్టాయి.. వారి వద్ద నున్న విచిత్ర పరికరముతో ఆ కన్నీరును వారు జాగ్రత్తగా ఒక గాజు సీసాలోనికి పంపుతున్నారు.. గాజు సీసాలో కన్నీరు ఎక్కువయ్యే కొద్ది ఆమె ఆకారం వికృతంగా మారడం మొదలైంది.. ఇంత జరుగుతున్నా ఆమె కన్నీరు మాత్రం ఆగట్లేదు.. ఆమెను ఆ పరిస్థితిలో చూస్తుంటే నాకు కన్నీరు ఆగలేదు.. అప్పుడే నాకు అర్ధం అయింది ఆడవారి కన్నీరును వీరు సేకరిస్తున్నారు అని.. ఇక వచ్చేద్దాం అనుకుంటున్న సమయంలో నా చేతిని ఎవరో గట్టిగా పట్టుకున్నారు.. 


ఎవరు పట్టుకున్నారో నాకు బాగా తెలుసు.. వారు చిన్మయానంద్ భాటియా గారు.. విషయం ఏంటంటే వారు కూడా అక్కడే పనిచేస్తున్నారు.. నన్ను ఎవరికంటా పడకుండా మరో మార్గం గుండా నన్ను తీసుకొచ్చి వదిలారు.. నేనేమి అడగలేదు.. ఆయనే ఇలా చెప్పారు .. 

ఎనిమిది సాత్విక లక్షణాలు కల్గి దైవగుణం కల్గిన ఉత్తమ స్త్రీ కన్నీరు ను 

రాక్షస లక్షణాలు కలిగి మంత్రముగ్ధ గల ప్రత్యేకమైన స్త్రీ కన్నీరు ను వారు సేకరిస్తున్నారు..


ఎందుకు ఏంటి అనేది నాకూ తెలియదు.. విదేశాలనుంచి కొందరు వచ్చి ఇక్కడే ఉంటూ ప్రయోగాలు చేస్తున్నారు.. ప్రతీ మంగళవారం ఈ దీవిలోకి ఓ పెద్ద నౌక వస్తుంది.. అందులో మొదటి లక్షణాలు కలిగిన స్త్రీ లు వుంటారు.. వారిని ఎవరు? ఎక్కడనుంచి ? ఎందుకు ? ఎలా తీసుకొస్తున్నారన్న విషయం ఎవరికీ తెలియదు.. ఇక రెండవ రకం స్త్రీలు మీరు.. మీకోసం వారు ప్రపంచం అంతా తిరిగి చివరకు మిమ్మల్ని కనిపెట్టి ఇక్కడకు చేరుకున్నారు.. నేను ఇక్కడ ఓ సంస్థ తరపున పనిచేస్తున్నాను..నాకు ఇక్కడ పనిచెయ్యడం ఇష్టం లేదు.. కానీ ఇదేంటో కనుక్కొని దీన్ని సమూలంగా రూపుమాపాలనే ఇంకా నేను ఇక్కడ పనిచేస్తున్నాను .. నాపై ఇక్కడ కాస్త అనుమానం వచ్చినా కూడా నా ఆనవాళ్ళు కూడా లేకుండా చేస్తారు.. నా అగ్రిమెంట్ ముగిసేవరకు నేను ఇక్కడనుంచి బయటకు కూడా రాలేను.. అందువల్ల నా మాట విని మీరంతా ఇక్కడనుంచి వెళ్ళిపొండి అని అన్నారాయన.. 

కానీ అప్పటికే సమయం చేయిదాటిపోయింది.. 

నేను ఈ రహస్య ప్రదేశంలో ఉండటం చేత ఆరోజు వారికి చిక్కలేదు.. నా వాళ్ళనందరినీ నేను ఆ రోజే కోల్పోయాను.. ఈ క్షణం వరకు కూడా నేను ఒకదాన్ని వున్నానని వారిలో ఎవ్వరికీ తెలియదు.. ఇన్ని ఏళ్ళ నుంచి భయపడుతూనే పరుగెడుతూనే బ్రతుకుతున్నాను.. మిమ్మల్ని చూసాక మళ్ళి చిన్మయానంద్ భాటియా గారు తిరిగివచ్చినట్లు అనిపించింది.. 


ఇక్కడ జరిగే విషయాలన్నీ రహస్యంగానే వున్నాయి.. అందుకే ఇన్ని రహస్యాలను ఒకేసారి చెప్పలేక మీకు ఒక ఆచూకి లా వీలునామాను పొందుపరిచి దానిద్వారా మీరు ఈ దీవిని కనుగొనేటట్లు చేసి చివరికి మిమ్మల్ని ఇక్కడదాకా రప్పించారు.. 

ఆ కన్నీరు ఆకారం గల గుర్తు అన్నిచోట్లా ఎందుకు ఉందో ఈ పాటికే మీకు అర్ధం అయ్యి ఉంటుంది .. 

ఇప్పుడు మీతో వున్న అమ్మాయిని మీరు కనుక ఆ నౌకలో కాపాడకపోయివుంటే ఈ పాటికే ఆమె ఏమై వుంటుందో మీకే తెలుసు.. 

మరి మీ సోదరీ అక్కడకు ఎలా వెళ్ళింది.. అని అడుగగా

తను వెళ్ళలేదు.. చనిపోయినవారిని, కొనప్రాణంతో ఉన్న కొందరిని వారు ఓ చిన్న పడవ సాయంతో సముద్రమార్గం గుండా అక్కడకు చేరవేసి రహస్యంగా ఉంచిన నేల అడుగుభాగాన వారిని బంధిస్తుంటారు .. వారు తప్పించుకోలేని విధంగా అగ్నికి స్పందించే ఓ స్పటికాన్ని ఏర్పాటుచేసి పెట్టారు.. అది కేవలం రాత్రి పూటనే దారి తెరుచుకుంటుంది.. ఒకవేళ ఎవరన్నా తప్పించుకొని బయటకు వచ్చినా అది ఓ నిర్మానుష్య దీవి కావడం చేత ఎక్కడికీ వెళ్ళలేని పరిస్థితి వారిది.. అలా తప్పించుకున్న వారిని కొరడాలతో కొట్టి కొట్టి చంపేస్తారు.. నా సోదరి విషయంలో కూడా జరిగింది అదే..


చిన్మయానంద్ భాటియా గారు ఓ అసాధారణమైన వ్యక్తి .. వారి వల్లనే మీ బాష నేను మాట్లాడగలుగుతున్నాను. మీ సందేహాలు అన్నీ తీరాక.. మీకోసం చాలా రోజులుగా ఓ ముఖ్యమైన వ్యక్తి ఎదురుచూస్తున్నారు వారిని పరిచయం చేస్తాను అని చెప్తుంది..

To be continued …

Written by : BOBBY

No comments:

Post a Comment