SOCOTRA
-The Mysterious Island-
మునుపటి భాగాన్ని మనం ఒక్కసారి మననం చేసుకుందాం ...
జాగ్రత్త .. తొందరపడి వేటినీ ముట్టుకోకు.. ఇది ఓ ప్రయోగశాల అని గుర్తుపెట్టుకో అంటాడు ప్రసన్నకుమార్ భాటియా..
అలాగే అంటూ తల ఆడిస్తూ .. మీరు ఓ విజ్ఞానశాస్త్ర అధ్యాపకులు కదా మీకేమనిపిస్తుంది దాన్ని చూస్తుంటే అడుగుతాడు మోహన్..
దాని దగ్గరకు వెళ్ళి పరీక్షగా చూస్తూ, ఆ సీసాను అటు ఇటు కులికించి నెమ్మదిగా వాసన చూస్తాడు.. ప్రసన్నకుమార్ భాటియా..
తరువాత ఏంటో చూద్దాం పదండి..
27th Part
ఇది చాలా ప్రత్యేకమైన రసాయనము.. మనిషిలోని భావోద్వేగాలను ప్రేరేపించి తనకు తెలియకుండానే, తన ప్రమేయమేమీ లేకుండానే కన్నీరును తెప్పించే రసాయనము ఇది.. ఇలాంటిది ఒకటి వుందని కూడా నాకు తెలియదు.. మొదటిసారి చూస్తున్నాను అంటాడు ప్రసన్నకుమార్ భాటియా..
అంటే ఇది భావోద్వేగపు రసాయనమా అంటాడు మోహన్..
కావాలంటే నా కళ్ళు చూడు .. వాసన చూసినందుకే ఎలా కన్నీరు వస్తుందో .. అంటాడు ప్రసన్నకుమార్ భాటియా..
అయితే ఈ రసాయనం ద్వారానే అందరి కన్నీళ్లు వారు సేకరిస్తున్నారు.. ఇంకొంచం ముందుకు వెళ్దాం పదండి..ఇంకేమైనా తెలుస్తాయేమో అంటూ ఆ రసాయనపు సీసాను.. చేతుల్లోకి తీసుకుంటాడు మోహన్..
వెళ్దాం కానీ ఇదెందుకు మళ్ళి అంటాడు ప్రసన్నకుమార్ భాటియా..
తరువాత చెప్తానులే .. ఇది నా దగ్గర ఉండనివ్వండి అంటాడు మోహన్..
మరోగదిలోకి వెళ్ళారు ఇద్దరూ..
అక్కడ ఓ సన్నని కర్రలాంటి ధృడమైన ఇనుపకడ్డీ పది అడుగులు ఎత్తు వుంది.. దానికి కొన్ని బలమైన తాళ్లు కట్టి వున్నాయి.. అక్కడక్కడా రక్తపు మరకలు కనిపిస్తున్నాయి .. దూరాన పచ్చిగా రక్తం కారుతున్న కొరడా ఒకటి పడి వుంది.. ఆ ప్రదేశం నరకానికి ప్రవేశ ద్వారంలా కనపడుతోంది..
దాన్నే చూస్తూ.. బహుశా ఇక్కడే ఆడవారిని కట్టేసి చిత్రహింసలు చేసి వారి కన్నీరును సేకరిస్తారేమో.. యక్షామీ కూడా ఈ గదినే చూసి వుంటుంది.. అంటాడు మోహన్..
ప్రసన్నకుమార్ భాటియాకు ఆ దృశ్యాలను చూస్తూ నోట మాట రావట్లేదు.. ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి.. ఒకింత వొణుకుపాటుకు గురౌతున్నాడు..
అది గమనించిన మోహన్ .. మీకేం కాలేదుగా.. అని అడుగుతాడు..
తడారిన గొంతుకతో ఓ గుటక వేసి.. ఊపిరి గట్టిగా తీసుకొని ఒక్కసారిగా వదుల్తాడు ప్రసన్నకుమార్ భాటియా…
వణుకుతున్న స్వరంతో.. ఏం కాలేదు..అంటాడు సన్నగా..
నేల మీద తడి తడిగా చాలా జుగుప్సగా వుంది ఆ గది అంతా.. వారి ఎడమ చేతి వైపున ఓ పెద్ద గాజు సీసాలో సగం వరకు వున్న నీటిని చూస్తాడు మోహన్..
ఇవే కన్నీళ్ళు అనుకుంటా.. ఇంకా వెచ్చగా వున్నాయి అంటాడు మోహన్.. వాటిని తాకుతూ.. !
భగవంతుడా … ఇలాంటివి ఇంకెన్ని చూడాలో అంటూ తన ముఖానికి అంటిన స్వేద బిందువులను చేత్తో తుడుచుకుంటూ అంటాడు ప్రసన్నకుమార్ భాటియా..
మనం వచ్చే ముందే ఎవరినో ఒక ఆమెను ఇక్కడ భయంకరంగా హింసించి తీసుకెళ్లినట్లు వున్నారు.. దానికి సాక్ష్యాలే పచ్చిరక్తం కారుతున్న ఆ కొరడా, సీసాలో వున్న వెచ్చని కన్నీరు.. ఆ గోడలపై చిప్పిల్లిన నెత్తుటి మరకలు .. అంటాడు ప్రసన్నకుమార్ భాటియా ..
అవును మీరు చెప్పింది నిజమే.. అక్కడ చూడండి అంటూ ఓ దృశ్యాన్ని చూపిస్తాడు మోహన్..
ఎవరో ఈడ్చుకెళ్ళినట్లుగా రక్తపు చార చాలా దూరం వరకు ప్రస్పుటంగా కనిపిస్తుంది.. !
ఆ రక్తపు చార వెంబడే నడుచుకుంటూ వెళ్ళారు ఇద్దరూ..
కొన్ని గజాల దూరంలో.. కాళ్ళు ముడుచుకొని నగ్నంగా ఓ స్త్రీ నేలపై వుండటం గమనిస్తారు ఇద్దరూ.. తన దేహమంతా చిట్లిపోయి రక్తం కారుతూ..ఓ మాంసపు ముద్దలా వికృతంగా పడివుంది..
అడుగులో అడుగు వేసుకుంటూ మెళ్ళిగా.. భయం భయంగా ముందుకు వెళ్లారు ఇద్దరూ…!
అంతలో పక్క గదిలో నుంచి ఓ చప్పుడు వినపడుతుంది...టక్కున ఇద్దరూ పక్కనే వున్న పరదా వెనుకకు వెళ్లి దాక్కున్నారు.. ఎవరివో మాటలు అర్థం కాని భాషలో వినపడుతున్నాయి.. వాళ్ళ మాటలను బట్టి చూస్తుంటే అక్కడ ఓ ఐదు మందికి పైనే ఉన్నట్లు అర్థమవుతుంది… ఇద్దరు జాగ్రత్తగా సైగలు చేసుకుంటూ అక్కడే నిలుచుండి పోయారు..
స్ స్ స్ మంటూ ఏదో లాగుతున్న శబ్ధం వినిపిస్తుంది..
ఏం శబ్ధం అది …. అన్నట్లుగా చేతులతో సైగ చేస్తాడు ప్రసన్నకుమార్ భాటియా..
ఆ అమ్మాయిని లాక్కెళ్తున్నట్లు వున్నారు.. అంటూ సైగ చేస్తాడు మోహన్…
కాసేపటికల్లా నిశ్శబ్దం ఆవరించింది.. మెల్లిగా పరదా తొలగించి తల సగమే బయట పెట్టి చూస్తాడు మోహన్.. ఎవరూ లేరు అన్నట్లుగా తల వూపుతూ బయటకు నడుస్తాడు.... ఇందాక మాటలు వినిపించిన ఆ గదివద్దకు అడుగులో అడుగులు వేస్తూ వెళ్లారు ఇద్దరూ… !
ఆ గదిలో వందల సంఖ్యలో చుట్టూరా చిత్రాలు అంటించి ఉన్నాయి… వాటినన్నిటినీ తీక్షణంగా చూస్తూ వుండగా.. ప్రసన్నకుమార్ భాటియా దృష్టి.. రెండు శ్వేత మీనాలపై పడుతుంది…
ఆ చేపలేనా ఇవి అంటూ ప్రసన్నకుమార్ భాటియా చెవి దగ్గరకు వచ్చి మెల్లిగా అడుగుతాడు మోహన్.. సందేహం లేదు అవే ఇవి అంటాడు..
ఇక్కడ వున్నటువంటి ప్రతీ చిత్రానికి ఓ అర్థం పరమార్థం వుంది.. కనిపించే ప్రతీ చిత్రం మనల్ని హెచ్చరిస్తున్నట్లు నాకు అనిపిస్తుంది అంటాడు ప్రసన్నకుమార్ భాటియా..
ఇక ఇక్కడనుంచి వెళ్ళి ముందు ఏముందో చూడాలి అంటాడు మోహన్..
కాస్త ముందుకు వెళ్ళగానే కుడిచేతి ప్రక్క మరో మలుపు కనిపించింది.. ఇద్దరూ ఊపిరి బిగబట్టి గుండెను అరచేతిన పట్టుకొని భయం భయంగా అడుగులేస్తారు…
అది చాలా పొడవాటి గది.. ఆ గదికి అటు ప్రక్కన ఇటు ప్రక్కన అరలు అరలుగా ఏర్పాటు చేసి వున్నారు.. వాటిలో వందల సంఖ్యలో పెద్ద పెద్ద గాజు సీసాలు వున్నాయి.. వాటి అన్నింటిలోనూ కన్నీళ్లే వున్నాయి.. అవన్నీ చూస్తూ ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టి వుండిపోయారు ఇద్దరూ… భగవంతుడా ఇంతమంది ఆడవారి కన్నీరా ఇది.. ఈ దృశ్యాన్ని చూస్తుంటేనే హృదయం ద్రవించిపోతోంది అంటాడు ప్రసన్నకుమార్ భాటియా..
అసలు మనుషులేనా వీరు.. అంటాడు మోహన్..
ఇటుచూడు మన కుడిచేతి ప్రక్కన వున్న కన్నీరు ఒకరంగు వుంటే .. యెడమ చేతి కన్నీరు మరో రంగులో వుంది.. బహుశా రెండు వేరు వేరు జాతుల స్త్రీ కన్నీరు ఏమో అంటాడు ప్రసన్నకుమార్ భాటియా…
ఇక్కడ కనిపిస్తున్న ఒక్కో కన్నీరు సీసా ఒక్కో స్త్రీ నిండు జీవితం.. వీరి ఏడుపు అరణ్య రోదన అయిపోయింది .. ఇప్పటికైనా మనం ఇది ఆపకపోతే ఇంతమంది కన్నీళ్ళకు అర్థమే లేదు అంటాడు మోహన్..!
కానీ ఎలా.. ఎలా ఆపాలి అని మనసులో అనుకుంటుండగా ..
దూరం నుంచి ఎవరో వస్తున్నట్లు కొన్ని అడుగుల చప్పుళ్ళు వినపడగానే .. ఇద్దరూ వెనక్కు వెళ్ళి .. వారు వచ్చిన చిత్రాల గదిలో మరో పరదా వెనుకన దాక్కున్నారు.. ఎవరో ఇద్దరు వ్యక్తులు ఆ కన్నీళ్ళ గదిలోకి వచ్చినట్లు వీరు గమనిస్తారు.. చాలాసేపుగా ఏవో మాటలు వినిపిస్తూనే వున్నాయి.. కానీ ఏ ఒక్కటీ అర్ధం కావట్లేదు..
వీరి మాటలను బట్టి చూస్తుంటే నాకు ఒక్కటి అర్ధం అయింది అంటాడు ప్రసన్నకుమార్ భాటియా..
ఏంటది అంటాడు మోహన్..
ఇక్కడ ఉన్నటువంటి కన్నీరును వీరు చంద్రిక కొలను దగ్గరకు తరలిస్తున్నట్లు నాకు అర్ధమయ్యింది అంటాడు ప్రసన్నకుమార్ భాటియా..
అవును నిజమే.. వారి మాటల్లో పలుమార్లు చంద్రిక కొలను అని అన్నారు.. కన్నీరును వారి అరబిక్ బాషలో అన్నట్లు వున్నారు.. సరే నిజంగా మనం అనుకున్నట్లు వీరు ఆ కన్నీరును తరలిస్తారా లేదా అనేది మనం ఇక్కడే వేచి వుండి గమనించాలి అంటాడు మోహన్..
అయితే ఏదైనా సురక్షితమైన ప్రదేశానికి మనం వెళ్ళి దాక్కుందాం అంటాడు ప్రసన్నకుమార్ భాటియా..
రెండవ బృందమైనటువంటి యక్షామీ (ఉవిధ), ఆకాష్, లోకేష్, సంతోష్ ఈ నలుగురూ మరో మార్గం గుండా లోపలకు ప్రవేశించారు..
ఆ ప్రదేశమంతా కనిపించి కనిపించని చీకటిగా.. భరించలేని దుర్గంధమును వెదజల్లుతూ, నేల కాస్త తడిగా, కాస్త జిగురుగా బంకవలె అతుక్కుంటూ అడుగుతీసి అడుగెయ్యడానికి ఇబ్బందికరముగా వుంది.. యక్షామీ (ఉవిధ) తన మంత్రముగ్ధముచే సజీవంగా వున్న ఆడవారిని కనిపెట్టి మిగిలినవారికి దారి చూపిస్తోంది..
ఆ మార్గం ఎలా వుందంటే.. ఆకాష్ మోహన్ లు వారు వచ్చిన దీవిలో ఓ వింత ఆకారాన్ని వెంబడిస్తూ వెళ్ళినప్పుడు నిప్పుకు స్పందించే రాయి ద్వారా లోపలకు ప్రవేశించిన మార్గంలా ఆకాష్ కు అనిపిస్తుంది.. పది అడుగులు ఎత్తు నాలుగు అడుగులు వెడల్పుతో ఏర్పాటు చేసి వున్న ఆ మార్గం కారాగారము వలె వారికి అనిపిస్తుంది.. ఆ మార్గంలో మధ్య మధ్యలో సన్నని వెలుగుతో లాంతర్లు మిణుకు మిణుకు మని వెలుగుతున్నాయి..
ఆ చీకటిని, ఆ ప్రదేశాన్ని చూస్తుంటే భయంతో ఊపిరి కూడా భారముగా మారిపోయింది వారికి..
To be continued …
Written by : BOBBY
No comments:
Post a Comment