SOCOTRA
-The Mysterious Island-
మునుపటి భాగాన్ని మనం ఒక్కసారి మననం చేసుకుందాం ...
చిన్మయానంద్ భాటియా గారు ఓ అసాధారణమైన వ్యక్తి .. వారి వల్లనే మీ బాష నేను మాట్లాడగలుగుతున్నాను. మీ సందేహాలు అన్నీ తీరాక.. మీకోసం చాలా రోజులుగా ఓ ముఖ్యమైన వ్యక్తి ఎదురుచూస్తున్నారు వారిని పరిచయం చేస్తాను అని చెప్తుంది..
తరువాత ఏంటో చూద్దాం పదండి..
21st Part
నాకు తెలిసి ఆ ముఖ్యమైన వ్యక్తి ఎవరో కాదు నా గురువుగారే అయివుంటారు అని మోహన్ అంటాడు..
ఇంకెందుకు ఆలస్యం రండిమరి వెళ్దాం అంటూ ఆ నేలమాలిగ లోపలకు తీసుకెళ్తుంది..
అక్కడ అంతా కాస్త చీకటిగానూ, కాస్త వెలుతురుగానూ, కనిపించి కనిపించనట్లుగా, చల్లని వాతావరణంతో నిండివుంది .. మంచి మంచి వేర్లు సువాసనలతో ఆ ప్రదేశమంతా సుగంధ పరిమళాలతో గుబాళించిపోతుంది.. ఆ నేలమాలిగలో కొండపైభాగం నుంచి నిరంతరం ప్రవహిస్తున్న సన్నని నీటి ధార ఒకటి కనిపించింది.. వారితో వచ్చిన ఆమ్మాయి… ఆకాష్…. ఇద్దరూ ఒకేసారి వెళ్ళడం ఇద్దరూ డీ కొట్టుకోవడం సిగ్గుతో ఆమె బుగ్గలు కందిపోవడం అన్నీ ఒకేసారి జరిగిపోయాయి..
తరువాత ఒక్కొక్కరుగా వెళ్ళి ఆ నీరును త్రాగి వస్తారు.. అక్కడి నీరు కాస్త చేదుగా, కాస్త వగరుగా స్వల్ప తీపితో ఇంకా ఇంకా త్రాగేలా రుచికరముగా వుంది.. ఇక అక్కడనుంచి కాస్త ముందుకు వెళ్ళగానే .. ఆ అఘోరా శిష్యులు అనుకుంటా కొందరు యౌవనులు ఓంకార నాదాన్ని ఏకధాటిగా పలుకుతూ వున్నారు.. ఆ శబ్దం ఎలా ఉందంటే .. మనకు తెలియకుండానే మనలోకి ఏదో నూతన శక్తి వెళ్ళి రోమ రోమాలను స్పృశించి నిక్కబొడుచుకున్నట్లుగా శరీరమంతా బిగుసుగా మారిపోయింది..
ఆ దృశ్యాన్ని కూడా చూస్తూ, వారిని దాటుకుంటూ కళ్ళు పెద్ద పెద్దవి చేసుకొని ముందుకు కదిలాము.. లోపలకు వెళ్ళేకొద్దీ మర్రిచెట్టు వేర్లు ఆ ప్రదేశమంతటా విస్తరించి ఊడలు వ్రేల్లాడుతూ కాస్త భయం గొల్పేలా వుంది..ఈ నేలమాళిగలో ఇంత పెద్ద మర్రిచెట్టు ఎలా వచ్చింది అని అనుకుంటూ అందరం ఆశ్చర్యంగా చూస్తూ ముందుకు కదిలాము.. ఆ మర్రిచెట్టు మొదళ్ళ దగ్గర ఆ అఘోరా రెప్ప వేయకుండా మమ్మలనే చూస్తూ మాకోసం వేచివున్నట్లుగా ఉన్నాడు.. ఆయన్ని చూడగానే మోహన్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన కాలిదగ్గర వాలిపోయాడు..
అందరూ చేతులతో నమస్కరిస్తూ అక్కడ నిలబడతారు..
అందరినీ తీక్షణంగా చూస్తూ, కొన్ని నిమిషాల అనంతరం
వారితో వున్న అమ్మాయిని చూస్తూ, అమ్మాయ్ ఇలా రా..! అని అంటాడు..
నీ మెడలోని ఆ తాబేలు హారం చాలా గొప్పది.. అది ఉన్నంతవరకు నీకెలాంటి ఆపద వుండదు..కానీ
కొందరు అది నీనుంచి లాక్కునే ప్రయత్నం చేస్తారు..
భయపడకు.. ధైర్యంగా వుండు
నువ్వు నమ్మిన వ్యక్తి నీకు తోడుగా నీ జీవితాంతం ఉంటాడు అని చెప్తాడు..
తరువాత ఆకాష్ ని పిలిచి
ఈ హారం నీ ఒక్కడికే కనిపిస్తుంది.. కొందరు నీ చేతనే ఆ హారాన్ని తీయించే ప్రయత్నం చేస్తారు.. కొన్ని అనివార్య పరిస్థితులలో నీవు దీన్ని తీయాల్సి వస్తుంది.. దానిగురించి భాదపడకు రాతను మార్చలేము.. అని చెప్తాడు..
తరువాత ప్రసన్నకుమార్ భాటియాను పిలిచి
నీ మూడు రక్తపుబొట్టులలో ఓ బొట్టును కోల్పోవాల్సి వస్తుంది.. భయపడకు, దిగులు పడకు, అధైర్య పడకు.. నేను వున్నాను.. అంతా నేను చూసుకుంటాను..
ఓ యక్షామీ నీకు ఏమి చెయ్యాలో తెలుసుగా.. నువ్వు వెళ్ళి ఆ పని చూడు రేపు మొదటి జామునే నన్ను వచ్చి కలువు అని చెప్పగానే వారిని అక్కడకు తీసుకొచ్చిన యక్షామి వెళ్ళిపోతుంది..
ఇక విశ్రాంతి తీసుకోండి.. రేపు మొదటి జామున మీకు మరి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి అని చెప్పి ఆ మర్రిచెట్టు వెలుపలకు వెళ్ళిపోతాడు..
మనుషులు మాత్రమే వున్నారు కానీ మనసులు మాత్రం అందరివీ నిలకడలేకుండా అల్లకల్లోలంగా వున్నాయి..ఆ అఘోరా చెప్పింది అర్ధం అయ్యి, కానట్లు వుంది..
ప్రసన్నకుమార్ భాటియా మాత్రం దీర్ఘాలోచనలో పడిపోయాడు.. ముగ్గురు కుమారులలో ఒకరిని కోల్పోవాలా అని అర్ధం కాకనే ఆ అఘోరా చెప్పాడు.. మరలా ఏమీ కాదని అభయమిచ్చాడు .. ఏంటో అంతా గందరగోళంగా వుంది..
ఇక్కడకు పిల్లలను తీసుకొని వచ్చి నేనే తప్పుచేసానా..
వారిని అనవసరంగా ఇబ్బందులకు గురి చేస్తున్నానా.. ??
ఎన్నో ఇబ్బందులను ధైర్యంగా ఎదుర్కొని ఇక్కడదాకా వచ్చిన నా ధైర్యం ఏంటి ఇప్పుడు నీరు కారిపోతుంది.. ఇలాంటి ఆలోచనలు ఎన్నో ప్రసన్నకుమార్ భాటియాను ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.. గత కొన్నిరోజులుగా సరైన ఆహారం, నిద్ర, లేకపోవడంతో క్రమ క్రమేణా తన మానసిక స్థితి మారుతూ వస్తుంది…
ఇంతలో ముగ్గురు పిల్లలూ వచ్చి ప్రసన్నకుమార్ భాటియా పక్కన కూర్చుని.. నాన్నగారు మీరేమి దిగులు పడకండి.. మనకు ఏమన్నా అయినా కూడా మనలో ఎవ్వరూ బాధపడకండి.. మనం చేస్తున్న ఈ కార్యం ఎంతో గొప్పది .. ఆ స్త్రీలు పడ్డ బాధ ముందు మనది ఏపాటిది.. మరొకరు ఇలాంటి బాధను ఎప్పటికీ అనుభవించకూడదు.. దానికోసం మన ప్రాణాలు పోయినా మరేం పర్వాలేదు అని ముగ్గురూ పిల్లలు ఒకేమాట మీద వుండి చెప్తారు.. వారి మాటలకు ప్రసన్నకుమార్ భాటియా కళ్ళు చమర్చాయి..
కళ్ళు తుడుచుకుంటూ, చాలా పెద్దవాళ్ళు అయిపోయారురా గర్వంగా కూడా వుంది మిమ్మల్ని చూస్తుంటే.. అంతా మంచే జరుగుతుందిరా మనమంతా కలిసే మళ్ళి ఇంటికి వెళ్తాము.. కలిసే ఉంటాము.. ఇక ఇప్పటికే సమయం చాలా అయిపోయింది హాయిగా పడుకోండి అని అంటాడు ప్రసన్నకుమార్ భాటియా..
అందరూ ఆ రాత్రివేళ అలసటతో ఆదమరిచి నిద్రపోయారు..
షుమారు పావు తక్కువ మూడు గంటలు కావస్తోంది.. బిగ్గరగా శంఖం పూరిస్తున్న చప్పుడు.. ఉలిక్కిపడి అందరూ లేచారు.. ఆ అఘోరా గుక్కతిప్పుకోకుండా శంఖం పూరిస్తున్నాడు.. ఆ శబ్దానికి నేలమాలిగ దద్దరిల్లిపోతుంది.. అలా షుమారు పావుగంట పూరించి
ఏవేవో మాటలు మాట్లాడుతున్నాడు.. విందామని అందరూ దగ్గరికెళ్ళి నిల్చున్నారు..
పగలు ముదిమితో మూల్గినప్పుడు
పక్షులు నోళ్ళ గూళ్ళు మూసినప్పుడు
గాలి కాళ్ళు చల్లారినప్పుడు
నేల ఒళ్ళు నిట్టూర్చినప్పుడు
కనురెప్పల మీద ముదురు చీకటి
కలల చిగుళ్ళు మేస్తున్నప్పుడు
రేపనే రెమ్మకొసలలో ఇరుక్కుని
రేయి కోయిల రంకెలేస్తున్నప్పుడు
ప్రణవంలాంటి తదాత్మ్యంలో
ప్రాణం నిశ్చలిస్తున్నప్పుడు
పదం లాంటి కైవల్యంలో
ప్రపంచం పరమపదిస్తున్నప్పుడు
అప్పుడు నా ఆమ్రేడితం
అస్తమించని ప్రత్యూషం
అప్పుడు నా అనుప్రానం
అవధిలేని క్రాంతిహాసం
అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ.. సంసారి, సన్యాసుల్లారా.. ఇటు రండి..
వంద గొంతులు చలిస్తే
వేయి గుండెలు పిలిస్తే
లక్ష చేతులు కలిస్తే
కోటి అడుగులు ధ్వనిస్తే
ఉదయిస్తుంది ఒక గుప్తసైన్యం
అదే అదే దీప్త చైతన్యం.. !!
అంటూ అందరినీ పిలుస్తూ భం భభం భం భం భభం భం .. భం భం భం భభం భం అనే చిత్రమైన శబ్దం చేస్తూ.. భోలాశంకరునివలే ప్రళయ తాండవం చేస్తున్నారు..
ఆ దృశ్యం ఎలావుందంటే .. జటాజూటం విదిల్చి పరమేశ్వరుడు ప్రణవ తాండవం చేస్తున్నట్లుగా వుంది.. ప్రతీ భంగిమకు ఆయన జటాజూటం సూర్యుని కిరణముల వలె పాయలు పాయలుగా విడిపోయి శూలాలవలె మారి ఒకింత రౌద్రం గాను, ఒకింత భయానకంగానూ వుంది.. కన్నార్పకుండా కొన్ని నిమిషాలు అందరూ అలానే మౌనంగా చూస్తూ వుండిపోయారు..
కాసేపటికల్లా ఆ తాండవం ముగిసింది .. రొప్పుతున్న శ్వాసతో , తడిచిన స్వేదమయ దేహంతో పద్మాసనం మీద కూర్చుని అందరినీ దగ్గరకు పిలుస్తాడు ఆ అఘోరా..
To be continued …
Written by : BOBBY
No comments:
Post a Comment