కుళాయి తిప్పగానే చటుక్కున నీరు రావడం మనకు సాధారణమైన విషయం.. ఒకవేళ కొళాయి లేకపోతే నూతినుంచో, కాలువ నుంచో లేక నదులనుంచో మనం నీరుని తెచ్చుకుంటాం.. సర్వ సాధారణమైనటువంటి ఈ నీరు “అమూల్యమైనది” అంటే మనకు వింతగాను, విడ్డూరంగాను ఉండొచ్చు.. కాని ఇది యదార్ధం..
నీరు చరిత్ర గతినే మార్చివేసింది.. నాగరికతలన్నీ నదులఒడ్డునే విలసిల్లాయి.. సింధునది ఒడ్డున విరాజిల్లిన నాగరికతనే మనం సింధు నాగరికత అంటున్నాం.. పంపానది ఒడ్డున (హంపి) విజయనగర సామ్రాజ్యం వెలిస్తే, పెన్నా గట్టున, కృష్ణవేణి తీరాన, గోదావరి ఆనుకొని రాజధానులే వెలిసాయి.. రాజ్యాలు స్థాపించబడ్డాయి... ప్రాచీన మొసపటేమియా (ఇప్పటి ఇరాక్) లో టైగ్రిస్, యూ ప్రేట్ నదుల జీవ జలాలకోసం యుద్దాలే జరిగివున్నాయి.. అంతెందుకు మొన్నటివరకు బంగ్లాదేశ్ కు పరిష్కారం కాని సమస్యల్లో గంగానది జలాల పంపిణి ఒకటి ...
మరి ఇంతటి ప్రాముఖ్యత కలిగిన నీటికి మనం తగినంత ప్రాధాన్యత ఇస్తున్నామా.. ??
ప్రాధాన్యత ఇవ్వకపోగా.. పనికిమాలిన వస్తువులన్నిటినీ ప్రవాహాల్లోకి పారేసి పరిశుభ్రమైన జలాల్ని కలుషితం చేస్తున్నాం..
పరిశ్రమలు భాద్యతారహితంగా విసర్జించే రసాయనాలవల్ల మన నదులూ, సరస్సులు, చెరువులూ (కొన్ని చోట్ల బావులు కూడా) ఎలాంటి దురవస్థకు లోనవుతున్నాయో చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు వున్నాయి..
అంతెందుకు గంగానది ఒడ్డున, కాశి సమీపంలో ఒక నూనె శుద్ది కర్మాగారం వుంది.. అది శుద్ది చేయగా మిలిన వ్యర్ధ నూనె పదార్ధాన్ని గంగానదిలోకి వదిలేస్తున్నారు.. ఒకసారి ఆ నూనె అంటుకొని నీటిపై భగ్గున మంటలు కూడా లేచాయి.. (కాలుష్యాన్ని సహించలేక గంగా భవాని మండి పడుతోందని కొందరు చమత్కరించారు కూడా) ఇది కాక రోజులు పదివేల లీటర్ల మరుగుదొడ్ల నుంచి వచ్చే మరుగునీటిని ఈ నదిలోకే వదిలేస్తున్నారు.. మనకు పరమ పవిత్రమై పూజలు అందుకుంటున్న గంగమ్మ కే ఈ దౌర్భాగ్యం తప్పనప్పుడు మామూలు నదుల సంగతి వర్ణనాతీతం ..
నదులలో, సరస్సులలో తళ తళ మెరిసే అందాల, వినీల, నిర్మల, జలరాసుల్ని ఏర్పరచడానికి ప్రకృతికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది.. సంకుచిత దృష్టితో, స్వార్ధంతో, మదంతో, అహంతో, వివేక సూన్యంతో, భవిష్యత్తు గురించి ఆలోచనా రాహిత్యంతో మనం ఈ జల సంపదను కలుషితం చేస్తున్నాం.. ప్రపంచాన్నే విషపూరితం చేస్తున్నాం..
మన ఇంట్లో వాడే వ్యర్ధాల దగ్గరనుంచి భారీ పరిశ్రమల వేల లీటర్ల నీరు వరకు అన్నీ కలుషితాలే .. అవన్నీ ఎలానో మార్చలేము.. మన చేతుల్లో వున్న నీటిని వృధా చెయ్యకుండా.. కలుషితం చెయ్యకుండా.. జనజీవనాన్ని కాపాడుకుందాం..
స్వస్తి.. __/\__
Bobby Nani
No comments:
Post a Comment