Thursday, August 18, 2016

వృద్దాప్యదశ ...



ఈ వృద్దాప్యదశ అనేది మానవుని జీవితంలో అత్యంత దుర్భరమైన సమయం.. ఆ సమయంలో వారు అనుభవించిన, గడచిపోయిన జ్ఞాపకాలు నెమరు వేసుకొనుటకు అదొక అందమైన, ఆనంద సమయం.. అలాంటి అందమైన సమయాన్ని కొందరు వృద్దులు చాల దయనీయముగా బ్రతుకువెలిబుచ్చుతూ వున్నారు.. వృద్దాప్యం లో కన్న వారిని పక్కన పెట్టుకొని చూడలేని ప్రతీ ఒక్కరికీ ఇది చేరువ కావాలనే రాసాను.. ఈ వృద్దాప్యం ఈ రోజు వారిది కాని రేపు మనది అవుతుందన్న విషయాన్ని గుర్తెరిగి వున్నంతలో మంచిని పంచమని గుర్తు చేస్తూవున్నాను... నేటి మంచి రేపటి నీ మధుర జ్ఞాపిక అవ్వాలనే చిరు సంకల్పంతో ఈ చిరుకవిత.. 


వృద్దాప్యదశ ... 


దుర్భరమే, దుర్భరమే 
వృద్దాప్యదశ ఎవరికైనా దుర్భరమే.. 
ప్రతీ మనిషికి వృద్దాప్యదశ దుర్భరమే.. 
కంటిచూపు కరువగును
దృశ్యమేది కానరాకుండెను .. 
ముందేమిటో, వెనుకేమిటో, 
ఇరుప్రక్కల వుందేమిటో
తెలుసుకొనుట క్లిష్టమై
మనసుకెంతో కష్టమగును ..

మంచి మాట వినరాదు
చెడ్డ మాట వినరాదు 
ఎవరి ఏడ్పు వినరాదు 
తన ఎడ్పే తనకు కూడా 
వినరాదు వినరాదు 
తోలుముడుత పడిపోవును 
పళ్ళు రాలి పడిపోవును 
చేతులలో శక్తి లేక 
శక్తి హీనులయ్యేను.. 

చిన్న పని చెయ్యలేక 
అడుగు తీసి అడుగు కూడ
వెయ్యలేక వెయ్యలేక 
చితికిలబడు బ్రతుకు బరువు..
షడ్రుచులను తినాలనే 
కోర్కె మిగిలివుంటుంది.. 
తిన్న నాల్గు ముద్దలేమో 
అరగకుండ వుంటుంది..
రోగాలతో, నొప్పులతో 
బ్రతుకు భారమౌతుంది.. 

నాలుక ఆడలేక 
పెదవులు కదలలేక 
ఆలోచన సాగలేక 
మాటలేమో తడబడును, తడబడును.. 
మనసునిండా పెను వేదన.. 
నిండు కొనెను, నిలుచుకొనెను ..
నడుము వంగిపోతుంది
నడక ఆగిపోతుంది.. 
మనసు కృంగిపోతుంది 
తనువులో అణువణువునా 
శక్తి కృంగిపోతుంది.. 

సుతులు సుతలు హితము కోరి 
ఆత్మీయత పంచిననూ,
దగ్గరుండి క్షణం క్షణం 
సేవలెన్ని చేసిననూ 
మృత్యువును ఎదుర్కొను 
శక్తి వారు పంచలేరుగా ... 


Bobby Nani

No comments:

Post a Comment