Tuesday, August 2, 2016

వ్యంగ్యాస్త్రం ...



ఒక కవి సంధించే అనేకానేక అక్షర అస్త్రాలు సమాజ శ్రేయస్సుకోరకే వుంటాయి.. కవికి అసాధ్యం లేదు, వుండదు, సమాజం బతికినా, చెడినా కవివల్లె జరుగుతుంది.. అలా మంత్రించలేని వాడు కవి కాడు .. ఇవాల్టి భ్రష్ట సమాజానికి నీతిగల కవి కావాలి.. నీతిమార్గం చూపే కావ్యం కావాలి.. ఆ దిశగా నా ప్రయాణం సాగాలని కోరుతున్నాను.. అలాగే కవి నిర్గీవపు పువ్వును వికసింపనూ గలడు, వసంతమూ తెప్పించగలడు .. లేని అందాన్ని కూడా అపూర్వంగా మలచనూ గలడు.. తన అస్త్రాలు కర్మాగారంలో తయారయ్యినవి కావు.. స్వీయ కుటీర పరిశ్రమల్లో తయారైన నాటు అస్త్రాలు.. ఒక్కో అక్షర ప్రయోగానికి ఒక్కో పదును.. ఒక్కో ప్రయోగానికి ఒక్కో నేర్పు, ఒక్కో ఫలితం .. 

ఆవేశంతో జలపాతం లా దూకనూ గలరు, ఆగ్రహంతో కత్తిసాము చేయనూ గలరు, కసివస్తే త్రిశూలాలు గుచ్చనూ గలరు.. ఎదురుపడితే ఈటెలతో విసరనూ గలరు.. ఎగతాళిగా వెక్కిరించనూ గలరు, వ్యంగాస్త్రాలను ప్రయోగించనూ గలరు.. సభ్యతతో సమాజాన్ని నిర్మించనూ గలరు, ప్రశ్నించనూ గలరు.. 

“కవులు కావ్యాలు రాస్తారు.. 
ఉత్తములు లాలిస్తారు.. 
చెట్లు పూలనిస్తాయి.. 
గాలి గంధాన్ని మోస్తుంది”.. ఈ భావం ఒక సంస్కృత స్లోకానిది.. అంతటి గొప్ప శ్లోకాలలో సైతం కవి చోటు సంపాదించుకున్నాడు.. 

ఒక కవి అక్షరాల్ని పొదిగేటప్పుడు తనహృదయం మొత్తం కావ్యం మీద నిండిపోయి వుంటుంది.. మరే ఆలోచనా వుండదు.. కావ్య వస్తువు, కావ్య ఛందస్సు, కావ్య భాష, కావ్య నాయిక, నాయకుడు, కావ్య ధ్వని, కావ్య రసం, కావ్య హేతువు, కావ్య సందేశం ఇలా తన అధ్యయనంలో ఇన్నిటిపై దృష్టిసారిస్తూ వెళతాడు.. ఇది వయస్సుకు సంబంధం లేదు.. పదునెనిమిది యేండ్ల బాలుడు రాయవచ్చు, ఎనుబది ఎనిమిది యేండ్ల ముదుసలి రాయవచ్చు, రాతకు భావం ముఖ్యం. భాష, వయస్సు కానే కాదు... ఇదే నేను నమ్ముతాను.. 

ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే కొందరు మిత్రులు ఓ ఎనభై ఏళ్ళ బామ్మను అడిగారు మీ వయసేంది మీరు రాసేదేంది అని .. చాలా బాధనిపించింది.. ఆమె కవితలు రాయకూడదా.. ?? అంటే ఆ వయస్సులో కృష్ణా, రామా అంటూ భజన చేసుకోవాలా.. ?? ఏం వారికి ఆశలు ఉండవా.. అన్నీ అనుభవించేసారు అని మాత్రం అనకండి.. ఎందుకంటె వారు ఏమి అనుభవించి వుండరు.. బాలిక గా వున్నప్పుడు పెద్దల హద్దులకు తలవంచి, యుక్త వయస్సులో భయానికి తలవంచి, పెళ్లి అయ్యాక మొగుడికి తలవంచి, పిల్లలు వచ్చాక వారి ఆనందానికి తలవంచి, వారికి మంచి భవిష్యత్తు కోసం అహర్నిశలు వారి కోసం తలవంచి చివరికి ఇప్పటికి అన్నీ బంధాలు, భాద్యతలు తీరిపోయాక వయస్సేమో ఎనిమిది పదులు అయ్యే.. ఇక ఇక్కడ అనుభవించింది ఏంది ?? మీ ఇంట్లో వాళ్ళను మీరు ఎప్పుడైనా మీ చిన్న చిన్న కోరికలు ఏంటి అని అడిగారా ?? అడిగి చుడండి... ఎన్నో చెప్తారు.. వాటితో పాటు అవన్నిటికన్నా మిమ్మల్ని బాగా చూసుకోవడమే ముఖ్యం అని కూడా చెప్తారు.. ఇలాంటి తీరికలేని సందర్భాలలో గడిపిన ఆమెకు ఇప్పుడు కవితలు రాయాలని కోరిక కలగడం అనువంతైననూ తప్పులేదు.. 

దయచేసి అలాంటి వారిని ప్రోత్సహించండి.. లేకుంటే పక్కకుపొండి అంతే కాని ఇలా మాత్రం అవహేళన చెయ్యకండి.. అమ్మా సరస్వతీ కటాక్షం మీ మీద వుంది.. మీరు నిరభ్యంతరంగా మీ రచనలను రాయండి.. 

ఉఫ్ఫ్ ఆవేశం వచ్చేస్తుంది.. తగ్గించుకోవాలబ్బా.. 

సరే ఈ రోజు ఆగస్టు 2. స్వతంత్ర దినోత్సవం త్వరలో రాబోతుంది కదా.. దాన్ని పురస్కరించుకొని ఈ రోజుల్లోని భాద్యతారహితంగా వుండే యువతను ఉద్దేశించి ఒక వ్యంగ్యాస్త్రం అందిస్తున్నాను .. 

“భారతదేశ స్వాతంత్ర్యం 
మహాత్మాగాంధీ బోసి నవ్వులో వుంది.. 
అర్ధ దిగంబరత్వంలో వుంది...
చేతికర్రలో వుంది.. 
చిన్న పిలకలో వుంది.. 
కాని, 
ఈ కాలంనాటి 
ఏ పౌరుని మెదడులో మాత్రం లేదు.. “

అద్గదీ మాటర్ .. 


వుంటాను ... ఆయ్.. __/\__

Bobby Nani


2 comments:

  1. వ్యంగ్యాస్త్రం అని వ్రాయాలి.

    ReplyDelete
    Replies
    1. అవును అండి.. నేను గమనించలేదు.. క్షంతవ్యుడను ...

      Delete