“భావ కవిత్వం” అంటే మేలురకం కవిత్వమని కొందరు, సొగసైన భావాలతో కూడుకున్న కవిత్వం అని కొందరూ, హృదయాన్ని స్పందింపజేసే కవిత్వం అని కొందరూ, శబ్దధ్వని, భావధ్వని, రసధ్వని మూడు రకాల ధ్వనులూ ప్రధానమైన కవిత్వమని కొందరు, కవి తన హృదయంతో పరిపూర్ణమైన అనుభూతిని పొందుతూ పదాలతో గీచే భావ చిత్రాలే భావ కవిత్వమని కొందరు... ఇలా తలా ఒక రకంగా మనస్సుకు తోచినట్లు, హృదయానికి నచ్చినట్లుగా వస్తు నిర్దేశం చేస్తూ నిర్వచించారు.. ఉదాహరణలూ చూపించారు..
ఈ ఉదాహరణలలో వాల్మికి అనుష్టుప్పులు, వ్యాసుని అనుష్టుప్పులు, కాళిదాసు వృత్తాలు, కవిత్రయం పద్యాలు, శ్రీనాధుని పద్యాలు, పోతన పద్యాలు, అష్ట దిగ్గజాల పద్యాలు, రాయల వారి పద్యాలు, చేమకూర వెంకటకవి పద్యాలు, మరెందరో కవుల పద్యాలు చోటుచేసుకున్నాయి.. ఇవేకాక జయదేవుని అష్ట పదులను, అన్నమయ్య పదాలలో కొన్నిటిని, త్యాగరాజ కృతులలో కొన్నింటిని, క్షేత్రయ్య పదాలలో కొన్నింటిని, భావ కవిత్వానికి ఉదాహరణలుగా వెంటనే ఎత్తి చూపించవచ్చును .. ఎందరో మహానుభావులు అందరికీ పాదాభి వందనములు..
ఇకపోతే ఈ శతాబ్దంలోని కవులలో భావకవిత వ్రాసిన వారు ఇంకనూ ఎందరో వున్నారు.. వారిలో కొందరు.. తిరుపతి వెంకట కవులు, పింగళివారు, కాటూరివారు, విశ్వనాధ సత్యనారాయణ, జంధ్యాల పాపయ్య శాస్త్రి, జాషువా, తుమ్మల సీతారామమూర్తి చౌదరి, గురజాడ అప్పారావు, నండూరి సుబ్బారావు, బసవరాజు అప్పారావు, సముద్రాల రాఘవాచారి, మల్లాది రామకృష్ణ శాస్త్రి, దేవులపల్లి కృష్ణ శాస్త్రి, ఆరుద్ర, శ్రీ శ్రీ, దాశరధి, మున్నగువారు ప్రముఖులు... ఇలా రాసుకుంటూ పోతే ఇంకా ఎందరో మహనీయులు.. వీరికి నా పాదాభివందనం.. నాకు తెలిసిన వారిని మాత్రమే ఉదహరించాను.. ఇంకెవరినన్నా ప్రముఖులను మరిచి వుంటే క్షంతవ్యుడను ...
అలాగే ఈ నాటి భావకవితా రంగంలో సుప్రసిద్దులు : నారాయణరెడ్డి, వేటూరి సుందర రామమూర్తి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఇలా ఇంకనూ ఎందరో.. ప్రముఖులు..
“ముఖే ముఖే సరస్వతీ “ అనే ఆర్య వాక్యం ఆయుదార్ధం కానే కాదు.. అది ఎళ్ళవేళలా సత్యమే... వేదాలు, శాస్త్రాలు, కళలూ అన్నీ ఆ తల్లి సరస్వతీ దేవి స్వరూపాలే .. ! అన్నీ దైవదత్తమైన వరాలే.. అన్నీ లోకంలో అన్నాన్ని సంపాదించుకోవడానికి, శాంతితో జీవించడానికి, శాంతిని నెలకొల్పడానికి, ఆనందాన్ని సమకూర్చుకోవడానికి, మనిషి మనిషిగా జీవించడానికి తోడ్పడే ముఖ్య ప్రణాలికలు..
ఏది ఏమైనా “భావకవిత“ అంటే అత్యంత ప్రాణప్రదం నాకు.. అందుకే నా కవితలలో చాలావరకు ఈ భావ కవితలే వుంటాయి..
స్వస్తి .. /\...
Bobby Nani
No comments:
Post a Comment