Tuesday, August 30, 2016

నాది కాని నా భాష ఈ భాష...




నిన్న కొందరు మిత్రులు అడిగిన ప్రశ్న.. 

ఏంటి అన్నీ పోస్ట్ లు చక్కగా తెలుగులో పెడతారు, తెలుగు గొప్పతనం గురించి చెప్తూ వుంటారు .. మరి నిన్నటి మాతృభాష దినోత్సవం గురించి మీరు ఏమి రాయలేదు ఎందుకని ?? ఈ ప్రశ్న వేసిన మిత్రులకు హృదయపూర్వకమైన నా ఈ సమాధానపు ప్రశ్న.. 

మనం పొద్దుగాల లేచినది మొదలు మళ్ళి పక్క ఎక్కే దాకా అసలు మాతృ భాష అనేది ఒకటి మాట్లాడుతున్నామని ఎరుకనా.. ?? ఊ .. హూ.. కనీసం మాట్లాడే భాష అయినా సక్రమముగా మాట్లాడుతామా అంటే అదీ లేకపాయే.. అన్నీ భాషలు కలగలిపి ఏ భాషలోనూ ప్రావీణ్యం లేని ప్రావీణ్యులం లా మాట్లాడేస్తున్నాం .. ఇంక సంవత్సరానికి ఓ సారి వచ్చే ఈ మాతృభాష దినోత్సవం గురించి మాత్రం అబ్బో .. యెంత గొప్పగా మాట్లాడేస్తామో, రాసేస్తామో.. ఒక్క రోజు సంబరం మనకు అవసరమా చెప్పండి.. అలా అని ప్రతీరోజు తెలుగులోనే మాట్లాడమనట్లేదు .. మాట్లాడే కొంచం తెలుగు భాషను అయినా పరిపక్వత తో, పరిపూర్ణత్వం తో మాట్లాడమని చెప్తున్నాను.. మనల్ని, మన భాషను చూసి ఎదుటివారికి మాట్లాడాలనే ఆసక్తి రేకెత్తించాలి అలా ఉండాలి మాతృభాషా పద ప్రయోగాలు .. భావం, భాష రెండూ కలిస్తే ఇక ఆ పదానికీ తిరుగు ఉండబోదు.. భాష ఏదైనా భావం ముఖ్యం.. భావం భాసించాలంటే భాష ముఖ్యం.. 

ఏనాడైతే కనీసం ఓ రెండు పంక్తులు అయినా పాశ్చాత్య భాషను ఉపయోగించకుండా మాతృభాషను మాట్లాడుతారో అప్పుడే నిజమైన మాతృభాష దినోత్సవం చిగురించి నట్లు..

నాది కాని నా భాష ఈ భాష...

అంతా కృతక భాష – వెగటు పుట్టించే ఈ ప్రకటనల ప్రగల్భాలు.. 
పరాయి భాషపై మోజు – మాసిపోని మమకారం.. 
స్వభాషపై స్వాభిమానంలేని ఆత్మ వంచనా సదృశ్యాలు 
క్షమార్హం కాని పట్టింపులేని ధోరణి.. 
పెన్, పెన్సిల్, టీ, కాఫీ, బుక్, పేపెర్ 
ఇదే నా భాష... నాది కాని నా భాష 
నా నోట్లో నానుతున్న భాష.. 
తెరలు, తెరలుగా పొంగిపొరలుతున్న భాష
తెలుగేయుల చేతుల్లో పరాభవించ బడుతున్న నా మాతృభాష 
ఆత్మాభిమాన రాహిత్యంలో నా తెలుగు 
కడదాకా మనగలిగేనా 
సాహిత్యోద్యమాలు – సాంస్కృతికోధ్యమాలు 
నా తెలుగును రక్షించేనా.. ?? ఉనికినైనా మిగిల్చేనా ??
అంతర్జాతీయ వలసలు – అంతర్గత వలసలు 
నా భాషను మసిబట్టిచ్చినాయి.. అందవిహీనం చేసినాయి.. 
బడాకోరు పెద్దమనుషులు బల్మీటికి రుద్దిన భాష 
నా భాష జాగలజేరి నాతోటి కలిసింది.. 
నా నోట్లోకొచ్చి నకరాలు జేస్తాంది... 
నన్ను వేషాలేయిస్తాంది .. పరాయోన్ని జేత్తాంది ..
పరాయి భాషనే పలికిత్తాంది .. గదే నా ... భాషగ మురిపిత్తాంది,
మైమరిపిత్తాంది .. 
ముడితే మాసిపోయే భాష కాదు నాది.. 
ఊకనే మరిచిపోయే భాష కాదు నాది.. 
జరంత మనసు పెడితే జల జలా రాలే భాష 
గల గలా పలికే స్వర్ణాలతో .. ఊట చెలిమెలాంటి పదాలతో 
భాషలెల్ల కెల్లా తియ్యటి భాష నాది..

@ Bobby Nani @

No comments:

Post a Comment