మానవ జీవితం, నైతిక విలువలు, ఆప్యాయతలు, అనురాగాలు, ఆఖరికి ప్రేమలు కూడా అన్నీ యాంత్రికంగా మారిన నేటికాలంలో ఓ కనువిప్పు కోసం మేల్కొలిపే చిరు సంకల్పంతో ఈ కవిత..
యాంత్రిక జీవనం..
ఈ రోజు కూడా.... ఆడయంత్రం కళ్ళు నలుపుకుంటూ లేచింది..
ఈ రోజు కూడా.... వాకిలి తుడిచి అంట్లు తోమి స్నానం చేసి
ఈ రోజు కూడా.... వంట మనిషి వేషం వేసింది..
ఈ రోజు కూడా.... మగయంత్రం బద్దకంగా మంచం దిగాడు..
ఈ రోజు కూడా.... పంపునీళ్ళు పట్టి గడ్డం గీసి స్కూటర్ తుడిచి
ఈ రోజు కూడా.... పగటి వేషం వేసాడు..
ఈ రోజు కూడా.... అమ్మ అరుపులకు, నాన్న కేకలకు
ఈ రోజు కూడా.... పిల్ల యంత్రాలు రెండూ లేవలేక లేచాయి..
ఈ రోజు కూడా.... కొట్టుకుంటూ, తిట్టుకుంటూ అల్లరి చేస్తూ
ఈ రోజు కూడా.... యూనిఫాం లోకి ప్రవేశించి కాన్వెంటు బస్సు ఎక్కాయి..
ఈ రోజు కూడా.... టిఫిన్ బాక్స్ సర్దుకొని హడావిడిగా ఆడయంత్రం సిటీ బస్సు ఎక్కింది..
ఈ రోజు కూడా.... ఇంటికి తాళం వేసి మగ యంత్రం స్కూటర్ స్టార్ట్ చేసాడు...
ఈ రోజు కూడా.... సాయంత్రం పిల్ల యంత్రాలు రెండూ బస్సు దిగాయి...
ఈ రోజు కూడా.... మూసిన తలుపులు వారిని వెక్కిరించాయి..
ఈ రోజు కూడా.... కాసేపు ఆడుకొని, కాసేపు తిట్టుకొని, కాసేపు కొట్టుకొని, అరుగెక్కి అలసిపోయాయి..
ఈ రోజు కూడా.... ఉస్సూరుమంటూ ఆడయంత్రం సిటి బస్సు దిగింది..
ఈ రోజు కూడా.... ఇంటికి తాళం తీస్తూ పిల్ల యంత్రాల మీద సాధింపు స్వేదం చిమ్మింది..
ఈ రోజు కూడా.... మగయంత్రం విసుక్కుంటూ స్కూటర్ దిగాడు..
ఈ రోజు కూడా.... ఆఫీస్ నుంచి చిరాకు ఫైల్ తెచ్చి ఇంట్లో తెరిచాడు...
ఈ రోజు కూడా.... నాలుగు రకాల టీవి ఛానళ్ళునూ, నాలుగు యంత్రాలు కళ్ళనిండా తాగాయి..
ఈ రోజు కూడా.... పెద్ద యంత్రాలు రెండూ కంచాల ముందు కూర్చున్నాయి..
ఈ రోజు కూడా.... తమ తమ బాసు యంత్రాని కాసేపు, తమతమ తోటి యంత్రాల్ని కాసేపు విమర్శించుకొన్నాయి ..
ఈ రోజు కూడా.... రెప్పలు వాలిపోతుండగా.. నాలుగు యంత్రాలు నిద్ర మంచాలెక్కాయి..
వాళ్ళ మధ్య మాటలు రాలవు... రాలినా,
యంత్రాలు కదులుతున్న చప్పుళ్ళే వినిపిస్తాయి..
వాళ్ళ మధ్య ప్రేమలు కురవవు ... కురిసినా,
యంత్రాలు రాసుకుంటున్న శబ్దాలే వినిపిస్తాయి..
ఇప్పుడు మనిషి యంత్రం – ఇల్లు యంత్రాంగం
ఎలా నవ్వాలో, ఎలా నడవాలో ఎలా మాట్లాడాలో ఆఖరికి ఎలా సంసారం చెయ్యాలో కూడా రేపట్నుంచి కంప్యూటర్లు నేర్పుతాయి..
స్వస్తి... ___/\___
Bobby Nani
No comments:
Post a Comment