Tuesday, August 30, 2016

నాది కాని నా భాష ఈ భాష...




నిన్న కొందరు మిత్రులు అడిగిన ప్రశ్న.. 

ఏంటి అన్నీ పోస్ట్ లు చక్కగా తెలుగులో పెడతారు, తెలుగు గొప్పతనం గురించి చెప్తూ వుంటారు .. మరి నిన్నటి మాతృభాష దినోత్సవం గురించి మీరు ఏమి రాయలేదు ఎందుకని ?? ఈ ప్రశ్న వేసిన మిత్రులకు హృదయపూర్వకమైన నా ఈ సమాధానపు ప్రశ్న.. 

మనం పొద్దుగాల లేచినది మొదలు మళ్ళి పక్క ఎక్కే దాకా అసలు మాతృ భాష అనేది ఒకటి మాట్లాడుతున్నామని ఎరుకనా.. ?? ఊ .. హూ.. కనీసం మాట్లాడే భాష అయినా సక్రమముగా మాట్లాడుతామా అంటే అదీ లేకపాయే.. అన్నీ భాషలు కలగలిపి ఏ భాషలోనూ ప్రావీణ్యం లేని ప్రావీణ్యులం లా మాట్లాడేస్తున్నాం .. ఇంక సంవత్సరానికి ఓ సారి వచ్చే ఈ మాతృభాష దినోత్సవం గురించి మాత్రం అబ్బో .. యెంత గొప్పగా మాట్లాడేస్తామో, రాసేస్తామో.. ఒక్క రోజు సంబరం మనకు అవసరమా చెప్పండి.. అలా అని ప్రతీరోజు తెలుగులోనే మాట్లాడమనట్లేదు .. మాట్లాడే కొంచం తెలుగు భాషను అయినా పరిపక్వత తో, పరిపూర్ణత్వం తో మాట్లాడమని చెప్తున్నాను.. మనల్ని, మన భాషను చూసి ఎదుటివారికి మాట్లాడాలనే ఆసక్తి రేకెత్తించాలి అలా ఉండాలి మాతృభాషా పద ప్రయోగాలు .. భావం, భాష రెండూ కలిస్తే ఇక ఆ పదానికీ తిరుగు ఉండబోదు.. భాష ఏదైనా భావం ముఖ్యం.. భావం భాసించాలంటే భాష ముఖ్యం.. 

ఏనాడైతే కనీసం ఓ రెండు పంక్తులు అయినా పాశ్చాత్య భాషను ఉపయోగించకుండా మాతృభాషను మాట్లాడుతారో అప్పుడే నిజమైన మాతృభాష దినోత్సవం చిగురించి నట్లు..

నాది కాని నా భాష ఈ భాష...

అంతా కృతక భాష – వెగటు పుట్టించే ఈ ప్రకటనల ప్రగల్భాలు.. 
పరాయి భాషపై మోజు – మాసిపోని మమకారం.. 
స్వభాషపై స్వాభిమానంలేని ఆత్మ వంచనా సదృశ్యాలు 
క్షమార్హం కాని పట్టింపులేని ధోరణి.. 
పెన్, పెన్సిల్, టీ, కాఫీ, బుక్, పేపెర్ 
ఇదే నా భాష... నాది కాని నా భాష 
నా నోట్లో నానుతున్న భాష.. 
తెరలు, తెరలుగా పొంగిపొరలుతున్న భాష
తెలుగేయుల చేతుల్లో పరాభవించ బడుతున్న నా మాతృభాష 
ఆత్మాభిమాన రాహిత్యంలో నా తెలుగు 
కడదాకా మనగలిగేనా 
సాహిత్యోద్యమాలు – సాంస్కృతికోధ్యమాలు 
నా తెలుగును రక్షించేనా.. ?? ఉనికినైనా మిగిల్చేనా ??
అంతర్జాతీయ వలసలు – అంతర్గత వలసలు 
నా భాషను మసిబట్టిచ్చినాయి.. అందవిహీనం చేసినాయి.. 
బడాకోరు పెద్దమనుషులు బల్మీటికి రుద్దిన భాష 
నా భాష జాగలజేరి నాతోటి కలిసింది.. 
నా నోట్లోకొచ్చి నకరాలు జేస్తాంది... 
నన్ను వేషాలేయిస్తాంది .. పరాయోన్ని జేత్తాంది ..
పరాయి భాషనే పలికిత్తాంది .. గదే నా ... భాషగ మురిపిత్తాంది,
మైమరిపిత్తాంది .. 
ముడితే మాసిపోయే భాష కాదు నాది.. 
ఊకనే మరిచిపోయే భాష కాదు నాది.. 
జరంత మనసు పెడితే జల జలా రాలే భాష 
గల గలా పలికే స్వర్ణాలతో .. ఊట చెలిమెలాంటి పదాలతో 
భాషలెల్ల కెల్లా తియ్యటి భాష నాది..

@ Bobby Nani @

Monday, August 29, 2016

భార్యా, భర్తల భంధం...



ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం భార్యా, భర్తల భందాన్ని అపహాస్యం చేస్తూ కొందరు పోస్ట్ లు పెడుతున్నారు ?? సరదాకి కూడా ఏ భందాన్ని కించ పరచకూడదు అని నమ్మేవ్యక్తిని నేను.. ఈ విషయం లో నేను మీతో ఏకీభవించను.. ఓం కార శబ్దమంత పవిత్రతను కలిగినదే ఈ భార్యా, భర్తల భంధం.. ఎవరెవరో, ఎక్కడివారో, అప్పటిదాకా ఒకరినొకరు కూడా చూసుకోకుండా అప్పటినుంచి కడదాకా కలిసి, మెలసి బ్రతకాలంటే మాములు విషయం కానే కాదు.. భారతీయుత వివాహ భందాలలో ఊహకు అందని శక్తి నిఘూడమై వుంది.. రెండు దేహాలు ఒక దేహంగా, ఒకే ఆత్మగా మారి ఒకే గదిలో జీవిచడం అనేది గొప్ప విషయం.. అలాంటి పవిత్ర భందాన్ని అపహాస్యం చెయ్యొద్దు అని విన్నవిస్తూ .. 


భార్య అనే ఆలయానికి 
అలసి పయనించే యాత్రికుడు భర్త.. 
సజ్జనుడికి స్వర్గధామం భార్య...
సృష్టికర్త వ్రాసిన బంగారు చిత్రపటం భార్య,
భర్తే పరికించ గలడు.. 
దేవుడిచ్చిన మణిమాల భార్య,
భర్తే ధరించగలడు ..
స్వర్ణలిఖితం భార్య, 
భర్తే పఠించగలడు ..

BOBBY NANI

Saturday, August 27, 2016

బంగారు పంటలే పండించే గోదావరి ...



" గోదావరి" ఈ పెరువింటేనే తనువూ, హృదయమూ పులకరించి పోతుంది.. అందుకు గల కారణం ఏంటో అందరికీ తెలిసిన విషయమే చుట్టూరా కనుచూపుమేర పచ్చని తివాచి కప్పినట్లు పంట పొలాలు, చెరువు గట్లు, కొబ్బరి చెట్లు, హైలెస్సో హైలెస్సో అంటూ ప్రాతఃకాలమున తెప్పల మీద వేటకు వెళ్ళే జాలర సోదరుల స్వరాలు, “ఏం.. టండీ” అంటూ గౌరవ పద ప్రయోగంతో పలకరించే ఆత్మీయులు... గోదావరి పదం ఎలా వచ్చిందంటే .. గంగి గోవు పాలు అనే మాట మన తెలుగునాట ఎంతోప్రసస్థమైంది, ప్రాచీనమైంది. గోదావరి పదం లోని “గోద” అంటే గోవు ఇచ్చిన (ద) పాలు అని, “ఆవరి” అంటే పాల వంటి శుభ్రమైన నీళ్ళను ఆవరించుకుని పారుతున్నదనీ అర్థం. ఈ నది ఒడ్డున చాలా ప్రఖ్యాత పుణ్యక్షేత్రములు మరియు పట్టణములు వున్నాయి.. ఇదంతా ఎందుకంటె నా మిత్రుడు ఒకరు ఈస్ట్ గోదావరిలో ఉంటాడు.. తను పది, పదిహేను దినములనుండి బాబీ గారు అన్నిటిమీదా రాస్తున్నారు.. నా కోసం, మా గోదావరోల్ల కోసం .. గోదావరి మీద ఏదైనా రాయండి అంటూ చాలాసార్లు అడగడం జరిగింది.... ఈరోజు ఎలా అయినా తన కోరిక తీర్చాలనే నిశ్చయంతో బంగారు పంటలే పండించే ఈ గోదావరి మీద నా చిరుకవిత... 


అందాల గోదావరి ..
బంగారు గోదావరి ...
గలగలా పారేను గోదావరి..
మిల మిలా మెరిసేను గోదావరి..
ఆ ఒడ్డున, ఈ ఒడ్డునా
బంగారు పంటలే పండేను ..
భాగ్యమెంతో వెలిసేను ..
సరస కిన్నెర సాని
శబరి చెలికత్తెగా
వయ్యారములతోడి
వెయ్యి మెలికలు తిరిగి
గల గలా పారేను గోదావరి..
ఒకచెంత బొగ్గు గనులు
ఒకచెంత పచ్చటి వరి పొలాలు..
ఒకచెంత అరటి కొబ్బరి తోటలు
సరిగమ పదనిస సంగీతం
శృతి తప్పక పాడేను గోదావరి..
పాపికొండల నడుమ
పండు వెన్నెలలోన
పరువల్లు త్రొక్కును గోదావరి..
మెండైన అడవులలో
నిండుగా పారేను గోదావరి..
అందాల చిందులతో
అందరినీ మురిపించు గోదావరి..
మోసాలు ఎరుగని
ద్వేషాలు పెంచని గోదావరి
బంగారు పంటలే పండించి
ప్రజల కన్నముపెట్టు గోదావరి..
శ్రీ లక్ష్మీ గోదావరి..
భూలక్ష్మి గోదావరి
అందాల గోదావరి
బంగారు గోదావరి

Bobby Nani

Thursday, August 25, 2016

శృంగార కృష్ణ...



శృంగార కృష్ణ... 

రామునిపేరు చెప్పగానే కఠోరమైన ఏక పత్నీ వతుడు అంటాము.. కృష్ణుడు అనగానే పదహారు వేల నూట ఎనిమిది మంది శృంగార నాయికలు అందరి హృదయాలలో స్పురిస్తారు.. స్పురించడమే కాదు ఆయన శృంగార కథలు జనం నోళ్ళల్లో పడి రకరకాల రూపాల పలువిధాల భావాలలా సంతరించుకున్నాయి.. ఎక్కడైనా శృంగారం పెచ్చుమీరితే రాసలీల అంటాం.. ఎవరైనా గొప్ప భోగిని గురించి చెప్పాలంటే అమ్మో అంటాం.. అతడు కృష్ణ భగవానుడు అని పేరు పెట్టేస్తాం.. పాపం దేవుడు కదా ఏమైనా అంటే కళ్ళు పోతాయేమోనని భయంగాని సగటు మనిషికి కృష్ణుడి శృంగార కథ ఓ మితిమీరిన సరసమనే అనిపిస్తుంది.. దానికి తగ్గట్లుగా ఆ కథను పుచ్చుకొని సంప్రదాయం తెలియని కవులూ, ఆర్ష విజ్ఞానాన్ని అర్ధం చేసుకోలేని “ఆధునికులూ” వీళ్ళ ఊహల్ని పెడత్రోవ పట్టించిన పాశ్చాత్యులూ ఇలా ఎందరో కృష్ణ దేవుడిని శృంగార కథకు వక్రభాష్యాలు చెప్పారు.. చెప్పుతున్నారు.. మనం వింటూంటే చెబుతూనే వుంటారు... కొంచం నిదానించి ఈ కథల్లో రహస్యాలు, నిజా, నిజాలు ఏమైనా ఉన్నాయా ?? విచ్చలివిడి శృంగారం చెప్పడానికి ఓ వ్యాసులు, ఓ పోతనా కావాలా !! అని ప్రశ్నించుకుంటే అనుమానాలన్నీ తొలగిపోయి ఓ మాధుర్య దర్శనం, ఓ విజ్ఞాన స్పర్శ, ఒక మహా పారాణిక వైదిక విధ్యా సంకేతం మనకు ధాసిస్తుంది ... బహుపత్నీ రూప జీవాత్మరతి అంటే ఏమిటో తెలుస్తుంది.. ఇలా తెలియడానికి ఋషిపుంగవులు, పూర్వ కవులూ ఆయా సంబర్భాలలో ప్రవచించిన వేద విజ్ఞానం అనుసంధానం చేసుకోవాలి.. ఇతర అవతారాలన్ని విడి విడిగా వేరు వేరు అంశాలను ప్రతిపాదిస్తుండగా సంపూర్ణమైన సాక్షాత్తు భగవంతుడి విశ్వవిరాట్స్వరూపంగా కృష్ణావతారం భాసిస్తుంది.. 

అందుకే అన్నారు.. 

“అంశావతారా అన్యేతు కృష్ణస్తు భగవాన్ స్వయమ్” అని భగవంతుడు విశ్వ విరాటస్వరూపం. బల, వీర, వైభవాది షడ్గుడాలు సమస్త వైభవమూ, సృష్టిస్థితిలయలు అన్నీ ఒక్క మూసలో పోసి చూపినట్లుగా కృష్ణుడు చూపిస్తాడు.. అంచేత ఆయన ఆట, పాటలకు, చదువు సాములకు, పెళ్లి, పేరంటాలకు, ఆవేశ కావేషాలకు, ధర్మ ధర్మాలకు అన్నిటికీ ఓ అర్ధం, పరమార్ధం వున్నాయి.. అది తెలుసుకోకుండా మాట్లాడటం మన అవివేకం.. 

కృష్ణునికి ఎనిమిది మంది.. రుక్మిణి, జాంబవతి, సత్యభామ, మిత్రవింద, భద్ర, నీల (నాగ్నజిత్తి), కాళింది, లక్షణ, ఈ పేర్ల వరసలలోను, వీళ్ళను స్వామి పెళ్ళాడిన పద్ధతులలోను కొంచం తేడాలున్నా మొత్తం మీద అష్ట మహిషులున్నారనేది అక్షర సత్యం.. భగవద్గీత లో కృష్ణుడు చెప్పారు.. “భూమి రాపోనలో వాయుఃఖం మనో బుద్ది రేవచ అహంకార ఇతీయం మే ఖిన్నా ప్రకృతి రష్టదా” భూమి, నీరు, నిప్పు, గాలి ఆకాశము మనస్సు, బుద్ది, అహంకారము ఇవి పిండాండ సమవాయి కారణాలు అయిన ప్రకృతి శక్తులు. వీటి స్వరూపాలకే రూపకల్పన చేసి ఆయన సాక్ష్యాత్ భగవంతుడు కాబట్టి వీరితో ఎల్లప్పుడూ క్రీడిస్తాడని చెప్పడానికి ఇలా వ్యక్తులుగా, రాజ కుమార్తెలు గా, మేనత్త కూతుల్లుగా, నదీ స్వరూపాలుగా, కథలు కట్టి ఆ ఎనిమిది మందినీ స్వామి వివాహం చేసుకున్నాడు అని శాస్త్రాలు చెప్తున్నాయి.. 

ఇక ఈ ఎనిమిది మంది ప్రకృతులను నడిపించే పరాకృతి ఒకటి వున్నది.. అది గోలోకమనే లోకం.. గోలోకమంటే సృష్టిస్థితి ప్రళయాలకు రంగస్తలమైన అంతరంగిక కాంతి లోకం.. చైతన్య కేంద్రం.. ఆ పరా ప్రకృతి ఏం చేస్తుందంటే ఈ ఎనిమిది ప్రకృతుల విలాసాలని అదుపులో వుంచుకొని స్వామియొక్క అంతర్యామి లక్షణంగా వ్యవహరిస్తూ వారి మార్గాలను, సాధననీ పవిత్రం చేసి స్వామిలో ఐక్యం అయ్యేలా చేస్తుంది.. ఆ శక్తి పేరే రాధ... ఈ పరా ప్రకృతి జీవఘాతమైన తన అంతర్యామి తత్వమని స్వామి భగవద్గీత లో చెప్పివున్నాడు.. ఇలా శ్రీ కృష్ణుని గురించి మనం కొన్ని రహస్యాలను చెప్పుకోవచ్చు.. నిజా నిజాలు తెలియక శ్రీ కృష్ణుడు విచ్చల విడి శృంగార పురుషుడు అంటే ఒప్పుకోబోము.. నెమలి పించన ధారుడు అంటే శారీరక కలయిక లేకుండా నెమలి అంత పవిత్రతను కలిగిన వాడు అని అంటారు.. నిజా నిజాలు తెలుసుకోకుండా మాట్లాడకండి అని విన్నవిస్తూ ... 

శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు .. 

స్వస్తి.. ___/\___

Bobby Nani

Wednesday, August 24, 2016

భ్రూణహత్య...



పురిటిల్లోనే భ్రూణహత్యలకు పాల్పడుతున్న తల్లిదండ్రుల వైఖరికి, హాస్పిటల్ యాజమాన్యానికి ఓ చెంపపెట్టుగా ఈ చిరు ఆవేదనాస్త్ర కవిత.. 

కొందరు పెళ్ళికాని యువత చీకటిమాటున క్షణికావేశంలో జరిగే దారుణానికి సాక్ష్యాలే ఈ భ్రూణహత్యలు.. అత్త, మమల వారసత్వపు పోరువల్ల జరిగేవే ఈ భ్రూణహత్యలు.. భ్రూణహత్య మహాపాపం .. దయచేసి ఒక్కరైనా అర్ధం చేసుకుంటారనే నా ఈ తాపత్రయం.. 

దయ, దాక్షిణ్యం మరచిన
తల్లితండ్రులు భ్రూణహత్యకు
పూనుకొనుటను
రాక్షసత్వమనందుమా ?
కర్కశత్వమందుమా ??

జాలి లేక ఆడ పిల్లను
సాకనోపక చంపబూనుచు,
గోడకు కొట్టినట్టి తండ్రియే
కరుడుకట్టిన కసాయి యవ్వగా..

పాపను కనుపాపవలెన్
కాయవలసిన తల్లిదండ్రులే ఆ
పాపను రూపుమాప తగునా... ఏది ధర్మం.. ??
ఎక్కడుంది ధర్మం ??
అన్నీ తప్పించుకొని
ఆడపిల్లగా భూమిమీదకు రాగా..

ఆడపిల్లను “ఆడ” పిల్లవే,
ఈడ పిల్లవు కావనుచు
అత్త ఇంటికి సాగనంపుటే
తమ లక్ష్యముగా పంపితిరే ..
వెళ్ళినాక ఈసడింపులకు
తాళలేక, కన్నవారికి చెప్పలేక..
మరణమే శరణమని వేడగా ..

గర్భమున తన శిశువు
కదలికలకు ఊపిరి పీల్చుకొని
క్రొత్త భంధం కోసం 9 నెలలు
వేచి చూడగా..
ముద్దులొలుకుతూ పుట్టినది
చూడు ఆడపిల్ల.... !!
అత్త మూతివిరుపుల తోడూ ..
మామగారి వెక్కిరింతలూ
ఇక మగపిల్లాడు లేడు
మనకని ఈసడించేడు భర్త..
వైఖరి దిక్కు తోచక గుండె
బరువై కుమిలి కుమిలి ఏడ్చే ఆ యబల ..

జన్మనిచ్చిన తల్లి నిస్పృహ
తెలిసినట్లుగా ఆ బిడ్డ ఏడ్వగా ..
ఆడపుట్టుక అంత అలుసా..
అన్నట్లు తోచేనపుడు..

పెద్దలందరు చీదరించిన
తండ్రికూడ నిరాదరించిన
తల్లి ఒడిలో పెరిగి పాపయు
వ్యక్తిత్వము కూర్చుకున్నది..

విద్య, వివేకములు అబ్బి
అంద, చందములు అమరి..
వినయ భూషణయై నిలిచినది..
అందరినీ ఆశ్చర్యపరిచినది..

నిర్మల బుద్ది నియమపాలన
త్యాగములను సైతం చెయ్యగలరని
నిరూపించింది ఈ వనిత..
అబల కాదు సబలగా నిలిచింది ఈ కోమలాంగి..

Bobby Nani

Tuesday, August 23, 2016

ప్రకృతి భిక్ష...



ప్రకృతి భిక్ష...
************
ప్రకృతి ఎంతో అందమైనది.. అందమైనది అన్నప్పుడు అంతా, ఇంతా అందమైనది అని కాదు.. నాలాంటి సామాన్యుడు వర్ణించడానికి వీలులేనంత అందమైనది అని నా అర్ధం.. ప్రకృతి సౌందర్యాన్ని, దాని మనోజ్ఞతను, రమణీయకాన్ని ఋక్కులను చెప్పిన ఋషుల దగ్గరనుంచి రవీంద్రుని వరకు ఎందరెందరో మధురాతిమధురంగా వర్ణనలు చేసారు.. కాని వీరు అందరూ ఈ ప్రకృతి మాత పద సౌందర్యాన్ని, దృశ్య సౌందర్యాన్ని చెప్పి వున్నారు.. నిరహంకార బుద్దితో, నిష్పక్షపాతంగా, ప్రసన్నచిత్తంతో, ప్రకృతిపోకడలను పరిశీలించిన ప్రజ్ఞానిధుల పరిశోధనల ఫలితంగా వెలిబుచ్చిన విజ్ఞానపర విశేషాలను గురించి కొన్నిటిని ఆలోచనకు వచ్చినవాటిని, నేను చూసిన వాటిని గురించి రాయ సంకల్పించి రాస్తున్నాను..

మన ప్రపంచానికి అపురూప సౌందర్యాన్ని సమ కూర్చేవి చెట్లు, చేమలే.. వసంతకాలం వచ్చిందంటే సర్వ ప్రకృతి పులకితమై ఆకుపచ్చగా కన్నుల పండుగగా వుంటుంది..

ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, ఎవరినైనా సరే పలకరించి చుడండి.. వాళ్ళు వాళ్ళు చేస్తున్న పనుల పరమార్ధం ఏంటి అని ఆలోచించండి.. పశుపక్ష్యాదులను చుడండి.. బ్రతికి వున్నంతకాలం వాటి జీవిత పరమార్ధం ఏమిటో పరిశీలించండి.. .. సరిగ్గా ఇలాంటి ఆలోచనే నాకు కలిగింది..

ఫలితంగా ఒకే సమాధానం నాకు తట్టింది.. “మానవులలో కోటి విద్యలు కూటి కొరకే” ఇక పశువులకు తిన్నది పుష్టి..... అంతే కాదు సమస్త జీవకోటిలో వాటి జీవితంలో చాలా భాగం ఆహారాన్ని సంపాదించుకోవడంలోనే వ్యయమై పోతుందని మనకు తెలిసిన సంగతే.. అంతెందుకు ఒక్క మానవులలోనే చూద్దాం.. ఏ దేశంలో చూసినా అక్కడి జనాభాలో అత్యధిక సంఖ్యాకులు ఏదో విధంగా ఈ భూమిని నమ్ముకొనేవారె ... వ్యవసాయమే ప్రధాన వృత్తి.. మన భారతదేశంలో నూటికి 70 శాతం మంది వ్యవసాయ వృత్తే.. (ప్రస్తుతం వారి సంఖ్య గణనీయంగా తగ్గుతోంది.. ) ఈ విధంగా మానవులకు, పశువులకు కావలసిన ఆహారం అంతా సస్యశ్యామలమై భూమాత కానుక.. అంటే మొక్కలు, పాదులు మనకు పెట్టిన భిక్ష అన్నమాట..

ఏ ప్రాంతాన్ని అయినా పచ్చని తివాసీ కప్పినట్లు మనోజ్ఞంగా కనపరిచే గరికపోచలు.. ఏ మైదానాన్ని అయినా, ఏ తోటనైనా, ఏ కొండనైనా, ఏ కోననైనా కన్నులపండువుగా అలకరించేవి అవే... ఇది అలా ఉంచితే.. మనం ప్రధానంగా తినే గోధుమ, వరి, బార్లీ, ఓట్లు, జొన్న, మొక్క జొన్న, రాగి, వగైరా ధాన్యాలన్ని ఈ తృణజాతుల ప్రసాదమే కదా.. ఆఖరుకు ఆ పేరు చెప్పగానే బ్రహ్మదేవుడికి సైతం నూరూర్చే బెల్లాన్ని, పంచదారను ప్రసాదించే చెరుకు కూడా ఈ తృణజాతుల కోవకే చెందుతుంది..
ఇంతేనా పశువులు, మేకలు గడ్డి గాదం మేసి వాటిని తియ్యని పాలుగా మార్చి మనకు ప్రసాదిస్తున్నాయి. ఇవన్నీ కూడా పశువులు మేసిన గడ్డి, గాదం, ఆకూ, అలం మారు రూపాలే కదా..అలాగే కాయ కసరు తిని బ్రతికే గొర్రెలు, మేకలు వంటి వాటిని చంపుకుతినే మాంసాహారులు, కేవలం పప్పు, కూరలు, పులుసు, పెరుగు వేసుకుతినే శాకాహారులు వీరందరికీ అన్న దాతలు, ప్రాణ దాతలు మొక్కలే కదా.. అంటే శాకాహారులు అయినా, మాంసాహారులు అయినా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తమ మనుగడకు ప్రాణులన్నీ మొక్కల మీదే ఆధారపడి వున్నాయి.. దీన్ని నేను ఒక్క మాటలో చెప్పాలంటే “ఆకు లేకపోతే అన్నమే లేదని చెప్పాలి.. “

అంతే కాకుండా మనం తినేదే కాకుండా మనం సేవిస్తూ వున్న కాఫీ, కోకో, ద్రాక్ష రసాలు, మద్యాలు, ఇవన్నీ కూడా చెట్ల భిక్షయే.. తినే ఐస్ క్రీం లు, మందులో వాడే తేనే ఇవన్నీ కూడాను చెట్లు ప్రసాదించినవే .. మనం కట్టుకునే బట్టలు పట్టు బట్ట కట్టుకున్నా, ఉన్ని బట్ట కట్టుకున్నా, వాటి మూలం వెతికితే అవన్నీ చెట్ల, చేమల ప్రసాదమని తేలుతుంది.. పోనీ దుప్పినో, మరే జంతువునో వేటాడి తెచ్చుకున్నా, చేపలు పట్టి తెచ్చినా వాటిని ఎలా వండుతాము ?? మన ఇళ్ళను కప్పి మనకు వెచ్చదనాన్ని ఇచ్చేది ఏంటి ? పొయ్యి ఏం పెట్టి వెలిగిస్తాము ? మన యంత్రాలు ఎలా నడుస్తున్నాయి ?? ఇందుకు ఉపయోగపడేది బొగ్గు యౌగిక ద్రవ్యం (దీనినే ఇంగ్లిష్ లో “కార్బన్ కాంపౌండ్” అంటారు.)

ఇంతకీ చెప్పవచ్చినది ఏమంటే మనం ఏ దృష్టితో చూచినా, ఏదో విధంగా తెల్లారి లేచింది మొదలు తిరిగి పడుకోబోయే వరకు చెట్లకు ఎంతగానో ఋణపడి ఉన్నామని..
ఒక మొక్క ఎదిగి ఒక స్థాయికి రావాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది.. 100 ఏళ్ళ నాటి మొక్కను తుంచాలంటే 100 నిమిషాలు కూడా పట్టట్లేదు.. నా దృష్టిలో వృక్షం అంటే కేవలం చెట్టు కాదు.. సృష్టిలోని ప్రతీ ప్రాణి ఊపిరి .. కొన్ని రోజుల క్రిందట ఓ వృక్షం గురించి రాసిన ఆవేదనాభరిత నా ఈ చిరు కవిత ....

ఓ వృక్షపు ఘోష...
*****************

విత్తు నాటిన నాటి రోజున...
నేటి నిలువెత్తు నిదర్శనమై ప్రెకలించుకొని
వస్తివి నా కనులముందుకు...
నిన్ను చూచిన ఆ క్షణమున ...
తెలియని అమ్మతనం నాలోలోన...
చూస్తుండగానే పెరిగి పెద్దవైతివి కనులముందర...
మొదట పూసిన లేలేత పుష్పము...
నీ..... నా...... ఆనందాన్ని మరింత రెట్టింపు చేసే..
అంతకు అంత నాకన్నా కొండంత .. ఎత్తుకు ఎదిగితివి..
ఫలమునిచ్చి, నీడనిచ్చి, వాయువునిచ్చి ...
అన్నీ ఇచ్చి , మా ఇలావేల్పువు అయితివి..
మా ఇంట్లో అన్నీ అయితివి..
అలాంటి నిన్ను గుర్తించలేక,
విలువ తెలియక స్వార్ధ బుద్దితో,
విపరీతబుద్దితో ..
వికటాట్టహాసముతో , వికృత చేష్టలతో..
మాదారికి.. రహదారికి అడ్డు అనే నెపంతో ..
నిన్ను ఖండ, ఖండాలుగా తెంపబడితిమే...
నీడ లేక, గూడులేక, తిండి లేక...
తిరుగాడుతున్న మాకు అప్పటికర్ధమయ్యెను .. నీ విలువ..
నేను రాస్తున్న నా ఈ కలం లోని సిరావి కూడా నువ్వేనని...

నాశనం చెయ్యాలనుకునే వారు ఎలానో నాశనం చేస్తారు.. ఎవరి మాట వినరు... కాని ఒకదాన్ని మనం నాశనం చేసేముందు అలాంటిదాన్నే మరొకటి వేరే చోట ప్రతిష్టించమని చిన్న అబ్యర్ధన...

అభివృద్ధి అంటే ఆనందం లా ఉండాలే కాని మనల్నే పాతాళం లోకి పంపేదిగా వుండకూడదు అని కోరుకుంటూ ..

స్వస్తి.. __/\__

Bobby Nani

Friday, August 19, 2016

అందని ద్రాక్షలు, అతి సామాన్యుల బ్రతుకులు..



ఈ కవిత రాయడానికి ఒక కారణం వుంది... ఉదయాన “డెక్కన్ క్రోనికల్ పేపర్” చూడగానే చాలా బాదేసింది.. సాక్షి మాలిక్ యెంతో కష్టపడి ఒక bronze మెడల్ మనకు సంపాదించి పెడితే .. మెయిన్ పేజి లో కుడిపక్కన ఒక ఫోటో వేసున్నారు.. త్రిష రజనితో నటిస్తుందంట అదేమో పేజి కి 60 శాతం పెద్ద ఫోటో తో వేసారు.. 
ఏది ముఖ్యం ?? 
ఏది స్ఫూర్తి దాయకం ?? 
ఇదేనా మన దేశం పై మనకున్న విలువలు.. 
దయచేసి మీరు ఇక దేశభక్తి అని మాత్రం అనకండి నాకు చాలా హాస్యాస్పదంగా వుంది.. 
ఎక్కడ చూసినా ధనమే రాజ్యమేలుతోంది.. ఈ మధ్య మన కోర్ట్ కూడా తీర్పు ఇచ్చింది.. రాజకీయ నాయకులు ఒలంపిక్ సెలెక్షన్స్ లో వేలు పెట్టేందుకు లేదు అని.. ఎవరండి ఇండియా సాధించలేదు అని చెప్పేది.. ఈ రాజకీయ నాయకుల రాక్షస కుట్రల వల్ల పలుకుబడి వలలో ఎందరో సమర్ధవంతులు ఇంటిదారి పడుతున్నారు.. అసమర్ధులు ఆబాసుపాలు అవుతున్నారు.. మన గౌరవాన్ని అక్కడే వదిలి వస్తున్నారు... రికమండేషన్స్ పక్కన పెట్టి సమర్ధులను ఒక్కసారి వదిలి చుడండి ఇండియా కి ఎన్ని పతకాలు వస్తాయో తెలుస్తుంది.. అరె ఇక్కడ కూడా స్వార్ధమేనా... ఇది యావత్తు 1.21 బిలియన్ల భారతీయుల గుండె చప్పుడు .. అర్ధం అవుతోందా మీకు.. విసిగి వేసారిన ఈ రాజ్యాంగం మీద, ఈ రాజకీయ నేతల మీద రక్తం మరిగే ఓ యువకుని ఆక్రోశాస్త్రాలు ... 


అందని ద్రాక్షలు, అతి సామాన్యుల బ్రతుకులు.. 
**********************************


ఇజాల ముసుగులో నిజాలను కబలిస్తున్నారు.. 
శాసనాల పేరుతో సామర్ధ్యాన్ని చంపేస్తున్నారు.. 
ఆసనాల తోడుతో హక్కుల్ని అణిచి వేస్తున్నారు.. 
చట్టాలను, తమ చుట్టాలుగా మారుస్తూ, 
సంపదలను, సరదాలుగా దోస్తున్నారు.. 
ఉపన్యాసాలతో ఊరిస్తూ, ఉపవాసాలను పోషిస్తున్నారు .. 
ఉద్యమాల ఊపిరినొక్కేస్తూ ..
ఉద్యమకారులను ఉరికంబం ఎక్కిస్తున్నారు..
తూటాలను వాటాలుగా పంచుకుంటున్నారు.. 
ప్రాణాలను మాలలుగా మార్చివేస్తున్నారు.. 
రాజ్య హింసకు ఎదురులేదు, రక్తతర్పణానికి విలువలేదు.. 
సామాజిక న్యాయం కానరాదు, సామ్యవాదం రాదు, ఎన్నటికీ రాదు.. 
వున్నవాడు, ఉన్నవాడికే తోడు, పేదవాడికి దరిద్రుడే దేవుడు.. 
మానవతకు విలువలేదు, మంచితనానికి స్థానం లేదు ..
దగాకోరుల రాక్షస రాజ్యంలో, దారిద్ర నారాయణులే దానకర్ణులు...
ఆకలి చావుల రేవులో, సంపన్నుల సందేశాల చిందులు.. 
అన్నీ రంగాలలో రంకుల రాట్నాలే .. 
రాజకీయానికి రాచ బాటలు.. 
నందనవనం లాంటి సుందర భారతంలో 
అందని ద్రాక్షలు, అతి సామాన్యుల బ్రతుకులు.. 

Bobby Nani

Thursday, August 18, 2016

వృద్దాప్యదశ ...



ఈ వృద్దాప్యదశ అనేది మానవుని జీవితంలో అత్యంత దుర్భరమైన సమయం.. ఆ సమయంలో వారు అనుభవించిన, గడచిపోయిన జ్ఞాపకాలు నెమరు వేసుకొనుటకు అదొక అందమైన, ఆనంద సమయం.. అలాంటి అందమైన సమయాన్ని కొందరు వృద్దులు చాల దయనీయముగా బ్రతుకువెలిబుచ్చుతూ వున్నారు.. వృద్దాప్యం లో కన్న వారిని పక్కన పెట్టుకొని చూడలేని ప్రతీ ఒక్కరికీ ఇది చేరువ కావాలనే రాసాను.. ఈ వృద్దాప్యం ఈ రోజు వారిది కాని రేపు మనది అవుతుందన్న విషయాన్ని గుర్తెరిగి వున్నంతలో మంచిని పంచమని గుర్తు చేస్తూవున్నాను... నేటి మంచి రేపటి నీ మధుర జ్ఞాపిక అవ్వాలనే చిరు సంకల్పంతో ఈ చిరుకవిత.. 


వృద్దాప్యదశ ... 


దుర్భరమే, దుర్భరమే 
వృద్దాప్యదశ ఎవరికైనా దుర్భరమే.. 
ప్రతీ మనిషికి వృద్దాప్యదశ దుర్భరమే.. 
కంటిచూపు కరువగును
దృశ్యమేది కానరాకుండెను .. 
ముందేమిటో, వెనుకేమిటో, 
ఇరుప్రక్కల వుందేమిటో
తెలుసుకొనుట క్లిష్టమై
మనసుకెంతో కష్టమగును ..

మంచి మాట వినరాదు
చెడ్డ మాట వినరాదు 
ఎవరి ఏడ్పు వినరాదు 
తన ఎడ్పే తనకు కూడా 
వినరాదు వినరాదు 
తోలుముడుత పడిపోవును 
పళ్ళు రాలి పడిపోవును 
చేతులలో శక్తి లేక 
శక్తి హీనులయ్యేను.. 

చిన్న పని చెయ్యలేక 
అడుగు తీసి అడుగు కూడ
వెయ్యలేక వెయ్యలేక 
చితికిలబడు బ్రతుకు బరువు..
షడ్రుచులను తినాలనే 
కోర్కె మిగిలివుంటుంది.. 
తిన్న నాల్గు ముద్దలేమో 
అరగకుండ వుంటుంది..
రోగాలతో, నొప్పులతో 
బ్రతుకు భారమౌతుంది.. 

నాలుక ఆడలేక 
పెదవులు కదలలేక 
ఆలోచన సాగలేక 
మాటలేమో తడబడును, తడబడును.. 
మనసునిండా పెను వేదన.. 
నిండు కొనెను, నిలుచుకొనెను ..
నడుము వంగిపోతుంది
నడక ఆగిపోతుంది.. 
మనసు కృంగిపోతుంది 
తనువులో అణువణువునా 
శక్తి కృంగిపోతుంది.. 

సుతులు సుతలు హితము కోరి 
ఆత్మీయత పంచిననూ,
దగ్గరుండి క్షణం క్షణం 
సేవలెన్ని చేసిననూ 
మృత్యువును ఎదుర్కొను 
శక్తి వారు పంచలేరుగా ... 


Bobby Nani

Tuesday, August 16, 2016

ఓ స్వరూపిణి ...




ఓ స్వరూపిణి ...

పలికావు ఒక రాగమై... పాడావు ఒక గేయమై..
నీ రచనామృత దివ్య సుందర “మేను” వీక్షణమునకై ..
నాలోన నిండి పొంగిన వలపులు
నవభావ శిఖరాలపై నుండి పొరలి..
ఏ చిత్రమూ లేకుండా గీచితి నా
స్వరూపిణి మధురమైన
రూపమును మనసులోన ఆశ్చర్యముగా.. !!!
ఆమె కాలి అందియలు ఘ్రల్లు ఘ్రల్లుమని మ్రోగి నా
యెదలో వినిపించెను ...
నా మేను పులకించెను ...
గంగానది తరగలలో కనిపించు స్వచ్ఛత.. నా
చెలి కనుదమ్ములలో చూచి ఉప్పొంగితిని ..
పొంగి పొరలు గోదావరి కెరటాల మధుర తాకిడితో..
పొంగిన నా నెచ్చెలి ఎద పులకించగ చూచితిని.. !!
నీలి కురులు పాయలుగా విడదీసి జడను అల్లుచూ..
నవ్వులతో మల్లెపూలు సవరించుచూ...
పరువులెత్తు కృష్ణవేణిని పోలిన నా స్వరూపిణి
కడగంటి చూపులను కని మురిసి ముగ్దుడనైపోతిని.. !!
కరమున నొక మధు కలశము నిడికొని..
ఉరమున నీ విటు లొదిగి వుండగా ..
ఆకాశమందున నెలరేడు
మన కౌగిలిలోని సౌందర్యమును చూడలేక..
మబ్బుల లోపల పొంచి చూచి
సిగ్గున తలవంచగా..
తారాపథమును చేరగ నీ గళమును
వినుట, కనుట సాధ్యమా సఖీ..
ఆ కనులు కలువలా, అరవిందాలా ..!!
నీ నవ్వులు మల్లికలా, సన్నజాజులా ..!!
నీకు సరిసాటి రాదు ఆమరుని వధూటి యైన
నీ రూపమే ...
నాలో లోన వెలుగు నిరంతర అమర దీపమై.. !!


Bobby Nani

Saturday, August 13, 2016

అభిసారిక...



ఓ అందమైన కోమలాంగి నాట్య భంగిమతో తన నటనా స్వరూపాన్ని ప్రదర్శిస్తూ .. తన లే లేత పాదాల చక్కిలి గింతలకు ఆ పుడమితల్లి సైతం పరువసించగా.. ఎదుట కూర్చున్న మగసిరి దీక్షగా ఒక్కదాని మీద దృష్టి నిలుపుట సాధ్యమా.. ఆ మగసిరికి ఎన్ని ఇబ్బందులో కదా.. రెప్పవెయ్యనంత దీక్షనగా ఆమెను చూస్తూ ఉండిపోయాడు.. వనములోవున్న మయూరి వేకువన పురివిప్పి నాట్యమాడినట్లు అతను భావిస్తాడు.. అలాంటి సమయంలో హృదయంలో పరువల్లు తొక్కే అనేకానేక అక్షరాలను ఏరుకొచ్చి ఇలా మీ ముందుకు తెచ్చాను.. 

అభిసారిక...

నటన మాడవే.. నాట్య మయూరి.. !!!
నేత్రమునకు అటు, ఇటూ కదిలియాడ ..
చిరు పాదాలు ఘ్రల్లు ఘ్రల్లుమని చిందులాడ..
వంపుల మెడ సొంపులొలకంగా
ఇంపుగ గళ మెత్తి పాడి ..
నటన మాడవే.. ఓ నాట్య మయూరి.. !!!
పిల్లనైన చల్లని తడిగాలి..
మెల్లగ మెల్లగ నిను తాకేనుగా..
రెక్కల సందున నేదో..
చక్కిలి గింతాయెనుగా ..
ఆకాశపుటంచు దాటి.
పై పైకి ప్రాకివచ్చు
నీలిమబ్బు దుప్పటాన ..
తేలియాడు కలలలోన..
ఉరుముల సడి. మెరుపుల వడి..
చినుకుల జడి తాళమైన శుభవేలలో..
సరస నీ సఖుడు పురివిడి...
వన్నెల కన్నుల చూడగ
నటన మాడవే ఓ నాట్య మయూరి..
నా హృదయాంతరాల లో అభిసారికవై .. !!


Bobby Nani

Thursday, August 11, 2016

ఎక్కడున్నది మన స్వాతంత్ర్యం .. ??




ఎందరో అమరవీరుల త్యాగఫలమును మనం ప్రస్తుతం భుజిస్తున్నాము, అనుభవిస్తున్నాము... 
వారు లేకుంటే మనం లేము.. కాని ఎన్నో మరణ, భాద, దుఃఖ,కన్నటి కష్ట ములను అనుభవించి వచ్చిన మన స్వాతంత్ర్యం ఇప్పటికి షుమారు 69 ఏళ్ళ సుధీర్గ పాలనలో.. నిజంగా ఆ అమరవీరుల పోరాటప్రతిమలకు మనం తగినట్లుగా వ్యవహరిస్తున్నామా.. ?? బ్రతుకుతున్నామా ?? అనే ప్రశ్నను మనంవేసుకుంటే వాటిల్లోనుంచి ఎన్నో వేల ప్రశ్నలు ముందుకు వస్తాయి.. 

పైకి లేకపోయినా ప్రతీ భారతీయుని గుండె చప్పుడు చేసే శబ్దం ఒక్కటే.. నిజమైన స్వాతంత్ర్యం అంటే ఇదేనా ?? అని.. అలాంటి ఆవేదనాభరిత హృదయ వేదనను రెండుముక్కల్లో రాయసంకల్పించి రాసాను.. తప్పుగా అనుకోవద్దని మనవి.. 

ఎక్కడున్నది మన స్వాతంత్ర్యం .. ??

ఏది ?? ఎక్కడున్నది ?? మన స్వాతంత్ర్యం ..
ఎందరెందరో మహానుభావులు 
చేశారందరూ స్వాతంత్ర్య పోరాటం.. 
గెలిచారు కొందరు – సత్యాగ్రహ సమరంలో.. 
తెచ్చారిదిగో మనకు స్వాతంత్ర్య పీఠం..
మాటలలో వచ్చింది.. కోటపై ఎగిరింది.. 
చదువురాని బాబులకు పదవులెన్నో తెచ్చింది.. 

కాని..

కూలి చేయు కన్నెపిల్ల కట్టుకోను గుడ్డలేక, 
అతుకు బొతుకు బొంతలాగ .. బ్రతుకులాగుటేందుకని .. 
ఏది ?? ఎక్కడున్నది ?? మన స్వాతంత్ర్యం ..

తిన్నవాడికే తిండి.. ఉన్నవాడికే కలిమి... 
అసలు లేని వాడి గతి .. ఎసరుపెట్టకుండ లేదు. 
ఎంగిలాకులేరుకొని ... ఎంచి, ఎంచి పంచుకొనే, 
దిక్కులేని ప్రజలకు ... డొక్క నిండదెందుకని ?? 
ఏది ?? ఎక్కడున్నది ?? మన స్వాతంత్ర్యం ..

స్వాతంత్ర్యం వచ్చింది.. శాన్నాల్లయింది .. 
ఏదీ ఎవరొచ్చినా ... వెలగబెట్టిందేముంది.. 
బడుగుజీవులందరికీ .. గతుకుచున్న బ్రతుకు లేక.. 
స్వాతంత్ర్యపు సారమిదా ?? సమభావన తేట ఇదా.. ?? 
ఏది ?? ఎక్కడున్నది ?? మన స్వాతంత్ర్యం ..

స్వస్తి.. ___/\___

Bobby Nani

Wednesday, August 10, 2016

యాంత్రిక జీవనం..



మానవ జీవితం, నైతిక విలువలు, ఆప్యాయతలు, అనురాగాలు, ఆఖరికి ప్రేమలు కూడా అన్నీ యాంత్రికంగా మారిన నేటికాలంలో ఓ కనువిప్పు కోసం మేల్కొలిపే చిరు సంకల్పంతో ఈ కవిత..

యాంత్రిక జీవనం..

ఈ రోజు కూడా.... ఆడయంత్రం కళ్ళు నలుపుకుంటూ లేచింది..
ఈ రోజు కూడా.... వాకిలి తుడిచి అంట్లు తోమి స్నానం చేసి
ఈ రోజు కూడా.... వంట మనిషి వేషం వేసింది..
ఈ రోజు కూడా.... మగయంత్రం బద్దకంగా మంచం దిగాడు..
ఈ రోజు కూడా.... పంపునీళ్ళు పట్టి గడ్డం గీసి స్కూటర్ తుడిచి
ఈ రోజు కూడా.... పగటి వేషం వేసాడు..
ఈ రోజు కూడా.... అమ్మ అరుపులకు, నాన్న కేకలకు
ఈ రోజు కూడా.... పిల్ల యంత్రాలు రెండూ లేవలేక లేచాయి..
ఈ రోజు కూడా.... కొట్టుకుంటూ, తిట్టుకుంటూ అల్లరి చేస్తూ
ఈ రోజు కూడా.... యూనిఫాం లోకి ప్రవేశించి కాన్వెంటు బస్సు ఎక్కాయి..
ఈ రోజు కూడా.... టిఫిన్ బాక్స్ సర్దుకొని హడావిడిగా ఆడయంత్రం సిటీ బస్సు ఎక్కింది..
ఈ రోజు కూడా.... ఇంటికి తాళం వేసి మగ యంత్రం స్కూటర్ స్టార్ట్ చేసాడు...
ఈ రోజు కూడా.... సాయంత్రం పిల్ల యంత్రాలు రెండూ బస్సు దిగాయి...
ఈ రోజు కూడా.... మూసిన తలుపులు వారిని వెక్కిరించాయి..
ఈ రోజు కూడా.... కాసేపు ఆడుకొని, కాసేపు తిట్టుకొని, కాసేపు కొట్టుకొని, అరుగెక్కి అలసిపోయాయి..
ఈ రోజు కూడా.... ఉస్సూరుమంటూ ఆడయంత్రం సిటి బస్సు దిగింది..
ఈ రోజు కూడా.... ఇంటికి తాళం తీస్తూ పిల్ల యంత్రాల మీద సాధింపు స్వేదం చిమ్మింది..
ఈ రోజు కూడా.... మగయంత్రం విసుక్కుంటూ స్కూటర్ దిగాడు..
ఈ రోజు కూడా.... ఆఫీస్ నుంచి చిరాకు ఫైల్ తెచ్చి ఇంట్లో తెరిచాడు...
ఈ రోజు కూడా.... నాలుగు రకాల టీవి ఛానళ్ళునూ, నాలుగు యంత్రాలు కళ్ళనిండా తాగాయి..
ఈ రోజు కూడా.... పెద్ద యంత్రాలు రెండూ కంచాల ముందు కూర్చున్నాయి..
ఈ రోజు కూడా.... తమ తమ బాసు యంత్రాని కాసేపు, తమతమ తోటి యంత్రాల్ని కాసేపు విమర్శించుకొన్నాయి ..
ఈ రోజు కూడా.... రెప్పలు వాలిపోతుండగా.. నాలుగు యంత్రాలు నిద్ర మంచాలెక్కాయి..
వాళ్ళ మధ్య మాటలు రాలవు... రాలినా,
యంత్రాలు కదులుతున్న చప్పుళ్ళే వినిపిస్తాయి..
వాళ్ళ మధ్య ప్రేమలు కురవవు ... కురిసినా,
యంత్రాలు రాసుకుంటున్న శబ్దాలే వినిపిస్తాయి..
ఇప్పుడు మనిషి యంత్రం – ఇల్లు యంత్రాంగం
ఎలా నవ్వాలో, ఎలా నడవాలో ఎలా మాట్లాడాలో ఆఖరికి ఎలా సంసారం చెయ్యాలో కూడా రేపట్నుంచి కంప్యూటర్లు నేర్పుతాయి..

స్వస్తి... ___/\___

Bobby Nani

Tuesday, August 9, 2016

కలుషితం x విషపూరితం = ఆఖరి గడియలు..



కుళాయి తిప్పగానే చటుక్కున నీరు రావడం మనకు సాధారణమైన విషయం.. ఒకవేళ కొళాయి లేకపోతే నూతినుంచో, కాలువ నుంచో లేక నదులనుంచో మనం నీరుని తెచ్చుకుంటాం.. సర్వ సాధారణమైనటువంటి ఈ నీరు “అమూల్యమైనది” అంటే మనకు వింతగాను, విడ్డూరంగాను ఉండొచ్చు.. కాని ఇది యదార్ధం.. 

నీరు చరిత్ర గతినే మార్చివేసింది.. నాగరికతలన్నీ నదులఒడ్డునే విలసిల్లాయి.. సింధునది ఒడ్డున విరాజిల్లిన నాగరికతనే మనం సింధు నాగరికత అంటున్నాం.. పంపానది ఒడ్డున (హంపి) విజయనగర సామ్రాజ్యం వెలిస్తే, పెన్నా గట్టున, కృష్ణవేణి తీరాన, గోదావరి ఆనుకొని రాజధానులే వెలిసాయి.. రాజ్యాలు స్థాపించబడ్డాయి... ప్రాచీన మొసపటేమియా (ఇప్పటి ఇరాక్) లో టైగ్రిస్, యూ ప్రేట్ నదుల జీవ జలాలకోసం యుద్దాలే జరిగివున్నాయి.. అంతెందుకు మొన్నటివరకు బంగ్లాదేశ్ కు పరిష్కారం కాని సమస్యల్లో గంగానది జలాల పంపిణి ఒకటి ... 

మరి ఇంతటి ప్రాముఖ్యత కలిగిన నీటికి మనం తగినంత ప్రాధాన్యత ఇస్తున్నామా.. ?? 
ప్రాధాన్యత ఇవ్వకపోగా.. పనికిమాలిన వస్తువులన్నిటినీ ప్రవాహాల్లోకి పారేసి పరిశుభ్రమైన జలాల్ని కలుషితం చేస్తున్నాం.. 

పరిశ్రమలు భాద్యతారహితంగా విసర్జించే రసాయనాలవల్ల మన నదులూ, సరస్సులు, చెరువులూ (కొన్ని చోట్ల బావులు కూడా) ఎలాంటి దురవస్థకు లోనవుతున్నాయో చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు వున్నాయి.. 

అంతెందుకు గంగానది ఒడ్డున, కాశి సమీపంలో ఒక నూనె శుద్ది కర్మాగారం వుంది.. అది శుద్ది చేయగా మిలిన వ్యర్ధ నూనె పదార్ధాన్ని గంగానదిలోకి వదిలేస్తున్నారు.. ఒకసారి ఆ నూనె అంటుకొని నీటిపై భగ్గున మంటలు కూడా లేచాయి.. (కాలుష్యాన్ని సహించలేక గంగా భవాని మండి పడుతోందని కొందరు చమత్కరించారు కూడా) ఇది కాక రోజులు పదివేల లీటర్ల మరుగుదొడ్ల నుంచి వచ్చే మరుగునీటిని ఈ నదిలోకే వదిలేస్తున్నారు.. మనకు పరమ పవిత్రమై పూజలు అందుకుంటున్న గంగమ్మ కే ఈ దౌర్భాగ్యం తప్పనప్పుడు మామూలు నదుల సంగతి వర్ణనాతీతం .. 

నదులలో, సరస్సులలో తళ తళ మెరిసే అందాల, వినీల, నిర్మల, జలరాసుల్ని ఏర్పరచడానికి ప్రకృతికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది.. సంకుచిత దృష్టితో, స్వార్ధంతో, మదంతో, అహంతో, వివేక సూన్యంతో, భవిష్యత్తు గురించి ఆలోచనా రాహిత్యంతో మనం ఈ జల సంపదను కలుషితం చేస్తున్నాం.. ప్రపంచాన్నే విషపూరితం చేస్తున్నాం.. 

మన ఇంట్లో వాడే వ్యర్ధాల దగ్గరనుంచి భారీ పరిశ్రమల వేల లీటర్ల నీరు వరకు అన్నీ కలుషితాలే .. అవన్నీ ఎలానో మార్చలేము.. మన చేతుల్లో వున్న నీటిని వృధా చెయ్యకుండా.. కలుషితం చెయ్యకుండా.. జనజీవనాన్ని కాపాడుకుందాం.. 

స్వస్తి.. __/\__


Bobby Nani

Monday, August 8, 2016

జీవితం ...


జీవితం
జనన మరణాల మధ్య
కాలం వ్రేలాడగట్టిన
ఓ కాంతి రేఖ..

జననం ఒక మరణం లేని ప్రశ్న..
మరణం ఒక జననం లేని ప్రశ్న..
సమాధానం లేని రెండు
సంపూర్ణ ప్రశ్నలకు
సమాధానం చెప్పడానికి
సందేహాల బోనులో నిలబడ్డ
సాక్షిలాంటిది ఈ జీవితం..

అబద్దం చెప్పదు ..
సత్యం తెలియదు..
ఎన్ని జీవితాలు..
ఎన్నెన్ని జీవితాలు !!
ఎన్నెన్ని సాక్ష్యాలు.. !!

కళ్ళులేని కాలం
చెవులు లేని కలంతో..
నోరులేని కాగితాల మీద
కన్నీటి అక్షరాలతో
అన్నీ వ్రాసుకుంటున్నది

అయినా తీర్పు లేదు..
అభియోగంలో మార్పు లేదు..

జనానికి మరణం శిక్ష..
మరణానికి జననం శిక్ష..
ఉభయ శిక్షలను తానే అనుభవించే
న్యాయం లేని జీవితం మనది..
నిబద్దత లేని చట్టాలు మనవి..
నీతి లేని రాజకీయం మనది..
ఎంతైనా స్వార్ధపూరిత మనుషులం కదా...


Bobby Nani

Sunday, August 7, 2016

నా నేస్తాలకు.. హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే..!!

ఓయ్ నేస్తమా!
నీకు ముందుగా స్నేహితుల రోజు శుభాకాంక్షలు!! నీకే చెప్తోంది.. ఓయ్ నిన్నే వినపడుతోందా.. 

ఆడు.. పాడు.. అందరితో ఆనందాన్ని పంచుకో.. మనదైన ఈ రోజు..!!! పసందైన మనరోజు.. 

స్నేహితులరోజు అనేది స్నేహితులు అందరూ కలిసి పండగ చేసేది కాదు... వాళ్ళు అందరూ కలిసి మరొకరి పేద ఇళ్ళల్లో పండగ జరిగేలా చూడాలనేది నా అభిప్రాయం ... ఎంతమంది ఏకీభవిస్తారో నాకు తెలియదు .. 

ఈరోజు సభాముఖంగా ఒక విషయాన్ని తెలియజేయాలని ఉద్దేశించి తెల్పుతున్నాను ... 

ఈ రోజుకోసం షుమారు 9 నెలల నుండి నిరీక్షణ. కాని ప్రయోజనం లేకుండా పోయింది... అసలు ఈ నిరీక్షణ ఎందుకు ? అని మీరడగవచ్చు .. నేను కొందరు మిత్రులను ఎన్నుకున్నాను. వాళ్ళు నాలాంటి ఆశయసాధన, ఆలోచన, ఆవేదన చెందుతున్న వారు అలాంటివారిని నేను ఎన్నుకొని రేపు సంవత్సరం రాబోయే స్నేహితులరోజుకు మనం ఒక ఈవెంట్ ప్లాన్ చేద్దాం .. మన స్నేహానికి గుర్తుగా ఆ రోజు అందరం కలిసి ఒక అనాధ శరణాలయం కి వెళ్లి అక్కడ వాళ్ళకు ఏం అవసరమో తెలుసుకొని అవన్నీ అందరికి సమకూర్చి సంధ్యాస్తమం వరకు అక్కడే వుండి వాళ్ళకు ధైర్యం చెప్పి, వాళ్ళలో అజ్ఞానంధకారపు చీకటి ఆలోచనలను తొలగించి వాళ్ళకు నూతను ఉచ్చాహాన్ని కలిగించి రావాలని అనుకున్నాం .. అలా ప్రతీ సంవత్సరం ఇంకొందరిని కలుపుకుంటూ వెళ్ళాలని ఒక చిన్న ఆశతో కూడిన కలని కన్నాను ... కాని కొందరికి సమయం లేకపోవడం వల్ల, మరికొందరికి ఉద్యోగపరమైన ఇబ్బందులవల్ల, మరికొందరికి కుటుంబ పరిస్థితుల రీత్యా విధికి తలవంచాల్సి వచ్చింది ... ఇది చాలా బాధాకరం .. కాని మాకు ఈ రోజు వెనకడుగు పడి ఉండొచ్చు రేపనే రోజు మాత్రం మేము వెళ్లి తీరుతాం అని ముక్తఖంటంతో సభా ముఖంగా తెలియ జేస్తున్నాను .. ఈ విషయాన్ని చాలా రహస్యంగా వుంచి వెళ్లి వచ్చినతరువాత దాని గురించి పోస్ట్ చెయ్యాలని అనుకున్నాను .. (ఇక్కడ గోప్పలకోసం పోస్ట్ పెట్టాలని అనుకోలేదండి అది చూసి మరికొందరు ముందుకు వేల్తారనే చిన్న నమ్మకం .. ) ఈ రకంగా పోస్ట్ చెయ్యాల్సి వస్తుందని అనుకోలేదు ... ఇప్పటికైనా నా మిత్రులు ఈ పోస్ట్ చూసి ముందుకు వస్తారని అనుకుంటూ వున్నాను .. సమస్యలు అందరికి వుంటాయి కాని మనకన్నా ఘోరమైన సమస్యలతో భాదపడే వారు ఎందరో వున్నారు అని మనం మరవకూడదు.. మన సమస్యలను మనం ఎలాగో అధిగమించే శక్తి సామర్ధ్యాలు మనకు వున్నాయి. ఎదుటివారి కన్నీటి బిందువును తుడిచే వారు చాలా అరుదుగా వుంటారు .. అది మీరే అని నా నమ్మకం ... 

క్షణాలు గడచిపోతున్నా.. ఏళ్లు దొర్లిపోతున్నా స్నేహం మాత్రం చెదిరిపోదు! 
స్నేహంలో ఆడ-మగ తేడాలుంటాయా? చిన్నా-పెద్దా వ్యత్యాసాలుంటాయా? అవసరాలుఫ్రెండ్‌షిప్‌ను చేస్తాయా? స్నేహం ఎలా పుడుతుంది? స్నేహానికి చిరునామాగా నిలిచేదెవరు? వాట్ ఈజ్ ఫ్రెండ్‌షిప్? 

అన్నీ బంధాలకు అతీతంగా ఉండేది స్నేహం. కుచేలుడిచ్చిన పిడికెడు అటుకులకు కృష్ణుడు బంగారు పట్టణాన్నే బహుకరించి స్నేహం విలువను ఈ లోకానికి తెలియచేశాడు. 

మహాభారతంలో దుర్యోధనుడు, కర్ణుడి మధ్య స్నేహం వెలకట్టలేనిది. స్నేహితుని కోసం ప్రాణాలనే పణంగా పెట్టిన కర్ణుడు చరిత్రలో నిలిచిపోయాడు. ఇలా యుగాలను దాటి.. ఒరే.. వీడు సెల్ఫిష్‌రా.. వదిలెయ్.. అంటే పోనీలేరా.. ఫ్రెండ్ కదరా.. అని టైసన్ చెప్పిన డైలాగ్ గుర్తుందా? ఇక్కడ స్నేహితుడిలో లోపాలున్నా వాటికి అతీతంగా స్నేహం ఉండాలని అంతర్లీనంగా చెబుతుందీ సినిమాలోని సన్నివేశం.

-అమెరికా ప్రభుత్వం 1935 ఆగస్టు మొదటి శనివారం ఓ వ్యక్తిని చంపింది. అతని మరణవార్త విని ఆ మరుసటి రోజు అతని స్నేహితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనకు స్పందించిన అమెరికా ప్రభుత్వం వీరి స్నేహానికి గుర్తుగా అప్పటి నుంచి ఏటా ఆగస్టు మొదటి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవంగా ప్రకటించారట.
-చాలా దేశాలు జూలై 20ని స్నేహితుల దినోత్సవంగా జరుపుకొంటాయి. 
-ఆగస్టు మూడోవారం మహిళా స్నేహ దినోత్సవంగా కొన్ని దేశాలు జరుపుతాయి. భారతదేశంలో మాత్రం సెప్టెంబర్ 3వ ఆదివారం జరుపుతారు. 
-ఫిబ్రవరి నెలను అంతర్జాతీయ స్నేహమాసంగా ప్రకటించారు. 
-పాత, కొత్త స్నేహితుల వారంగా మే మూడోవారంగా నిర్ణయించారు.

తద్వారా అమెరికా కోసం కాకపోయినా అక్కడ ఒక స్నేహితుడికోసం మరణించిన మరో స్నేహితుడి వీర మరణానికి గుర్తుగా మనం అందరం ఇక్కడ స్నేహానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఇలా ఈ రోజు స్నేహుతుల రోజు జరుపుకుందాం .... మిత్రులందరికీ హృదయపూర్వక స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు..

మరొక్కసారి నా నేస్తాలకు.. హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే..!!


స్వస్తి.. ___/\___
Bobby Nani

Saturday, August 6, 2016

“భావ కవిత్వం” అంటే ...??


“భావకవిత“ అనే పదబంధం ఏ సుదినాన పుట్టిందో ! ఏ మహనీయుని ఊహనుండి జనించిందో ! ఈ విషయాలను ఇద్దమిద్దంగా చెప్పటం అసాధ్యం..

“భావ కవిత్వం” అంటే మేలురకం కవిత్వమని కొందరు, సొగసైన భావాలతో కూడుకున్న కవిత్వం అని కొందరూ, హృదయాన్ని స్పందింపజేసే కవిత్వం అని కొందరూ, శబ్దధ్వని, భావధ్వని, రసధ్వని మూడు రకాల ధ్వనులూ ప్రధానమైన కవిత్వమని కొందరు, కవి తన హృదయంతో పరిపూర్ణమైన అనుభూతిని పొందుతూ పదాలతో గీచే భావ చిత్రాలే భావ కవిత్వమని కొందరు... ఇలా తలా ఒక రకంగా మనస్సుకు తోచినట్లు, హృదయానికి నచ్చినట్లుగా వస్తు నిర్దేశం చేస్తూ నిర్వచించారు.. ఉదాహరణలూ చూపించారు..

ఈ ఉదాహరణలలో వాల్మికి అనుష్టుప్పులు, వ్యాసుని అనుష్టుప్పులు, కాళిదాసు వృత్తాలు, కవిత్రయం పద్యాలు, శ్రీనాధుని పద్యాలు, పోతన పద్యాలు, అష్ట దిగ్గజాల పద్యాలు, రాయల వారి పద్యాలు, చేమకూర వెంకటకవి పద్యాలు, మరెందరో కవుల పద్యాలు చోటుచేసుకున్నాయి.. ఇవేకాక జయదేవుని అష్ట పదులను, అన్నమయ్య పదాలలో కొన్నిటిని, త్యాగరాజ కృతులలో కొన్నింటిని, క్షేత్రయ్య పదాలలో కొన్నింటిని, భావ కవిత్వానికి ఉదాహరణలుగా వెంటనే ఎత్తి చూపించవచ్చును .. ఎందరో మహానుభావులు అందరికీ పాదాభి వందనములు..

ఇకపోతే ఈ శతాబ్దంలోని కవులలో భావకవిత వ్రాసిన వారు ఇంకనూ ఎందరో వున్నారు.. వారిలో కొందరు.. తిరుపతి వెంకట కవులు, పింగళివారు, కాటూరివారు, విశ్వనాధ సత్యనారాయణ, జంధ్యాల పాపయ్య శాస్త్రి, జాషువా, తుమ్మల సీతారామమూర్తి చౌదరి, గురజాడ అప్పారావు, నండూరి సుబ్బారావు, బసవరాజు అప్పారావు, సముద్రాల రాఘవాచారి, మల్లాది రామకృష్ణ శాస్త్రి, దేవులపల్లి కృష్ణ శాస్త్రి, ఆరుద్ర, శ్రీ శ్రీ, దాశరధి, మున్నగువారు ప్రముఖులు... ఇలా రాసుకుంటూ పోతే ఇంకా ఎందరో మహనీయులు.. వీరికి నా పాదాభివందనం.. నాకు తెలిసిన వారిని మాత్రమే ఉదహరించాను.. ఇంకెవరినన్నా ప్రముఖులను మరిచి వుంటే క్షంతవ్యుడను ...

అలాగే ఈ నాటి భావకవితా రంగంలో సుప్రసిద్దులు : నారాయణరెడ్డి, వేటూరి సుందర రామమూర్తి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఇలా ఇంకనూ ఎందరో.. ప్రముఖులు..
“ముఖే ముఖే సరస్వతీ “ అనే ఆర్య వాక్యం ఆయుదార్ధం కానే కాదు.. అది ఎళ్ళవేళలా సత్యమే... వేదాలు, శాస్త్రాలు, కళలూ అన్నీ ఆ తల్లి సరస్వతీ దేవి స్వరూపాలే .. ! అన్నీ దైవదత్తమైన వరాలే.. అన్నీ లోకంలో అన్నాన్ని సంపాదించుకోవడానికి, శాంతితో జీవించడానికి, శాంతిని నెలకొల్పడానికి, ఆనందాన్ని సమకూర్చుకోవడానికి, మనిషి మనిషిగా జీవించడానికి తోడ్పడే ముఖ్య ప్రణాలికలు..

ఏది ఏమైనా “భావకవిత“ అంటే అత్యంత ప్రాణప్రదం నాకు.. అందుకే నా కవితలలో చాలావరకు ఈ భావ కవితలే వుంటాయి..


స్వస్తి .. /\...


Bobby Nani

Thursday, August 4, 2016

అడుగంటిపోతున్నాయి మానవతా విలువలు..


గుడిలోన మూగబోయిన బొమ్మ మెడలో,
మూడు మణుల పచ్చలగల హారం.. !!
ఎండవానల బండబారిన శ్రామికుడి ఇంట్లో,
మూడుపూటల తిండిలేని బ్రతుకుభారం ....!!
గుడిలోన రాతి బొమ్మకు
తడవ తడవకు నూతన వాస్త్రాలంకర...
గుడిబయట బిచ్చగత్తే,
మాన సంరక్షణకు మూరెడు బట్ట కరువాయే.. ..!!
జగద్రక్షకుని ధర్మ హుండీకి,
సాక్షాత్ పోలీసులే రక్ష దేవాలయంలో....
రక్షణ కోరిన ఆడదాని శీలానికి,
“శ్రీ రాముడే” రక్ష పొలిసు స్టేషనులో .. !!!
అమృతం తాగిన దేవునికి
కమ్మని ఆవునేతి లడ్డూల నైవేద్యం... !!!
అంబలికి నోచని అనాధల కడుపుల్లో,
ఆకలి తిరుగలి వాయిద్యాలు....!!

పురోగమిస్తున్న నవ నాగరిక సమాజంలో..
పునర్దర్శన మిస్తున్నాయి మూఢనమ్మకాలు ..!!
అంతర్ధానమౌతున్నాయి దయాంతః కరణాలు ..
అడుగంటిపోతున్నాయి మానవతా విలువలు..

Bobby Nani

Tuesday, August 2, 2016

సర్వమూ మధురమే ..


నయనం మధురం హసితం మధురం
హృదయం మధురం గమనం మధురం
మధురాధిపతే రఖిలం మధురమ్ !!

కృష్ణునికి సంబంధించిన సర్వమూ మధురమే ..
ఆ స్వామి అధరమే కాదు,
కన్నులే కాదు,
చిరునవ్వులే కాదు,
నడకలే కాదు,
ఆయన వేణువూ,
పాదరేణువూ సహితం మధురములే ...
గోకులమూ,
బృందావనమూ,
యమునా స్రవంతీ ,
మంజుల లతా నికుంజాలూ అన్నీ మాధుర్య మయములే..
అన్నీ మాధవ మయములే .. !
అన్నీ శ్యామ సుందర దివ్య సౌందర్య తెజోవిరాజితములే !
అన్నీ నందనయన నయనార వింద సౌందర్యకందళితములే ..

Bobby Nani

వ్యంగ్యాస్త్రం ...



ఒక కవి సంధించే అనేకానేక అక్షర అస్త్రాలు సమాజ శ్రేయస్సుకోరకే వుంటాయి.. కవికి అసాధ్యం లేదు, వుండదు, సమాజం బతికినా, చెడినా కవివల్లె జరుగుతుంది.. అలా మంత్రించలేని వాడు కవి కాడు .. ఇవాల్టి భ్రష్ట సమాజానికి నీతిగల కవి కావాలి.. నీతిమార్గం చూపే కావ్యం కావాలి.. ఆ దిశగా నా ప్రయాణం సాగాలని కోరుతున్నాను.. అలాగే కవి నిర్గీవపు పువ్వును వికసింపనూ గలడు, వసంతమూ తెప్పించగలడు .. లేని అందాన్ని కూడా అపూర్వంగా మలచనూ గలడు.. తన అస్త్రాలు కర్మాగారంలో తయారయ్యినవి కావు.. స్వీయ కుటీర పరిశ్రమల్లో తయారైన నాటు అస్త్రాలు.. ఒక్కో అక్షర ప్రయోగానికి ఒక్కో పదును.. ఒక్కో ప్రయోగానికి ఒక్కో నేర్పు, ఒక్కో ఫలితం .. 

ఆవేశంతో జలపాతం లా దూకనూ గలరు, ఆగ్రహంతో కత్తిసాము చేయనూ గలరు, కసివస్తే త్రిశూలాలు గుచ్చనూ గలరు.. ఎదురుపడితే ఈటెలతో విసరనూ గలరు.. ఎగతాళిగా వెక్కిరించనూ గలరు, వ్యంగాస్త్రాలను ప్రయోగించనూ గలరు.. సభ్యతతో సమాజాన్ని నిర్మించనూ గలరు, ప్రశ్నించనూ గలరు.. 

“కవులు కావ్యాలు రాస్తారు.. 
ఉత్తములు లాలిస్తారు.. 
చెట్లు పూలనిస్తాయి.. 
గాలి గంధాన్ని మోస్తుంది”.. ఈ భావం ఒక సంస్కృత స్లోకానిది.. అంతటి గొప్ప శ్లోకాలలో సైతం కవి చోటు సంపాదించుకున్నాడు.. 

ఒక కవి అక్షరాల్ని పొదిగేటప్పుడు తనహృదయం మొత్తం కావ్యం మీద నిండిపోయి వుంటుంది.. మరే ఆలోచనా వుండదు.. కావ్య వస్తువు, కావ్య ఛందస్సు, కావ్య భాష, కావ్య నాయిక, నాయకుడు, కావ్య ధ్వని, కావ్య రసం, కావ్య హేతువు, కావ్య సందేశం ఇలా తన అధ్యయనంలో ఇన్నిటిపై దృష్టిసారిస్తూ వెళతాడు.. ఇది వయస్సుకు సంబంధం లేదు.. పదునెనిమిది యేండ్ల బాలుడు రాయవచ్చు, ఎనుబది ఎనిమిది యేండ్ల ముదుసలి రాయవచ్చు, రాతకు భావం ముఖ్యం. భాష, వయస్సు కానే కాదు... ఇదే నేను నమ్ముతాను.. 

ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే కొందరు మిత్రులు ఓ ఎనభై ఏళ్ళ బామ్మను అడిగారు మీ వయసేంది మీరు రాసేదేంది అని .. చాలా బాధనిపించింది.. ఆమె కవితలు రాయకూడదా.. ?? అంటే ఆ వయస్సులో కృష్ణా, రామా అంటూ భజన చేసుకోవాలా.. ?? ఏం వారికి ఆశలు ఉండవా.. అన్నీ అనుభవించేసారు అని మాత్రం అనకండి.. ఎందుకంటె వారు ఏమి అనుభవించి వుండరు.. బాలిక గా వున్నప్పుడు పెద్దల హద్దులకు తలవంచి, యుక్త వయస్సులో భయానికి తలవంచి, పెళ్లి అయ్యాక మొగుడికి తలవంచి, పిల్లలు వచ్చాక వారి ఆనందానికి తలవంచి, వారికి మంచి భవిష్యత్తు కోసం అహర్నిశలు వారి కోసం తలవంచి చివరికి ఇప్పటికి అన్నీ బంధాలు, భాద్యతలు తీరిపోయాక వయస్సేమో ఎనిమిది పదులు అయ్యే.. ఇక ఇక్కడ అనుభవించింది ఏంది ?? మీ ఇంట్లో వాళ్ళను మీరు ఎప్పుడైనా మీ చిన్న చిన్న కోరికలు ఏంటి అని అడిగారా ?? అడిగి చుడండి... ఎన్నో చెప్తారు.. వాటితో పాటు అవన్నిటికన్నా మిమ్మల్ని బాగా చూసుకోవడమే ముఖ్యం అని కూడా చెప్తారు.. ఇలాంటి తీరికలేని సందర్భాలలో గడిపిన ఆమెకు ఇప్పుడు కవితలు రాయాలని కోరిక కలగడం అనువంతైననూ తప్పులేదు.. 

దయచేసి అలాంటి వారిని ప్రోత్సహించండి.. లేకుంటే పక్కకుపొండి అంతే కాని ఇలా మాత్రం అవహేళన చెయ్యకండి.. అమ్మా సరస్వతీ కటాక్షం మీ మీద వుంది.. మీరు నిరభ్యంతరంగా మీ రచనలను రాయండి.. 

ఉఫ్ఫ్ ఆవేశం వచ్చేస్తుంది.. తగ్గించుకోవాలబ్బా.. 

సరే ఈ రోజు ఆగస్టు 2. స్వతంత్ర దినోత్సవం త్వరలో రాబోతుంది కదా.. దాన్ని పురస్కరించుకొని ఈ రోజుల్లోని భాద్యతారహితంగా వుండే యువతను ఉద్దేశించి ఒక వ్యంగ్యాస్త్రం అందిస్తున్నాను .. 

“భారతదేశ స్వాతంత్ర్యం 
మహాత్మాగాంధీ బోసి నవ్వులో వుంది.. 
అర్ధ దిగంబరత్వంలో వుంది...
చేతికర్రలో వుంది.. 
చిన్న పిలకలో వుంది.. 
కాని, 
ఈ కాలంనాటి 
ఏ పౌరుని మెదడులో మాత్రం లేదు.. “

అద్గదీ మాటర్ .. 


వుంటాను ... ఆయ్.. __/\__

Bobby Nani


Monday, August 1, 2016

ఆమె శిల్పమా ?? లేక ధాత సృజించిన అపరంజి బొమ్మా.... !!!

రూపవతి, గుణవతి అయిన ఓ పడుచు పిల్ల అలా కంటి ముందర నడుచుకుంటూ దేవతలా వస్తుంటే ఆ దృశ్యాన్ని చూసినప్పుడు వయస్సు లేనోడు దగ్గరనుంచి వయసయిపోయినోడు దాకా కళ్ళు విట్టార్పి చూస్తారు... అలాంటి ఓ కోమలాంగి, ఓ నాట్య మయూరిని చూసినప్పుడు ప్రతీ మగాడు ఎలా తమ తమ మనసులో ఆమెను ఆరాధిస్తారో, సృజిస్తారో, పరితపిస్తారో ఆ వర్ణనను రాయాలనిపించింది... కళ్ళు ఊరుకున్నా మనసు ఊరుకోదు కదా.. ఎంతటి వాడైనా కాంత దాసుడే కదా.. అందుకే ఓ చిరు వర్ణనాతీత మధుర గుళిక..

ఆమె శిల్పమా ?? లేక ధాత సృజించిన అపరంజి బొమ్మా.... !!!
 
మరువలేనేమో ఆ
చెలి మోహన రూప లావణ్యం ... !!
ఆ దరహాసం, ఆ విలాసం..
ఆ నవయవ్వన శోభావికాసం ..
ఆమె మోము పదియారు కళల
విలసిల్లు పున్నమి వెన్నెల రేడు..
ఆమె కన్నులే సరసు లోపల
విరసిన కల్వల రేకుల జోడు..
ఉన్నదో లేదో అనే సందేహము గల
ఆమె సన్నని నడుము.. కన్నుల
ముంగిట కానరాకుండే ..
శృంగారముతో పొంగిన ఆ లేమ
ఉరమ పైననే ... ప్రతీ మగడి చూపు నిలుచు..
అవి అధరాలా మధుర సుధలనూ
అందించు నందన వన ఫలములా ...
అవి ఆమె కడగంటి చూపులా లేక
మరుడు సంధించెడు శాత శరాలా ...
ఆమె శిల్పమా లేక ధాత సృజించిన
అపరంజి బొమ్మా ... !
సకల జగాలను మోహింప జేయగ
జాలువారిన ఒక దివ్య దీపమా..
సౌందర్య దేవత రూపమా..

Bobby Nani