Thursday, July 6, 2017

“అక్షరారణ్యము” ..



ఎన్నో వేల సంవత్సరముల క్రింద కోతి రూపంలో సృష్టించబడిన మానవుడు తన రూపానికి రంగులు దిద్దుకుంటూ క్రమేణా మనం నేడు చూస్తున్న చక్కని ఆకారాన్ని అందుకున్నాడు.. అంతేకాదు మిగతా జంతుజాలం కంటే ఎన్నో రెట్లు తన మేధాశక్తిని పెంచుకున్నాడు.. ఆకాశానికి ఎగురుతున్నాడు.. చంద్రుణ్ణి చేరుకున్నాడు.. సముద్రాలను జయిస్తున్నాడు.. ఏవేవో ఘన కార్యాలు సాధిస్తూ ఉన్నాడు .. కాని తనను తాను జయించలేక పోతున్నాడు.. కోతిలో నుండి పుట్టాననే పేరు సార్ధకం చేసుకోవడానికే కాబోలు కోతి బుద్దులు మాత్రం మానలేదు.. 

గిల్లికజ్జాలు తెచ్చుకుంటున్నాడు... ఒక సోదరుణ్ణి చూసి సకిలిస్తున్నాడు.. ఇంకొకడిని చూసి ఇకిలిస్తున్నాడు.. ఒకరిమీద రాయి విసురుతున్నాడు... మరొకడిమీద తిన్నది పారవేస్తున్నాడు .. ఒకరికొంప పీకుతున్నాడు.. ఇంకొకరి కొంపకు నిప్పంటిస్తున్నాడు .. తన తోకను ఏదో కరిచిందని ఆ బాధ నివారణకు మందు వెతుక్కునే బదులు ఇంకొకడి తోకను కొరికి వాడూ బాధపడుతూ ఉంటే చూసి ఇప్పుడు ఇద్దరం సమానంగా వున్నాం పర్వాలేదు అని ఆనందిస్తున్నాడు.. 

సోదరులారా ..!!

ఆత్మ – పరమాత్మ – పూర్వజన్మ మొదలగు వాటి గురించి చేర్చించే అంత జ్ఞానం కాని పాండిత్యం కాని నాకు లేదు.. కాని ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను.. 

ఈ సృష్టిలోని ప్రకృతి ఎన్ని యుగాలనుండో అభివృద్ధి చెందుతూ వచ్చి ఇంత చక్కని రూపాన్ని దిద్దుకున్నది.. ఈ విశాల ప్రపంచం మీద ఎన్నో కోట్ల జీవరాశి వున్నది.. కాని జంతువులకు లేని బుద్ధిబలం కలిగి మానవజాతి ఒక విశిష్టమైన స్థానము సంపాదించుకుంది.. మనమెన్ని ఖండాలుగా విభజించినా, ఎన్ని దేశాలుగా ఏర్పరుచుకున్నా.. ఎన్ని రాష్ట్రాలుగా భాగించుకున్నా, ఎన్ని తెగలుగా, ఎన్ని మతాలుగా, ఎన్ని కులాలుగా ఊహించుకున్నా.. మనమంతా ఒక్కటే.. ఒకే సృష్టిలో పుట్టిన ఒకే సృష్టికర్త బిడ్డలం.. 

అనంతమైన ఈ సృష్టిలో మానవుడు భౌతికంగా (Physically) చూస్తే ఒక చిన్న అణువు మాత్రమే ... అంతేకాదు మానవుడు నూరేళ్ళ బ్రతుకుతున్నాడని విర్రవీగే ఆ కాలమంతా ఒక క్షణంతో సమానమే.. నీవు మట్టిలోనే కలిసేది అని తెలుసు.. ఆ చావు ఏక్షణమైన రాగలదని కూడా తెలుసు.. బ్రతుకుతున్నంత కాలం యెంత విర్రవీగినా ఆ క్షణం రాగానే అంతా శూన్యం అని తెలుసు.. 

ఇన్ని తెలిసిన మానవుడు మరి ఎందుకు మూర్ఖుడైపోతున్నాడు.. ??
ఎందుకు ఈ మారణహోమం తలపెడుతున్నాడు.. ??
ఎందుకు రక్త పాతం జరుపుతున్నాడు.. ?? 
ఎందుకు ఈ ఓర్వలేని తనం ??
ఎందుకీ రసాభాసలు ?? 
ఎందుకీ అసూయాద్వేషాలు ?? 
ఎందుకీ దగుల్బాజీ వేషాలు ??
ఎందుకీ రొమ్ములు, వీపులు చరుచుకోవడాలు ?? 
ఎందుకీ నీచాతి నీచమైన పనులు.. ?? 
ఒకవైపు అంతరాత్మ మొత్తుకుంటుంటే దాన్ని ధిక్కరిస్తూ ఎందుకీ తిక్క తిక్క వేషాలు వేస్తున్నాం ?? 

మిత్రులారా...!!

బుద్ధిబలం, విచక్షణాజ్ఞానం మనలో అంతర్గతమై ఉన్నవి .. వాటిని ఉపయోగించి ప్రేమానురాగాలను పెంచుకోండి.. దీనులను రక్షించండి.. కష్టాలలో ఉన్నవారిని ఆడుకోండి.. అనాధలకు ఆశ్రయమివ్వండి .. మంచిని పెంచండి.. మమతలు నింపుకోండి కాని హాయిగా బ్రతికేవారి జీవితాలకు చిచ్చుపెట్టకండి .. 

బ్రతికేది నాలుగు రోజులే .... ఇదంతా మిధ్య.. మనం ఎన్నో పిచ్చి వేషాలు వేసి, ఎందరినో హతమార్చి (ప్రత్యక్షంగా – పరోక్షంగా) సంపాదిస్తున్న ఆస్తులు, పదవులూ అన్నీ మనందరినీ మోసం చేసి ఒక్క క్షణంలో మాయమైపోతాయి.. 

అంతేకాదు నీవు చేయదలుచుకున్నది, అనుభవించేది, సంపాదించదలుచుకున్నది, ఆనందించదలుచుకున్నది ఎదుటివారు కూడా కావాలనుకుంటాడని తెలుసుకొని ఒకరిని ఏడ్పించకుండా, నష్టపరచకుండా, వారిని గంగలో ముంచకుండా, గొంతులు కోయకుండా సంపాదించు, ఆనందించు, అనుభవించు కాని ఈ కోతి బుద్దులు మానుకో... 

బుద్ది హీనులమై మనమిలా అసహ్యకరమైన పనులెందుకు చేస్తున్నాం అనేబాధ... 
మానవజాతి ఇలా నిర్వీర్యమైపోతే ఎలా అనే నా ఆవేదన, తపనలే నేను రాస్తున్న, రాయబోతున్న కవితలకు, కావ్యాలకు కారణ, ప్రాణ భూతాలుగా మారుతున్నాయి.. నేను చూసిన, నా కంట పడిన ప్రతీ భావనననూ మొదట నేను పొంది, స్వీకరించి మీకు అందించగలుగుతున్నాను.. 

అయినా మనలో మంచితనముంది.. విచక్షణాజ్ఞానం ఉంది.. ఈ ప్రపంచం మీద ఎందరో మహానుభావులు అప్పుడప్పుడు జన్మించి మనకు చేస్తున్న హితబోధలు కొంతవరకైనా మనం పాటిస్తే మానవ జాతి మనుగడ కొనసాగగలదని తెలియజెప్పడమే నా “అక్షరారణ్యము” .. ఈ కలం పేరు “లేఖిని” ... 

Written By : Bobby Nani

No comments:

Post a Comment