Monday, July 17, 2017

తెలుగు రాష్ట్రం పై కేంద్రానికి ఎందుకీ శీతకన్నుఎప్పుడూ కవితలూ, కావ్యాలేనా అప్పుడప్పుడూ ఇలాంటి వాటిపై కూడా దృష్టి సారిద్దాం... 


తెలుగు రాష్ట్రం పై కేంద్రానికి ఎందుకీ శీతకన్ను 
********************************

దేశ భాషలలో లెస్స అనిపించుకున్న తేట తెలుగు వారి రాష్ట్రం పట్ల కేంద్రం తొంటి చెయ్యి చూపిస్తుండటంతో అన్నీ రంగాలలో అభివృద్ధి కుంటుపడుతున్నది.. 

తెలుగువారు తమ మెత్తని స్వభావాన్ని త్యజించి తమలోని చైతన్య శక్తిని వెలిదీసి తెలుగునాట మహోదయానికి కృషి చేయాలి.. 

స్వరాజ్యం వచ్చి 70 ఏళ్ళు కావస్తుంది..
ఆంధ్రరాష్ట్రం ఏర్పడి 64 ఏళ్ళు కావస్తున్నది.. 
విశాలాంద్ర జన్మించి 60 ఏళ్ళు దాటింది.. 
తెలుగు రాష్ట్రాలు రెండుగా విభజన జరిగి 2 ఏళ్ళు దాటింది.. 
అయినా మార్పు లేదు.. 


అంధ్రప్రదేశ్ సువిశాలమైన దేశం... సారవంతమైన భూమి, సమృద్దిగా వున్న నదీ జలాలు, అనేక ముడి పదార్ధాలు, ఖనిజ సంపదలు, అన్నిటికీ మించి ఆర్ద్ర హృదయం గల ప్రజలు.. ఇవన్నీ ఆంధ్ర దేశపు అదృష్టాలు..అవకాశాలు.. అవకాశాల సద్వినియోగంలోనే పురోగమనం వున్న చరిత్ర ఉంది.. 

ఇక ఉభయ రాష్ట్రాల చుట్టూ ఉత్తర, దక్షిణ ప్రాంతాల కూడలి రెండు భూభాగాలుగా ఇక్కడ కలుస్తాయి.. రెండు సంస్కృతులు ఇక్కడ సమ్మేళనమవుతాయి.. ఉభయ రాష్ట్రాలకు అంటిపెట్టుకుని వున్న రాష్ట్రాలు మరింకే రాష్ట్రానికి లేవేమో.. మద్రాసు, మైసూరు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాలు చుట్టూరా ఉన్నాయి.. తూర్పున సుధీర్గమైన సముద్ర తీరం ఉంది..

ఇకపోతే “తేట తెలుగు కమ్మదనం” 

తెలుగువారి పెద్ద అదృష్టాలలో ఒకటి వారి బాష, తియ్యగా, సరళంగా, హాయిగా ఉంటుంది తెలుగు.. సంగీత తరంగాలనే పొంగించగలదు దాని శబ్ద మాధుర్యం.... దీనికి తోడు సంగీతం, సంస్కృతం మొదలైన పరభాష మంచిని తనలో ఇముడ్చుకుని, నిండుతనాన్ని సంతరించుకున్నది మన తెలుగు బాష.. దేశంలోని అన్నీ బాషలకు అంతో ఇంతో అందుబాటులో వుండి వాటి విశిష్టతలను తనతో లగ్నం చేసుకోగలిగింది తెలుగు భాషే.. అందుకనే “దేశ భాష లందు తెలుగు లెస్స” అని ఆనాడు శ్రీకృష్ణదేవరాయలు మెచ్చుకున్నారు.. 
ఈనాడు ఎట్టి పక్షపాత బుద్దిలేని పాశ్చాత్య శాస్త్రవేత్తలు హోమ్ఫీల్డ్, మాక్లాయిడ్, డాక్టర్ కారే, డాక్టర్ కాంప్బెల్, మోరిస్, డాక్టర్ హాల్డేన్ లు మెచ్చుకున్నది.. కనుక భాషాదురభిమానం, సంస్కృతీ వైరుధ్యంతో సతమతమౌతూన్న భారతావనికి అంగరక్ష కాగల శక్తి మన తెలుగు రాష్ట్రాలకే వున్నదని చెప్పడంలో సంశయమే లేదు... 

అయితే ఇంతటి ప్రాభవం, కాగితం మీద మాత్రమే కనిపిస్తుంది.. ఊహాలోకంలో మెరుస్తుంది... ఇంతవరకు ఇది కలగానే మిగిలిపోయింది.. వాస్తవం ఇందుకు పూర్తిగా విరుద్దం.. పొరుగు రాష్ట్రాలను అభిమానిస్తూ అన్నీ రంగాలలో కేంద్రం తొంటి చెయ్యే చూపుతున్నది.. 

“ఇది ముమ్మాటికీ ఆంధ్రుల మెతకదనమే”

ఈ దురవస్థకు కారకులెవరు ?? 
ఇతరులను ఏమని ప్రయోజనం?? 
ఆందోళనలు జరిపితే తప్ప మన ఉనికిని అంగీకరించని ఈ దినాలలో ఈనాటి మనస్తత్వంతో తెలుగువారు బ్రతకడం నేర్చుకోవాలి.. తమిళనాడులో వారి భాషాభిమానాన్ని గుర్తుతెచ్చుకోవాలి.. తెలుగువారిలో వున్న లోపం కొంపమీదకు వస్తేగాని ఉత్సాహం చూపించరు .. దప్పికైతే బావి త్రవ్వుకునే మనస్తత్వం.. ఇది మారాలి.. 

ఇక సాహిత్యంలో సుగమ సాహిత్యం కావాలి.. అందుకనే తెలుగులో నవలలు, నవలికలు, కథలు పిచ్చటిల్లినయ్ .. శాస్త్ర రచన వెనకాడుతున్నది.. సంగీతంలో సుగమ సంగీతం కావాలి.. వాగ్గేయకారులు తెలుగులోనే సంగీత రచన చేసినా మన తెలుగువారికి శాస్త్రీయ సంగీతం ఎక్కువగా పనికి రాదు.. అలాగే ముడిసరుకును బయట అమ్ముకొని సొమ్ము చేసుకుంటారే కాని.. వాటితో సామాగ్రిని తయారు చెయ్యరు.. ఇవన్నీ తెలుగువారు అలవాటుపడ్డ, పడుతున్న సుగమైన మార్గాలు.. సదరు జీవితాలకు చెరగని చిహ్నాలు.. 

వారుపెట్టుకున్న కంపెనీలు, సంస్థలు ఎక్కువగా చితికిపోతుంటాయి.. అది క్రమశిక్షణ, కలసికట్టుతనం లేదనడానికి గుర్తు.. 

అభివృద్దిని సాధించాలంటే తెలుగువారు సహజంగా తమలో వున్న చైతన్య శక్తిని బయటకు పొంగించాలి.. శ్రమపడటం అలవరుచుకోవాలి.. కార్య దీక్షను పెంపొందించుకోవాలి.. 

జరిగిన చరిత్రను బట్టి పాఠాలు నేర్చుకొని ఆత్మ పరిశీలన గావించి దీక్షాకంకణులై మహోదయానికి కృషి చెయ్యాలి.. అప్పుడే స్వర్ణాంధ్రప్రదేశ్ ను చూడగలం.. 

స్వస్తి.. ___/\___

Written by ; Bobby Nani

1 comment:

 1. తెలుగువారిలో తాము తెలుగువారమన్న స్పృహకూడా ఆట్టే కనిపించని కాలం.

  తెలుగింటిబిడ్డలతో వారి తల్లిదండ్రులే, ఇంట్లో కూడా, ఎంతో ముందుచూపుతీ కేవలం ఆంగ్లంలోనే మాట్లాడుతున్న కాలం.

  తెలుగుయువతీయువకుల్లో చెప్పుకోదగ్గ శాతం మంది తెలుగులో చదవనూ వ్రాయనూ తెలియదని, అందులో కొందరైతే కించిత్తు గర్వంగానే, చెప్పుకుంటున్న కాలం.

  ఏ‌భాషైతేనేం. అది just a tool for communication అంటూ మన తెలుగు మేధావులే తెలుగు నెర్చుకోవలసిన అగత్యం ఏమీ లేదని ఈసడిస్తున్న కాలం. భాషాభిమానం అంటే వీళ్ళూ అది కేవలం దురభిమానమే అంటున్నారు. (అమ్మ కూడా ఒక ఉపకరణమేనేమో -కేవలం‌ మనకాళ్ళమీద మనం నిలబడేదాకా కాస్త ఆసరాగా ఉండటానికి. ఆ తరువాత అమ్మమీద అభిమానం అదేలెండీ‌ దురభిమానం‌ కూడదన్న మాట.) అవసరం కాని భాషను పక్కన్ పెట్టవచ్చు -అవసరం కాని అమ్మనూ‌ పక్కకు నెట్టవచ్చు ఈ సిధ్ధాంతంతో. ఇలాంటి పిదపకాలం.

  అందుచేతనే యేమో, ఇంకో ఇరవై ముఫైసంవత్సరాల్లోనే ఈ తెలుగు కాలగర్భంలో కలిసిపోతుందన్న మాట ప్రబలంగా వినిపిస్తున్న కాలం.

  అటువంటి ఈ‌కాలంలో, ఎవరో ఏదో చెయ్యటం లేదూ ఈ‌ తెలుగుకీ‌ అని ఒకరిని అనవలసిన పని ఏముందీ? ఏదైనా అని మాత్రం లాభం ఏముందీ?

  ReplyDelete