Wednesday, July 5, 2017

ఓ మనిషి !! వింటున్నావా ఓ కన్నీటి గాధ ..



దారిలో వెళ్తూ వెళ్తూ 
ఒక రోగగ్రస్తమైన కుక్కను చూసాను.. 
ఆ ముసలి కుక్క కళ్ళలో బాధ, అసహాయత, 
వెలువడుతున్నాయి.. !!
దాన్ని అలా చూసి ఊరుకోలేక, 
ఓదార్చగలనేమో అని దగ్గరకు వెళ్లాను..! 
నన్ను చూచి భయపడి లేవపోయి, 
సతికిలపడి నావంక దీనంగా నిస్సహాయతతో, 
చూచింది ఆ కుక్క..!!
ఆ చూపుల్లో మానవుడి మాట కంటే, 
స్త్రీల కన్నీటి గాథకంటే,
విదితమైన బాష ఒకటి నాకు ప్రస్పుటంగా కనిపించింది.. !!
ఓ మనిషి !!
నీ దుర్మార్గం వల్ల 
నేనిలా రోగిగా పడివున్నాను .. !!
మీరుతన్నే కాలి గాయాలనుండి, 
ఈ పాడుపడ్డ ఆలయంలో తలదాచుకున్నాను..!! 
దుమ్ము, బూడిద మనిషి హృదయంకంటే, 
సున్నితమైనవి కనుక, 
ప్రపంచంలో మీ అన్యాయపు పరిపాలన అంతం అగుగాక.. !!
అనే మాటలు దాని కళ్ళ నుంచి ఒక్కొక్కటిగా రాలుతున్నాయి..!! 
అంతటితో ఆగక మళ్ళి మొదలు పెట్టింది 
దాని ఆవేదనా అశ్రువులను ..!!
ఆనాటి నుంచి నేటివరకు, 
నమ్మక, విశ్వాసాలకు మారుపేరుగా సేవచేసాను మీకు..! 
మనిషిని కాపాడాను.. మనిషికై తపించాను, 
యజమాని రాకకై వేచి వున్నాను..! 
అతడు రాకుంటే ఏడ్చాను..! 
అయినా ఆశించలేదు పంచభక్ష్యాలు, 
వేసిన ఎంగిలి ఎముకలతోనే తృప్తిపడ్డాను..!
ముసలితనం రాగానే – ఇంటినుంచి పారద్రోలాడు మనిషి,
అల్లరి పిల్లల రాళ్ళకు గురిచేశాడు కృతజ్ఞుడు..!!
ఓ మనిషీ.. !!
మీరు మనుషులనూ కుక్కల్లాగే చూస్తారు.. 
యౌవనంలో దేశాన్ని రక్షించి 
మిమ్ము కాపాడిన సైనికులను 
వయస్సుమళ్ళగానే మట్టితో సమానంగా నెట్టివేస్తారు ...!!
ఓ మనిషీ ... !!
మీరు ఆడదాన్ని కూడా అలానే చూస్తారు..
మిసి మిసి వయస్సులో ఉన్నప్పుడు, 
ఆమె అందాలన్నిటినీ దోచుకుంటారు.. 
ఒడలు సడలగానే వద్దు పొమ్మంటారు.. 
ముద్దులకుప్ప అనుకున్న దాన్ని, 
మురికి కూపంలో తోస్తారు..!!
అంటూ వాపోయింది ఆ నోరులేని జంతువు,
మనిషి కృతజ్ఞత గూర్చి తన కళ్ళతో.. !!
అంతా అర్ధం చేసుకున్నట్లుంది, 
ఆ కుక్క మన చేతగాని హృదయాన్ని..!!

Written By : Bobby Nani
లేఖిని 05.07.2017 ✍️

No comments:

Post a Comment