Friday, February 10, 2017

SOCOTRA (The Mysterious Island) from Bobby... 12th Part

SOCOTRA

                                      -The Mysterious Island-


మునుపటి భాగాన్ని మనం ఒక్కసారి మననం చేసుకుందాం ...

ఏంటి ఆకాష్ నన్ను పిలిచావ్ అంటూ మోహన్ దగ్గరకు వస్తాడు.. 

ఇది చూసారా నిన్న మనకు ఈ మ్యాప్ ఆ సొరంగంలోని వారు ఇచ్చారు.. దీన్ని బాగా గమనించారా కనిపించీ కనిపించని ఆకారంతో ఓ గుర్తు ఇందులో దాగుంది … అదే గుర్తు (“నేత్రం నుంచి జాలువారే కన్నీరు”)ను నేను ఇందాక ఈ నౌకలోని ఓ గది తలుపుపై చూసాను.. ఆ గదిలో ఏముందో మనం తెలుసుకోవాలి.. ఖచ్చితంగా అందులో ఏదో వుంది.. అని చెప్తాడు ఆకాష్.. 
అవునా అయితే పద.. వెళ్దాం.. ఎవ్వరికీ అనుమానం రాకుండా మనం మెలగాలి గుర్తుపెట్టుకో అని అంటాడు మోహన్..

ఇద్దరూ కలిసి ఆ గది దగ్గరకు వెళ్తారు..

ఆ గదిలో ఏముందో తెలుసుకుందాం పదండి..
12th Part
కాని ఆ గదికి తాళం వేసివుంది.. ఇక్కడ ఈ గది దగ్గర మనం వుంటే చూసే వాళ్ళకు లేనిపోని అనుమానాలు వస్తాయి … తద్వారా మనం ఇక్కడ వుండటం అంత శ్రేయస్కరం కాదు.. మరెక్కడైనా ఈ గదిలోకి వెళ్ళే మార్గం ఉందేమో అని ప్రయత్నిద్దాం పదా అని మోహన్ అంటాడు.. 


ఇద్దరూ గదికి వెనుక భాగం లోకి చేరుకుంటారు .. అక్కడ పాత వస్తువులను భద్రపరిచే ప్రదేశంలా వుంది.. అక్కడ అన్నీ దుమ్ము, ధూళి తో నిండివున్నాయి .. అడుగులు వేస్తుంటేనే వారి అడుగులు అక్కడ పడుతున్నాయి.. 

ఏంటి ఇంత అందమైన నౌకలో ఇలాంటి ఒక ప్రదేశం వుంది.. అయినా ఈ ప్రదేశానికి ఎవ్వరూ వచ్చినట్లు లేరు.. అందుకే మన అడుగులు కూడా ఇంత దుమ్ములో స్పష్టంగా కనిపిస్తున్నాయి… అని అంటాడు ఆకాష్.. 

నిజమే ఆకాష్ ఎవరూ రాలేదంటే ఇక్కడ ఏదో వుందని అర్ధం అని అంటాడు మోహన్.. నాకెందుకో ఈ నౌకలో ఏదో జరుగుతోందని పిస్తుంది … 

ఎలా చెప్తున్నావ్ అని అంటాడు ఆకాష్.. 

ఇక్కడ ఉన్నవన్నీ చాలా దుమ్ముతో వున్నాయి .. చూడు ఆ ప్రదేశం లో కొంచం అంటే కొంచం కూడా దుమ్ము లేదు..అంటాడు మోహన్.. 

నిజమే .. అయినా నువ్వు అన్నింటిని ఇలా ప్రత్యేకంగా ఎలా చూడగలవు.. ఇదెలా సాధ్యం.. అని అంటాడు ఆకాష్.. 

అవన్నీ మనం తరువాత మాట్లాడుకుందాం.. ముందు గదిలో ఏముందో మనం తెలుసుకోవాలి అంటాడు మోహన్.. 

ఇద్దరూ ఆలోచిస్తూ వుండగా.. 

వెళ్ళాల్సిన గదికి షుమారు పన్నెండు అడుగుల ఎత్తులో ఒక చిన్న (గాలిని బయటకు పంపే ) ఫ్యాన్ అక్కడ తిరుగుతూ వుండటం గమనిస్తారు ఇద్దరూ… 

ఆకాష్ మనం ఎలా అయినా ఆ పైకి ఎక్కి లోపల ఏముందో చూడాలి.. అప్పుడే మనకు ఒక అవగాహన వస్తుంది అంటాడు మోహన్… 

అక్కడ ఉన్నటువంటి పాత వస్తువులలో నుంచి కొన్ని విరిగిన కుర్చీలు, స్టూల్స్ ఒకదానిపై మరొకటి పెట్టి ఆకాష్ ని ఎక్కమని చెప్తాడు మోహన్.. 

వెంటనే ఆకాష్ పైకి ఎక్కి గదిలోకి చూసే ప్రయత్నం చేస్తున్నాడు.. 

ఆ గది అంతా చీకటిగా వుంది.. సరిగా కనిపించట్లేదు… ఏవేవో కొన్ని ఆడవారికి సంబందించిన దుస్తులు, పగిలిన గాజులు, అక్కడ చెల్లా చెదురుగా పడివున్నాయి.. ఇంతలో ముందువైపున గది తలుపును ఎవరో తీస్తున్నారు… 


మోహన్ గారు… ఎవరో ఆ గదిలోకి రాబోతున్నారు మీరు అటువెల్లి చూడండి అని ఆకాష్ చెప్పగానే మోహన్ ముందువైపు తలుపు దగ్గరకు చేరుకోవడానికి అటు ప్రక్కకు వెళ్తాడు.. 

ఈలోపలే ఆ గది తలుపులు తెరుచుకుంటాయి.…

ఓ 15 ఏళ్ళ పిల్లాడు తన చేతిలో ఆహార పదార్ధాలను పట్టుకొని ఆ గదిలోకి వస్తాడు.. 
అక్కా అంటూ ఎవరినో పిలుస్తున్నాడు.. 

అప్పటిదాకా నిశ్శబ్దంగా ఉన్న ఆ గది ప్రాంగణం ఒక్కసారిగా ఆమె రోధనకు దద్దరిల్లి పోయింది.. 

ఆ రోదన ఎలా ఉందంటే … పిచ్చిపట్టిన వారు పెద్ద పెద్దగా ఎడుస్తున్నట్లు ఉంది ..ఆకాష్ కి ఏమి అర్ధం కాక అలానే చూస్తూ వున్నాడు…

ఆమె ఎవరు? 
ఇక్కడ ఆమె ఎందుకు వుంది ??
ఎందుకు అలా ఏడుస్తుంది ? 

ఇలాంటి ప్రశ్నలతో అలానే నిస్తేజంగా చూస్తున్న ఆకాష్ కి ఘల్లు, ఘల్లు మని ఆమె అందియల చప్పుడు వినిపిస్తుంది.. ఆమె ఆ గదికి కుడిచేతివైపున వుంది.. అక్కడ చాలా చీకటిగా వుంది.. అందియలు వినిపిస్తున్నాయి కాని ఆమె మోము మాత్రం కనిపించట్లేదు.. 

ఆ అందియల చప్పుడు మరింత దగ్గరగా వినిపిస్తుంది… 
ఆకాష్ తన తలను బాగా వంచి చూస్తూ… 

అయ్యో పాపం ! 

ఏ స్త్రీకి ఏ పురుషుడి వల్ల ఏ ఆపద వాటిల్లిందో.. 
అని అక్కడ కలయజూశాడు. 
అలా చూస్తుండగా ... ఆ లేలేత చీకట్లలో ప్రకాశవంతమైన ఓ కోమలాంగి పాదము కనిపిస్తుంది .. ఆ పాదమునకు అంటిన ముదురు వర్ణము గల పారాణి, ఆ పాదాలను అంటిన బంగారు వర్ణము గల కాలి అందియలు.. అవి ఆమె ఒక్కో అడుగుకీ ఘల్లు ఘల్లు మని సవ్వడిచేస్తుండగా ఇక్కడ ఆకాష్ గుండె ఝల్లు ఝల్లుమని ఎగిరెగిరి పడుతోంది.. నిజంగానే ఆమె పాదాలు విచ్చుకున్న పద్మాలవలె వున్నాయి.. మరొక్క అడుగు ముందుకు వేసింది.. ఆమె మోకాలి క్రింద భాగం స్వేతవర్ణమును పులుముకున్న శంఖం ఆకృతి లో ఉంది .. అలానే నోరు ఎల్ల బెట్టి చూస్తున్నాడు ఆకాష్.. మరో అడుగుతో ఆమెను చూడొచ్చనే ఆతురతతో ఎదురు చూస్తూ వున్నాడు.. 

అనుకున్నట్లే ఆమె ముందుకు వచ్చింది.. తలకట్టు చెదిరి ఆ కేశములు ఆమె వెన్నెలవంటి నడుము పై పడి అమావాస్య పరుచుకున్న చీకటిలా ఉండగా, కంటినీరు ధారలై ప్రవహిస్తూ, విలపిస్తూ, తుమ్మెదల బారులవంటి కంటిచూపులు భయంతో, బెరుకుతో నలుదిశలా ప్రసరిస్తుండగా మనుషుల అలికిడితో ఆ గదిలో ఈ చిన్నది, చాప కన్నులున్నది, దీనత్వము మూర్తీభవించినట్లు కనబడింది ఆకాష్ కి… భయముతో, శోకముతో, వడలిపోయి, మేనిసౌందర్యలక్ష్మి శోభ సడలిపోయి, వణుకుతూ ఆ పిల్లాడి ముందుకు వచ్చింది…. సన్నని మేలిముసుగు చాటునుండి మేలిమికాంతులు ప్రసరిస్తున్న వదనముతో, పాపిటిపై చేతులు జోడించి “దయచేసి నన్ను వదిలేయండి” అంటూ చిక్కిన మోముతో, నలిగిన చీరతో, వణుకుతున్న స్వరంతో ఆ కోమలాంగి మాట్లాడిన మాటలకు ఆకాష్ ఆ క్షణం ఆమెకోసం ఏమైనా చెయ్యాలని తన ప్రాణాన్ని సైతం ఆమెకు కానుకగా సమర్పించాలని నిర్ణయం తీసుకుంటాడు.. 


తొలిచూపు, తొలిప్రేమ, తొలివలపు ఇవన్నీ ఒక్కసారిగా ఆకాష్ హృదిలోకి చొచ్చుకొని వచ్చేశాయి… తనకు తెలియకుండానే ఆమెను అమితంగా ఆరాదిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు .. ఆ ఇరవై రెండేళ్ళ చిన్నదాని కోసం తన ఇరవై ఐదేళ్ళ నిరీక్షణ ఫలించే సమయం వచ్చేసిందని తను గ్రహిస్తాడు.. 

గది లోపలకు వచ్చిన పిల్లాడు ఏమి మాట్లాడకుండా తనచేతిలో వున్న ఆహార పదార్థాలు అక్కడ పెట్టి మల్లి తలుపు వేసుకొని వెళ్ళిపోతాడు.. 

మోహన్ ఆ పిల్లాడిని అవతలివైపు కలిసి ఇలా అడుగుతాడు.. 

తమ్ముడూ అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ …. పక్కకు తీసుకెళ్ళి ఇక్కడ జరగకూడనివి యేవో జరుగుతున్నట్లు వున్నాయి అవేంటో నీకు బాగా తెలుసు.. నీ మనసు కూడా ఇవన్నీ చెయ్యడానికి చాలా బాధపడుతూ ఉంది .. దానికి నీ ఈ కన్నీళ్ళే సాక్షి…. నాకు వివరంగా చెప్పు నీ గురించి ఎవరికీ తెలియనివ్వను, నీకేం కాకుండా చూసుకుంటాను .. నిన్ను మాతోపాటు తీసుకెళ్ళి బాగా చదివిస్తాను.. నా తమ్ముడిలా చూసుకుంటాను…. దయచేసి నన్ను నమ్ము… ఓ మంచి కార్యానికి నీవంతు నీవు సహాయం చెయ్యి అని ఆ పిల్లాడిని అడుగుతాడు.. 

ఆ పిల్లాడు కాసేపు మౌనం గా వుండి .. తరువాత తన కళ్ళను తుడుచుకుంటూ చెప్తాను అన్నా.. నాకేమైనా మరేం పర్వాలేదు కాని ఈ దారుణాలను చూడలేక పోతున్నాను.. మీరు నన్ను తీసుకెళ్ళినా, తీసుకెళ్ళక పోయినా సరే ఈరోజు నేను మీకు చెప్తాను అని అంటూ… చెప్పనారంభించాడు .. 

ఇందాక ఆ గదిలో కనిపించిన ఆ అందమైన అమ్మాయి కొన్ని రోజుల్లో అత్యంత దారుణంగా తన రూపాన్ని పూర్తిగా వదులుకొని వికృతంగా మారబోతోంది.. అలా ఎందుకు మారబోతోందో నాకు కూడా తెలియదు కాని ఇక్కడ నుంచి ఆ దీవికి తీసుకెళ్ళిన ప్రతీ అమ్మాయి అలానే మారిపోతుందని ఇక్కడ వాళ్ళు అనుకుంటుంటే విన్నాను.. అంతే కాదు అలా మారిన వాళ్ళ ఫోటో కూడా నేను చూసాను.. నేను అన్నం పెట్టిన వారు అలా అయిపోవడం చూసి చాలా ఎడ్చేవాడిని … ఆ దీవిలో ఏదో జరుగుతోంది అని చెప్తాడు ఆ పిల్లాడు… 

సరే కాని ఈ నౌక ఎక్కడనుంచి వస్తుంది?? ఆ అమ్మాయిలను ఎక్కడనుంచి తీసుకొస్తున్నారు ?? అని మోహన్ అడుగగా.. 

ఒక దగ్గరనుంచి అని కాదు ప్రత్యేకమైన అమ్మాయిలు ఎక్కడ ఉన్నారని తెలిస్తే వారందరినీ యెంత దూరంలో వున్నా వెళ్లి బలవంతంగానో, లేదా వారికి ఏదైనా ఆశ చూపించో, ఎలాగోలా ఇక్కడకు తీసుకొచ్చేస్తారు .. ఈ గదిలోనే బంధిస్తారు.. ఆ దీవి దగ్గరకు వెళ్ళేదాకా ఎన్ని రోజులు ఉంటే అన్నిరోజులు నేను వారిని భోజన సౌకర్యాలు అందిస్తాను.. ఆ దీవికి వెళ్ళాక ఇక నాకు వారికి ఎలాంటి సంబంధం వుండదు.. అని చెప్తాడు.. 

ప్రత్యేకమైన అమ్మాయిలు అంటే ?? అని అడుగుతాడు మోహన్ … 

దాని గురించి కూడా నాకు తెలియదు వారు అంటుంటే వినడమే.. అని సమాధానమిస్తాడు ఆ పిల్లాడు.. 

నీ దగ్గర ఆ గది తాళం మరోటి ఉందా ?? అని అడుగుతాడు మోహన్.. 

హా నా గదిలో మరోటి వున్నట్లు నాకు గుర్తు అనగానే.. 

ఈ తాళం నాకు ఇచ్చేసి .. నీ దగ్గర వున్న తాళాన్ని నీ దగ్గర పెట్టుకుంటావ ?? అని మోహన్ అనగానే .. 

ఇస్తాను కాని మీరు ఆ గదిలోకి వెళ్ళారని తెలిస్తే నన్ను చంపేస్తారు అని అంటాడు ఆ పిల్లాడు.. 

మేము ఇలా వెళ్లి ఆమెతో కొన్ని మాట్లాడి అలా వచ్చేస్తాము .. నన్ను నమ్ము నీకేం కాదు అని మాట ఇస్తాడు మోహన్.. 

సరే నేను నా గదికి వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ పిల్లాడు.. 

మోహన్ వేగంగా ఆకాష్ దగ్గరకు వెళ్లి విషయం చెప్పి ఇద్దరూ కలిసి ఆ రూము దగ్గరకు తాళం తీసేందుకు వెళ్ళారు.. 

తాళం తీయ్యడమే ఆలస్యం.. ఆకాష్ చాలా వేగంగా తలుపులు తీసుకొని గదిలోకి వెళ్లి ఆమెను వెతకనారంభిస్తాడు.. చీకట్లో అటువైపుగా తిరిగి వున్న ఆమెవెనుక ఆకాష్ నిలబడి .. 

మీరు ఇక భయపడాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదు.. మిమ్మల్ని ఎలాగైనా క్షేమంగా మీ ఇంటికి చేర్చే భాద్యత మాది.. మమ్మల్ని నమ్మండి.. అంటూ తన కంఠాన్ని మృదువుగా చేసుకొని అంటాడు ఆకాష్… 

ఎవరు మీరు ??? 
అంటూ తన చేతి గాజుల చిరు శబ్దముతో, తన పాదములనంటిన మువ్వల సవ్వడులతో, పురివిప్పిన కేశములతో ఆకాష్ వైపుగా తిరిగి ఎదుట నిలబడింది.. 

ఆమె కళ్ళలోకి చూసే ధైర్యం లేదు ఆకాష్ కి.. అందుకే ఆమె తిరగగానే తలను కిందకు వంచి .. వారు ఇక్కడకు ఎలా వచ్చారో అంతా వివరంగా చెప్పాడు.. 

ఈలోపల మోహన్ మధ్యలో దూరి … మీరు ప్రత్యేకమైన వారు అని ఆ పిల్లాడు చెప్పాడు .. ఆ విషయం మీకు తెలుసా ?? అని అడుగగా.. 

ఏంటి ??
నేను ప్రత్యేకమైన అమ్మయినా.. అందుకేనా వారు నన్ను బలవంతంగా ఇక్కడకు లాక్కొచ్చి పడేశారు.. ఈ విషయం నాకు మీరు ఇప్పుడు చెప్పేదాకా తెలియదు.. అని అంటుందామె.. 

బాగా ఆలోచించండి మీలో ఏదో ప్రత్యేకత వుండే ఉంటుంది.. లేకుంటే వారు ఇక్కడకు తీసుకురారు అని చెప్తాడు మోహన్.. 

ఆమె ఆలోచిస్తూ వుండగా.. 

ఒకపని చెయ్యండి.. మీరు ఎక్కడనుంచి వచ్చారు ?? మీరేం చేస్తారు ?? తదితర విషయాలను మొదలుకొని మీరు ఇక్కడకు వచ్చేదాకా మీ గతాన్ని మాకు వివరించండి అంటూ అడుగుతాడు ఆకాష్.. 

కాసేపు మౌనంగా ఉండిపోయింది ఆమె… 

కొన్ని నిమిషాల అనంతరం.. ఆకాషే చొరవ చేసుకొని ఆమెను అడుగుతాడు.. 

మీరలా మౌనంగా ఉంటే ఎలా.. మీ గురించి మాకు తెలిస్తేనే కదా మిమ్మల్ని కపాడగలం అని అంటాడు ఆకాష్.. 

నా గురించి చెప్పడానికి ఏముంటుంది ?? 


మాదో చిన్న కుగ్రామం.. మా గ్రామం మొత్తం అడవికి మధ్యభాగంలో సముద్రానికి దగ్గర భాగంలో ఉంటుంది.. అందువల్ల ప్రభుత్వంచే గుర్తించబడని ఓ ఆటవిక తెగలా మేము బ్రతుకుతున్నాం.. మా గ్రామంలో ఓ ఇరవై ఆరు కుటుంబాలు మాత్రమే జీవిస్తున్నాయి.. నిత్యం ఆహార వనరులకోసమే వేట సాగించే కుటుంబాలు మావి... పాడి, వ్యవసాయమే మా ప్రధాన జీవనాధారం… ఈరోజుల్లో కూడా విద్యుత్తు లేని గ్రామాలుంటాయంటే మీరు నమ్ముతారా ?? మా గ్రామం అందుకు తార్కాణం .. ప్రపంచపటంలో మా గ్రామం వెతికినా మీకు కనిపించదు.. సముద్రపు దొంగలకు మాత్రమే తెలిసిన ఏకైక గ్రామం మాది.. ఆ సముద్రపు దొంగలకు ప్రతినిత్యం బలౌతున్న బానిస గ్రామం, వారి తల దాచుకునేందుకు విడిది చేసే గ్రామం అని చెప్పొచ్చు.. నా చిన్నప్పుడే అమ్మా, నాన్న ఓ పడవ ప్రమాదంలో చనిపోయారు.. అప్పటినుంచి నన్ను మా పెదనాన్నగారు పెంచారు.. తన బిడ్డకన్నా గొప్పగా నన్ను ప్రేమించారు.. ఆయనకు తెలిసిన నాలుగు అక్షరాలు నాకు నేర్పించారు.. 

మరికాసేపట్లో నా పెళ్ళి జరుగుతుందనగా వీళ్ళు నన్ను తీసుకువచ్చేశారు .. ఏ ఆడపిల్ల అయితే దేనికోసమో కలలు కంటుందో ఆ మరుపురాని మధుర క్షణం అది.. ఇక నేను బ్రతికినా ఒక్కటే, చచ్చినా ఒక్కటే.. ఇదే నా గతం.. అని చెప్తుంది ఆ అమ్మాయి.. 

మీ వ్యక్తిగతం గురించి చెప్పమన్నాను… అంటే మీ స్వభావం, మీ పనితీరు, ఇలా మీ గురించి చెప్పండి అని చెప్తున్నాను.. అని ఆకాష్ అనగానే.. 

ఆమె ఒక్కసారిగా కోపంతో.. ఇప్పటికే నా వ్యక్తిగతాన్ని మీకు చాలా చెప్పేశాను ఇక చెప్పాల్సిన అవసరం నాకు లేదు.. అసలు మిమ్మల్ని నేను ఎలా నమ్మాలి ?? అని ఆమె కసురుకోగా.. 

తన జేబులో వున్న మ్యాప్ ని తీసి ఆకాష్ తనకు చూపిస్తాడు.. ఆ దీవిలో జరుగుతున్న పరిణామాలను .. తను చూసిన ఆ విచిత్ర మనుషులను ఆమెకు వివరిస్తాడు.. 
ఆమె భయంతో నాకు కూడా అలాంటి గతే పడుతుందా ?? అంటూ అడుగుతుంది.. 

లేదు నీకు అలా ఏమి జరగదు మేము నీకు తోడుగా వుంటాం.. దయచేసి నీ గురించి మొత్తం మాకు చెప్పు .. సమస్యను ఎదుర్కోవడానికి మనం పరిష్కారాన్ని కనుగొనవచ్చు.. అని అంటాడు ఆకాష్..

To be continued …

Written by : BOBBY

5 comments:

  1. suspence.. is still .. there... the introduction of heroine is excellent...

    ReplyDelete
  2. Very intresing ... And exiting.... Sri raga garu cheppinattu em varnincharandi aamenu..... Super....

    ReplyDelete
  3. Really chala bagundi.suspence inka bagundi

    ReplyDelete