Thursday, February 23, 2017

ముఖపుస్తక వైభోగం..



ముఖపుస్తక వైభోగం.. 
****************

అది మహాస్రవంతి, ఆ స్రవంతిలో నురగలతో వెండిలా వచ్చే తరంగాలలో యెంత నిండుతనమో .. ఆ నిండుతనంలో యెంత గడుసుతనమో... యెంత లోతు, ఎన్ని ఊహలు, మరెన్ని ఆశయాలు, అనుభూతులు, సందేశాలు, సందోహాలు, సంతోషాలు... !

ఏంటి అనుకుంటున్నారా ?? అదేనండి ఈ ముఖపుస్తకం.. ఎంతగా చూడదలుచుకున్నా ఆ గభీరత కేసి అలా చూస్తూ.... ఆఁ! ఎంత నిండుతనం అన్న ఊహాజగత్తులో అలానే నిస్తేజంగా నిలబడిపోతాము ... !

ఒక విషయమా... రెండు విషయములా ..!! జీవితం అంటే ఏమిటో అక్షరాల రూపంలో “టపాల” గుత్తులతో ఇమిడి ఘోషిస్తోంది ఈ ముఖపుస్తకం ... మనసు బాలేనప్పుడు తెరిచి చూస్తే మహా మహుల అక్షరాలతో తాలికట్టేందుకు ముస్తాబైన పెండ్లి కూతురిలా అందంగా సింగారించుకొని ఉంటుంది... నేర్చుకోవాలనే తపన కాస్త ఉంటే చాలు ప్రతీ ఒక్కరు ఇక్కడ గురువర్యులే... పూజ్యసమానులే... 

ఉలిక్కిపడ్డ కోడి కొక్కొ..రో....కో అనడమే తడవుగా మేల్కొంటుందీ ముఖపుస్తకం.. పల్లెల చిరు గంటల లేగల “అంబా” అనే ఆగవులు, రైతు, కూలిజనం పనీ పాటలకోసం ఉరుకులు, పరుగులు.. నగరాల్లో “బ్లో బ్లో” మనే శబ్దాలు, గోలలు, పొగలు, కాలుష్యాలు, యంత్రాల తో ఉరుకులు, పరుగులు... సమయం లేని జీవిత ప్రయాణాలు.. !!!

మరెన్నో ... సాయం సమయం పక్షుల కిల కిలా రవాలు, రేకులు విచ్చిన సన్న జాజులు, సంపెంగలు, మల్లెల పడుచుతనపు కోర్కెల సువాసనా రూపంలో గుబాళింపులు.. ! సూర్యునికి విశ్రాంతి సమయం, కూలిజనం పాటల హోరుతో ఇంటికి నడకలు, రెక్కల పక్షుల గూటికి ఎగురులు.. 

కోర్కెల కూని రాగాలు, ప్రేమల పల్లవి గీతాలు, కొంటేతనపు సింగిరి గీతాలు యెంత గమ్మత్తులో ..!

ఉంగరంతో జీవితం ప్రారంభించి ఎన్నో మజిలీలు, మైలురాళ్ళని దాటుకుంటూ ప్రయాణం చేసి, పసితనం, బాల్యం, యువకత్వం, యౌవ్వనం, సంసారం, భాద్యతలు, పెద్దరికం, చుట్టూ కొడుకులు, కోడళ్ళు, మనుమలు, మునిమనమలు, ఒడుగులూ, పెళ్ళిళ్ళు, పేరంటాలు, నోములు, వ్రతాలు, పూజలు, పునస్కారాలు, గుడులు, గోపురాలు, దేవుళ్ళు, దెయ్యాలు... ! ఇలా అన్నింటి గురించి ఎన్ని “టపాలో”... 

ఈ ప్రయాణంలో ఎన్నో అనుభవాలు, ఆ అనుభవాలకు ప్రతి రూపాలు ఎన్నో, మరెన్నో ఈ ముఖపుస్తకపు రచనలు, అక్షర విభాగాలకు భాండాగారాలు ... చదువరుల ఆనందానికి ప్రతీకలు, కోమలాంగుల ఆపాదమస్తక వర్ణనలకు పుట్టినిల్లులు, అసమర్ధ నాయకత్వ పరిపాలనలకు రచయితల రౌద్ర అక్షర రూపానికి నిలువెత్తు నిదర్శనాలు ... ఈ ముఖపుస్తకంలో ఇలా ఎన్నో ఎన్నెన్నో.. 

ఏముంది ఈ జీవితం ?? అనే ప్రశ్నకు .. ఆ ప్రశ్నలో ధ్వనించే తత్వాలతో ఈ ముఖపుస్తకం ఎప్పటికప్పుడు సమాధాన పరుస్తూనే ఉంటుంది.. భావాల వెల్లువ నీటి చలనులా నేటి రచయితలకు ఊరే కొద్ది అక్షరాలకు కొదవే లేదు .. 

అందరూ సరదాగా... సునాయాసంగా... ఆనందంతో, ఆస్వాదిస్తూ రాయాలి, చదవాలి అదే నా తాపత్రయం..

మరి రాస్తారు కదూ...

Written by : Bobby

No comments:

Post a Comment