Friday, September 30, 2016

విసిరి పారేసిన ఓ గుడ్డ పీలిక ...



మనిషి జన్మ ఎంతో శ్రేష్టమైనది కాని మనుషులు మాత్రం ఒక సాటి మనిషిని మనిషిగా చూడని దిస్థితి ... మనిషిగా పంపడం మాత్రమే దేవుని నిర్ణయం ... దాన్ని మానవత్వంతో జీవిచడం మనమే అలవరచుకోవాలి ... సాటి మనిషిని గౌరవించాలి ... కనీసం గౌరవించక పోయినా పర్వాలేదు అవమానించకూడదు ... ఘనకార్యాలు సాధించడానికే భగవంతుడు మనను ఎన్నుకొన్నాడని విశ్వసించాలి. ఆ విశ్వాసమే ఘనకార్యాలని సాధించగల శక్తినిస్తుంది.... ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన చిరంజీవి పట్టుమని 12 ఏళ్ళు అయినా నిండకమునుపే, అల్లరితనం వికసించక మునుపే, ఆనందం వెల్లివిరియక మునుపే, అసలు జీవించక మునుపే కష్టాల కడలిలో కుటుంబ పరిస్థితులను తన భుజములపై వేసుకొని బ్రతుకుతున్న ఓ పేదింటి కొమరుడు గురించి రాయాలనిపించింది .. కొందరు పిల్లలు చదువుకొనవలసిన వయస్సులో కుటుంబాలను పోషించే పరిస్థితి రావడం నిజంగా శోచనీయం .. అలాంటివారిని ఉద్దేశించి హృదయంలో ద్రవించిన భావాన్ని సిరాగా మలిచి వాడికి అందిస్తున్న అక్షర హారం ఇది.. 

విసిరి పారేసిన ఓ గుడ్డ పీలిక ...
*******************


చదువుకుంటానంటే చంపుతానని నాన్న.. 
సినిమాకెళ్తానంటే తంతానని యజమాని
వాడి బల్యానుభూతుల మామిడి పూతల మీద 
మంచులా కురుస్తారు.. 
ఇంకా పిడికెడు అనుభవాలైనా ఏరని 
వాడి పసి చేతుల్లోకి 
కుటుంబ స్థితిగతులు సూది మొనల్లా దిగుతున్నాయి.. 
జీవితమంటే మాయ మంత్రాల 
జానపద సినిమా కాదని తెలిసిపోతుంది.. 
ఇష్టం లేకపోయినా అదే 
జీవనాధారమని అర్ధం అయిపోతుంది.. 
ఇక సూదీ, దారమే వాడికి బంధువులు, స్నేహితులూ 
పోద్దునేప్పుడో తిన్న గుప్పెడు తరవాణీ మెతుకులు.. 
మధ్యాహ్నం యజమాని పోయించిన గుక్కెడు టీ నీళ్ళు.. 
ఇవే వాడికి పంచభక్ష్య పరమాన్నాలు .. 
కాజా చుట్టూ అద్బుతంగా దారాన్ని అల్లే సాలీడు వాడు.. 
తన బతుకు వస్త్రం చిరుగులనేమాత్రం కుట్టుకోలేని 
జాలి కథా నాయకుడు.. 
రీలు నుంచి దారాన్ని తెంపుతున్న సులువుగా 
తన గుండె కండె నుంచి కష్టాల్ని తెంపుకోలేని 
శోక తప్త గీత గాయకుడు వాడు.. 
కుట్టు సరిగా లేదని యజమాని నోరు పారేసుకుంటే 
కత్తిరించి ఓ మూల పారేసిన గుడ్డ పీలిక వాడు.. 
నెలాఖరు క్షణాల్లో కల్లు గుర్రమెక్కి వచ్చిన తండ్రి 
జేబును గుంజుకుపోయినప్పుడు 
చొక్కా నుంచి తెగి పడిన బొత్తం వాడు.. 
వాడి చుట్టూ దండాల మీంచి 
సీతాకోక చిలుక రెక్కల్లాంటి బట్టలు వ్రేలాడుతున్నాయి 
వాడి కళ్ళల్లోంచి మాత్రం 
నాన్న నోట్లోనుంచి కురిసే బూతులు 
రంగు వెలిసిన అమ్మ నవ్వులు వ్రేలాడుతుంటాయి.. 
రంగు రంగు దుస్తుల్లో అంబారీల్లో 
దొరబాబు లోస్తుంటారు పోతుంటారు కాని 
వాడి కేసి కాసిన్ని చూపులు అక్షింతలు అయినా చల్లరు 
టీ తేవడం ఆలస్యమైందని 
యజమాని కొడుకు చేయి విసిరినప్పుడు
పౌరుష మొచ్చినా 
ఇలాయి బుడ్డి పొగ చూరిన అమ్మ కళ్ళలోని జీవితం 
వాడిని బుద్ధుడ్ని చెయ్యడం 
ఎవరూ గమనించరు 
సినిమాపేర్లు చదవడం వరకే 
పరిమితమైన వాడి అక్షర జ్ఞానం 
ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ల యూనిఫాంలను 
వాడి కంటి నీటితో తడి చెయ్యడం 
ఎవరూ తెలుసుకోలేరు.. 
రెండు వేళ్ళ నడుమ కదిలే సూది 
నాణెం మీది రెండు కంకుల నడుమ ఒకటి అంకెలా
ఊరించడం 
ఎవరూ గ్రహించరు.. 
గిర్రుమని తిరిగే మిషన్ల హోరులో
వాడి గుండె మూలుగుల్ని ఎవరూ వినరు.. 
వాడు తన ఆశల కంరాలకు 
దారాలతో ఉరివేయడం గాని 
తన ఊహల రెక్కలను 
కత్తెర మొనలతో తుంచెయ్యడం గాని 
ఎవరూ పరికించరు 
సూదిలో దారం ఎక్కించేటప్పుడు 
వాడు అచ్చు తుపాకీలో తూటాలేక్కించే సైనికుడే.. 
కజాలో బోత్తాలో అంచులో కుడుతున్నప్పుడు 
వాడు అచ్చు చిక్కుదీసి తలదువ్వుతున్న అమ్మే...
కుట్టిన దుస్తుల్ని దులిపి మడత పెడుతున్నప్పుడు 
వాడు అచ్చు పసి మెదళ్ల అజ్ఞానాన్ని దులిపే గురువే.. 
చిత్తుగా తాగి వచ్చిన తండ్రిని 
నిలదీయనూ లేక 
నెత్తి, నోరు బాదుకుని విలపించే తల్లిని 
సముదాయించనూ లేక 
పళ్ళ అంచులతో తెంపి ఉమ్మె 
దారపు కొసల సాక్షిగా ఎప్పటిలాగే 
తల కళ్ళ గ్రహాల్ని డీకొనే 
అవసరాల తోక చుక్కల్ని మోసుకుంటూ వాడు.. 
వాడి స్పర్శలో నలిగి పునీతమైన బట్టల్ని తొడుక్కుని 
శరీరం నిండా గర్వాన్ని పూసుకుంటూ మనం.. 
ఇలా బతికేద్దాం.. 

Bobby Nani​

No comments:

Post a Comment