Wednesday, September 21, 2016

మీననేత్రిని ... (ఓ చేపకళ్ళ వయ్యారి)



మీననేత్రిని ... (ఓ చేపకళ్ళ వయ్యారి)


ఆమె చిత్రమా లేక శిల్పమా ... లేక
అపురూపమైన అపరంజి బొమ్మా.. !!
కలలోన నేను కన్నులతో గంటిని..
కౌగిలిలో నామె నే దాచుకొంటి ..
ఆమె ముంగురులు పొడవైన బారులు..
ఆ కన్నులే సరసిలో నడియాడు
గడుసైన మీలకు చక్కని జోడు..
ఆమె కంఠమే శంఖమై రాజిల్లు
ఆమె పెదవులు చిందు అమృతపు జాలు
ఆమె గళమున వెడలిన రవము
అది వాయులీన ధ్వని తోడ సమము..
అటువైపుగా దాటి నిలిచిన నా చూపు
కడులోతుగా నున్న నాభి జూచెను
కనులను వంచి నే గాంచి నానా
ఆమె పాద పల్లవములపైన
అమరివున్న పారాణి గాంచితి
ఆమె కాలి అందియల సవ్వడి
వింటి నామె రూపమును గంటిని..
ఆమె నొసటి కుంకుమను గాంచితిని
ఆమె కనుల కాటుకను జూచితిని
ఆమె గాజుల గలగలలు వుండగా
మరుని మనోహర దీపికలా
బిర బిరా నన్ను చేరగనే
వలపుల వెన్నెల మాలికలా.. !!
విరిసీ విరియని ఆమె కనుదమ్ముల
కురిసే ప్రేమకు నే తాళ లేను
ముగ్దమనోహర మౌ నీ రూపము
చూచుచు ఊరక నే నిల్వ లేను
కులుకుల నడకల నడుచు మరాళీ
నాట్యము చేసే వన మయూరీ
శృంగారమే రూపు తాల్చిన రాణీ
నీ కిదే జోహారు ఓ విరిబోణీ ..!!
బిగి బిగి కౌగిలిలో బంధించ నీవే
ఎదపై తడిముద్దుల వెచ్చనితో ముంచనీవే
అధర సుధలను అందించ రావే
అలరు విల్తు వెత తీర్చగ రావే ..!!
ఒక పరి నా చెవి దావున చేరి
ప్రేమికా యని పిల్వంగ రాదే
నా గుండెలోన నీ ఊపిరితో
వేణువు నూది వినిపింపరాదే ..!!
ఎన్నో జన్మల అనుభందమే ఇది
తెలియవే చెలీ మరువగ రాని
స్వర్గ సుఖాలను చవి చూపించవే
జగమును ఊయల చేసి ఊచవే మీన నేత్రిని ..

Bobby Nani

No comments:

Post a Comment