Friday, September 2, 2016

మట్టి గణపతినే పూజించండి .....



పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతి విగ్రహాలను పూజించడమే శ్రేయస్కరం. 
ఈ దిశగా అందరూ ఆలోచన చేసి ఆచరించాలి. ప్రకృతి వరప్రసాదమైన మట్టితో చేసిన విగ్రహాలనే ఉపయోగించాలి. పార్వతీదేవి వినాయకుణ్ణి సహజ సిద్ధమైన నలుగు పిండితో చేసిన సంగతిని ఇతిహాసాల్లో స్పష్టంగా పేర్కొన్న సంగతి తెలిసిందే. 
“మట్టి విగ్రహాలను పూజిద్దాం.... మన చెరువులను కాపాడుకుందాం”... 
అనే నినాదంతో ముందుకు సాగాల్సిన అవసరం ఎంతయినా వుంది. గత రెండేళ్ళనుంచి అక్కడక్కడ ప్రకృతి సిద్ధమైన మట్టితోను, రంగుల కాగితాలతోను రూపొందిన విగ్రహాలను వాడుతున్నారు. అయినా హెచ్చుగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారుచేసిన విగ్రహాలనే ఉపయోగిస్తున్నారు. ఎంతో ప్రచారం జరుగుతున్నా వస్తున్న స్పందన అంతంత మాత్రంగానే ఉండడం బాధాకరమైన అంశం. 

ప్రస్తుతం వినాయక విగ్రహాలను ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తోనే విపరీతంగా తయారుచేయడంవల్ల సమస్యలు ఎదురవుతున్నాయి. వాటి తయారీకి తక్కువ శ్రమ, ఖర్చు అవుతున్నందువల్ల ఎక్కువ సంఖ్యలో తయారుచేస్తున్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే కొన్ని వేల సంఖ్యలో విగ్రహాలను తయారుచేస్తున్నారు. ఇక పల్లె, పట్నాల్లో వాటి తయారీ గూర్చి వేరేగా చెప్పనక్కరలేదు. ఈ విగ్రహాలను నదుల్లో, చెరువుల్లో నిమజ్జనం చేయడంతో జీవరాసులైన జలచరాలు చనిపోతున్నాయి. ఈ నీటిలో స్నానం చేసినా, తాగినా పరిస్థితి భయంకరంగా ఉంటుంది. వ్యాధుల తాకిడికి గురికావలసి వస్తుంది.... పర్యావరణం ఘోరంగా దెబ్బతింటోంది.... ఈ విగ్రహాలు కరగకపోయినందువల్ల చెరువు గర్భాల్లో పొరగా ఏర్పడి భూగర్భ జలాల తరుగుదలకు కారణమవుతోంది.... ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌లో కాల్షియం సల్ఫేటు సెమి హైడ్రేట్ ఉన్నందువల్ల దీనికి పూసిన రసాయనాల్లో పాదరసం ఉన్నందున కొన్ని సంవత్సరాలవరకు నీటిలో కరగవు.... కరగని ఈ రసాయనాలను చేపలు మిగిలిన జలచరాలు ఆహారంగా తీసుకోవడంవల్ల చనిపోతున్నాయి.... నీటిలో ఆమ్ల స్వభావం బాగా పెరిగి, ఆ నీటిని తాగిన మనుషులకు రోగాలు వస్తున్నట్టు పరిశోధనల్లో తేలింది. నీటిలో ఆక్సిజన్ శాతం తగ్గుతున్నట్టు కూడా వెల్లడైంది....

అయితే ఈ ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌కు శతాబ్దాల చరిత్ర ఉంది.... పారిస్‌లో 17వ శతాబ్దంలో క్యాపిటల్ ఆఫ్ పారిస్‌ను ఇళ్ల నిర్మాణాలకు ఉపయోగించేవారు..... అగ్నిప్రమాదాల బారినుంచి రక్షించేందుకు దాన్ని వాడేవారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అనేది జిప్సం నుండి తయారవుతుంది..... జిప్సం నిల్వలు పారిస్ దగ్గరలో ఎక్కువగా ఉండడంవల్ల అప్పటి రాజు ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌కు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి ప్రోత్సహించేవారు..... ఆ రోజుల్లో చెక్కతో తయారుచేసిన ఇళ్ళకు ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌ను కప్పి అగ్ని ప్రమాదాల రక్షణ పొందేందుకు వాడేవారు..... వాటిని నీటిలో కలిపే అవసరం లేకపోయింది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యేవి కావు....

కొన్నేళ్ళ క్రితం మన రాష్ట్రంలో కాలుష్య నియంత్రణ మండలి (పి.సి.బి) వారు మట్టితో తయారుచేసిన విగ్రహాలను కొన్ని గ్రామాలకు, పట్నాలకు నామమాత్రంగా పంపారు. ప్రస్తుతం అది కూడా జరగడం లేదు. అన్ని పాఠశాలల్లో విద్యార్థులచే మట్టి విగ్రహాలను తయారుచేయించి పంపిణీ చేయించేందుకు పాఠశాల విద్యాశాఖ చొరవ తీసుకోవాలి..... అలాగే మట్టి విగ్రహాలనే వినియోగించాలని కోరుతూ ర్యాలీలు జరపాలి..... ఇవన్నీ చేస్తే నెమ్మదిగానైనా మంచి మార్పు వస్తుంది...... పర్యావరణ పరిరక్షణకు ఎంతో కొంత మేలు జరుగుతుంది...... మన మనుగడకు ప్రకృతి ఎన్నోరకాల సదుపాయాలను కలుగజేసింది. .....కానీ వాటి విలువ తెలుసుకోకుండా మనకు మనమే హానికారకులమవుతున్నాము...... ఫలితంగా మన మనుగడ మాత్రమే కాకుండా, సృష్టిలోని ఇతర జీవరాశులు కూడ తీవ్రంగా నష్టపోతున్నాయి. మానవుడు చేపట్టే ప్రకృతి వినాశకర కార్యకలాపాల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసిన వినాయకుళ్ళు కూడా చోటు చేసుకోవడం విచారకరం..... భక్తి మాత్రమే కాదు పర్యావరణ పరిరక్షణ కూడ ముఖ్యం ....

చివరగా : కొందరు విచిత్ర, వికృత ఉమ్మెత్త ముండాకోరుల విన్యాసాలు చూడలేకపోతున్నాం.. బాహుబలి వినాయకుడు ఏందిరా హౌలే.. ఏక దంతుడు, లంబోదరుడు, మూషిక వాహనుడు, ఇలానే వినాయకుడు వుంటేనే అందం.. ఆయన రూపాన్ని అలానే వుంచండి... దయచేసి.. అపహాస్యం చెయ్యకండి.. పిచ్చి తుగ్లక్ విన్యాసాలు మానితేనే చూచే జనులకు బాగుంటుంది అని నా ఉచిత సలహా.. 

స్వస్తి __/\__

Bobby Nani

No comments:

Post a Comment