Thursday, August 25, 2016

శృంగార కృష్ణ...



శృంగార కృష్ణ... 

రామునిపేరు చెప్పగానే కఠోరమైన ఏక పత్నీ వతుడు అంటాము.. కృష్ణుడు అనగానే పదహారు వేల నూట ఎనిమిది మంది శృంగార నాయికలు అందరి హృదయాలలో స్పురిస్తారు.. స్పురించడమే కాదు ఆయన శృంగార కథలు జనం నోళ్ళల్లో పడి రకరకాల రూపాల పలువిధాల భావాలలా సంతరించుకున్నాయి.. ఎక్కడైనా శృంగారం పెచ్చుమీరితే రాసలీల అంటాం.. ఎవరైనా గొప్ప భోగిని గురించి చెప్పాలంటే అమ్మో అంటాం.. అతడు కృష్ణ భగవానుడు అని పేరు పెట్టేస్తాం.. పాపం దేవుడు కదా ఏమైనా అంటే కళ్ళు పోతాయేమోనని భయంగాని సగటు మనిషికి కృష్ణుడి శృంగార కథ ఓ మితిమీరిన సరసమనే అనిపిస్తుంది.. దానికి తగ్గట్లుగా ఆ కథను పుచ్చుకొని సంప్రదాయం తెలియని కవులూ, ఆర్ష విజ్ఞానాన్ని అర్ధం చేసుకోలేని “ఆధునికులూ” వీళ్ళ ఊహల్ని పెడత్రోవ పట్టించిన పాశ్చాత్యులూ ఇలా ఎందరో కృష్ణ దేవుడిని శృంగార కథకు వక్రభాష్యాలు చెప్పారు.. చెప్పుతున్నారు.. మనం వింటూంటే చెబుతూనే వుంటారు... కొంచం నిదానించి ఈ కథల్లో రహస్యాలు, నిజా, నిజాలు ఏమైనా ఉన్నాయా ?? విచ్చలివిడి శృంగారం చెప్పడానికి ఓ వ్యాసులు, ఓ పోతనా కావాలా !! అని ప్రశ్నించుకుంటే అనుమానాలన్నీ తొలగిపోయి ఓ మాధుర్య దర్శనం, ఓ విజ్ఞాన స్పర్శ, ఒక మహా పారాణిక వైదిక విధ్యా సంకేతం మనకు ధాసిస్తుంది ... బహుపత్నీ రూప జీవాత్మరతి అంటే ఏమిటో తెలుస్తుంది.. ఇలా తెలియడానికి ఋషిపుంగవులు, పూర్వ కవులూ ఆయా సంబర్భాలలో ప్రవచించిన వేద విజ్ఞానం అనుసంధానం చేసుకోవాలి.. ఇతర అవతారాలన్ని విడి విడిగా వేరు వేరు అంశాలను ప్రతిపాదిస్తుండగా సంపూర్ణమైన సాక్షాత్తు భగవంతుడి విశ్వవిరాట్స్వరూపంగా కృష్ణావతారం భాసిస్తుంది.. 

అందుకే అన్నారు.. 

“అంశావతారా అన్యేతు కృష్ణస్తు భగవాన్ స్వయమ్” అని భగవంతుడు విశ్వ విరాటస్వరూపం. బల, వీర, వైభవాది షడ్గుడాలు సమస్త వైభవమూ, సృష్టిస్థితిలయలు అన్నీ ఒక్క మూసలో పోసి చూపినట్లుగా కృష్ణుడు చూపిస్తాడు.. అంచేత ఆయన ఆట, పాటలకు, చదువు సాములకు, పెళ్లి, పేరంటాలకు, ఆవేశ కావేషాలకు, ధర్మ ధర్మాలకు అన్నిటికీ ఓ అర్ధం, పరమార్ధం వున్నాయి.. అది తెలుసుకోకుండా మాట్లాడటం మన అవివేకం.. 

కృష్ణునికి ఎనిమిది మంది.. రుక్మిణి, జాంబవతి, సత్యభామ, మిత్రవింద, భద్ర, నీల (నాగ్నజిత్తి), కాళింది, లక్షణ, ఈ పేర్ల వరసలలోను, వీళ్ళను స్వామి పెళ్ళాడిన పద్ధతులలోను కొంచం తేడాలున్నా మొత్తం మీద అష్ట మహిషులున్నారనేది అక్షర సత్యం.. భగవద్గీత లో కృష్ణుడు చెప్పారు.. “భూమి రాపోనలో వాయుఃఖం మనో బుద్ది రేవచ అహంకార ఇతీయం మే ఖిన్నా ప్రకృతి రష్టదా” భూమి, నీరు, నిప్పు, గాలి ఆకాశము మనస్సు, బుద్ది, అహంకారము ఇవి పిండాండ సమవాయి కారణాలు అయిన ప్రకృతి శక్తులు. వీటి స్వరూపాలకే రూపకల్పన చేసి ఆయన సాక్ష్యాత్ భగవంతుడు కాబట్టి వీరితో ఎల్లప్పుడూ క్రీడిస్తాడని చెప్పడానికి ఇలా వ్యక్తులుగా, రాజ కుమార్తెలు గా, మేనత్త కూతుల్లుగా, నదీ స్వరూపాలుగా, కథలు కట్టి ఆ ఎనిమిది మందినీ స్వామి వివాహం చేసుకున్నాడు అని శాస్త్రాలు చెప్తున్నాయి.. 

ఇక ఈ ఎనిమిది మంది ప్రకృతులను నడిపించే పరాకృతి ఒకటి వున్నది.. అది గోలోకమనే లోకం.. గోలోకమంటే సృష్టిస్థితి ప్రళయాలకు రంగస్తలమైన అంతరంగిక కాంతి లోకం.. చైతన్య కేంద్రం.. ఆ పరా ప్రకృతి ఏం చేస్తుందంటే ఈ ఎనిమిది ప్రకృతుల విలాసాలని అదుపులో వుంచుకొని స్వామియొక్క అంతర్యామి లక్షణంగా వ్యవహరిస్తూ వారి మార్గాలను, సాధననీ పవిత్రం చేసి స్వామిలో ఐక్యం అయ్యేలా చేస్తుంది.. ఆ శక్తి పేరే రాధ... ఈ పరా ప్రకృతి జీవఘాతమైన తన అంతర్యామి తత్వమని స్వామి భగవద్గీత లో చెప్పివున్నాడు.. ఇలా శ్రీ కృష్ణుని గురించి మనం కొన్ని రహస్యాలను చెప్పుకోవచ్చు.. నిజా నిజాలు తెలియక శ్రీ కృష్ణుడు విచ్చల విడి శృంగార పురుషుడు అంటే ఒప్పుకోబోము.. నెమలి పించన ధారుడు అంటే శారీరక కలయిక లేకుండా నెమలి అంత పవిత్రతను కలిగిన వాడు అని అంటారు.. నిజా నిజాలు తెలుసుకోకుండా మాట్లాడకండి అని విన్నవిస్తూ ... 

శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు .. 

స్వస్తి.. ___/\___

Bobby Nani

No comments:

Post a Comment