Tuesday, August 23, 2016

ప్రకృతి భిక్ష...



ప్రకృతి భిక్ష...
************
ప్రకృతి ఎంతో అందమైనది.. అందమైనది అన్నప్పుడు అంతా, ఇంతా అందమైనది అని కాదు.. నాలాంటి సామాన్యుడు వర్ణించడానికి వీలులేనంత అందమైనది అని నా అర్ధం.. ప్రకృతి సౌందర్యాన్ని, దాని మనోజ్ఞతను, రమణీయకాన్ని ఋక్కులను చెప్పిన ఋషుల దగ్గరనుంచి రవీంద్రుని వరకు ఎందరెందరో మధురాతిమధురంగా వర్ణనలు చేసారు.. కాని వీరు అందరూ ఈ ప్రకృతి మాత పద సౌందర్యాన్ని, దృశ్య సౌందర్యాన్ని చెప్పి వున్నారు.. నిరహంకార బుద్దితో, నిష్పక్షపాతంగా, ప్రసన్నచిత్తంతో, ప్రకృతిపోకడలను పరిశీలించిన ప్రజ్ఞానిధుల పరిశోధనల ఫలితంగా వెలిబుచ్చిన విజ్ఞానపర విశేషాలను గురించి కొన్నిటిని ఆలోచనకు వచ్చినవాటిని, నేను చూసిన వాటిని గురించి రాయ సంకల్పించి రాస్తున్నాను..

మన ప్రపంచానికి అపురూప సౌందర్యాన్ని సమ కూర్చేవి చెట్లు, చేమలే.. వసంతకాలం వచ్చిందంటే సర్వ ప్రకృతి పులకితమై ఆకుపచ్చగా కన్నుల పండుగగా వుంటుంది..

ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, ఎవరినైనా సరే పలకరించి చుడండి.. వాళ్ళు వాళ్ళు చేస్తున్న పనుల పరమార్ధం ఏంటి అని ఆలోచించండి.. పశుపక్ష్యాదులను చుడండి.. బ్రతికి వున్నంతకాలం వాటి జీవిత పరమార్ధం ఏమిటో పరిశీలించండి.. .. సరిగ్గా ఇలాంటి ఆలోచనే నాకు కలిగింది..

ఫలితంగా ఒకే సమాధానం నాకు తట్టింది.. “మానవులలో కోటి విద్యలు కూటి కొరకే” ఇక పశువులకు తిన్నది పుష్టి..... అంతే కాదు సమస్త జీవకోటిలో వాటి జీవితంలో చాలా భాగం ఆహారాన్ని సంపాదించుకోవడంలోనే వ్యయమై పోతుందని మనకు తెలిసిన సంగతే.. అంతెందుకు ఒక్క మానవులలోనే చూద్దాం.. ఏ దేశంలో చూసినా అక్కడి జనాభాలో అత్యధిక సంఖ్యాకులు ఏదో విధంగా ఈ భూమిని నమ్ముకొనేవారె ... వ్యవసాయమే ప్రధాన వృత్తి.. మన భారతదేశంలో నూటికి 70 శాతం మంది వ్యవసాయ వృత్తే.. (ప్రస్తుతం వారి సంఖ్య గణనీయంగా తగ్గుతోంది.. ) ఈ విధంగా మానవులకు, పశువులకు కావలసిన ఆహారం అంతా సస్యశ్యామలమై భూమాత కానుక.. అంటే మొక్కలు, పాదులు మనకు పెట్టిన భిక్ష అన్నమాట..

ఏ ప్రాంతాన్ని అయినా పచ్చని తివాసీ కప్పినట్లు మనోజ్ఞంగా కనపరిచే గరికపోచలు.. ఏ మైదానాన్ని అయినా, ఏ తోటనైనా, ఏ కొండనైనా, ఏ కోననైనా కన్నులపండువుగా అలకరించేవి అవే... ఇది అలా ఉంచితే.. మనం ప్రధానంగా తినే గోధుమ, వరి, బార్లీ, ఓట్లు, జొన్న, మొక్క జొన్న, రాగి, వగైరా ధాన్యాలన్ని ఈ తృణజాతుల ప్రసాదమే కదా.. ఆఖరుకు ఆ పేరు చెప్పగానే బ్రహ్మదేవుడికి సైతం నూరూర్చే బెల్లాన్ని, పంచదారను ప్రసాదించే చెరుకు కూడా ఈ తృణజాతుల కోవకే చెందుతుంది..
ఇంతేనా పశువులు, మేకలు గడ్డి గాదం మేసి వాటిని తియ్యని పాలుగా మార్చి మనకు ప్రసాదిస్తున్నాయి. ఇవన్నీ కూడా పశువులు మేసిన గడ్డి, గాదం, ఆకూ, అలం మారు రూపాలే కదా..అలాగే కాయ కసరు తిని బ్రతికే గొర్రెలు, మేకలు వంటి వాటిని చంపుకుతినే మాంసాహారులు, కేవలం పప్పు, కూరలు, పులుసు, పెరుగు వేసుకుతినే శాకాహారులు వీరందరికీ అన్న దాతలు, ప్రాణ దాతలు మొక్కలే కదా.. అంటే శాకాహారులు అయినా, మాంసాహారులు అయినా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తమ మనుగడకు ప్రాణులన్నీ మొక్కల మీదే ఆధారపడి వున్నాయి.. దీన్ని నేను ఒక్క మాటలో చెప్పాలంటే “ఆకు లేకపోతే అన్నమే లేదని చెప్పాలి.. “

అంతే కాకుండా మనం తినేదే కాకుండా మనం సేవిస్తూ వున్న కాఫీ, కోకో, ద్రాక్ష రసాలు, మద్యాలు, ఇవన్నీ కూడా చెట్ల భిక్షయే.. తినే ఐస్ క్రీం లు, మందులో వాడే తేనే ఇవన్నీ కూడాను చెట్లు ప్రసాదించినవే .. మనం కట్టుకునే బట్టలు పట్టు బట్ట కట్టుకున్నా, ఉన్ని బట్ట కట్టుకున్నా, వాటి మూలం వెతికితే అవన్నీ చెట్ల, చేమల ప్రసాదమని తేలుతుంది.. పోనీ దుప్పినో, మరే జంతువునో వేటాడి తెచ్చుకున్నా, చేపలు పట్టి తెచ్చినా వాటిని ఎలా వండుతాము ?? మన ఇళ్ళను కప్పి మనకు వెచ్చదనాన్ని ఇచ్చేది ఏంటి ? పొయ్యి ఏం పెట్టి వెలిగిస్తాము ? మన యంత్రాలు ఎలా నడుస్తున్నాయి ?? ఇందుకు ఉపయోగపడేది బొగ్గు యౌగిక ద్రవ్యం (దీనినే ఇంగ్లిష్ లో “కార్బన్ కాంపౌండ్” అంటారు.)

ఇంతకీ చెప్పవచ్చినది ఏమంటే మనం ఏ దృష్టితో చూచినా, ఏదో విధంగా తెల్లారి లేచింది మొదలు తిరిగి పడుకోబోయే వరకు చెట్లకు ఎంతగానో ఋణపడి ఉన్నామని..
ఒక మొక్క ఎదిగి ఒక స్థాయికి రావాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది.. 100 ఏళ్ళ నాటి మొక్కను తుంచాలంటే 100 నిమిషాలు కూడా పట్టట్లేదు.. నా దృష్టిలో వృక్షం అంటే కేవలం చెట్టు కాదు.. సృష్టిలోని ప్రతీ ప్రాణి ఊపిరి .. కొన్ని రోజుల క్రిందట ఓ వృక్షం గురించి రాసిన ఆవేదనాభరిత నా ఈ చిరు కవిత ....

ఓ వృక్షపు ఘోష...
*****************

విత్తు నాటిన నాటి రోజున...
నేటి నిలువెత్తు నిదర్శనమై ప్రెకలించుకొని
వస్తివి నా కనులముందుకు...
నిన్ను చూచిన ఆ క్షణమున ...
తెలియని అమ్మతనం నాలోలోన...
చూస్తుండగానే పెరిగి పెద్దవైతివి కనులముందర...
మొదట పూసిన లేలేత పుష్పము...
నీ..... నా...... ఆనందాన్ని మరింత రెట్టింపు చేసే..
అంతకు అంత నాకన్నా కొండంత .. ఎత్తుకు ఎదిగితివి..
ఫలమునిచ్చి, నీడనిచ్చి, వాయువునిచ్చి ...
అన్నీ ఇచ్చి , మా ఇలావేల్పువు అయితివి..
మా ఇంట్లో అన్నీ అయితివి..
అలాంటి నిన్ను గుర్తించలేక,
విలువ తెలియక స్వార్ధ బుద్దితో,
విపరీతబుద్దితో ..
వికటాట్టహాసముతో , వికృత చేష్టలతో..
మాదారికి.. రహదారికి అడ్డు అనే నెపంతో ..
నిన్ను ఖండ, ఖండాలుగా తెంపబడితిమే...
నీడ లేక, గూడులేక, తిండి లేక...
తిరుగాడుతున్న మాకు అప్పటికర్ధమయ్యెను .. నీ విలువ..
నేను రాస్తున్న నా ఈ కలం లోని సిరావి కూడా నువ్వేనని...

నాశనం చెయ్యాలనుకునే వారు ఎలానో నాశనం చేస్తారు.. ఎవరి మాట వినరు... కాని ఒకదాన్ని మనం నాశనం చేసేముందు అలాంటిదాన్నే మరొకటి వేరే చోట ప్రతిష్టించమని చిన్న అబ్యర్ధన...

అభివృద్ధి అంటే ఆనందం లా ఉండాలే కాని మనల్నే పాతాళం లోకి పంపేదిగా వుండకూడదు అని కోరుకుంటూ ..

స్వస్తి.. __/\__

Bobby Nani

No comments:

Post a Comment