ఒక చిత్రాన్ని, అందులోని అక్షరాలను చూసి వారి స్థాయిని అంచనా వేస్తున్నారు అంటే మీరు ఎలాంటి మానసికస్థితిలో వున్నారో అర్ధం అవుతుంది.. అవగాహన రాహిత్యం నేడు మనిషికి మనిషికీ మధ్య దూరాన్ని పెంచుతుంది..!!ఒక స్త్రీ ఈ ఫోటో పెట్టి భార్యాభర్తలు గురించి కొన్ని అక్షరాలు రాస్తే .. ఆమెను దారుణంగా చూస్తూ, మాటలతో శవ పరీక్ష చేస్తారా ఆమెను మీరు.. ఇదేనా మీ సంస్కారం .. ఇదేనా మీకు తెలిసిన జ్ఞానం..!
పైకి శ్రీరంగ నీతులు చెప్తూ,
గుడిఎనక నా సామి లా వుండేవాళ్ళు మన మధ్యనే ఎందరో..
తాత్వికతను భోదిస్తూనే లోలోన శృంగార కార్యకలాపాలు గావిస్తూ .. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంటారు వీరు..
సమాజంలో వీరు అత్యంత ప్రమాదకారులు కూడా.. !!
విశృంఖలత్వాన్ని, విచ్చలవిడితనాన్ని ఇక్కడ నేను ప్రోత్సహించట్లేదు..!!
అయినా ఎవడికి తెలియదు ఈరోజుల్లో శృంగారం అంటే.. పదిహేనేళ్ళ కుర్రాడు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడి ఫోన్ చేతిలో పట్టుకున్నాడు అంటే .. నీకు తెలుసా.. వాడేం చూస్తున్నాడో అందులో..
ఎవరికి చెప్తావ్ నువ్వు.. ఇది తప్పు, ఇది ఒప్పు అని.. నువ్వు చెప్తే వింటారా .. ఫోన్ పగలకొట్టి రెండుదెబ్బలేస్తే ఊరుకుంటారా .. ఇంకో మార్గాన్ని అన్వేషిస్తారు .. ఇదే నేటి యువత ఆలోచనాధోరని ..!!
నువ్వు దాపెట్టే కొద్ది వారిలో కుతూహలం తారాస్థాయిలో ఎక్కువ అవుతూనే వుంటుంది.. అలా అని విచ్చలవిడిగా ఉండమని కాదు.. విజ్ఞానపరంగా వారికి ఆరోగ్యవంతమైన అవగాహన అందివ్వాలి.. !
సరే ఇక విషయంలోకి వెళ్దాం..!
ఆలుమగలు అంటే రెండు శరీరాలే కాదు..
పూర్తిగా ఒకరికొకరు చదివిన పుస్తకం లా తెలుసుకొని వుండాలి..!!
రెండు మనసులతో ఒకే పుస్తకమై
తొమ్మిది రసాలను సిరాగా చేసి
ఏక కలంతో రాసుకునే రంగులమయ జీవితం వారిది..!!
అలసి పయనించే యాత్రికుడు భర్త..
సజ్జనుడికి స్వర్గధామం భార్య...
సృష్టికర్త వ్రాసిన బంగారు చిత్రపటం భార్య,
దేవుడిచ్చిన మణిమాల భార్య,
యజమాని, బానిస సంబంధాలే భార్యాభర్తలను జడుఁల్ని చేస్తున్నాయి..అందుకే రసస్పందన కోసం ఒకరికొకరు తడుముళ్ళాడవలసి వస్తోంది.. ముందు ఈ వైఖరిని విడిచి పెట్టాలి.. మీ ఇద్దరిలో ఎవరూ ఎవరికీ బానిసా కాదు యజమానీ కాదు..ఉభయులూ ఒకరికొకరు క్షణం ఎడబాటు కూడా సహించలేని స్నేహితులు కావాలి. స్నేహమే మధురమైన సంబంధం.. స్నేహమే ఒకరిలో ఒకరిని లీనం చేసే సాధనం..
సహృదయులే, స్నేహశీలత్వం, నిత్య సంతోషం, దయ, అనురాగం ప్రదర్శించగలిగిన మగవాణ్ణి స్త్రీ ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే వుంటుంది.. అతని కౌగిట్లో వెన్నలా కరిగిపోతుంది.. అతని స్పర్శతో పులకరిస్తుంది.. సౌందర్యజిజ్ఞాసువులైన భార్యాభర్తల గాఢపరిష్వంగములో మరే ఆర్తనాదాలు వినపడవు.. కిలకిల ధ్వనులు తప్ప..
ప్రతీ పురుషుడూ స్త్రీ కోసమే సృష్టించబడ్డాడు.. అలానే ప్రతీ స్త్రీ పురుషుని కోసమే సృష్టించబడింది .. యవ్వనం వారి కలయిక కోసమే నిర్దేశించబడింది.. ఈ సత్యం తెలియని వాడు దుఃఖ భాగుడు, అసంతృప్తజీవుడు .. తను అనుభవించలేని, ఆఘ్రాణించలేని పుష్పాన్ని భగవదార్పితం చేసినట్లు కొందరు భార్యాభర్తలు వారి యవ్వనాన్ని వ్యర్ధం చేస్తున్నారు.. అందుకు గల కారణం అహం అనే చీడ పురుగు వారిని మోహించి ఉండటమే..
నవ జీవనం, నవ భావం, నవ దర్శనం మానవుల పవిత్ర శృంగార రసనిష్పన్నతలోంచే పుట్టుకొస్తాయి.. జీవితం పూల పాన్పు కాదు.. దుఃఖభూయిష్టమైనది.. ఎన్నో బాధలు, శ్రమలూ పడనిదే రోజు గడవదు నేడు.. అయినా ప్రతీరోజు ప్రతీ పురుషుడూ తన భార్యలో కొత్తదనాన్ని చూడనేర్వాలి.. అలానే ప్రతీ స్త్రీ తన భర్త నుంచి కొత్త అనుభూతిని గ్రహించాలి. ఆ స్త్రీ పురుషులిద్దరూ ఏకమైన ప్రతీ దఫా వారి మనసిక నిషేదాలు తొలగిపోవాలి.. ప్రశాంతమూ, ప్రగాఢమూ, అయిన కొత్త వ్యక్తిత్వం పొటమరించాలి..
ఆదర్శ దాంపత్యానికి సంబంధించిన విజ్ఞానాన్ని, నిర్భయంగా యువతరం చర్చించి, సరియైన వైఖరి అవలంబించేలా చేయడం సంఘసేవకులకు, వైద్యులకు బాధ్యత కలిగివుండాలి..
ఆలింగన, చుంబన, నఖక్షత, దంతక్షతాది బాహ్యరత విధానాలు, అంతరరతి విధానాలు చదువుకున్నంత మాత్రాన ఎవడూ రతిలో సమర్ధుడు కాలేడు ..
ఈత ఎలా ఈదాలో చదివినంత మాత్రాన ఈదగలడా ?? ఈతను నేర్చుకోవాలి.
ఈతను నేర్చుకోవాలంటే చెరువూ, గురువూ రెండూ వుండాలి. అలాగేరతి విషయంలో కూడా, భయబ్రాంతులైన భార్యాభర్తలు సఖ్యత మీద అనుభవం, అనుభవం మీద ఆస్వాదన కలుగుతాయి.. పెళ్ళికి ముందే కొందరు త్వరపడిపోవడం వల్ల నిజమైన ఆనందాన్ని, ఆస్వాదనను అందుకోలేక పెళ్లి అయిన తరువాత సహచారితో సఖ్యత లేక విడాకుల దాకా పోయిన కేసుల్ని, విడాకులు తీసుకున్న కేసుల్ని నేను నా ఆఫీనులోనే ఎన్నో చూస్తున్నాను..
సారభూతమైన జీవస్పందనను గ్రహించగల శక్తి గల వాళ్ళు,
స్పందించే స్వభావంగల వాళ్ళు దాంపత్యజీవితకైవల్యాన్ని చేరుకోగలరు..
భూమ్యాకాశాలను రెండిటినీ ఏకం చేయగల అపూర్వానుభూతి దాంపత్య మాధుర్యాన్ని సమగ్రంగా చదివి చవిచూచినవారికే కలుగుతుంది. స్పర్శద్వారా అస్పృశ్యమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని గ్రహించి స్త్రీల శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అవసరాలను సంతృప్తిపరచగలిగిన వాడు దైవాన్ని సైతం మెప్పించగలడు ఇది సత్యం.. ఇదే సత్యం..
భార్యాభర్తల మధ్య కుళ్ళు జోకులు, సెటైర్లు , వెధవ పోస్టులు పెట్టే వారికి, మనోభావాలను పంచుకునే స్త్రీ, పురుషుల పై వక్ర దృష్టి కనపరిచే వరాహ సౌందర్యులకు, మూత్ర చోరులకు ఈ నా వివరణ ఓ చెంపపెట్టు కావాలి..మన ఇంట్లో కూడా స్త్రీ లు ఉన్నారన్న విషయాన్ని గుర్తెరిగి ప్రవర్తిస్తారని ఆశిస్తూ స్వస్తి..__/\__
Written by: Bobby Aniboyina